ఏపీ నుంచి రోజా పలాయనం.. తమిళనాట పొలిటికల్ ఎంట్రీ?
మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్ప బోతున్నారా? ఏపీ రాజకీయాల నుంచి నిష్క్రమించబోతున్నారా? తమిళ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయారా? తమిళ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రోజాకు రూట్ క్లియర్ అయిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పుట్టినింట రాజకీయాల్లో మంచో చెడో తనదైన ముద్రవేసుకున్న రోజా.. ఇప్పుడు మెట్టినింట తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రంలో రాజకీయాలు, సినీ రంగాన్ని వేరుచేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. దీంతో తన సినీ గ్లామర్‌తోపాటు.. తన భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వారు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తానని రోజా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రోజాకు తమిళ భాషపైనా మంచి పట్టుంది. దీంతో అక్కడి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే విషయంపై తన సన్నిహితులతో రోజా కొద్దికాలంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అవకాశాన్ని బట్టి డీఎంకే లేదా హీరో విజయ్ పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న చర్చ నగరి నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998లో తెలుగుదేశం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి రోజా పోటీ చేశారు. అయితే.. ఆ రెండు ఎన్నికల్లోనూ రోజా ఓడిపోయారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రోజాకు పార్టీలో పెద్దపీట వేస్తూనే వచ్చారు. కానీ, రోజా దూకుడు స్వభావం కారణంగా పార్టీలో ముఖ్యనేతల నుంచి, క్యాడర్ నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఫలితంగా ఆ తెలుగుదేశం పార్టీకి దూరమై 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రోజాకు అవకాశం దక్కింది. టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వహించారు. అయితే, రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత.. రోజా వ్యవహారశైలిలో పూర్తిగా మార్పు వచ్చింది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు, క్యాడర్ నుంచి రోజా పట్ల వ్యతిరేకత పెల్లుబికింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలోని ముఖ్యనేతలంతా ఏకతాటిపైకి వచ్చి అధినేత జగన్ కు ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం రోజాకే టికెట్ కేటాయించడంతో.. నగరి నియోజకవర్గ ప్రజలు రోజాను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. సొంత పార్టీ నుంచి కూడా ఆమెకు ఇసుమంతైనా మద్దతు లభించ లేదు.
రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత నియోజకవర్గంలో రోజా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు మంత్రి పదవికూడా ఉండటంతో ఆమె సోదరులు కుమారస్వామిరెడ్డి, రాంప్రసారెడ్డి ప్రతీ పనిలో లంచాలు, కమీషన్లు వసూలు చేశారని, ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును రోజా దోచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి అయిన కొద్దినెలలకే రోజా ఖరీదైన కారును కొనుగోలు చేయడం కూడా అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రోజా తన నోరును ఏనాడూ అదుపులో పెట్టుకోలేదు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో రోజా పేరెత్తితే మహిళలు చీదరించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఏపీలో వైసీపీ ఘోర ఓటమికి రోజా, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్ వంటి నేతలుకూడా ఓ కారణమని చెప్పొచ్చు.
దీంతో రోజా పేరెత్తితే వైసీపీ శ్రేణులు కూడా మండిపడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అధిష్టానం పెద్దలు, పార్టీ నేతలు సైతం రోజా పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రోజాలాంటి మహిళ పార్టీ నుంచి వెళ్లిపోవటమే మంచిదన్న భావనకు అధిష్టానం సైతం వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తనపట్ల విముఖత చూపుతుందనే విషయాన్ని ముందుగానే గమనించిన రోజా.. తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది.
వైసీపీ ఐదేళ్ల పాలనలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలపై రోజా తీవ్రస్థాయిలో విమ్శలు చేశారు. దీంతో ఆ మూడు పార్టీల్లోనూ రోజాకు డోర్లు క్లోజ్ అయ్యాయి. వైసీపీ అధిష్టానం నుంచి ఆమెపట్ల విముఖత వ్యక్తమవుతోంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే బెటర్ అనే భావనకు రోజా వచినట్లు నగరి నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.
అయితే అదేమంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు. రోజా రజనీకాంత్ పై చేసిన విమర్శల కారణంగా ఆ రాష్ట్రంలో ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సరే ఎలాగోలా ఆమె అక్కడ రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాణిద్దామనుకున్నా.. ఇక్కడ ఆమె అవినీతిపై విచారణలో దోషిగా తేలితే ఇక ఆమె పొలిటికల్ డ్రీమ్స్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనని చెబుతున్నారు.
అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజా ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడా ఆమె రాజకీయాల గురించి నోరెత్తడం లేదు. అయితే, రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతికి పాల్పడినట్లు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడ లను ప్రోత్సహించాలని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రీడల నిర్వహణలో భాగం గా వంద కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విచారణలో రోజాపై ఆరోపణలు నిజమేనని తేలితే ఆమె కటకటాల పాలుకావడం ఖాయమన్న చర్చ జరుగుతుంది. అదే జరిగితే ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.