గల్లా జయదేవ్ పశ్చాత్తాప పర్వం!

రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాబలం వుంటే సరిపోదు.. మనోబలం కూడా వుండాలి. రాజకీయాల్లో రాణిస్తూ వుంటే అది చూసి తట్టుకోలేక చాలా గాడిదలు ఓండ్ర పెడుతూ వుంటాయి. ప్రతి ఊరకుక్కా మొరుగుతూ వుంటుంది.. ఒక్కోసారి సదరు కుక్కలు కరుస్తాయి కూడా. విజయాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి. అధికారం వస్తుంది.. పోతుంది.. వీటిని తట్టుకుని నిలబడినప్పుడే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు.. లేకపోతే రాజీపడిపోయిన ‘రాజీ’కీయ నాయకులు అంటారు. పాపం గల్లా జయదేవ్ వైసీపీ రాక్షస పాలనలో జరిగిన అవమానాలను భరించలేక రాజకీయ సన్యాసం చేశారు. ఆ తొందరపాటుతనం వల్ల ఆయన ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింది. వైసీపీ రాక్షస పాలనలో ఎదురైన వేధింపుల కారణంగా ఒత్తిడికి గురైన గల్లా జయదేవ్ ఇప్పుడు టీడీపీ దశ తిరగడంతో తన రాజకీయ భవిష్యత్తును తానే పాడుచేసుకున్నట్టు బాధపడుతున్నారు. చేసేది లేక మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. అప్పట్లో ఆయన రాజకీయలకు గుడ్ బై చెప్పకుండా వుంటే, ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఆయన కీలక పాత్రలో ఉండేవారు. గుంటూరు ఎంపీగా మూడోసారి పోటీ చేస్తే కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు. కింజరపు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో కీలక స్థానం రావడానికి జయదేవ్‌ పోటీలో లేకపోవడమే కారణం.  జగన్‌ తన రాజకీయ ప్రత్యర్థులను వేటాడే క్రమంలో గల్లా జయదేవ్‌ను టార్గెట్‌ చేశారు. అది తట్టుకోలేక ఎప్పుడూ ఇలాగే ఉంటుందనే భయంతో జయదేవ్‌ గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్డీయేకి గెలుపు అవకాశాలున్నాయని తెలిసినా ఒకవేళ మళ్లీ జగన్‌ వస్తే ఇబ్బంది పడతామనే ఉద్ధేశంతో పక్కకు తప్పుకున్నారు. జయదేవ్‌ కాదనడం వల్లే గుంటూరు ఎంపీ సీటును పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఇచ్చారు. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. ఇదంతా చూసి తాను ఎంత తప్పు చేసిందీ జయదేవ్‌కి అర్థమై బాధపడుతున్నారు. జయదేవ్‌ పరిస్థితిని గమనించిన చంద్రబాబు మళ్లీ పార్టీలోకి రమ్మని సూచించారు. ప్రస్తుతానికి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే రాజకీయ కుటుంబానికి చెందిన  గల్లా జయదేవ్‌కు తన సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. రెండు సార్లు ఎంపీగా పని చేసిన గుంటూరులోనూ మంచి పలుకుబడి, పరపతి ఉన్నాయి. పార్టీలోనూ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌ వద్ద గుర్తింపు ఉండటం వల్ల మళ్లీ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అయితే ఢిల్లీ పదవికి పరిమితమైతే గ్రౌండ్‌ లెవెల్‌లో ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోస్టు తీసుకోవాలా? వద్దా? అని తర్జనభర్జన పడుతున్నారు. రాజ్యసభకు వెళితే మళ్లీ కీ రోల్‌లోకి రావచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎన్డీయే కూటమి తరఫున రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబును కోరారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళాలంటే అందుకు చాలా సమయం ఉంది కాబట్టి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండాలనే చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో జయదేవ్‌ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జయదేవ్‌ చంద్రబాబు నిర్ణయించినట్లు ఢిల్లీలో అధికార ప్రతినిధి అవుతారా? లేక జయదేవ్‌ ఆశిస్తున్నట్లు రాజ్యసభలో అడుగుపెడతారా? అన్నది చూడాల్సివుంది.

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

 తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన. దేశవ్యాప్తంగా 14 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన 14 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ కూడా ఉన్నాయి. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటలకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ 14 రాష్ట్రాలకూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించాయి. 

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిఐడి తనిఖీలు 

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గత నెల 21న జరిగిన దస్త్రాల దహనం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి మదనపల్లెకి చేరుకుంది. అక్కడి నుంచి సబ్ కలెక్టరేట్​ కార్యాలయానికి చేరుకొని సోదాలు చేపట్టింది. ఇవాళ తెల్లవారుజామున 3 వరకు తనిఖీలు సాగాయి. ఈ క్రమంలోనే దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రికార్డుల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీఐడీకి అప్పగించింది. దస్త్రాల దహన ఘటనపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భాగంగా సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం వేకువజాము 3 గంటల వరకూ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, అదనపు ఎస్పీ రాజ్‌కమల్, డీఎస్పీ వేణుగోపాల్ బృందం తనిఖీలు చేపట్టింది. దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ తోపాటు, ప్రత్యక్ష సాక్షి నిమ్మనపల్లె వీఆర్ఏ రమణయ్య, ఘటన ముందు వరకూ ఆఫీసులో ఉన్న ఆర్‌డీఓ హరిప్రసాద్ లను సబ్ కలెక్టరేట్ కు పిలిపించి సీఐడీ అధికారులు విచారణ చేశారు.

