గల్లా జయదేవ్ పశ్చాత్తాప పర్వం!
posted on Aug 27, 2024 @ 11:33AM
రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాబలం వుంటే సరిపోదు.. మనోబలం కూడా వుండాలి. రాజకీయాల్లో రాణిస్తూ వుంటే అది చూసి తట్టుకోలేక చాలా గాడిదలు ఓండ్ర పెడుతూ వుంటాయి. ప్రతి ఊరకుక్కా మొరుగుతూ వుంటుంది.. ఒక్కోసారి సదరు కుక్కలు కరుస్తాయి కూడా. విజయాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి. అధికారం వస్తుంది.. పోతుంది.. వీటిని తట్టుకుని నిలబడినప్పుడే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు.. లేకపోతే రాజీపడిపోయిన ‘రాజీ’కీయ నాయకులు అంటారు. పాపం గల్లా జయదేవ్ వైసీపీ రాక్షస పాలనలో జరిగిన అవమానాలను భరించలేక రాజకీయ సన్యాసం చేశారు. ఆ తొందరపాటుతనం వల్ల ఆయన ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింది.
వైసీపీ రాక్షస పాలనలో ఎదురైన వేధింపుల కారణంగా ఒత్తిడికి గురైన గల్లా జయదేవ్ ఇప్పుడు టీడీపీ దశ తిరగడంతో తన రాజకీయ భవిష్యత్తును తానే పాడుచేసుకున్నట్టు బాధపడుతున్నారు. చేసేది లేక మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. అప్పట్లో ఆయన రాజకీయలకు గుడ్ బై చెప్పకుండా వుంటే, ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఆయన కీలక పాత్రలో ఉండేవారు. గుంటూరు ఎంపీగా మూడోసారి పోటీ చేస్తే కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు. కింజరపు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో కీలక స్థానం రావడానికి జయదేవ్ పోటీలో లేకపోవడమే కారణం.
జగన్ తన రాజకీయ ప్రత్యర్థులను వేటాడే క్రమంలో గల్లా జయదేవ్‌ను టార్గెట్ చేశారు. అది తట్టుకోలేక ఎప్పుడూ ఇలాగే ఉంటుందనే భయంతో జయదేవ్ గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్డీయేకి గెలుపు అవకాశాలున్నాయని తెలిసినా ఒకవేళ మళ్లీ జగన్ వస్తే ఇబ్బంది పడతామనే ఉద్ధేశంతో పక్కకు తప్పుకున్నారు. జయదేవ్ కాదనడం వల్లే గుంటూరు ఎంపీ సీటును పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఇచ్చారు. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. ఇదంతా చూసి తాను ఎంత తప్పు చేసిందీ జయదేవ్‌కి అర్థమై బాధపడుతున్నారు. జయదేవ్ పరిస్థితిని గమనించిన చంద్రబాబు మళ్లీ పార్టీలోకి రమ్మని సూచించారు. ప్రస్తుతానికి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే రాజకీయ కుటుంబానికి చెందిన గల్లా జయదేవ్‌కు తన సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. రెండు సార్లు ఎంపీగా పని చేసిన గుంటూరులోనూ మంచి పలుకుబడి, పరపతి ఉన్నాయి. పార్టీలోనూ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ వద్ద గుర్తింపు ఉండటం వల్ల మళ్లీ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అయితే ఢిల్లీ పదవికి పరిమితమైతే గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోస్టు తీసుకోవాలా? వద్దా? అని తర్జనభర్జన పడుతున్నారు. రాజ్యసభకు వెళితే మళ్లీ కీ రోల్‌లోకి రావచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎన్డీయే కూటమి తరఫున రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబును కోరారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళాలంటే అందుకు చాలా సమయం ఉంది కాబట్టి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండాలనే చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో జయదేవ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జయదేవ్ చంద్రబాబు నిర్ణయించినట్లు ఢిల్లీలో అధికార ప్రతినిధి అవుతారా? లేక జయదేవ్ ఆశిస్తున్నట్లు రాజ్యసభలో అడుగుపెడతారా? అన్నది చూడాల్సివుంది.