ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటన!
posted on Sep 1, 2024 @ 1:39PM
మంగళగిరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ముంపు ప్రాంతాలకు చేరుకున్న లోకేష్ అధికారులతో కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత తాడేపల్లి నులకపేటలోని క్వారీ ప్రాంతంలో ఇళ్ళు నీట మునిగిన బాధితులను పరామర్శించారు. బాధితులకు పునరావాసం కల్పించి, ఆహార వసతి కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ని ఆదేశించారు. ముంపు నుంచి మంగళగిరికి శాశ్వతంగా విముక్తి కలిగేలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని బాధితులకు లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి గండాలయ్యపేటలోని కొండ చరియ విరిగిపడి మృతి చెందిన బాధిత కుటుంబాన్ని లోకేష్ పరామర్శించి, ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వారికి అందించారు. టిడ్కో గృహాలు, రత్నాల చెరువు చేనేత కార్మికులను కూడా పరామర్శించడం లోకేష్ షెడ్యూలులో వుంది. నారా లోకేష్ వెంట వివిధ విభాగాల అధిపతులు అధికారులు కూడా ఉన్నారు.