మోడీ దౌత్యం యుద్ధాన్ని ఆపుతుందా?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడం కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారా? ఆయన దౌత్యం ఫలించేనా? ప్రస్తుతం ప్రపంచ దేశాలలో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం  మోడీ  ఇటీవల స్వల్ప వ్యవధిలో రష్యా, ఉక్రేయిన్ లలో  పర్యటించి రావడమే. రష్యాలో పర్యటించిన ఆరు వారాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌  వెళ్లారు. దీంతో సహజంగానే ఆయన పర్యటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి భారతదేశం  ఎటూ మొగ్గు చూపకుండా వ్యవహరిస్తోందని ప్రపంచానికి చాటేందుకే కాకుండా మోడీ పర్యటనలు.. ఆ రెండు దేశాల మధ్యా యుద్ధాన్ని ఆపడానికి కూడా అని  ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ దౌత్య సంబంధాల విశ్లేషకుల వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.  మోదీ  శుక్రవారం (ఆగస్టు 23) కీవ్‌ వెళ్లి, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమీర్‌ జెలెన్స్కీతో  చర్చలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు, ఉక్రెయిన్‌తో భారత సంబంధాల మెరుగుదలపై కూడా ఆయన ఈ సందర్భంగా చర్చించినట్లు చెబుతున్నారు. రష్యా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ పై దాడి చేసిన తర్వాత భారతదేశం ఈ రెండు దేశాలకూ సమాన దూరం పాటిస్తూ వస్తోంది. యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు, ఏ తీర్మానాన్ని ప్రతిపాదించినా భారతదేశం గైర్హాజర్‌ అవుతూ వచ్చింది. రష్యాను విమర్శించే తీర్మానాల విషయంలో కూడా మౌనం, దూరం పాటించింది.  పాశ్చాత్య దేశాల ఆంక్ష లను ఖాతరు చేయలేదు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు, ఆయుధాల సరఫరాలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో భారత్‌ పాశ్చాత్య దేశాల హెచ్చరికలు, బెదరింపులను లెక్క చేయలేదు. జి-20 సదస్సులో తమకు కూడా స్థానం కల్పించాల్సిందిగా గత ఏడాది ఉక్రెయిన్‌ చేసిన అభ్యర్థ నను భారత్‌ తోసిపుచ్చింది. ఈ ఏడాది జూన్‌లో స్విట్జర్లాండులో జరిగిన శాంతి సదస్సుకు ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాన్ని పంపించడానికి కూడా భారత్‌  సుముఖత వ్యక్తం చేయలేదు. శాంతి పేరుతో భారత్‌ రష్యా కు వ్యతిరేకంగా నోరెత్తకపోవడం పట్ల ఉక్రెయిన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ సహజంగానే రష్యా యుద్ధం విషయంలో భారత్ తనకు మద్దతుగా నిలవాలని ఆశించింది. నిలుస్తుందని భావించింది.  అయితే భారత్ నుంచి అటువంటి స్పందన లేకపోవడం అటుంచి,  పుండు మీద కారం చల్లినట్టుగా మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం ఉక్రెయిన్‌ ఆగ్రహాన్ని మరింత  పెంచింది.  ఈ నేపథ్యంలో రష్యా పర్యటన జరిగిన ఆరు వారాల తరువాత ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం అంతర్జాతీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  భారత  ప్రధాని ఉక్రెయిన్‌ను సందర్శించడం ఇదే  తొలి సారి. అదీ యుద్ధ సమయంలో భారత ప్రధాని ఉక్రెయిన్ పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అయ్యింది. ఉక్రెయిన్‌ పర్యటన సందర్భంగా ఈ ఇద్దరు నాయకులు యుద్ధం గురించి చర్చించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపం దగ్గర నివాళులర్పించారు.  మోదీ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య వ్యవసాయం, సంస్కృతి, వైద్య ఉత్పత్తులు, సామాజిక అభివృద్ధి పథకాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. అయితే అంతకు మించి అద్భుతాలేమీ జరగలేదు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆపేందుకు భారత్ కీలక పాత్ర పోషిస్తుందా లేదా అన్న దానిపై ఎటువంటి స్పష్టతా రాలేదు.  అయితే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య  శాంతి స్థాపన కోసం పరోక్ష ప్రయత్నాలకు ఎటువంటి ఢోకా ఉండదన్న సంకేతాన్ని మాత్రం మోడీ ఉక్రెయిన్ పర్యటన ఇచ్చింది.  

