వైసీపీలో తప్పుతున్న కట్టు.. సడలిన జగన్ పట్టు!

వైసీపీ ఆవిర్భావం నుంచి తాజా ఓటమి వరకూ ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ జగనే. జగన్ రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందు నుంచీ రాజకీయాలలో కొమ్ములు తిరిగిన నేతలుగా ఉన్న వారు కూడా జగన్ పార్టీలోకి వచ్చే సరికి చేతులు కట్టుకుని నిబడి జగన్ ఏం చెప్పినా ఎస్ బాస్ అనాల్సిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల నేతలను దూషించమంటే దూషించాలి. ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలపై దాడులు చేయాలంటే చేయాలి. అంతే. అందుకు భిన్నంగా చేయడానికి అవకాశమే లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా జగన్ హయాంలో డమ్మీలుగా మిగిలిపోయారు. పార్టీలో నంబర్ వన్ నుంచి చివరి వరకూ అంతా జగనే అన్నట్లు నడిచింది. రెండేళ్ల కిందట పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించి.. అప్పటికి పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను సగౌరవంగా పదవి నుంచీ, పార్టీ నుంచీ సాగనంపి మరీ జగన్ తనను తాను పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. మరో గత్యంతరం లేక పార్టీ మొత్తం జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడంటూ ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టి ఆమోదించింది. అయితే ఆ తరువాత ఈసీ ఆ ఎన్నిక చెల్లదని తేల్చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆ శాశ్వత అధ్యక్ష ముచ్చట మూన్నాళ్లకే ముగిసింది అది వేరే సంగతి.  ఇక ప్రస్తుతానికి వస్తే ఈ ఏడాది జూన్ లో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని అందుకుంది. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించి రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలింది. ఈ పరాజయం తరువాత వైసీపీలో జగన్ నాయకత్వానికి అంత వరకూ ఉన్న సర్వ సమ్మతి లేకుండా పోయింది. ఆయనకు సన్నిహితులుగా మెలిగిన వారు సైతం పార్టీని వీడారు. ఇక జగన్ ఆడమన్నట్లల్లా ఆడి, పాడమన్నట్లలా పాడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ , అనీల్ కుమార్ యాదవ్ వంటి వారు పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాల్లో కలికానిక్కూడా కనిపించడం లేదు.  ఇక పార్టీలో ఉన్న వారు కూడా గతంలోలా జగన్ కు తానా అంటే తందానా అనేందుకు సిద్ధంగా లేరు. చివరాఖరికి సీనియర్ నేత.. మేకపాటి రాజమోహన్ రెడ్డి  అయితే జగన్ మాటను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. అసలాయన జగన్ లేక్కేమిటన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా బెజవాడను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఆ సందర్భంగా వరద బాధితుల సహాయం కోసం సీఎం రిలీఫ్ పండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తాయి. రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ సీఎంఆర్ఎఫ్ కు వారాళాలిచ్చారు. సెలిబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తమకు తోచిన విధంగా వరద బాధితుల కోసం తమ వితరణను చాటారు.  అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం తమ పార్టీకి చెందిన ఎవరూ కూడా సీఎంఆర్ఎఫ్ కు విరాళం ఇవ్వడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్  వరద బాధితుల కోసం స్వయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అయితే ఆ విరాళాన్ని సీఎంఆర్ఎఫ్ కు పంపబోననీ, పార్టీ తరఫున తానే వరద బాధితులను ఆదుకుంటానని ప్రకటించి.. ఓ రెండు రోజుల పాటు హడావుడి చేశారు. ఆ తరువాత ఓ రెండు ఆటోలలో వరద బాధితులకు సరుకులను పంపిణీ చేసి కోటీ ఖర్చు అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. లక్షల మంది వరద బాధితులకు జగన్ ప్రకటించి, ఖర్చు చేసిన కోటి రూపాయలతో అందించిన సహాయమేమిటో ఎవరికీ తెలియదు. దానికి లెక్కా పత్రం  ఉంటుందని ఎవరూ భావించరు. లెక్కలు చెప్పమని అడిగే వారూ లేరు. కానీ ఎంత రాజకీయాలలో ఉన్నా మేకపాటి వ్యాపారవేత్త, ఆయన ఓ పెద్ద కనస్ట్రక్షన్ కంపెనీ యజమాని. కనుక స్వతగాహా అన్ని విషయాల్లోనూ లెక్కా పత్రం జవాబుదారీ తనం ఉండాలని కోరుకుంటారు. అందుకే జగన్ హుకుంను బేఖాతరు చేసి వరద బాధితుల కోసం తన సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ కే పంపారు. పాతిక లక్షల రూపాయల చెక్కును స్పీడ్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికే పంపించారు.  అంటే గతంలోలా పార్టీలో ఇక  నీ మాట చెల్లుబాటు కాదు అని మేకపాటి జగన్ కు చెప్పకనే చెప్పారన్న మాట. 

కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. మద్యం కనీస ధర 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.  అలాగే భోగాపురం విమానాశ్రయానికి ‘‘అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం’’గా పేరు పెడుతూ మంత్రివర్గం తీర్మానించింది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ అంశం మీద  కేబినేట్ సమావేశంలో చర్చించారు. గత సంవత్సరం ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని.. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు.  తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ తన పరిపాలన సాగించారని పలువురు మంత్రులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ల పునరుద్ధరణ అంశంలో మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. జగన్ ప్రభుత్వ హయాంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్లో చర్చించారు. సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం రెండు సంవత్సరాలలో ప్రభుత్వ ఖజానా నుంచి 205 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాలంటీర్లు, సచివాలయాలకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే 200 రూపాయలను రద్దు చేశారు. అలాగే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ 'స్టెమీ' పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.  ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు.  కొత్త కార్పొరేషన్‌కి 10 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించారు. 

వైసీపీకి బాలినేని గుడ్‌బై.. రేపే జనసేనలోకి...!

వైఎస్ జగన్, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ముసుగులో గుద్దులాట ముగిసింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. గురువారం నాడు ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్నారు.  కొద్ది రోజుల నుంచి బాలినేని వైసీపీని వీడనున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి. జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు జగన్‌తో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడిన బాలినేని... పవన్ కళ్యాణ్ నుంచి ఓకే సిగ్నల్ రాగానే వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. వైసీపీలో బాలినేని గత మూడేళ్లుగా హాఫ్ రెబల్‌గానే కొనసాగుతున్నారు. ఇటు బాలినేనికీ, అటు వైసీపీ అధినేతకూ కూడా పరస్పర అవసరాలు ఉన్నాయి. పైపెచ్చు ఇరువురూ బంధువులు కూడా. అయినా బాలినేనికి పొమ్మనకుండా పార్టీలో పొగపెట్టడం అన్నది గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ వస్తోంది. ఇది ఎప్పుడు మొదలైందంటే.. జగన్ తాను అధికారం చేపట్టిన తరువాత దాదాపు మూడేళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవినుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది బాలినేనిలో అసంతృప్తికి బీజం వేసింది. అప్పటి నుంచీ  ఆయన పార్టీకి, పార్టీ అధినేత జగన్‌కు పంటికింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అయితే జగన్ పొమ్మన్న ప్రతిసారీ బాలినేని చూరుపట్టుకు వేలాడారు. అలాగే బాలినేని పార్టీకి గుడ్ బై చెబుతానంటూ అల్టిమేటం ఇచ్చిన ప్రతిసారీ జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని బుజ్జగించారు. ఎందుకంటే బాలినేనికి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఇలా బాలినేని జగన్ మధ్య ఇన్నేళ్లూ టామ్ అండ్ జెర్రీ ఆట సాగుతూనే వచ్చింది. అయితే 2024 ఎన్నికలలో వైసీపీతోపాటు బాలినేని కూడా పరాజయం పాలవ్వడంతో ఇక ఒకరి అవసరం ఒకరికి లేకుండా పోయింది. మరో ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేకపోవడం, ఇప్పుడు జనసేన నుంచి రాజకీయ ఆశ్రయం దొరకడంతో ఆయన ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకుని జగన్‌కు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్‌తో  ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో జగన్ కూడా హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  

100 రోజుల కూటమి పాలన... 100 అభివృద్ధి, సంక్షేమాలు...!

