ఫైళ్ల దగ్ధం వెనుక కుట్రదారులను అరెస్టు చేయాలి!
posted on Aug 19, 2024 @ 10:04AM
వైసీపీ హయాంలో వివిధ శాఖలలో జరిగిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి రాకూండా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పుడు ఫైళ్ల దగ్ధం అనే కార్యక్రమం సాగుతోందా అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో కీలకమైన ఫైళ్లు దగ్ధం అవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలలో వరుసగా జరుగుతున్న ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మదనపల్లో సబ్ కలెక్టర్ కార్యాలయంతో మొదలు పెడితే తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఫైళ్ల దగ్ధం వరకూ జరిగిన సంఘటనల వెనుక కుట్రకోణాన్ని వెలికి తీయాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. ఈ ఫైళ్ల దగ్ధం సంఘటనలపై విచారణ అంటూ కాలయాపన చేయకుండా, కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని మదనపల్లెలో పెద్ద ఎత్తున ఫైళ్ళు ధగ్దం చేశారని, వేలాది మంది రైతుల భూములు అన్యాక్రాంతం అయ్యాయనీ, రికార్డులు తారుమారు అయ్యాయనీ, రైతులపై దౌర్జన్యాలకు పెద్దిరెడ్డి మనుషులు తెగబడ్డారన్న వందల ఫిర్యాదులు ఉన్నాయనీ, ఈ నేపథ్యంలోనే ఫైళ్లు దగ్ధం కావడం పులు అనుమానాలకు తావిస్తోందని ఆయనో ప్రకటలో పేర్కొన్నారు.
ఇప్పుడు తాజాగా ధవళేశ్వరం కార్యాలయంలో పోలవరం ముంపు నిర్వాసితులకు సంబంధించిన నష్టపరిహారం దస్త్రాలు దగ్ధమయ్యాయి. దాదాపు 4,202 కోట్ల పోలవరం ప్రధాన కాలువ నిర్మాణ పనులు, భూసేకరణ దస్త్రాల దగ్ధం వెనుక కూడా కుట్ర ఉందన్నారు. అలాగే విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఫైళ్ల దగ్ధం సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఫైళ్ళు ఎందుకు దగ్ధం అవుతున్నాయో, దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటో వెల్లడి కావాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల సాక్ష్యాలు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే కొందరు అధికారుల సహకారం, పర్యవేక్షణతొ ఇవి జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇందులో భాగమైన ఉద్యోగులపై సస్పెన్సున్, బదిలీలతో సరిపెట్టే ధోరణి వీడి, కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.