హైదరాబాద్ ప్లైఓవర్లపై కెటీఆర్ ట్వీట్ 

తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజలకు మేలు కన్నా కీడు ఎక్కువగా చేసింది. ఫలితంగా వోటర్లు ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తీర్పు ఇచ్చారు. అహంకారమే ఆభరణంగా భావించే మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తుతం ట్వీట్ లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి  ఓర్వలేకపోతున్నారు.బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎక్స్ వేదిక‌గా మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌లో ఫ్లైఓవ‌ర్లు, కనెక్టింగ్ రోడ్ల‌పై ట్వీట్ చేసిన‌ కేటీఆర్.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన త‌ర్వాత స్ట్రాట‌జిక్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్‌(ఎస్ఆర్‌డీపీ) ప‌నులు నెమ్మ‌దించాయ‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హ‌యాంలోనే హైదరాబాద్‌లో మౌలిక స‌దుపాయాలను క‌ల్పించ‌డానికి ఎస్ఆర్‌డీపీ ద్వారా చొర‌వ తీసుకున్నామ‌న్నారు. దీని కింద అప్ప‌టి కేసీఆర్ ప్ర‌భుత్వం 42 కొత్త ప్రాజెక్టుల‌ను ప్రారంభించింద‌ని గుర్తు చేశారు. అందులో 36 ప్రాజెక్టులు విజ‌య‌వంతంగా పూర్తి అయ్యాయ‌ని, మిగిలిన వాటిని 2024లో పూర్తి చేయాల్సి ఉండేన‌ని తెలిపారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న‌లో ఎస్ఆర్‌డీపీ  ప‌నులు పూర్తిగా నెమ్మ‌దించాయన్నారు. గ‌డిచిన 8 నెల‌లుగా స‌ర్కార్ త‌రుఫున స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో కాంట్రాక్ట‌ర్ల‌కు స‌కాలంలో చెల్లింపులు జ‌ర‌గ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఎస్ఆర్‌డీపీ ఫేజ్‌-3 ప‌నుల‌ను తిరిగి ప్రారంభించాల‌ని కేటీఆర్ కోరారు. ఈ ఫేజ్-3 ప‌నుల్లో మూసీ వెంబ‌డి ఎక్స్‌ప్రెస్‌వే, కేబీఆర్ పార్క్ కింద ట‌న్నెల్స్ నిర్మాణం, ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు, ఇత‌ర అనేక గ్రేడ్‌సెప‌రేటర్లు ఉన్నాయ‌న్నారు.

టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలకు నోటీసులు 

ఎపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి)  పై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల టీటీడీలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోణలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన లావాదేవీలపై రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి నిర్వహించిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు.   ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలకూ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అలాగే అంతకు ముందు చైర్మన్, ఈవోగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు సమాచారం.  సాధారణంగా టీటీడీలో ప్రతి ఏటా సుమారు రూ.300 కోట్ల వరకూ ఇంజనీరింగ్ పనులకు కేటాయింపులు చేస్తుంటారు.  అయితే ఈ క్రమంలో టెండర్లలో భారీ ముడుపులు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. గోవిందరాజస్వామి సత్రాలకు రూ.420 కోట్లు, స్విమ్స్‌కు రూ.77 కోట్లు, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, ఇతర పనులకు నిధుల కేటాయింపుపై విజిలెన్స్ అధికారులు ..ముఖ్య గణాంక అధికారి బాలాజీకి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. టీటీడీలో ఆర్ధిక అవకతవకలను ఎందుకు అడ్డుకోలేదో సమాధానం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తొంది.   

తెలంగాణపై డెంగ్యూ పంజా!?

తెలంగాణ రాష్ట్రం విషజ్వరాల గుప్పెట్లో చిక్కుకుందా? డెంగ్యూ విజృంభిస్తోందా? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలౌతున్న వారి సంఖ్య చూస్తుంటే అవుననే అనాల్సి వస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ వేడలో ప్రభుత్వం జర్వాల నియంత్రణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. వేలాది మంది విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలౌతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖపై ఇప్పటి వరకూ కనీసం ఒక్కటంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదే. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంటిలోనూ ఒక జ్వర బాధితుడు ఉన్నాడంటే అతిశయోక్తి లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం, ప్రతిపక్షం హైడ్రా సవాళ్లు, ప్రతి సవాళ్లకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజారోగ్యానికి ఇవ్వడం లేదు.   అధర గణాంకాల మేరకే రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగాయి. ప్రభుత్వాసుపత్రులలో తీవ్ర మైన మందుల కొరత నెలకొంది. రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో జ్వరాల వ్యాప్తి తీవ్రత చూస్తుంటే జ్వరపీడితుడు కానీ వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ జ్వర బాధితులతో నిండిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ లు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలనీ, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించి, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.  

ఏపీకి గుడ్ న్యూస్.. 12 పారిశ్రామిక వాడల జాబితాలో ఏపీకి పెద్దపీట

కేంద్రం ప్రభుత్వం ఏపీకి తీపి కబురు అందించనుంది. కేంద్రం పాతిక వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా 12 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు జాబితాలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న 12 పారిశ్రామిక వాడల జాబితాలో బీహార్, ఆంధ్ర ప్రదేశ్,  యూపీ, ఉత్తరాఖండ్, కేరళ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి.  ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం ఒక్కటే తరువాయి అని తెలుస్తోంది.  కేంద్రం నిర్ణయంతో  పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక పురోగతిని గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.   ఈ కొత్త ప్రాజెక్టులు రూ.1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా గృహ, వాణిజ్య ప్రాంతాలతో కూడిన సగటు పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలవని విశ్వసిస్తోంది. ఈ పారిశ్రామిక పార్కుల ద్వారా దేశీయంగా తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించడం సాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. సహజంగానే విజనరీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుందనడంలో సందేహం లేదు.  

ఎవరి దారి వారిదే.. ఎవరి గోల వారిదే.. బీజేపీలో నయా ట్రెండ్!