2024 జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 20వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి దివాళా తీయించినా 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేశారు. మొదటి వందరోజుల్లో జగన్ ప్రభుత్వం రూ.250 పెన్షన్ పెంచడం తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదు. మళ్లీ జగనే వచ్చి ఉంటే కరెంట్ ఛార్జీల బాదుడు, కరెంటు కోతలు పెరిగి ఉండేవి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. పింఛన్ రూ. 3 వేలకే పరిమితమై ఉండేది. నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. 100 రోజుల్లో సాధించిన ప్రధాన విజయాలు: 1. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి 1వ తేదీనే ఇళ్ల వద్ద రూ.4 వేలు ఇవ్వడం జరిగింది. బకాయిలు రూ.3 వేలు కూడా కలిపి రూ.7 వేలు పెన్షన్‌ను 64 లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి. 2. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు. తొమ్మిది డీఎస్సీల ద్వారా 1996 నుండి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 మంది ఉపాధ్యాయ నియామకాలు చేశాయి, జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశారు. 3. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100 పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెన్నిధి అయ్యారు. 4. విజయవాడ వరద బాధితులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల బంగాళదుంపలు 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, బిస్కెట్లు అందించింది. ఆదివాసి ప్రాంతాలలో జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు 5 కేజీల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమోటాలు, 4 బంగాళాదుంపలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. 5. హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు. 6. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచారు. 7. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమరావతికి రూ.15వేల కోట్లు మంజూరు. 8. పోలవరం నిర్మాణానికి రూ.12,500 కోట్లకు కేంద్రం అనుమతి పొందారు. 9. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 75 వేల మంది యువతకు ఉపాధికి కేంద్రం ఆమోదించింది. 10. వాట్సాప్ సందేశానికి స్పందించిన మంత్రి నారా లోకేష్, 25 మంది దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన IIT, NIT, IIITలలో ప్రవేశాలకు చొరవ. 11. డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించారు. రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకేరోజు సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. 12. ప్రజావేదిక, ప్రజాదర్బార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ 50 వేలకు పైగా అర్జీల స్వీకరణ. .13. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు కేటాయించారు, అదనంగా ప్రకాశం జిల్లాను చేర్చారు. 14. విశాఖ రైల్వే జోన్‌కు మడపర్లోవలో 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపు. 15. పంచాయతీలకు రూ.1,452 కోట్లు విడుదల చేసింది. జగన్ ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపల్ నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించింది. 16. టీడీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు రూ. 1,674 కోట్లు విడుదల చేసింది. 17. ఆరోగ్యశ్రీకి జగన్ 1600 కోట్లు బకాయిలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 700 కోట్లు బకాయిలు చెల్లించింది. 18. నీరు-చెట్టు బకాయిలు రూ.256 కోట్లు చెల్లింపు జరిగింది. 19. రాజధాని కౌలు రైతుల బకాయిలు రూ. 400 కోట్లు చెల్లించారు. 20. పేదల గృహనిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు చెల్లింపు. 21. వరదల్లో పంట నష్టం ఎకరాకు రూ.2 వేల నుండి రూ.10 వేలకు పెంపు. 22. జగన్ రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం బియ్యంతోపాటు పంచదార, గోధుమపిండి కూడా ఇవ్వడమైంది. మార్కెట్ లో కంది పప్పు రూ. 180 ఉంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కి తగ్గించారు. కొత్తగా మరో 4 వేల రేషన్ షాపులను ప్రారంభించబోతున్నారు. 23. అక్రమ కేసుతో ఓ మహిళను వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లను సస్పండ్ చేసి రాష్ట్రంలో రికార్డ్ సృష్టించారు. 24. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 19 నుంచి ఆన్ లైన్ బుకింగ్, అందుబాటులోకి పోర్టల్, యాప్. 25. విషపూరిత మధ్యం స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచడమైంది. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది. 26. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు మంజూరు చేయడం జరిగింది. 27. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేయడమైంది. 28. నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.15 వేల నుండి రూ.25 వేలకు పెంచారు. 29. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడమైంది. కోయభారతి టీచర్ పోస్టులు 700 భర్తీ. 30. ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పనిదినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ది చేకూరుతోంది. 31. సీఎం చంద్రబాబు గారు పది రోజులు విజయవాడలో బస్‌లోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టారు. రెట్టింపు సహాయాన్ని అందించారు. 32. యుద్ధప్రాతిపదికన విజయవాడ వరద బాధితులకు టిఫిన్, భోజనాలు 10 రోజుల్లో 1.14 కోట్ల మందికి వాటర్ బాటిల్స్ 1.12 కోట్లు, పాల పాకెట్లు 35 లక్షలు, బిస్కెట్ పాకెట్స్ 46 లక్షలు, కోడిగుడ్లు 4 లక్షలు, కూరగాయలు 3,385 క్వింటాళ్లు అందించడమైంది. 33. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులు 17 మందికి ఒక్కొక్కరికి కోటి చొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, గాయపడ్డ 10 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగింది. 34. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు, తాగునీటికి రక్షణ కల్పించడమైంది. 35. బుడమేరు గండ్లను యుద్దప్రాతిపదికన పూడ్చడమైంది. 36. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్ బోట్లను తొలగించడమైంది. 37. బీపీసీఎల్ కంపెనీ ఏపీలో 70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 38. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీవో విడుదల. 39. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు. 40. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు. 41. అర్చకుల వేతనాలు రూ.10 వేల నుండి 15 వేలకు పెంపు. 42. గృహ నిర్మాణానికి సహకారం రూ.4 లక్షలకు పెంపు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టా. 43. MSMEలకు ప్రభుత్వ గ్యారంటీతో రూ.1000 కోట్ల రుణాలు. 44. 77 వేల మంది CBSE విద్యార్థులకు స్టేట్ బోర్డులో పరీక్షలు రాసే వెసులుబాటు. ఆయాలు, వాచ్‌మెన్‌ల జీతాలు, ఇతర బకాయిలు రూ.89 కోట్లు విడుదల. 45. సౌదీ ఎడారిలో దుర్భర స్థితిలో ఉన్న మామిడి దుర్గ, జుబేద, జుబేర్, వీరేంద్రను స్వదేశానికి తెప్పించిన మంత్రి లోకేష్. 46. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయం. 47. రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా 15 వేల ఉద్యోగాల కల్పనకు HCLను ఒప్పించిన నారా లోకేష్. 48. ఫ్యాక్స్ కాన్‌ను ఒప్పించి ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ. 49. IT, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సంసిద్ధత. 50. గత ప్రభుత్వం బకాయి పెట్టిన గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు 178.5 కోట్లు విడుదల. 51. అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్‌కు 3 లక్షల ఆర్థిక సాయం అందజేత. 52. మదనపల్లె డిగ్రీ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి 23 నెలలుగా బకాయిపడ్డ జీతాలు విడుదల. 53. రూ.5 వేల కోట్ల సాయంతో సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరంలలో పర్యాటకం అభివృద్ధికి కేంద్రం ముందడుగు. 54. www.goir.ap.gov.in వెబ్ సైట్ పునరుద్ధరణ. 55. తిరుపతితో సహా అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో మెంబరుగా ఒక బ్రాహ్మణ సభ్యుడికి చోటు. 56. ధూప దీప నైవేద్యాలకు రూ.50 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న గుడులకు సాయం రూ. 5 వేల నుండి 10 వేలకు పెంపు. రూ.50 వేలకు పైనున్న గుడులకు రూ. 10 వేల నుండి 15 వేలకు పెంపు. 57. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాల ఒక్కొక్కరికి రూ.5 లక్షలు. 58. 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 59. 2,800 కోట్ల పెట్టుబడులతో గోద్రేజ్ కంపెనీ రాష్ట్రానికి రాక. 60. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో 100 మహిళా వసతి గృహాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం 61. తెలంగాణ నుంచి రూ.2,50 కోట్లు బకాయిలు రాబట్టడమైంది.. 62. మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం 1489 కొత్త బస్సుల కొనుగోలు. 63. ఉపాధి హామీ పథకం మెటీరియల్ క్రింద రూ.2 వేల కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం. 64. భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్లో భాగంగా సీఎం, కేంద్ర మంత్రి సందర్శన. 65. యూట్యూబ్, గూగుల్, మహీంద్ర వంటి ప్రముఖ కంపెనీలతో భేటీలు. 66. టీటీడీ లడ్డూల నాణ్యత పెంపు. 67. ముచ్చుమర్రి గ్యాంగ్ రేప్ నేరస్థులపై కఠిన చర్యలు. 68. కౌలు రైతులకు కోఆపరేటివ్ బ్యాంకు రుణాలు. 69. మైనార్టీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణ కోసం 19 కేంద్రాల ఏర్పాటు. 70. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ. 71. మదనపల్లె భూ కబ్జాలపై పబ్లిక్ హియరింగ్ సదస్సులు. 72. భోగాపురం, విశాఖ భూకబ్జాలపై పబ్లిక్ హియరింగ్. 73. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్‌చే అర్జీల స్వీకరణ. 74. సీఎం పర్యటనలకు పరదాలు లేవు, ట్రాఫిక్ అంతరాయాలు లేవు, చెట్ల నరికివేతలు లేవు. 75. గత ప్రభుత్వ దోపిడీలపై 7 శ్వేతపత్రాలు విడుదల. మైనింగ్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల సస్పెన్షన్లు. 76. విభజన సమస్యలపై ఏపీ, టీఎస్ ముఖ్యమంత్రుల భేటీ. 77. రాజధాని రైతులకు కౌలు 5 ఏళ్ల పొడిగింపు. 78. ఇల్లు లేదని గోడు చెప్పుకున్న రాములు నాయక్‌కు ఇల్లు కేటాయింపు. 79. ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. 80. స్కాన్ చేస్తే భూమి సరిహద్దులు, లొకేషన్ వచ్చేలా క్యూ ఆర్ కోడ్‌తో పాస్ పుస్తకాలు. 81. భూముల రీ సర్వే నిలిపివేత. 82. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు, 83. శ్రీశైలంలో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి 20 ఏళ్ల తరువాత జూలైలో నిండిన శ్రీశైలం రిజర్వాయర్. 84. జలకళతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు. 85. ఆరుద్రకు ఆర్థిక సహాయం అందజేత. 86. అమరావతి రింగ్ రోడ్డు, రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం. 87. విశాఖ స్టీలు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కుమారస్వామి ప్రైవేటీకరణ చేయబోమని హామీ. 88. ఇళ్ల నిర్మాణాలకు రూ.4 లక్షలకు పెంపు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లకు పెంపు. 89. రూ.250 కోట్లతో XLRI మేనేజ్మెంట్ స్కూల్. 90. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ బీసీ ఉన్నతాధికారి పి. కృష్ణయ్య నియామకం. 91. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళెంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు. 92. ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయిలు రూ.32 కోట్లు విడుదల. 93. పోలవరం ఎడమగట్టు ప్రధాన కాల్వ విశాఖ వరకు ఉత్తరాంధ్ర సాగు, తాగు జలాలకు రూ.959 కోట్లు కేటాయింపులు, పాలనామోదం. 94. నెల్లూరు జిల్లా దామవరం విమానాశ్రయ ల్యాండ్ అక్విజిషన్‌కి రూ.96 కోట్లు ఆమోదం. 95. విద్యుత్ కోతలు లేవు. విద్యుత్ ఛార్జీల బాదుడు లేదు. 96. నూజివీడు IIITలో కలుషిత ఆహార ఘటనకు కారణమైన ఫుడ్ కాంట్రాక్టర్ల తొలగింపు. 97. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు రూ.290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల. 98. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం... ఇలా ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు.  99. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరును డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరణ. 100. అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 7.5 లక్షల మందికి ఉపాధి లక్ష్యాలుగా సీయం చంద్రబాబు గుజరాత్‌లోని గాంధీనగర్లో జరిగిన ప్రపంచ పునరుత్సాదక పెట్టుబడుల సమావేశంలో పాల్గొన్నారు. ఎవ్‌రెన్ సంస్థ సీఈఓ సుమన్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు.

