బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైడ్రా నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా పని మొదలెట్టేసింది. ఇప్పటికే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ కట్టడాలను కూల్చివేసింది. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన  చెరువును ఆక్రమించి విద్యాసంస్థలు నిర్మించారంటూ నోటీసులు జారీ చేసింది.  మర్రి రాజశేఖరరెడ్డికి చెందిన ఎమ్ ఎల్ ఆర్ఐటీ,  ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను చిన్న దామెర చెరువు ను ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన   రెవెన్యూ అధికారులు మర్రిరాజశేఖరరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆయనకు చెందిన విద్యాసంస్థల కూల్చివేతపై ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. అయితే మరో వైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను అతిక్రమించి నిర్మించిన విద్యాసంస్థల విషయంలో వాటి యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.  వాటిపై తక్షణ చర్యలు తీసుకోబోమని  పేర్కొన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున అటువంటి విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేస్తామన్నారు. విద్యార్థులను తరలించిన తరువాత ఆ కట్టడాలను వారంతట వారే  కూల్చి వేసుకోవాల్సి ఉంటుందన్నారు.  అలా జరగకపోతే అప్పుడు హైడ్రా రంగంలోకి దిగుతుందని రంగనాథ్ పేర్కొన్నారు.  ఆ సందర్భంగా ఆయన మల్లారెడ్డి, ఒవైసీల పేరు ప్రస్తావించారు.  నిబంధనలను అతిక్రమించి నిర్మించిన కట్టడాల విషయంలో మల్లారెడ్డి అయినా, ఒవైసీ అయినా హైడ్రా ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.  

అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కడున్నారు?.. జనసేన ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

మెగా వర్సెస్ అల్లు వార్ ముదిరి పాకాన పడింది. ఇంత వరకూ రెండు కుటుంబాలకు చెందిన వారి మధ్య మాత్రమే నడిచిన మాటలయుద్ధం ఇప్పుుడు రాజకీయ వేదికలకూ పాకింది. అసలిదంతా ఎలా మొదలైందంటే.. ఎన్నికలకు ముందు  వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి, ర్యాలీలో పాల్గొనడంతో ఆరంభమైంది. అప్పటి నుంచీ   అల్లు అర్జున్  పై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉంది. మెగా అభిమానులు బన్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. నాగబాబు సోషల్ మీడియా వేదికగా బన్నీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ పరోక్షంగా పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అంటూ.. ఇటీవల ఓ ఈవెంట్ లో నా ఫ్యాన్స్ అని నొక్కి చెప్పాడు. అలాగే నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తానంటూ తన నంద్యాల టూర్ ని సమర్ధించుకున్నాడు.  దీంతో బన్నీపై మెగా అభిమానుల విమర్శలు మరింత పెరిగాయి. ఇలా రోజురోజుకి వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది కదా.. దీనిపై మీ స్పందన ఏంటని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బొలిశెట్టి శ్రీనివాస్ అసలు అల్లు అర్జున్  కు ఫ్యాన్స్ ఉన్నారా? నాకు తెలియదు అంటూ బదులిచ్చారు.  మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా విడిపోయి షామియానా కంపెనీలాగా బ్రాంచ్ పెట్టుకున్నారేమో అని వ్యాఖ్యానించారు. అలాగే ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదు. బహుశా అల్లు అర్జున్  తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో అన్న బోలిశెట్టి శ్రీనివాస్ ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అభిమానులే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు.  నా ఇష్టమైతే వస్తా అన్న అల్లు అర్జున్ మాటలను ఉటంకిస్తూ అసలు ఆయనను రమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా ఒకటే అన్న బోలిశెట్టి,   జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేసిన చోట వాళ్లు ఓడిపోయారన్నారు. అంతెందుకు అల్లు అర్జున్ తండ్రి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వెళ్లి ఏం చేశారని ఎద్దేవా చేశారు. దీంతో ఇప్పుడు బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా అల్లు ఫ్యామిలీ వార్ ఇప్పుడు మరంత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