భార‌తీయ జ‌న‌తా పార్టీ అంటే క్ర‌మ శిక్ష‌ణ గ‌ల పార్టీ అన్న భావన అందరిలో ఉంటుంది. ఆ పార్టీలోని నేత‌లు ఎవ‌రికి ఇష్ట‌మొచ్చిన‌ట్లు వారు మాట్లాడేందుకు వీలుండ‌దు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేర‌కు న‌డుచుకొవాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ త‌ర‌హాలో బీజేపీలో నేత‌ల మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాలు చాలా త‌క్కువ‌గా  ఉంటాయన్న అభిప్రాయం ఉండేది. తెలంగాణ బీజేపీలోనూ మొన్న‌టి వ‌ర‌కు అదే ప‌రిస్థితి ఉండేది. కానీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత తెలంగాణ బీజేపీ రాజ‌కీయాల్లో నయా ట్రెండ్ కనిపిస్తోంది.  పార్టీలోని నేత‌లు గ్రూపులుగా విడిపోయి ఎవ‌రి రాజ‌కీయాలు వారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై బీజేపీ నేత‌లు త‌లోమాటా మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో అయోమ‌యం నెల‌కొంటోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను బీజేపీ వ్య‌తిరేకిస్తోందా.. స‌మ‌ర్ధిస్తోందా అనే విష‌యం అర్థ‌కాక ఆ పార్టీ ద్వితీయ‌ శ్రేణి నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన హైడ్రా విష‌యం లోనూ బీజేపీ నేత‌లు త‌లోమాట మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి, మ‌రి కొంద‌రు నేత‌లు హైడ్రా తీరును త‌ప్పుబ‌ట్ట‌గా.. ఎంపీ ర‌ఘ‌న‌ధ‌న్ రావు, బీజేపీ నేత‌ కొండా విశ్వేశ్వ‌ ర‌రెడ్డి వంటి నేత‌లు హైడ్రా ప‌నితీరును ప్ర‌శంసిస్తున్నారు. తాజా ప‌రిస్థితిని చూస్తే రాష్ట్ర బీజేపీలో వ‌ర్గ‌పోరు తీవ్ర‌స్థాయికి వెళ్లిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది. దీంతో పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో ప‌రిణామాల‌పై దృష్టిసారించింది. రాష్ట్రంలో కొంద‌రు నేత‌ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ స‌త్తా చాటింది. ముఖ్యంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ప్ర‌జ‌లు మంచి ఫ‌లితాల‌ను క‌ట్ట‌బెట్టారు. ప‌దిహేడు ఎంపీ స్థానాల‌కుగాను ఎనిమిది  స్థానాలలో బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.  బీజేపీకి ఇది పెద్ద విజ‌యమ‌నే చెప్పొచ్చు. ఎన్నిక‌ల్లో సానుకూల ఫలితాలను సాధించి ఊపు మీదున్న బీజేపీ.. ఆ జోష్ ను ప్ర‌స్తుతం కంటిన్యూ చేయలేకపోతోంది. నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాల కార‌ణంగా పార్టీ శ్రేణులు సైతం ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్ న‌డుస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌రువాత కిష‌న్ రెడ్డికి కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న రాష్ట్ర అధ్య‌క్షుడిగానూ కొన‌సాగుతున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో కొత్త‌వారికి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని కొద్ది కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈట‌ల రాజేంద‌ర్‌, ర‌ఘునంద‌న్ రావు, డీకే అరుణ‌, ధ‌ర్మ‌పురి అర‌వింద్ తో పాటు మ‌రి కొంద‌రు  నేత‌లు అధ్య‌క్ష స్థానం కోసం పోటీ ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీ వ‌ర్గ‌ విబేధాలు తార స్థాయికి చేరాయి. కొంద‌రు నేత‌లు పార్టీలైన్ దాటి త‌మ అభిప్రాయాల‌ను ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై బీజేపీలోని ఒక్కోనేత ఒక్కోలా మాట్లాడుతుండ‌టం బీజ‌పీ శ్రేణుల‌ను అయోమ‌యానికి గురిచేస్తోంది.  కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశాడు. అదే స‌మ‌యంలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మేఘా సంస్థ తప్పిదాలపై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాడు. అంతేకాక‌.. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలితే మీడియాను తీసుకెళ్లి మ‌రీ చూపించి, కాంట్రాక్టు సంస్థ త‌ప్పిదాల‌ను ఎత్తిచూపారు. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేఘాకు అక్కడి ప్రభుత్వాలు పలు ప్రాజెక్టులు అప్పగించడంతో.. ముందుగా మేఘాపై బీజేపీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కమలనాథులు డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. తాజాగా రేవంత్ స‌ర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా విష‌యంలోనూ బీజేపీ నేత‌లు ఏకాభిప్రాయంతో లేరు. ఎవ‌రికి అభిప్రాయాన్ని వాళ్లు ఓపెన్‌గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తున్నారు. హైడ్రా తీరును కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. దీంతో బీజేపీ హైడ్రాకు వ్య‌తిరేక‌మ‌ని అంద‌రూ భావించారు. కానీ, ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ప్రెస్‌మీట్ పెట్టి హైడ్రా కూల్చివేత‌ల‌ను స‌మ‌ర్ధించాడు. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, మ‌రికొంద‌రు బీజేపీ నేత‌లు హైడ్రాను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల రేవంత్ స‌ర్కార్ ను అభినందించారు. ఇవ‌న్నీ వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయంగా కాకుండా పార్టీ అభిప్రాయంగానే చెప్పేశారు. దీంతో హైడ్రా విష‌యంలో అస‌లు బీజేపీ స్టాండ్ ఏమిట‌న్న చ‌ర్చ రాజ‌కీయాల్లో మొద‌లైంది. ఈ క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర పార్టీ అధిష్టానం అనుమతి మేర‌కే పార్టీ కార్యాల‌యంలో ప్రెస్ మీట్లు పెట్టాల‌ని ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలిసింది.  తెలంగాణ బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ విషయంలో పార్టీలో గందరగోళం కొనసాగుతోంద‌ని స‌మా చారం. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ ను తానే  అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాన్ని ఖండించారు. అయితే కిషన్ రెడ్డి మాటలను లెక్కచేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి అభయ్ పాటిల్ హాజ‌ర‌య్యారు. అంతేకాదు.. ఆగస్ట్ 17న ఢిల్లీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‌లో తెలం గాణ ఇంచార్జ్‌గా పాల్గొనట్టు అభయ్ పాటిల్ ట్వీట్ చేశారు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా తరుణ్‌చుగ్‌ వ్యవహరించారు. ఆయనను జమ్మూకశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్‌కే పరిమితం చేయడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. అధికారికంగా ఈ పదవిలో  పార్టీ అధిష్ఠానం ఇంకా ఎవరినీ నియమించ లేదు.    కానీ జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందంటూ అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా తనను తానే స్వయంగా ప్రకటించుకున్నారు. దీంతో కిష‌న్ రెడ్డితో స‌హా బీజేపీలో కొంద‌రు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ నేత‌లు ప‌లువురు అభ‌య్ పాటిల్ తీరు ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ  రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జిగా ఆయ‌నొద్ద‌ని ఇప్ప‌టికే  అధిష్ఠానానికి తెలియజేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన పార్టీగా పేరున్న బీజేపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేర‌డంతో పాటు.. నేత‌లు ఎవ‌రికి వారే సొంత నిర్ణ‌యాలు తీసుకుంటుండం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే కేంద్ర పార్టీ పెద్ద‌లు దృష్టిసారించార‌ని, త్వ‌ర‌లోనే రాష్ట్ర బీజేపీలో నెల‌కొన్న అన్ని స‌మ‌స్య‌ల‌కు ఎండ్‌కార్డ్ ప‌డుతుంద‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది వేరే సంగతి. ప్రస్తుతం మాత్రం బీజేపీ రాష్ట్ర నేతల తీరుతో ఆ పార్టీ క్యాడర్ లో తీవ్ర గందరగోళం నెలకొందనడంలో మాత్రం సందేహం లేదు. 