మురళీమోహన్‌కి వ్యతిరేకంగా జయభేరి ఎదుట ధర్నా!

ప్రముఖ నటుడు, నిర్మాత, జయభేరి సంస్థల అధినేత, మాజీ ఎంపీ మురళీమోహన్ చిక్కుల్లో పడ్డారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి దగ్గర  నిర్మించిన జయభేరి ది క్యాపిటల్‌  అపార్ట్ మెంట్ వాసులు రోడ్డెక్కారు.  ఈ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్స్‌ యజమానులు జయభేరి సంస్థ తమను మోసం చేసిందంటూ  వారు ధర్నాకు దిగారు. బుధవారం(సెప్టెంబర్ 18) న అపార్ట్ మెంట్ వాసులు బయట నుంచి ఎవరూ లోనికి రాకుండా కార్లు పార్క్ చేశారు. బిల్డర్ గా మురళీమోహన్ కు మంచి రికార్డే ఉంది.  హైదరాబాద్‌లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ అనేక వెంచర్లు చేసింది. ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులూ వచ్చిన దాఖలాలు లేవు. అయితే  ఇప్పుడు మాత్రం కుంచనపల్లి దగ్గర నిర్మించిన జయభేరి ది క్యాపిటల్‌పై ఫ్లాట్‌ యజమానులు బోలెడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విషయాన్ని  యాజమాన్యం దృష్టికి  తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ధర్నాకు దిగారు.  విషయమేంటంటే జయభేరి ది క్యాపిటల్‌లో మొత్తం 147 ఫ్లాట్స్‌ ఉన్నాయి.  ఆ ప్లాట్స్ కొనుగోలు సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వసతులు కల్పించలేదంటూ జయభేరీ సంస్థపై అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మురళీమోహన్‌కి చెందినవి కావడంతో, అతనిపై నమ్మకంతోనే కొనుగోలు చేశామని యజమానులు చెబుతున్నారు.    సిసి కెమెరాలు ఫిక్స్‌ చేయలేదు, కార్‌ పార్కింగ్‌ దగ్గర దీపాలు లేవు. చెప్పిన మేరకు సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడం,  ఫైర్‌ సేఫ్టీ లేకపోవడం, చుట్టు పక్కల నుంచి పాములు వంటి ప్రాణహాని కలిగించే జంతువులు రాకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి 90 ఫిర్యాదులను అపార్ట్ మెంట్ వాసులు సంస్థ యాజమాన్యానికి  ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారు ధర్నాకు దిగారు.   ఈ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ కొనుగోలు చేసిన వారికి రక్షణ లేకుండా పోయిందని, ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం తమకు లేదని యజమానులు చెబుతున్నారు.  జయభేరి సంస్థకు, మురళీమోహన్‌కి మంచి పేరు ఉంది.  ఆ నమ్మకంతోనే  ఫ్లాట్స్‌ కొనుగోలు చేశామని, తమతోపాటు బంధువులచేత కూడా కొనిపించామని యజమానులు అంటున్నారు. ఫ్లాట్స్‌ అమ్మడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఫ్లాట్స్‌లో ఉండేవారికి కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్స్‌ హ్యాండోవర్‌ చేసేందుకు 15 రోజుల నుంచి నెలరోజుల వరకు టైమ్‌ తీసుకుంటున్నారని అంటున్నారు. ఎమినిటీస్‌, కార్పస్‌ ఫండ్‌తోపాటు అగ్రిమెంట్‌లో పేర్కొన్న ప్రతి ఒక్క దానికి మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌కి ఎందుకు టైమ్‌ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. రెండు లక్షలు పెట్టి కార్‌ పార్కింగ్‌ని కొనుగోలు చేస్తే కార్లకు రక్షణ లేకుండా పోయిందని, చాలా కార్లు డ్యామేజ్‌ అయ్యాయని చెబుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఫ్లాట్స్‌ అమ్మకాలు ఇప్పుడు జోరందుకున్నాయని, ఎక్కువ రేట్లతోనే ఫ్లాట్స్‌ అమ్ముతున్నారని బాధితులు చెబుతున్నారు.  దీనిపై జయభేరి  యజమాన్యం చేస్తున్న స్పందించాల్సి ఉంది. 