శ్రీకాకుళంలో భూ కంపం...భయాందోళనలో ప్రజలు 

ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గత ఏడాది టర్కీ,సిరియా భూకం ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలో 50 వేల మందికిపైగా కన్నుమూశారు. భారత్, ఇండోనేషియా, పాకిస్థాన్, చైనా, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో తరుచూ భూంకపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్ లో ఎక్కువగా ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఏపిలో భూకంపం సంభవించింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరిగిందో కాసేపు అర్ధం కాక అయోమయానికి గురయ్యారు. భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎన్ కన్వెన్షన్ పూర్తిగా అక్రమ కట్టడం.. స్పష్టం చేసిన హైడ్రా

తెలంగాణలో గత కొన్ని రోజులుగా హైడ్రా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ముఖ్యంగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగిపోతోంది. కాగా తన కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని నాగార్జున ప్రకటించారు. ఎలంటి అతిక్రమణలూ లేకుండా పట్టాభూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లారు. అంతే కాకుండా గతంలోనే ఎన్ కన్వెన్షన్ కు కూల్చవద్దన్న కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా హైడ్రా ఓవరేక్షన్ చేసి తన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిందని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి కనీసం అనుమతి కూడా లేదని హైడ్రా తన సుదీర్ఘ వివరణలో కుండబద్దలు కొట్టింది.   నటుడు నాగార్జున తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టిఎల్) ను ఆక్రమించి నిర్మించారనీ, అందుకే దానిని కూల్చివేశామని నిర్ద్వంద్వంగా పేర్కొంది.  తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని, చట్ట విరుద్ధమని నాగార్జున పేర్కొనడాన్ని ఖండించింది.  అలాగే ఎన్ కన్వెన్షన్ ను పట్టాభూమిలోనే నిర్మించామని నాగార్జున చెప్పడం శుద్ధ అబద్ధమని హైడ్రా పేర్కొంది.  ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  ఎన్ కన్వెన్షన్ ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్మితమైన కట్టడమని స్పష్టం చేశారు. అంతే కాకుండా   మొత్తం తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను పూర్తిగా ఆక్రమించి మరీ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని విస్పష్టంగా చెప్పారు.   ఎన్ కన్వెన్షన్ కు 2014లోనే జీహెచ్ ఎంసీ నోటీసులు జారీ చేసిందని వివరించారు.  దాంతో అప్పట్లోనే ఎన్ కన్వెన్షన్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారని రంగనాథ్ వివరించారు.  ఆ తరువాత కోర్టు ఎన్ కన్వెన్షన్ యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిచిన అనంతరం ఎన్ కన్వెన్సన్ యజమానులకు జీహెచ్ఎంసీ మరో నోటీసు జారీ చేసిందనీ, ఆ నోటీసులో  తమ్మిడికుంట చెరువు ఎఫ్ టిఎల్ ను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని పేర్కొందని వివరించారు.  ఆ తరువాత ఎన్ కన్వెన్షన్ యజమానులు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్ఎస్)  కింద క్రమబద్ధీకరించుకోవడానికి విఫలయత్నం చేశారని హైడ్రా చెర్మన్ రంగనాథ్ పేర్కొన్నారు.  

తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. మంగళవారం (ఆగస్టు 27) వరకూ శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టగా, బుధవారం టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం (ఆగస్టు 27) శ్రీవారిని మొత్తం 71 వేల 153 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 853 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 32 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక బుధవారం (ఆగస్టు 28) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 12 గంటల సమయం పడుతోంది. 

జగన్ లండన్ టూర్... సీబీఐ కోర్టు అనుమతి!

ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లోకంటే కర్నాటకలో, లండన్లో ఎక్కువగా వుంటున్నారు. మొన్నీమధ్యే కదా విదేశాలకు వెళ్ళొచ్చారు. మళ్ళీ ఇంకోసారి ఫారిన్ టూర్‌కి బయల్దేరబోతున్నారు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్‌లో పర్యటనలో పర్యటించబోతున్నారు. ఆయన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి ఆయన లండన్‌కి వెళ్తున్నారట.  దీనికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వస్తారా.. రారా అనే అనుమానాలు తలెత్తాయి. ఎందుకు వెళ్ళారనే డౌట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అవే అనుమానాలు, డౌట్లు వస్తున్నాయి. కొంతమంది అయితే, జగన్‌కి లండన్‌లో మానసిక వ్యాధికి ట్రీట్‌మెంట్ జరుగుతోందని, అందుకే ఆయన పదేపదే లండన్ వెళ్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో ఆ లండన్ మహా నగరానికే తెలియాలి.

కేటీఆర్ ఫామ్‌హౌస్.. ఈరోజు కూల్చడం ఖాయం..!

హైదరాబాద్‌లో హైడ్రా రెచ్చిపోతోంది. చెరువుల ఉనికినే దెబ్బతీసేలా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. గత వారం పది రోజులుగా హైడ్రా ధాటికి వందల కొద్దీ భవనాలు కుప్పకూలిపోయాయి. దాంతో చెరువులను ఆక్రమించి కట్టిన, చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టిన భవనాల యజమానులు వణికిపోతున్నారు. హైడ్రా చిన్నా చితకా భవనాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద అపార్టమెంట్ల వరకు దేనినీ వదలడం లేదు. అన్నిటినీ చితమంటల్లోకి నెట్టేస్తోంది. చెరువుల విషయంలో ఆక్రమణ జరిగిందా... నిబంధనల అతిక్రమణ జరిగిందా.. అయితే కూల్చేయ్.. ఇదీ హైడ్రా వరస. హైదరాబాద్‌లో ఇంతవరకు కనీ వినీ ఎరుగని విధంగా ఎన్నో పెద్ద పెద్ద అపార్టుమెంట్లు హైడ్రా బారిన పడి శిథిలాలుగా మారిపోయాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనసులో ఇంకా ఏయే ఆలోచనలు వున్నాయో.. ఇంకా ఏ రేంజ్‌లో కూల్చివేతలు జరగబోతున్నాయో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.  సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ని హైడ్రా కూల్చేయడంతో ఇక హైడ్రా ఎంతవారి ఆస్తులనైనా కూల్చేయడం ఖాయమన్న సందేశం అందర్లోకి వెళ్లింది. దాంతో చాలామంది ప్రముఖల గుండెలు దడదడలాడుతున్నాన్నాయి. నాగార్జున కన్వెన్షన్‌ని కూల్చిన తర్వాత హైడ్రా రెండు రోజులపాటు నిశ్శబ్దంగా వుంది. మొన్న ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్‌ని కూల్చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. సోమ, మంగళవారాల్లో కూడా హైడ్రా నిశ్శబ్దంగా వుంది.  ఈ నేపథ్యంలో బుధవారం నాడు కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని కూల్చేస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదేళ్ళు అధికారం చెలాయించిన పార్టీకి చెందిన నాయకుడి ఫామ్ హౌస్ కాబట్టి బీఆర్ఎస్‌కి చెందిన నాయకులు నిరసన కార్యక్రమాలు జరిపే అవకాశం వుంది కాబట్టి, పూర్తిగా పోలీసు బలగాలతో ఆ ప్రాంతం మొత్తాన్నీ కట్టడి చేసి, కూల్చివేతలు నిర్వహించాలన్నది హైడ్రా ప్లాన్‌గా తెలుస్తోంది.  హైదరాబాద్‌లోని జంట జాలాశయాల పరిధిలో 111 జీవో అమలులో వుంది. అంటే ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు కట్టకూడదు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్‌లు వెలిశాయి. ఈ ప్రాంతంలోనే వెలిసిన కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ఇక్కడ కూల్చివేతలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫామ్‌హౌస్‌ వీడియోలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన నేరం మీద రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది. ఆనాడు జరిగిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, కూల్చివేతల పర్వం కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ప్రారంభం కాలేదు.. ఆ ఒక్కదానితో ముగిసేదీ కాదు.. ఏది ఏమైనప్పటికీ ఈ బుధవారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారనే అనుమానాలు అయితే బలంగా వున్నాయి. ఆ ఫామ్ హౌస్ నాది కాదు.. నా ఫ్రెండ్‌ది.. నేను కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ ప్రకటించారు. అందులో ఏవైనా అతిక్రమణలు వుంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తాను అని కూడా ప్రకటించారు. దానితోపాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి పలువురు కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్‌కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నా ఫామ్ హౌస్ నిబంధలకు వ్యతిరేకంగా వుంటే కూలగొట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. కేటీఆర్‌దిగా భావిస్తున్న ఫామ్‌హౌస్‌ని కూల్చేయాలని పలువుని నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఫామ్ హౌస్ ఓనర్‌గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూలగొట్టవద్దు అని చెప్పలేదు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పింది. కాబట్టి కోర్టు వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందువల్ల లైన్ మొత్తం క్లియర్‌గా వుంది.. ఇక కూలగొట్టడమే మిగిలి వుందని, ఆ కార్యక్రమం బుధవారం నాడు పూర్తి అవబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కూల్చివేతలు నిర్వహించే వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే, ఫామ్‌హౌస్ కూలగొట్టకుండా ఆపే పరిస్థితి లేకపోవడంతో సదరు ఫామ్‌హౌస్‌లోని సామాను మొత్తాన్నీ కేటీఆర్ అక్కడ నుంచి తరలించినట్టు సమాచారం. లోపల ఇంద్రభవనంలా వుండే ఫామ్‌హౌస్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన చాలా సామాను వుంది. ఆ సామాను మొత్తాన్నీ అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్‌లో పూచిక పుల్ల కూడా లేకుండా మొత్తం తరలించేశారు. కూల్చివేతకు కేటీఆర్ మానసికంగా సిద్ధపడే ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. ఇక హైడ్రాకి లైన్ క్లియర్‌గా వుంది. కూల్చేయడమే మిగిలివుంది.

వెంకటరెడ్డి అక్రమాల గనిలో తవ్విన కొద్దీ నేరాలు!

పాపం పండటం అంటే ఏమిటో, పాపం పండితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డికి ఇప్పుడు తెలిసి వస్తోంది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి ఇసుక మైనింగ్ అనుమతులు, అమ్మకాలు, టెండర్లు, కాంట్రాక్టుల వ్యవహారంలో  ఇష్టారీతిగా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి, ఇప్పుడు గతంలో చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జగన్ హయాంలో వీఈ వెంకటరెడ్డి అక్రమాలపై ఏసీబీ అవినీతి నిరోధక శాఖ నజర్ పెట్టింది. వెంకటరెడ్డి అక్రమాలపై దర్యాప్తునకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద అనుమతులను సంపాదించింది.  జగన్ హయాంలో  ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ఎండీగా వెంకట రెడ్డి బహువిధాలుగా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక మైనింగ్, విక్రయాలు, టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో నిబంధనలకు తూట్లు పొడిచి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.  ఆ ఆరోపణల మేరకు వెంకటరెడ్డి పూర్తిగా వైసీపీ నేతల ఆదేశాల మేరకు పని చేశారు.  అలా పని చేసి ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చేశారు.  ఆ ఆరోపణల ఆధారంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన సస్పెండ్ చేసింది.  ఇప్పటికే వెంకటరెడ్డి మైనింగ్ లీజుల కేటాయింపులో పలు ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడ్డారని ఏపీబీ నిర్ధారించింది. అలాగే ఇసుక టెండర్ల ఖరారులోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఏపీబీ దర్యాప్తులో తేలింది. ఇప్పుడు అందుకు సంబంధించి ఫైళ్లు, డాక్యుమెంట్ల పరిశీలనలో దిగ్భ్రాంతికర విషయాన్ని ఏపీబీ బయటపెట్టింది. జైపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీ అప్పటికే ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు బకాయి పడి ఉండగా వెంకటరెడ్డి  ఆ కంపెనీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంతే కాకుండా సుప్రీం కోర్టుకు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీలకు తప్పుడు అఫిడవిట్లను సమర్పించారు. ఈ విషయంపైనే ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తున్నది.  ఈ నెల 31న వెంకటరెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది.  అయితే  సస్పెన్షన్ లో ఉండటం వల్ల ఆయన రిటైర్ కాలేరు.  అదలా ఉంచితే గత రెండు నెలలుగా వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. సస్పెన్షన్ నోటీసులు అందుకోవడానికి కూడా ఆయన దొరక లేదు.  మొత్తం మీద వెంకటరెడ్డి కదలికలను ఏసీపీ నిశితంగా పరిశీలిస్తున్నది. ఇప్పటికే మైనింగ్ ఎండీగా ఆయన పాల్పడిన   అవకతవకలు, అక్రమాలపై స్ఫష్టమైన ఆధారాలు లభించడంతో  ఆయ నపై  చర్యలు తప్పవు. కలుగులో దాక్కొన్నా బయటకు తీసుకువచ్చి చట్ట ప్రకారం శిక్ష అనుభవించేలా చేస్తారు.   