వైసీపీ డర్టీ పిక్చర్!

వైసీపీపేరు దేశ రాజ‌కీయాల్లో మారుమోగుతోంది. దేశంలో ఏ రాజ‌కీయ పార్టీలోనూ ఇలాంటి త‌ర‌హా నేత‌లు ఉండ‌ర‌ని వైసీపీ నేత‌ల గురించి చ‌ర్చించుకుంటున్నారు. ప‌లు జాతీయ ఛానెల్స్ సైతం వైసీపీ నేత‌ల‌పై ఫోక‌స్ పెట్టాయి. ఏంటీ.. వైసీపీ నేత‌లు అంత గొప్ప ప‌నులు ఏం చేశార‌నుకుంటున్నారా.. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా వారి వ్య‌వ‌హార‌శైలి ఉంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధిలో ఏపీని దేశంలోనే అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నారు. తెలుగుదేశం, జ‌నసేన నేత‌లు రాష్ట్రంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తూ.. ప్ర‌జ‌ల‌ చేత మ‌న్న‌న‌లు పొందాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు. కానీ, వైసీపీ నేత‌లు మాత్రం అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ.. అధికారం కోల్పోయి ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ అక్ర‌మ సంబంధాలు, రాస‌లీల‌తో ఏపీ ప‌రువును దేశ‌వ్యాప్తంగా మంటగలుపుతున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ వీడియోలు, ఆడియోలు వైసీపీ అధికారంలో ఉండగా వైరల్‌ అయ్యాయి. అయితే, వాటిని మార్ఫింగ్ చేశారంటూ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలో ఉండ‌టంతో వారు చెప్పిందే వేదంగా నడిచిపోయింది. కానీ, ప్ర‌జ‌లు మాత్రం వైసీపీ నేత‌లు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని గ్ర‌హించారు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీకి దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. అయినా  ఆ పార్టీ నేత‌ల్లో మార్పు రావ‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో వైసీపీ నేత‌ల ఒక్కొక్క‌రి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌స్తోంది. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రించిన వైసీపీ నేత‌ల బండారం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తోంది. అధికారంలో ఉన్న స‌మ‌యంలో కొంద‌రు వైసీపీ నేత‌లు భూక‌బ్జాలు, ఇసుక‌, మ‌ట్టి దందాల‌కు పాల్ప‌డి పెద్ద‌ మొత్తంలో అక్ర‌మ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. మ‌రి కొంద‌రు భూక‌బ్జాల‌కు పాల్పడ్డారు.. ఇంకొంద‌రు మ‌హిళ‌ల‌ను భ‌య‌పెట్టి రాస‌లీలల‌ వ్య‌వ‌హారాల‌ను న‌డిపించారు. ఇటీవ‌ల కాలంలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగిని లోబ‌ర్చుకొని, ఆమెతో రాస‌లీల‌లు సాగించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతేకాదు.. ఆమె ద్వారా పెద్ద‌మొత్తంలో దేవాదాయ శాఖ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం స‌మ‌సిపోక‌ముందే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న భార్య‌ా బిడ్డ‌ల‌ను వ‌దిలేసి దువ్వాడ శ్రీ‌నివాస్ వైసీపీకి చెందిన మ‌హిళా నేత‌తో ఉంటున్న‌ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో కుటుంబ స‌భ్యులు దువ్వాడ ఇంటి ఎదుట ఆందోళ‌నకు దిగారు. ఈ వివాదం కొన‌సాగుతూనే ఉంది. ఇదే స‌మ‌యంలో వైసీపీకి చెందిన మ‌రో ఎమ్మెల్సీ అనంత‌బాబు అస‌భ్య‌క‌ర‌ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. వ‌రుస‌గా వెలుగులోకి వ‌స్తున్న వైసీపీ నేత‌ల రాస‌లీల‌ల వ్య‌వ‌హారం, అస‌భ్య‌క‌ర వీడియోపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌జ‌రుగుతున్న వేళ మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వైసీపీకి చెందిన కీల‌క నేత ముంబ‌యికి చెందిన హీరోయిన్ ను బంధించి చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌జ‌రుగుతుంది.   అల్లూరి సీతారామ‌రాజు జిల్లా రంపచోడ‌వ‌రానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. గతంలో ద‌ళిత వ‌ర్గానికి చెందిన డ్రైవర్‌ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో అనంత‌బాబు జైలుకెళ్లాడు. కొద్దిరోజుల‌కే జైలు నంచి బ‌య‌ట‌కొచ్చాడు. అయినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనంత‌బాబును పార్టీ బాధ్య‌త‌ల నుంచి తొల‌గించలేదు. దీంతో జ‌గ‌న్ అండ‌దండ‌ల‌తో అనంత‌బాబు మ‌రింత రెచ్చిపోయాడు. తాజాగా ఆయ‌న సంబంధించిన అస‌భ్య‌క‌ర వీడియో వెలుగులోకి రావ‌డంతో వైసీపీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. అనంత‌బాబు త‌న‌పై వ‌చ్చిన వీడియో మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు ఈ వ్యవహారం బయటకు తీస్తే.. అనంతబాబుకు అసలు షాక్ తగిలే అవకాశం ఉంది. డ్రైవర్ హత్య కేసులో పోలీసులు సరైన సమయంలో చార్జిషీట్ వేయకపోవడం వల్లనే సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. లేకపోతే ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం అనంతబాబు వ్యవహారాలన్నింటినీ బయటకు తెచ్చేందుకు ఆయన చేసిన ఫిర్యాదునే ఆధారంగా చేసుకుని పోలీసులతో దర్యాప్తు చేయించే అవకాశం ఉంది. మన్యంలో అరాచకశక్తిగా మారిన అనంతబాబు తనకుతానే గడ్డు పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పవచ్చు. అయితే, ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ అధిష్టానం స్పందించ‌లేదు. వైసీపీ నేత‌లు హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌టానికి పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికూడా ఓ కార‌ణ‌మ‌న్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల‌నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. అధికారంలో ఉన్న‌న్ని రోజులు భూక‌బ్జాలు, అవినీతి అక్ర‌మాల‌తో పార్టీ ప్ర‌తిష్ట‌ను కొంద‌రు నేత‌లు దెబ్బ‌తీశారు. అయినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారిని వెనుకేసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఒక్కొక్క వైసీపీ నేత రాస‌లీల‌ల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌స్తున్నా వారిపై వేటు వేయ‌కుండా జ‌గ‌న్ తాత్సారం చేస్తుండ‌టంతో పార్టీ శ్రేణుల‌ను ఆగ్ర‌హానికి గురిచేస్తుంది. గ్రామ‌, మండ‌ల స్థాయిలో ఎన్నోక‌ష్టాలు ఎదుర్కొని పార్టీ కోసం పని చేస్తుంటే రాష్ట్ర స్థాయి ప‌ద‌వుల్లో ఉన్న కొంద‌రు నేత‌లు పార్టీ ప‌రువును తీసున్నార‌ని పార్టీ శ్రేణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా మేల్కొని రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీ‌నివాస్‌, అనంత‌బాబుల‌పై వేటువేయాల‌ని, త‌ద్వారా పార్టీపై ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతున్న చెడు అభిప్రాయాన్ని తొల‌గించేందుకు జ‌గ‌న్ చర్యలు తీసుకోవాల‌ని పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేస్తున్నారు. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా మేల్కోక‌పోతే తాము పార్టీలో కొన‌సాగే ప‌రిస్థితి ఉండ‌ని కొంద‌రు నేత‌లు స్ప‌ష్టంగా చెప్పేస్తున్నారు.

ముంబై హీరోయిన్‌కి వైసీపీ నేత చిత్రహింసలు!

అధికారంలో వున్నా, అధికారం పోయినా వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, లీలలు మాత్రం నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. ఇంతకాలం వైసీపీ నాయకులు తమ తెలివితేటలను లోకల్‌గానే చూపిస్తున్నారని అనుకుంటున్నాం. వీళ్ళ తెలివితేటలు సరిహద్దులు దాటి.. రాష్ట్రాలు దాటి ముంబై వరకు చేరుకున్నాయి. ముంబైకి చెందిన ఆషా జెత్వానీ అనే హీరోయిన్‌ని, ఆమె తల్లిదండ్రులని, బంధువులని ఒక హీరోయిన్‌ని వైసీపీలో బాగా పలుకుబడి వున్న నాయకులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, తప్పుడు కేసులో ఇరికించి జైలుపాలు చేసిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అనగనగా ఆషా జెత్వానీ అనే ఒక ముంబై హీరోయిన్. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. పెద్దగా సక్సెల్ ఏమీ రాలేదు. ఆ తర్వాత ముంబైకి వెళ్ళిపోయింది. సినిమా హీరోయిన్ వేషాల మీద ఆశలు వదులుకుని, టీవీ సీరియళ్ళలో పాత్రలు ధరిస్తోంది. ఆమె టాలీవుడ్‌ సినిమాల్లో నటించినప్పుడు ఏపీకి చెందిన ఒక పెద్ద పోస్టు వెలగబెట్టిన వైసీపీ నాయకుడితో పరిచయం కలిగింది. ఆ పరిచయం చాలా దూరమే వెళ్ళిందన్న అభిప్రాయాలున్నాయి. పెద్ద గోకుడు మాస్టర్‌గా పేరున్న ఆ వైపీ బడా లీడర్, ఆ  హీరోయిన్ మధ్య ఏం జరిగిందో ఊహించలేని అమాయకులు ఎవరూ లేరు. కొంతకాలం హైదరాబాద్‌లో వేషాల కోసం ప్రయత్నించిన ఆమె ముంబైకి వెళ్ళిపోయింది. తనకు, తెలుగు రాష్ట్రాలకు ఇక సంబంధం లేదు అని ఆమె భావిస్తున్న తరుణంలో, ఏపీకి చెందిన ఆ వైసీపీ నాయకుడు ఆమె జీవితంలోకి మళ్ళీ ప్రవేశించాడు. 2024లో రాష్ట్రంలో జగన్ పార్టీ అధికారంలో వున్న సమయంలో తన అధికార బలంతో, అధికార మదంతో సదరు హీరోయిన్ జీవితంలో ఆడుకున్నాడు. పోలీసుల సహకారంతో ఆ హీరోయిన్‌ని చిత్రహింసలకు గురిచేశారు. జగన్ హయాంలో ఆయన చెప్పినట్టల్లా ఆడి, జగన్ అరాచక పాలనకు తనవంతు సహాకారం అందించిన ఒక ఐపీఎస్ అధికారి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏ పోస్టులోనూ నియమించకపోవడంతో ఖాళీగా వున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అ గొప్ప ఐపీఎస్ ఆఫీసర్, సీఐగా వెలగబెట్టిన ఒక అధికారి సహకారంతో సదరు వైసీపీ పెద్దమనిషి ముంబై హీరోయిన్‌ని చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. సదరు వైసీపీ నేత ఆ హీరోయిన్ మీద తప్పుడు కేసు పెట్టాడు. దీనికోసం మొవ్వ మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్‌ని పావుగా వాడుకున్నారు. తమను హీరోయిన్ మోసం చేసిందంటూ తప్పుడు కేసు పెట్టించారు. ఐపీఎస్ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా కమిషరేట్ కార్యాలయం నుంచి టాస్క్ ఫోర్స్ టీమ్ ముంబైకి వెళ్ళింది. ఆషా జెత్వానీని, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి 2024 ఫిబ్రవరిలో విజయవాడకి తీసుకొచ్చింది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఒక ప్రదేశంలో హీరోయిన్‌ని, ఆమె కుటుంబాన్ని రెండు వారాలపాటు నిర్బంధించింది. అక్కడ ఆమెని పోలీసులు శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. అక్రమ కేసులో అరెస్టు చేసి సబ్ జైలుకు పంపారు. ఈ వార్త మీడియాకి తెలియకుండా అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ దారుణం బయటకి వచ్చింది.  ఇబ్రహీంపట్నంలో ఉండని వ్యక్తి, ఎక్కడో కృష్ణా జిల్లా ప్రాంతంలో మొవ్వ మండలంలో ఉండే వ్యక్తి ఫిర్యాదుతో ఈ హీరోయిన్‌ని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ముంబైకి వెళ్ళి మరీ ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు ఆ హీరోయిన్‌తో సన్నిహితంగా వున్న ఆ వైసీపీ నాయకుడు ఆమెను చిత్ర హింసలకు ఎందుకు గురిచేయించాడు? ఎందుకు జైలుకు పంపించాడు.. ఇప్పుడు ఇవన్నీ రహస్యాలుగా వున్నాయి. ఈ రహస్యాలను ఛేదించే ప్రాసెస్ కూడా జరుగుతోంది. త్వరలో దీనికి సబంధించిన అన్ని వివరాలూ అధికారంగా బయటకు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

తెలంగాణ అథ్లెట్లకు అత్యధిక పథకాలపై గురి: రేవంత్ రెడ్డి 

క్రీడలకు పెద్ద పీట వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో మంచి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై... మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను రేవంత్ రెడ్డి నేడు పంపిణీ చేశారు. మెయిన్స్‌లోనూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సివిల్స్ ఉత్తీర్ణులై తెలంగాణ ప్రతిష్ఠను పెంచాలన్నారు. తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆయన ఆకాంక్షించారు.  ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తామన్నారు. 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్ ? 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో అరెస్టు అయిన క‌విత‌.. ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఇటీవ‌లే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికాగా, ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ క‌విత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. క‌విత త‌ర‌ఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించ‌నున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే న‌మ్మ‌కంతో బీఆర్ఎస్ నాయ‌క‌త్వం ఉంది. రాఖీ పండగనాడు కవిత జైల్లో ఉండటాన్ని అభిమానులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యారు. అన్న కెటీఆర్ ఈ రాత్రి తన పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లనున్నారు. 

హీరో దర్శన్ కు జైలులో వివిఐపి ట్రీట్మెంట్  కఠిన చర్యలకు సిద్దరామయ్య ఆదేశం 

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో సుమారు రెండు నెలలుగా జైలులో ఉంటున్నాడు కన్నడ స్టార్ హీరో. పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఈ హీరోను చూసి చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బయట లగ్జరీ లైఫ్ గడిపిన తమ హీరో జైలులో మగ్గిపోతున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా అబద్ధమని అర్థమై పోయింద. జైలులో హీరో దర్శన్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ అందుతుందని తెలుస్తోంది. సెంట్రల్ జైలులో అతను రాజ భోగాలు అందుకున్నట్లు స్పష్టమవుతోంది. జైలు ఆవరణలో దర్శన్ ఇతర రౌడీ షీటర్లతో కూర్చుని కులాసాగా కాఫీ తాగుతూ, సిగరెట్ ఊదుతూ కబుర్లు చెప్పుకుంటున్న ఫోటో వైరల్‌గా మారింది. దీంతో పాటు వీడియో కాల్‌లో కూడా మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో జైలు అధికారులు, ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య సదరు జైలు సిబ్బంది, ఉన్నతాధికారులప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబధించి డీజీ అండ్ ఐజీపీ అలోక్ మోహన్ నుంచి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. అలాగే దర్శన్ తదితరులను వెంటనే వేరే జైళ్లకు తరలించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు.