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

దేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి (జమిలి) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  వన్ నేషన్ -వన్ ఎలక్షన్‌పై నియమించిన రామ్నాథ్ గోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశం మీద పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెడతారు.  జమిలి ఎన్నికల నిర్వహణకు మోడీ ప్రభుత్వం పట్టుదలగా వుంది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ తదితర ప్రతిపక్షాలు అంటున్నప్పటికీ ఈ విషయంలో మోడీ సర్కార్ వెనుక అడుగు వేసే ఉద్దేశాన్ని ఏ దశలోనూ వ్యక్తం చేయలేదు. రెండు రోజుల క్రితం హోం శాఖ మంత్రి అమిత్ షా ఈసారి జమిలి ఎన్నికల నిర్వహణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టంగా చెప్పారు.  పదేళ్ల క్రితం బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది. గత రెండు పర్యాయాలుసంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి సర్కార్‌ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జమిలి ఎన్నికలపై ఎంతమాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం. మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి స్పష్టంగా చెప్పారు కూడా. దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా మారింది. దేశంలో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు నిర్వహిస్తూనే వుంటారు. ఇలా ఎన్నికల ప్రక్రియ నిరంతరం జరగడం వల్ల దాని ప్రభావం దేశ  అభివృద్ధి మీద పడుతోందన్న అభిప్రాయాలున్నాయి. దీన్ని అధిగమించడానికి జమిలి ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, అలాగే, రాష్ట్రాల్లో నిరంతరం ఎన్నికలు జరుగుతూ వుండటం వల్ల ఎలక్షన్ కోడ్ కారణంతో సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడుతోందని, జమిలి వల్ల అలాంటి ఇబ్బందులు వుండవని అంటున్నారు.  ప్రధాని తదితర బీజేపీ నాయకులు జమిలి ఎన్నికల విషయలో చాలా ఉత్సాహంగా వున్నారు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు తన ఆమోదం తెలిపింది. కానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమన్నది ఒక చిక్కు ప్రశ్న.  జమిలి ఎన్నికల విషయంలో అంతరార్థ విశ్లేషణ    

జర్నలిస్ట్  భూములపై  కెసీఆర్ కుట్ర ఆగలేదా? 