కాంగ్రెస్ తో గొంతు కలుపుతున్న బద్దశత్రువు బిజెపి  

కాంగ్రెస్ కు  బిజెపి బద్ద శత్రువు. ఈ రెండు పార్టీలు మునుపెన్నడూ కల్సి రాలేదు.కానీ హైడ్రా కూల్చివేతల విషయంలో  కాంగ్రెస్ కు బిజెపి పూర్తి మద్దత్తు ఇస్తోంది. ఈ రెండు పార్టీల కామన్ బద్దశత్రువు బిఆర్ఎస్ . బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఫామ్ హౌజ్  జన్వాడా కూల్చివేత కోసం కాంగ్రెస్ కు బిజెపి బాసటగా నిల్చింది.  హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలోని ఇతర నాయకులు హైడ్రాపై ఆచితూచి మాట్లాడుతుంటే రఘునందన్ మాత్రం అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతను సమర్థించిన ఆయన.. ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వం  తరపున హైకోర్టులోనూ వాదనలు వినిపించేందుకు సిద్ధమని ప్రకటించి సంచలనమే సృష్టించారు.  తాజాగా, మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అడ్డొచ్చే వారిపై బుల్డోజర్లు ఎక్కించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం చెరువులు, కుంటలు, ఆక్రమణల కూల్చివేతల విషయంలో ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, ఈ విషయంలో హైడ్రా పారద్శకంగా వ్యవహరించాలని సూచించారు. అలాగని పేదల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధుల్లో రాజకీయ నాయకులు ఎవరూ కలగజేసుకోవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి ప్రభుత్వ భవనాలైనా సరే కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బహిష్కరించిన ఎస్పీ!

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఎదురే లేదన్నట్లుగా విర్రవీగిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అనంతపురం జిల్లా ఎస్పీ నియోజకవర్గ బహిష్కరణ వేటు వేశారు. స్థాయి మరిచి రెచ్చిపోయిన పెద్దారెడ్డిని పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య నియోజకవర్గం నుంచి అనంతపురం తరలించారు. ఇకపై నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటే ముందస్తు అనుమతి తప్పని సరి అని స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల తరువాత నియోజకవర్గంలో చెలరేగిని హింసాకాండ నేపథ్యంలో ఎస్పీ కేతిరెడ్డి నియోజకవర్గ ఎంట్రీపై బహిష్కరణ అస్తరం ప్రయోగించారు. ఈ మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టరాదన్నది ఆ నోటీసుల సారాంశం.  ఎన్నికల ఫలితాల అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రతిసారీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డి ప్రజెన్స్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని భావించిన పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా ఆయన నియోజకవర్గంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు.   తాజాగా ఇటీవల పెద్దారెడ్డి తన నివాసానికి వచ్చిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో వాహనాలు దగ్ధం అయ్యాయి,  ఆస్తి నష్టం సంభవించింది. దీంతో పోలీసులు పెద్దారెడ్డిని నియోజకవర్గం బయటకు సాగనంపారు. పటిష్ఠ బందోబస్తు మధ్య పెద్దారెడ్డిని అనంతపురంకు తరలించిన పోలీసులు ఇకపై ముందస్తు అనుమతి లేకుండా నియోజకవర్గంలోకి ప్రవేశించవద్దని నిషేధం విధించారు.  తాడిపత్రి నియోజకవర్గంలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, పర్యవేక్షించిన డీజీపీ నియోజకవర్గంలో హింసాకాండకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలో తెలుగుదేశం, వైసీపీకి చెందిన కీలక నేతల ప్రజన్స్ వల్లనే తాడిపత్రిలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పుతోందని డీజీపీ పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగానే ఎస్పీ పెద్దారెడ్డిని నియోజకవర్గంలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.   

కూల్చివేతల ఖర్చు ఆక్రమణదారులదేనని  తేల్చేసిన హైడ్రా

హైడ్రా కూల్చివేతల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 166 నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రాకు వ్యర్థాల తరలింపు భారంగా మారింది. కూల్చివేతల ఖర్చు హైడ్రాకు తడిసి మోపెడవుతోంది. దీంతో హైడ్రా కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల ఖర్చు  మీవి అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతల  పని  మాది అని కొత్త నినాదం ఇచ్చారు.  హైదరాబాద్ లోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రా.. తాజాగా అక్రమ నిర్మాణదారులకు మరో షాక్ ఇచ్చింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చు మొత్తం వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కూల్చివేతలకు సంబంధించి బుల్డోజర్లు, వాటికి ఇంధనం, ఆపరేటర్ కు వేతనం, కూల్చివేతల తర్వాత పోగవుతున్న వ్యర్థాల తరలింపు.. వీటికయ్యే ఖర్చు మొత్తం అక్రమ నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తేల్చిచెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆర్‌ఆర్‌ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. హైడ్రా ఇప్పటి వరకు సిటీలోని 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇందులో పలు భారీ కట్టడాలు కూడా ఉండడంతో నిర్మాణ వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగయ్యాయి. ఆక్రమణలు తొలగించడంతో పాటు చెరువులను పూర్వ స్థితిలోకి తీసుకురావడానికి తవ్వకాలు జరపాల్సి ఉంటుందని, భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జరగకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ చెప్పారు. వ్యర్థాల తరలింపుతో పాటు ఈ ఏర్పాట్లకు రూ.కోట్లలో ఖర్చవుతుందని ఆయన వివరించారు. అయితే, హైడ్రా వద్ద ప్రస్తుతం నిధులు ఆ స్థాయిలో లేవని ఆయన వివరించారు. ఇప్పటి వరకు జరిపించిన కూల్చివేతలకు ఇచ్చిన కాంట్రాక్టులోనే శిథిలాల తొలగింపును కూడా చేర్చామని తెలిపారు.

తెలుగు నటితో మాజీ ముఖ్యమంత్రి రాసలీలలు..

రాజకీయ నాయకులు రాసలీలలు నడిపే విషయంలో నంబర్ వన్ రాష్ట్రం అయిన కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి ఒకరు నందిబెట్ట ప్రాంతంలో వున్న అతిథి గృహంలో పలువురు యువతులతో సరస సల్లాపాలు నిర్వహించారని ప్రముఖ న్యాయవాది జగదీశ్‌ ఆరోపణలు చేశారు.  సదరు మాజీ ముఖ్యమంత్రి తీరుపై సుప్రీంను ఆశ్రయించనున్నామని న్యాయవాది జగదీశ్ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తామని తెలిపారు. జగదీశ్ అన్నీ చెప్పారుగానీ, ఆ మాజీ ముఖ్యమంత్రి పేరు మాత్రం చెప్పడం లేదు. ‘ఆయన’ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇద్దరు మంత్రులతో కలసి నందిబెట్ట ప్రాంతలో వున్న అతిథి గృహానికి వెళ్ళేవారట. అక్కడ పలువురు యువతులతో ముఖ్యమంత్రి అండ్ మంత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని ఆరోపిస్తున్నారు. సదరు యువతులలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక సినీ నటి కూడా వున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఇలాంటి సేవలు చేసిపెట్టడం ద్వారా కొంతమంది దళారులు తమ ఫైళ్ళ మీద సంతకాలు చేయించుకునేవారని లాయర్ జగదీశ్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక 20 మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం.  కొద్ది రోజుల్లో ఆ నాయకులు, అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం వుందంటున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రితో కలసి గెస్ట్ హౌస్‌లో సేవలు అందుకున్న మంత్రులలో ఒకరు ఇప్పుడు కర్నాటకలో ఎంపీగా కూడా వున్నారట. 

షర్మిల అడుగులు తెలుగుదేశం వైపు?

కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తోందా?  లేదా షర్మిల అలా భయపడుతున్నారా? తన కంటే తన అన్న జగన్ ను పార్టీలోకి తీసుకుంటేనే బెటర్ అని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇస్తోందని షర్మిల భావిస్తున్నారా? అంటే ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న ప్రకటనలు, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు వింటే ఔననే అనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బెంగళూరు వేదికగా జగన్ తరచూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారనీ, ఆ భేటీల్లో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రతిపాదన తీసుకు వచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే జగన్ చర్యలు, ప్రకటనలు కూడా ఉంటున్నాయి. రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం నుంచి ఆయన వరుసగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్ తో ఒప్పందం లేదా పొత్తు స్థాయిని దాటి విలీనం దాకా వెళ్లాయని కూడా వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన దారి తాను చూసుకోకతప్పదని గ్రహించారని అంటున్నారు. అందుకే ఆమె విమర్శల దాడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పై కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేని తన అన్న పార్టీ వైసీపీ మీదనే ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. దీంతో ఆమె చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాకుండా తెలుగుదేశం కు ప్రయోజనం కలిగేలా ఉంటున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా కాదు బాహాటంగానే చెబుతున్నాయి. ఇటీవల అచ్చుతాపురం ప్రమాదం విషయంలో షర్మిల విమర్శలన్నీ వైసీపీ టార్గెట్ గానే  ఉండటాన్ని కాంగ్రెస్ వర్గాలు ఉటంకిస్తున్నాయి. అచ్చుతాపురం ప్రమాదానికి కారణం వైసీపీ సర్కార్ నిర్వాకమేనని ఆమె కుండబద్దలు కొట్టడమే కాకుండా, తెలుగుదేశం కూటమి సర్కార్ ను వెనకేసుకు వచ్చేలా మాట్లాడారని అంటున్నాయి.  అచ్యుతాపురం ప్రమాదం విషయంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష  వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలే అయింది,గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే ఈ ప్రమాదానికి కారణమని తెలుగుదేశం ఆరోపిస్తుంటే,  వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో  ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదాన్ని ఎలా హ్యాండిల్  చేశామో గుర్తు తెచ్చుకోండి అంటూ తెలుగుదేశం తక్షణ స్పందన విషయంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నది. ఈ మధ్యలో షర్మిల తన నోటికి పని చెప్పారు. అచ్చుతాపురం ప్రమాదం జరగడానికి  గత వైసీపీ సర్కార్ నిర్వాకమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. భద్రతా ప్రమాణాలు సరిగా లేవంటూ గత డిసెంబర్ లోనే ప్రభుత్వానికి నివేదిక అందినా జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు.   ఆమె మాటలు నిస్సందేహంగా తెలుగుదేం కూటమి సర్కార్ కు మద్దతుగా అనుకూలంగా ఉన్నాయి.  షర్మిల తీసుకున్న ఈ స్టాండ్  రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి ఏ మేరకు దోహదపడుతుందో తెలియదు కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం గట్టి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఇక్కడే  షర్మిల అడుగులు కాంగ్రెస్ కు ఎడంగా, తెలుగుదేశం వైపుగా పడుతున్నాయా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.  

నా ఫామ్ హౌజ్ బఫర్ జోన్ లో లేదు:  ఎంఎల్సి  పట్నం మహేందర్ రెడ్డి

హైడ్రా కూల్చివేలతో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జంప్ అయిన ప్రజాప్రతినిధుల గుండెల్లో కూడా వణుకు మొదలైంది. హిమాయత్ సాగర్ చెరువు బఫర్ జోన్ లో ఉన్న ఎంఎల్ సి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌజ్ ను రేవంత్ సర్కారు కూల్చివేస్తుందా? లేదా? ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఇవ్వాళ పట్నం మహేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కెటీఆర్ కు అవగాహన లేకపోవడం వల్లే నా ఫామ్ హౌజ్ బఫర్ జోన్ లో ఉందని చెబుతున్నారన్నారు.  కొత్వాల్ గూడలోని తన ఫాంహౌస్ అక్రమ నిర్మాణమంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయంపై మాట్లాడారు. కొత్వాల్ గూడలోని సర్వే నెం.13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005 లో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు. అప్పటి ప్రభుత్వం నుంచి, ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫాంహౌస్ కట్టుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు.తాత, తండ్రుల నుంచి తమది వ్యవసాయ కుటుంబమని, తమ కుటుంబానికి చాలా వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు. అలాంటిది ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అక్కడ ఎలాంటి కాంపౌండ్ లేదని కావాలంటే మీడియా ప్రతినిధులతో సహా ఎవరైనా వెళ్లి చూడొచ్చని చెప్పారు. అవసరమైతే పట్టా కాగితాలు కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అది చిన్న గెస్ట్ హౌస్ అని, అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఆరోపణల్లో నిజంలేదని మహేందర్ రెడ్డి చెప్పారు. అక్కడికి చుట్టుపక్కల పలు ఫంక్షన్ హాళ్లు, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. హైడ్రా ఏర్పాటును ఎమ్మెల్సీ ప్రశంసించారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు.

