విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉంటా.. సీఎం చంద్రబాబు
posted on Sep 1, 2024 @ 8:22PM
బుడమేరు వరదతో నీట మునిగిన సింగ్ నగర్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. స్వయంగా బోటులో వెళ్లి బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది వారించినప్పటికీ, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద నీటిలోనే బోటులో వెళ్ళి ఆయన బాధితులు ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. అరగంట పాటు వరదనీటిలో ప్రవాహంలో తిరిగిన చంద్రబాబు, బాధితులను ఆదుకునేంత వరకూ తాను అక్కడే ఉంటానని ప్రకటించారు. ప్రస్తుతం బాధితులకు పూర్తిస్థాయిలో ఆహారం, తాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ని గంటగంటకూ సమీక్షిస్తానని చంద్రబాబు తెలిపారు.
సీఎం వెంట కలెక్టరేట్‌లోనే హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని కూడా వున్నారు. దాదాపు 6 వేల మందికి ఎంపీ కేశినేని చిన్ని ఆహారం ఏర్పాటు చేశారు. ఆహార సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని హోంమంత్రి ఆదేశం. ఆహార ప్యాకింగ్, సరఫరా బాధ్యత అక్షయపాత్ర, ఇతర సంస్థలకు అప్పగించారు. ఆహార ప్యాకింగ్, సరఫరా పనులకు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చాయి. అదేవిదంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల కోసం మంగళగిరి అక్షయ పాత్ర కిచెన్‌లో దాదాపు లక్షా యాభై వేల మందికి ఆహార పదార్థాలు సిద్ధమయ్యాయి.