జర్నలిస్ట్ లకు రేవంత్ సర్కారు  తాము మార్కెట్ ధరకు కొనుగోలు చేసిన భూమి అప్పగించినప్పటికీ బిఆర్ఎస్ కుట్రలు  ఇంకా ఆగలేదు. కూతురు కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న సమయంలో కూడా తెలంగాణ కార్డు ఉపయోగించిన బిఆర్ఎస్ తన అవసరానికి తెలంగాణ పేరు ఎత్తుకుంటుంది. బిఆర్ ఎస్ తన పేగు బంధాన్ని వెతుక్కుంటుంది. తల్లి వేరు కోసం తండ్లాడుతోంది. తన మూలాలను కనుగొనే పనిలో పడింది. అయితే   ఫ్రస్టేషన్ లో   ప్రాంతీయవాదాన్ని ఎత్తుకోవడం ఆ పార్టీ సిద్దాంతంగా మారిపోయింది. రెండు దశాబ్దాల జర్నలిస్ట్ కల నెరవేరే వేళ బిఆర్ఎస్ మరో కుట్రకు తెరలేపింది. సోషల్ మీడియాద్వారా జర్నలిస్టులపై విషాన్ని చిమ్ముతోంది.3, 600 కోట్ల భూమిని ఆంధ్రా జర్నలిస్ట్లకు రేవంత్ రెడ్డి కట్టబెట్టటారని ప్రచారం చేస్తోంది. ఇటీవల సచివాలయంలో రాజీవ్ విగ్రహావిష్కరణ సమయంలో కూడా తెలంగాణ తల్లి ప్రస్థావన  బిఆర్ఎస్ తెచ్చింది. అంతకుముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి పిఎసి చైర్మన్ పదవి రావడాన్ని బిఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. అరికెపూడి రేవంత్ రెడ్డికి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంతటితో ఆగకుండా మరో  బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరికెపూడిపై ఉసిగొల్పింది. కెసీఆర్ తన ఫాం హౌజ్ కు పిలిపించుకుని కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టినట్లు సమాచారం.  అరికెపూడి ఆంధ్రోడు అంటూ కౌశిక్ రెడ్డి దుర్బాషలాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగానే  తన ఇంటికి రావాలని  కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో అరికెపూడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్తా  అరికెపూడిపై  హత్యాయత్నం కేసుగా టర్న్ అయింది. కెసీఆర్ కు అప్నా పరాయ్ ఉండదు.తనకు వ్యతిరేక గళం వినిపిస్తే హిట్లర్ లా మారిపోతాడు.  స్వంత పార్టీ ఎమ్మెల్యేనే హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనాపాటి. జర్నలిస్ట్ ల సపోర్ట్ తో అధికారంలో వచ్చిన టిఆర్ఎస్  పదేళ్లు అధికారంలో  కొనసాగింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  జర్నలిస్ట్ లు కొనుగోలు చేసిన 70 ఎకరాల భూమి న్యాయ వివాదాల్లో ఇరుక్కొంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం  కేవలం నిజాంపేటలోని 32 ఎకరాలను  అప్పగించిన కెసీఆర్ పేట్ బషీర్ బాద్ లోని 38 ఎకరాలను అప్పగించలేదు. విలువైన ఈ భూమిపై కెసిఆర్ కన్ను పడింది. ఇంకేం తన కుట్రకు శ్రీకారం చుట్టాడు.  మాజీ జర్నలిస్ట్ క్రాంతికిరణ్ కు ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జర్నలిస్ట్ లంటే తనకు అభిమానమని చెప్పుకున్నాడు . ఈయనను జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టే విధంగా పావులు కదిపాడు. మరో మాజీ జర్నలిస్ట్ పల్లె రవిని బిఆర్ఎస్ లో చేర్చుకున్నాడు ఎలాంటి ఎన్నికలు లేకుండానే క్రాంతికిరణ్ , పల్లె రవి లను సొసైటీ డైరెక్టర్లు చేసి 38 ఎకరాలను మింగేయాలని చూశాడు. అప్పటి అధికార పార్టీ చెప్పినట్లు చేసింది పాత కమిటీ. బిఆర్ఎస్ అరాచకాలను టీం జెఎన్ జె ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఉద్యమాలు చేసింది. ప్రతిపక్షాల మద్దత్తును కూడగట్టుకుంది. అప్పటిపిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కల్సింది.   ఈ భూములను తిరిగి జర్నలిస్ట్ లకు  అప్పగిస్తామని  కాంగ్రెస్ మేనిఫెస్టో లో చేర్పించిన ఘనత టీం జెఎన్ జె దే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. పదేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్నహౌజింగ్ సొసైటీకి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగి ఇద్దరు  టీం జెఎన్ జె సభ్యులు  డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. రమణారావు, అశోక్ రెడ్డి డైరెక్టర్లుగా ఎన్నికైన తర్వాతే 38 ఎకరాల భూమి ఫైల్ వేగంగా కదిలింది.  ఎట్టకేలకు  కెసీఆర్ అప్పగించని భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం  అప్పగించింది.    సుప్రీం తుదితీర్పు ప్రకారం  పేట్ బషీర్ బాద్ భూమిని రేవంత్ సర్కారు అప్పగించింది. ఇక్కడే  కెసీఆర్ కు కడుపు మండిపోయింది. మరో కుట్రకు తెరలేపాడు. బిఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లో ఉన్న నల్లబాలు అనే బిఆర్ఎస్ కార్యకర్తను రెచ్చగొట్టి తెలంగాణ కార్డును మరో మారు ప్రయోగించాడు.  హౌసింగ్‌ సొసైటీకి ఇటీవల రేవంత్‌రెడ్డి  ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించడంపై కొందరు కుట్రదారులు కడుపుమంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని సొసైటీ డైరెక్టర్లు బి.కిరణ్ కుమార్, ఆర్.రవికాంత్‌రెడ్డి, ఎన్.వంశీ శ్రీనివాస్, పీవీ రమణారావు, కె.అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థలాల కేటాయింపును అడ్డుకుంటామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పట్లో స్థలం కొనుగోలుకు సభ్యులు అందిన కాడల్లా అప్పు చేశారని, ఇంకొందరు అప్పు పుట్టక భార్యల మంగళసూత్రాలు తాకట్టు పెట్టారని  వారు వివరించారు.  కుట్రదారులు వాస్తవాలను దురుద్దేశపూరితంగా విస్మరించి సొసైటీపై విషం చిమ్ముతున్నారని, ఆంధ్ర, తెలంగాణ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. 

