అర్ధరాత్రి వేళ చంద్రబాబు మరోసారి బోటు ప్రయాణం!
posted on Sep 2, 2024 1:15AM
వరద ముంపుకి గురైన విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి బోటులో ప్రయాణించారు. సెల్ ఫోన్, కెమెరా లైట్ల వెలుగులో నీటిలో మునిగిన ఇళ్ళలోని ప్రజలను చంద్రబాబు పరామర్శించారు. పలు కుటుంబాలకు చంద్రబాబు స్వయంగా ఆహారాన్ని అందించారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న ఫిర్యాదులు చంద్రబాబు నోట్ చేసుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా వుండటం వల్ల సహాయక చర్యలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలకు ఓపికగా చంద్రబాబు వివరించారు. వ్యవస్థను సరిదిద్దడానికి ఈ ఒక్క రాత్రి తనకు పడుతుందని, తనకు ఈ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వారిని కోరారు. ఆరేడు గంటల్లోనే వ్యవస్థను చక్కదిద్దుతానని వారికి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, అందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని, అంతవరకూ ప్రజలు ధైర్యంగా వుండాలని చంద్రబాబు సూచించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో వున్న ప్రజలకు ధైర్యం చెప్పాలన్న ఉద్దేశంతోనే అర్ధరాత్రి మరోసారి సింగ్ నగర్‌కి వెళ్ళానని చెప్పారు. బాధితులలో ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని అన్నారు. కొంతమంది రోగులు, చాలామంది వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని వున్నారని, ప్రతి ఒక్కరినీ తప్పకుండా రక్షించి తీరుతామని, సోమవారం ఉదయానికల్లా బోట్లు, హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు.