ఒక రోజు ముందే పెన్షన్లు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం
posted on Aug 29, 2024 @ 9:39AM
ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే పాలన ఎలా సాగుతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతలలో చూపుతున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులు ఏనాడూ నెలలో మొదటి తేదీన వేతనాలు అందుకున్న పరిస్థితి లేదు. అలాగే పెన్షనర్లు తమ పెన్షన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీనే అందుతున్నాయి. పెన్షన్ల పంపిణీ కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నెల మొదటి తేదీనే జరిగిపోతున్నది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా ఒక్కో పథకం ప్రవేశపెడుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి అనేక చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం రూ.3 వేలు పెన్షన్ ఇస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని మరో రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు అందిస్తోంది.
ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చాలా పద్ధతిగా వ్యవహరిస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా మొదట పెన్షన్ల పెంపును అమలు చేయగా.. ప్రతినెల 1వ తేదీన ఠంఛనుగా పెన్షన్‌లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి సెప్టెంబర్ నెల పెన్షన్ ను నెల మొదటి తేదీ కంటే ఒక రోజు ముందే.. అంటే ఆగస్టు 1వ తేదీనే అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే ఆగస్టు 31నే అర్హులందరికీ పెన్షన్లను అందజేయాలని నిర్ణయించింది.
ఏదైనా కారణంగా ఈ నెల 31వ తేదీనన పెన్షన్లు అందకపోతే.. సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం రోజున అందించనున్నట్లు తెలిపింది. ఇక గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి.. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు.