వైసీపీ ఖేల్ ఖతమ్.. జగన్ పార్టీ దుకాణ్ బంద్?!
ఏపీలో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు రాజకీయాల పరంగా, పాలనాపరంగా ఏపీ ప్రతిష్టను దేశవ్యాప్తంగా దిగజార్చిన జగన్ రెడ్డి రాజకీయ పతనం ఆరంభమైంది. ఏపీలో జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో ఇబ్బందులు పడిన ప్రజలు.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కకుండా చేశారు. అయినా, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. ఐదేళ్లు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపేందుకు ఒక పక్క సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డి ముందుకు సాగుతుంటే.. రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేలా కుట్ర రాజకీయం చేసేందుకు జగన్, వైసీపీ బ్యాచ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనికి తోడు రాజ్యసభలో తమకు పదకొండు మంది ఎంపీల బలం ఉంది.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మా అవసరం ఉందంటూ ఆ పార్టీ నేతలు విర్రవీగుతున్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ నేతలు అలా చెప్పుకునే అవకాశాన్ని కోల్పోబోతున్నారు. రాజ్యసభలో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల్లో పది మంది కూటమి పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిలో టీడీపీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జనసేన పార్టీలోకి ఇద్దరు వెళ్లబోతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఇప్పటికే కూటమి పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు త్వరలో తెలుగుదేశం గూటికి చేరబోతున్నారు. గురువారం (ఆగస్టు 29) ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ను కలిసి వారు రాజీనామా లేఖలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ త్వరలో సీఎం చంద్రబాబ నాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకోబోతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరి బాటలోనే మరో ఎనిమిది మంది వైసీపీ రాజ్యసభ్యులు కూడా పయనించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కేవలం ఒక్క రాజ్యసభ ఎంపీ మాత్రమే వైసీపీకి మిగలనున్నారు. టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నవారిలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావుతోపాటు గొల్ల బాబూరావు కూడా ఉన్నారని చెబుతున్నారు. అలాగే బీజేపీలో చేరేందుకు రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని సిద్ధమవుతున్నారు. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్. కృష్ణయ్యలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఏపీ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, వీరిద్దరిలో వైసీపీకి గుడ్ బై చెప్పేదెవరు, పార్టీలో మిగిలేదెవరు అన్నదానిపై క్లారిటీ రాలేదు, కానీ ఈ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వైసీపీలో మిగులుతారని ఆ పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. దీంతో వైసీపీలో మిగిలే ఒక్క రాజ్యసభ సభ్యుడు ఎవరనే అంశంపైనా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డి వైసీపీలోనే కొనసాగనున్నారనీ, విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలతో ఇప్పటికే టచ్‌లోకి వెళ్లారని సమాచారం. అయితే, తాను వైసీపీని వీడటం లేదని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రకటించారు. కానీ, బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన వైసీపీని వీడడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
రాజ్యసభ సభ్యుల్లో వైవీ సుబ్బారెడ్డి ఒక్కరే వైసీపీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆయన పదవీకాలం ముగిసిన తరువాత రాజ్యసభలో వైసీపీ ప్రాతినిధ్యమే కోల్పోనుంది. ఎందుకంటే.. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం వచ్చే ఐదేళ్లు ఒక్క రాజ్యసభ సీటును కూడా ఆ పార్టీ గెలుచుకునే అవకాశం లేదు. రాజ్యసభలోనేకాదు.. శాసన మండలిలోనూ వైసీపీని వీడేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోతుల సునీత తన రాజీనామాతో బోణీ చేశారు. మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలుసైతం ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొందరు తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.. అన్నీఅనుకూలిస్తే సెప్టెంబర్ నెలలోనే భారీ సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీల్లోకి వెళ్లే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. వైసీపీకి జగన్ మోహన్ రెడ్డితో కలుపుకొని పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనీ, తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారు వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవ్వడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనే ప్రధాన కారణం. అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు జగన్ ఏనాడూ విలువ ఇవ్వలేదు. తాను చెప్పింది చేయడానికే మీరు ఉన్నారన్నట్లుగా ప్రవర్తించారు. జగన్ సహా కేవలం నలుగురైదుగురు నేతల నిర్ణయాలే వైసీపీ ప్రభుత్వంలో అమలయ్యాయి. దీంతో తమతమ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా జగన్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జగన్ తీరుపై మెజార్టీ శాతం ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ అధికారంలో ఉండటంతో ఎవరూ బయటపడలేదు. ఇప్పుడు ఒక్కొక్కరుగా జగన్ ప్రభుత్వంలో తమకు ఎదురైన ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. వైసీపీ అధికారంలో లేకపోయినా, ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడేందుకు సిద్ధమౌతున్నారు. కూటమి పార్టీల్లోని టీడీపీ, బీజేపీ, జనసేన అధిష్టానాలు గేట్లు ఓపెన్ చేస్తే భారీ సంఖ్యలో వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి రాబోయే కాలంలో వైసీపీ దుకాణం బంద్ అవ్వటం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.