లిప్ట్ సాంకేతిక లోపంతో నాలుగో అంతస్థు నుంచి పడి వృద్దుడు మృతి

కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ లో ఇళ్ల కన్నా అపార్ట్ మెంట్లు ఎక్కువే. అనేక చోట్ల ఆకాశహార్మ్యాలను కడుతున్నారు. ఈ కట్టడాలకు వెళ్లాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. ఈ కట్టడాల కోసం ప్రత్యేకంగా నిర్మించే లిప్ట్ లే  ప్రజల పాలిట యమపాశాలయ్యాయి.  ఫ్లోర్‌కు లిఫ్ట్ రాకున్నా తలుపులు తెరుచుకోవడంతో ఓ వృద్ధుడు నాలుగో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌ శివారులోని గుడిమాల్కాపూర్‌లో జరిగిందీ ఘటన. రిటైర్డ్ ఫార్మసిస్ట్ అయిన 65 ఏళ్ల ఎంఎస్ సమియుల్లా బేగ్ స్థానిక ప్రియా కాలనీలో ఉంటున్నారు.బేగ్ ఈ నెల 17న కేటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. నిన్న కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లగా ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో బేగ్ తాముండే నాలుగో ఫ్లోర్ నుంచి కిందికి వెళ్లాలని అనుకున్నారు. లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కారు. అయితే, లిఫ్ట్ ఫ్లోర్‌కు చేరుకోనప్పటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఈ విషయం తెలియని బేగ్ అందులో కాలుపెట్టే సరికి అమాంతం కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అపార్ట్‌మెంట్లలోని లిఫ్ట్‌ల పనితీరుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.

హ్యాకర్ బారిన పడ్డ తెలంగాణ  స్పీకర్  

అతడు చట్ట సభకు అధిపతి. అయితేనేం హ్యాకర్లకు అవన్నీ పట్టవు. శాసనాలు తయారయ్యే అసెంబ్లీ స్పీకర్ ట్వీట్  హ్యాక్ కావడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది.  ఇటీవలి కాలంలో ప్రముఖుల ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు హ్యాక్ కావడం ఎక్కువవుతోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖులు హ్యాకర్ల బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎక్స్ ఖాతాను కొందరు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిన సమయంలో ఆ ఖాతాలో కొన్ని వీడియోలను, పోస్టులను హ్యాకర్లు పెట్టారు. ఈ విషయాన్ని గడ్డం ప్రసాద్ తెలిపారు.  "సూచన... ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత ఎక్స్ ఖాతా కొంత సమయం హ్యాక్ అయింది. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుని సెట్ చేశారు. నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు, నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను" అని గడ్డ ప్రసాద్ ట్వీట్ చేశారు. స్పీకర్ ఖాతాను హ్యాక్ చేసిన నిందితులను సైబర్ క్రైం నిపుణులు పట్టుకుంటారో వేచి చూడాల్సిందే. 

రచ్చ ఓడి ఇంట గెలిచిన వినేష్ పోగట్

ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది నానుడి. వినేష్ పోగట్ విషయంలో రివర్స్ అయ్యింది. ఆమె ఒలింపిక్స్ లో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయినప్పటికీ స్వగ్రామంలో మాత్ర అపూర్వ సాగతం అందుకున్నారు.  ఒలింపిక్స్ లో అనర్హతకు గురైన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కు స్వర్ణ పతకం లభించింది. అయితే, ఈ పతకం ఒలింపిక్స్ నిర్వాహకులు ఇచ్చింది కాదు. వినేశ్ స్వగ్రామం బలాలి ప్రజలు అభిమానంతో చేయించి ఇచ్చిన పతకం. వినేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం బలాలిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామస్తులు ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. బంగారు పతకం మెడలో వేయడంతో పాటు కరెన్సీ నోట్ల దండలతో సత్కరించారు.  వంద గ్రాముల అదనపు బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ పై వేటు పడింది. 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్ లో గెలిచినప్పటికీ రెజ్లర్ కు పతకం దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన వినేశ్ కు ఆమె సొంత గ్రామం నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఒలింపిక్స్ కమిటీ వేటు వేసినప్పటికీ తమ దృష్టిలో వినేశ్ స్వర్ణం గెలిచినట్లేనని గ్రామస్తులు చెప్పారు. తామే బంగారు పతకం చేయించి ఆమె మెడలో వేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే తాజాగా వినేశ్ ఫోగాట్ పుట్టిన రోజు వేడుకల్లో గోల్డ్ మెడల్ తో సన్మానించారు. ‘నా పోరాటం ముగియలేదు.. మన దేశంలోని అమ్మాయిల కోసం ఇప్పుడే మొదలైంది. ఒలింపిక్స్ లో ఫైనల్ కు దూరమవడంతో ఎంతో బాధ పడ్డా. అయితే, తిరిగి వచ్చాక నాకు దక్కిన మద్దతు చూశాక నేను ఎంతో అదృష్టవంతురాలినని అనిపించింది. ఇప్పుడు అందుకున్న ఈ మెడల్ కంటే నాకు ఏదీ గొప్పది కాదు’ అని బలాలిలో జరిగిన సన్మాన సభలో వినేశ్ ఫోగాట్ వ్యాఖ్యానించారు.