జగన్ ను అన్ ఫాలో చేసిన రోజా?.. సందేహం లేదు.. ఇక సాంబారే!

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పేశారా? ఇక దేవుడిచ్చిన జగనన్న ముఖం కూడా చూడకూడదని నిర్ణయించేసుకున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీనీ, జగన్ ను అన్ ఫాలో అయ్యారు. అలా వైసీపీని అన్ ఫాలో చేయడం ద్వారా ఇక తనకు ఆ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు. ఆమె హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గత కొంత కాలంగా ఆమె తమిళనాడు నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ఫ్రెష్ గా మెదలు పెట్టనున్నారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చారని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక రోజాకు ఏపీతో, వైసీపీతో బంధం తెగిపోయి నట్లేనని చెబుతున్నారు. వాస్తవానికి ఒక్క రోజా అనే కాదు ఇటీవలి ఘోర పరాజయం తరువాత పలు వురు వైసీపీ సీనియర్లు పార్టీకి దూరం అయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం, స్థాయి కూడా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా  తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అగ్రనాయకుల మీదా నోరెట్టుకు పడిపోయిన వాళ్లంతా ఇప్పుడు నోరుకుట్టుకుని మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. విడదల రజని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశి, గుడివాడ అమర్నాథ్ ఇలా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం స్థాయి మరిచి చెలరేగిన నేతలెవరూ ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఆ కోవలోనే రోజా కూడా నడుస్తున్నారు. సినీ నటిగా ఆమెకు తమిళనాట ఉన్న క్రేజ్, గుర్తింపునకు తోడు దర్శకుడిగా రోజా భర్త సెల్వమణికి కూడా ఆ రాష్ట్రంలో ఒకింత పలుకుబడి ఉండటంతో రోజా సేఫ్ సైడ్ గా తమిళనాడుకు మకాం మార్చేశారని వైసీపీ వర్గాలే బెబుతున్నాయి. ఇప్పుడామె తమిళనాడు వేదికగా పోలిటిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమౌతున్నారని అంటున్నారు.  

కేటీఆర్ ఫామ్‌హౌస్ ఖాళీ.. ఇక కూల్చుకోండి!

హైదరాబాద్ నగరానికి చెందిన జంట జలాశయాల నిషేధిత ప్రాంతంలో నిర్మించిన కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేతకు సంబంధించిన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ నాది కాదు.. నా మిత్రుడిది అని ప్రకటించారు. అతిక్రమణలు వుంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తాను అని కూడా చెప్పారు. ఫామ్ హౌస్ ఓనర్‌గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి కోర్టు నుంచి రిలీఫ్ ఏమీ లభించలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని ఏరోజైనా కూలగొట్టొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇక చేయగలిగింది ఏమీ లేకపోవడంతో, సదరు ఫామ్‌హౌస్‌లోని సామాను మొత్తాన్నీ కేటీఆర్ అక్కడ నుంచి తరలించినట్టు సమాచారం. లోపల ఇంద్రభవనంలా వుండే ఫామ్‌హౌస్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన చాలా సామాను వుంది. ఆ సామాను మొత్తాన్నీ అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్‌లో పూచిక పుల్ల కూడా లేకుండా మొత్తం తరలించేశారు. కూల్చివేతకు కేటీఆర్ మానసికంగా సిద్ధపడే ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. ఇక హైడ్రాకి లైన్ క్లియర్‌గా వుంది. కూల్చేయడమే మిగిలివుంది.

తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్!

స్కాములు చేసేవారు ఇందుకలరు, అందులేరు అనడానికి అవకాశం లేకుండా.. అన్నిచోట్లా వుంటారు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగింది. ఈ స్కామ్‌ని పసిగట్టిన తెలంగాణ సీఐడీ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని అనేక ఆస్పత్రుల మీద ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మెడికల్ బిల్లుల స్కామ్‌లో ఆస్పత్రులతోపాటు పలువురు ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు, అధికారుల హస్తం వుందని తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుల స్కామ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఫేక్ బిల్లులు సమర్పించడం ద్వారా ఆర్థికంగా లాభపడిన వారి దగ్గరనుంచి సీఐడీ విచారణను ప్రారంభించనుంది.