తెలంగాణలో మూడు దశల్లో ‘స్థానిక’ ఎన్నికలు!
posted on Aug 30, 2024 @ 10:40AM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు జరిగే తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పెంచింది. అందులో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన దిశగా చర్యలు ప్రారంభించింది.
గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ వినా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో గురువారం (ఆగస్టు 20) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేసింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ లిస్టును యథావిధిగా పరిగణనలోనికి తీసుకుని, వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ జాబితాలను తయారు చేసి ముసాయిదాను వచ్చే నెల 6న ప్రచురించాలని ఆదేశించారు. ఆ తరువాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. ఈ ముసాయిదా జాబితాలో వార్డు వారీగా లేదా పంచాయతీ వారీగా ఓటర్లను అమర్చడంలో ఏవైనా పొరపాట్లు జరిగితే సెప్టెంబర్ 13 వరకు సంబంధిత మండల పరిషత్ అధికారులకు లేదా జిల్లా పంచాయతీ అధికారులకు రాత పూర్వకంగా తెలపాలని సూచించారు. ఓటరు జాబితాల తయారీ, వార్డుల వారిగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పొలింగ్ సిబ్బంది శిక్షణ తదితర విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తరువాత నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలున్నందున ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు.