అసలు మోపిదేవి.. జగన్ మధ్య ఏం జరిగింది?
posted on Aug 30, 2024 @ 4:18PM
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం రాజకీయంగా ఒకింత సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచిన మోపిదేవి వెంకట రమణ.. పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉ:టూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు. అటువంటి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలలో రానున్న భారీ మార్పులకు సంకేతంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ, పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీకి ముఖచిత్రంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ కూడా ఆయన జగన్ కు విధేయంగా ఉంటూ వచ్చారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది.
పార్టీకీ రాజీనామా చేసుంతగా మోపిదేవిలో జగన్ పట్ల అసంతృప్తి పేరుకుపోవడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తనకు కానీ, తన సోదరుడికి కానీ జగన్ టికెట్ నిరాకరించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మోపిదేవి పలు మార్లు కోరినప్పటికీ రేపల్లె నుంచి మోపిదేవికి టికెట్ నిరాకరించే విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలాగే ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేడయంతో మోపిదేవికి అవమానకరంగా మారింది. అంతే కాకుండా పార్టీ వ్యవహారాలలో కూడా మోపిదేవికి ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక పార్టీ పరాజయం తరువాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఫలితాల తరువాత నుంచీ మోపిదేవి వైసీపీకి గుడ్ బై చెబుతారన్న టాక్ పోలిటికల్ సర్కిల్స్ లో వినబడుతూనే ఉంది.
ఇప్పుడు తెలుగుదేశంలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఆయన రాజకీయ విధేయతలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నది అవగతమౌతోంది.
ఇంతకీ మోపిదేవి చంద్రబాబుతో టచ్ లోకి ఎలా వెళ్లారంటే రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబుతో మోపిదేవి సమావేశమయ్యేందుకు సహకరించారు. ఆ సమావేశంలో మోపిదేవి వెంకటరమణతో పాటు మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇరువురూ కూడా వైసీపీకి, తమతమ రాజ్యసభ సభ్యత్వాలకూ రాజీనామా చేశారు. ఏ క్షణంలోనైనా తెలుగుదేశం కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి. మొత్తం మీద మోపిదేవి వంటి విధేయుడే దూరం అవ్వడం పార్టీలో జగన్ నాయకత్వంపై అవిశ్వాసం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తనకు బలం ఉందని భావిస్తున్న రాజ్యసభలోనూ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ కూడా వైసీపీకి రానున్న రోజులలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.