మోడీ దౌత్యం యుద్ధాన్ని ఆపుతుందా?
posted on Aug 27, 2024 @ 10:48AM
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడం కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారా? ఆయన దౌత్యం ఫలించేనా? ప్రస్తుతం ప్రపంచ దేశాలలో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం మోడీ ఇటీవల స్వల్ప వ్యవధిలో రష్యా, ఉక్రేయిన్ లలో పర్యటించి రావడమే. రష్యాలో పర్యటించిన ఆరు వారాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ వెళ్లారు. దీంతో సహజంగానే ఆయన పర్యటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి భారతదేశం ఎటూ మొగ్గు చూపకుండా వ్యవహరిస్తోందని ప్రపంచానికి చాటేందుకే కాకుండా మోడీ పర్యటనలు.. ఆ రెండు దేశాల మధ్యా యుద్ధాన్ని ఆపడానికి కూడా అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ దౌత్య సంబంధాల విశ్లేషకుల వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. మోదీ శుక్రవారం (ఆగస్టు 23) కీవ్ వెళ్లి, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పాటు, ఉక్రెయిన్‌తో భారత సంబంధాల మెరుగుదలపై కూడా ఆయన ఈ సందర్భంగా చర్చించినట్లు చెబుతున్నారు. రష్యా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత భారతదేశం ఈ రెండు దేశాలకూ సమాన దూరం పాటిస్తూ వస్తోంది.
యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు, ఏ తీర్మానాన్ని ప్రతిపాదించినా భారతదేశం గైర్హాజర్ అవుతూ వచ్చింది. రష్యాను విమర్శించే తీర్మానాల విషయంలో కూడా మౌనం, దూరం పాటించింది. పాశ్చాత్య దేశాల ఆంక్ష లను ఖాతరు చేయలేదు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు, ఆయుధాల సరఫరాలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో భారత్ పాశ్చాత్య దేశాల హెచ్చరికలు, బెదరింపులను లెక్క చేయలేదు.
జి-20 సదస్సులో తమకు కూడా స్థానం కల్పించాల్సిందిగా గత ఏడాది ఉక్రెయిన్ చేసిన అభ్యర్థ నను భారత్ తోసిపుచ్చింది. ఈ ఏడాది జూన్‌లో స్విట్జర్లాండులో జరిగిన శాంతి సదస్సుకు ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాన్ని పంపించడానికి కూడా భారత్ సుముఖత వ్యక్తం చేయలేదు. శాంతి పేరుతో భారత్ రష్యా కు వ్యతిరేకంగా నోరెత్తకపోవడం పట్ల ఉక్రెయిన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ సహజంగానే రష్యా యుద్ధం విషయంలో భారత్ తనకు మద్దతుగా నిలవాలని ఆశించింది. నిలుస్తుందని భావించింది. అయితే భారత్ నుంచి అటువంటి స్పందన లేకపోవడం అటుంచి, పుండు మీద కారం చల్లినట్టుగా మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం ఉక్రెయిన్ ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో రష్యా పర్యటన జరిగిన ఆరు వారాల తరువాత ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం అంతర్జాతీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రధాని ఉక్రెయిన్‌ను సందర్శించడం ఇదే తొలి సారి. అదీ యుద్ధ సమయంలో భారత ప్రధాని ఉక్రెయిన్ పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అయ్యింది. ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఈ ఇద్దరు నాయకులు యుద్ధం గురించి చర్చించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపం దగ్గర నివాళులర్పించారు. మోదీ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య వ్యవసాయం, సంస్కృతి, వైద్య ఉత్పత్తులు, సామాజిక అభివృద్ధి పథకాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. అయితే అంతకు మించి అద్భుతాలేమీ జరగలేదు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆపేందుకు భారత్ కీలక పాత్ర పోషిస్తుందా లేదా అన్న దానిపై ఎటువంటి స్పష్టతా రాలేదు. అయితే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య శాంతి స్థాపన కోసం పరోక్ష ప్రయత్నాలకు ఎటువంటి ఢోకా ఉండదన్న సంకేతాన్ని మాత్రం మోడీ ఉక్రెయిన్ పర్యటన ఇచ్చింది.