పదవిలోకి బొత్స.. జగన్ చేతికి బొచ్చె!
posted on Aug 19, 2024 @ 2:38PM
బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కావడం ఇక లాంఛనమే. తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడంతో బొత్సకు లైన్ క్లియర్ అయ్యింది. అంత వరకూ ఓకే కానీ.. బొత్స ఎమ్మెల్సీ కావడం వైసీపీకి మాత్రం తీరని నష్టమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం చేస్తున్నది వైసీపీ ఉత్తరాంధ్ర నేతలూ, శ్రేణులే కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంతకీ బొత్సకు జగన్ విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం, ఇంతకాలం అంటే జగన్ అధికారంలో ఉన్నంత కాలం విశాఖలో చక్రం తిప్పిన నేతలకు ఇసుమంతైనా ఇష్టం లేదు. అయితే తెలుగుదేశం కూడా పోటీ చేస్తుంది. అధికారంలో ఉండటం వల్లనో, ప్రజా వ్యతిరేకత కారణంగా పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థలలో వైసీపీ ప్రజా ప్రతినిథులుగా ఉన్న వారు గోడ దూకేసీ కూటమికి మద్దతు పలుకుతారన్న భావనతో వారు బొత్స ఓటమి తథ్యమని భావించారు. ఆ కారణంగానే ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి వంటి వారు బొత్స నామినేషన్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశాఖ నుంచి కంటే బొత్స సొంత జిల్లా విజయనగరం నుంచే ఎక్కువ మంది హాజరయ్యారు. దీనిని బట్టే విశాఖలో బొత్స ఎంట్రీని ఆ జిల్లా వాసులు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పడనే కాదు.. ఎన్నికలకు ముందు కూడా జగన్ బొత్సను నమ్మారు కానీ విశాఖ వైసీపీ నేతలను పెద్దగా నమ్మలేదు. అందుకే విశాఖ ఎంపీ స్థానానికి బొత్ సతీమణినే నిలబెట్టారు. ఆమె ఘోరంగా ఓడిపోయారనుకోండి అది వేరే విషయం. కానీ బొత్స సతీమణిని విశాఖ ఎంపీగా నిలబెట్టడం ద్వారా జగన్ బొత్స సత్యనారాయణ తన అధికార, వ్యాపార సామ్రాజ్యాన్ని విశాఖకు, అలాగే శ్రీకాకుళం జిల్లాకు విస్తరించుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బొత్స రాజకీయంగా, వ్యాపారాల పరంగా విజయనగరం జిల్లాలో పాతుకు పోయారు. ఇసుక, క్యారీలు, మద్యం, రియల్ ఇలా ఏ రంగం తీసుకున్నా బొత్స కుటుంబానిదే మొత్తం ఆధిపత్యం. ఇక రాజకీయంగా ఆయన జిల్లాలో బొత్స ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైఎస్ హయాం నుంచీ కూడా బొత్స హవా విజయనగరం జిల్లాలో నడుస్తూనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలోనూ, ఆ తరువాత ఇటీవల జరిగిన ఎన్నికలలో మాత్రమే బొత్స, ఆయన కుటుంబ సభ్యులు పరాజయం పాలయ్యారు.
విజయనగరం జిల్లాలో అంతగా పాతుకు పోయిన బొత్స విశాఖలోపై కూడా ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అందుకే లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణిని విశాఖ రప్పించి పోటీ చేయించారు. కానీ గాలివాటం మారడంతో ఆమె ఓడిపోయారు. సరే విశాఖ జిల్లాలో వైసీపీకి ఇటీవలి ఎన్నికలలో జీరో రిజల్టే వచ్చింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ నుంచి పోటీ చేసిన వారంతా పరాజయం పాలయ్యారు. అయినా వారికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మోల్సీ కోసం పోటీ పడ్డారు. జగన్ బోత్సను ప్రమోట్ చేయడాన్ని వ్యతిరేకించారు. పోటీ అంటూ జరిగితే సహాయ నిరాకరణకు కూడా రెడీ అయ్యారు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం కూటమి పోటీ నుంచి తప్పుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది.
బొత్సకు విజయం ఎలా దక్కిందన్నది పక్కన పెడితే ఇప్పుడు శ్రీకాకుళం, విజయగనరం, విశాఖ జిల్లాలపై బొత్స ప్రభావం, పెత్తనం కచ్చితంగా ఉంటుంది. అంటే ఉత్తరాంధ్ర వైసీపీకి ఇప్పుడు ముఖచిత్రంగా బొత్స మారిపోయారు. బొత్సకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం అన్న బాధ్యతను జగన్ బొత్సకు అప్పగించారు. అయితే రాష్ట్ర రాజకీయాలలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను బట్టి చూస్తే జగన్ తన పార్టీని అంత కాలం ఎలాంటి పొత్తులూ లేకుండా నడిపే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జగన్ కాంగ్రెస్ కు దగ్గరకావడానికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే బొత్సకు కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాల ద్వారా జగన్ ను అధిగమించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికే ఎక్కువ అవకాశలు ఉన్నాయని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.
వైసీపీ కాంగ్రెస్ లో విలీనమైనా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా బొత్స రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. తన విధేయత జగన్ పట్ల కాదనీ, వైఎస్ పట్ల అనీ ప్రకటించి బొత్స షర్మిల పంచన చేరినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదంటున్నారు. ఒక విధంగా విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జగన్ బొత్సకు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీ మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి బొత్సకు అప్పగించారనీ, ఇక ఉత్తరాంధ్రపై జగన్ రాజకీయం నడవదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.