జగన్ లండన్ టూర్ రద్దు?
posted on Aug 30, 2024 @ 12:46PM
ఎవరు ఎలాగైనా చావండి.. నేను మాత్రం లండన్ టూర్ వెళ్ళి తీరాల్సిందే అన్నట్టుగా వుంది వైసీపీ నాయకుడు జగన్ వ్యవహారం. ఒకవైపు వైసీపీ నాయకుల రాసలీలలు, మరోవైపు ఖాళీ అవుతున్న పార్టీ, ఇంకోవైపు ముంచుకొస్తున్న కేసులు.... ఇంకా బోలెడన్ని తలనొప్పులు.. అయినప్పటికీ జగన్ లండన్ టూర్ చేయాలనే ఫిక్స్ అయిపోయారు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి సీబీఐ కోర్టు దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే, సీబీఐ కోర్టు చాలా పెద్ద మనసు చేసుకుని అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్‌లో ఎంజాయ్ చేయడానికి జగన్ సామాను సర్దుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఆయన లండన్ టూర్ రద్దయ్యే అవకాశాలు వున్నాయన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి.
మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసు విచారణ మొదలైంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నిందితుడు. జగన్‌తోపాటు ఈ కేసులో మిగతా నిందితులు అయిన సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఐడీ డీఎస్పీ విజయ్‌పాల్‌కి కూడా గుంటూరు జిల్లా పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించారు. మరికొందరికి కూడా నోటీసులు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు నోటీసులు ఇచ్చినవారందరినీ పిలిపించి విచారణ జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా వున్న జగన్‌ని కూడా పోలీసులు పిలిచే అవకాశం వుంది. ఈ కేసులో విచారణకు పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సి వుంది. నా ఇష్టమొచ్చినప్పుడు వస్తాను అంటే కుదరదు. విదేశాలకు వెళ్ళడానికి సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతి కూడా ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనేది కూడా సందేహమే. అందువల్ల జగన్ లండన్ టూరు మీద రఘురామ కేసు ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రఘురామ కేసు మాత్రమే కాదు.. ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీని చిత్రహింసలకు గురిచేసిన కేసు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశం వుంది. హీరోయిన్‌ని హింసించడం వెనుక జగన్ హస్తం వుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఆదేశించడం వల్లనే పోలీసులు గానీ, వైసీపీ నాయకులుగానీ చాలా ‘అంకితభావం’తో హీరోయిన్‌ని వేధింపులకు గురిచేశారన్న అనుమానాలు వున్నాయి. ఈ కేసు విచారణను త్వరతగతిన పూర్తిచేసి, దోషులకు శిక్ష విధించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వుంది. కాదంబరి జెత్వానీ విజయవాడకు వచ్చి ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం వున్నవారందరినీ పోలీసులు ప్రశ్నిస్తారు. జగన్‌కి కూడా ఇందులో సంబంధం వుందని సెప్టెంబర్ 3వ తేదీ లోపు తేలిన పక్షంలో జగన్ లండన్ టూర్‌కి వెళ్ళకుండా పోలీసులు ఆపే అవకాశం వుంది. ఇలా జగన్ లండన్ టూర్‌కి రెండు గండాలు పొంచి వున్నాయి.