నల్లొండలో బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్గొండలోని ఆ పార్టీ కార్యాలయాన్ని పక్షం రోజుల్లో కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా అక్రమంగా ఎలాంటి అనుమతులూ లేకుండా భవనాన్ని నిర్మించిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అధికారంలో ఉండగా ఎలాంటి అనుమతులూ లేకుండా బీఆర్ఎస్ పార్టీ  నల్లొండలో కార్యాలయాన్ని నిర్మించింది. బీఆర్ఎస్ అధికారంలో కొనసాగినంత కాలం అనుమతులు లేని నిర్మాణం అంటూ  అభ్యంతరం చెప్పే సాహసం కూడా చేయలేకపోయారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత   అనుమతులు లేని నిర్మాణాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటి రెడ్డి  వెంకటరెడ్డి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గట్టిగా అడ్డుపడ్డారు. ఎవరైనా కార్యాలయం జోలికి వస్తే అంతు చూస్తానంటూ బెదరించారు. దీంతో భవనం కూల్చివేత విషయంలో అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఈ తరుణంలో నల్లొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేని కారణంగా దానిని డిమాలిష్ చేయాలని డీటీపీసీ ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. భవనాన్ని కూల్చకుండా రెగ్యులరైజ్ చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అనుమతులు లేకుండా భవన నిర్మాణం ఎలా చేశారని సూటిగా ప్రశ్నించి, ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమనడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలని  హైకోర్టు ఆదేశించింది.   అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అక్రమంగా నిర్మాణం చేసినందుకు లక్ష రూపాయలు జరిమానా విధించింది. 

వరద బాధితులకు చంద్రన్న ప్యాకేజీ!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల బాధితులకు ప్యాకేజీ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు వరద బాధితులకు సాయంగా అందజేసే ప్యాకేజీ వివరాలను తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించాం. విజయవాడ వరదల సమయంలో 10 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేశాను. ఇప్పుడు నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డాం. విజయవాడ నగరంలో వారం పది రోజులు వరదలో చిక్కుకుని ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం,  పై అంతస్తుల్లో ఉన్న వారికి రూ.10 వేలు ఆర్ధిక సాయం ఇస్తాం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరదలకు ఇల్లు మునిగి ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సాయం అందిస్తాం. కిరాణా షాపులు, చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ. 25 వేలు, ఎంఎస్ ఎంఈ లకు, వ్యాపార సంస్థ స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించాం. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ. 3 వేలు, ఆటోలకు రూ. 10 వేలు అందిస్తాం. అలాగే దెబ్బతిన్న ధాన్యం, ప్రత్తి, చెరకు, వేరుసెనగ పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు, అరటి, పసుపు వంటి ఉద్యానవన పంటలకు హెక్టార్‌కు రూ. 35 వేలు సాయం చేస్తాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలలో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నాం. బ్యాంకులు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నాం. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువుల కోల్పోయిన రైతులకు కూడా  పరిహారం అందిస్తున్నాం. వరద సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటించాము."అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

అమిత్ షా నోట మధ్యంతరం మాట.. ఎందుకంటే?

  కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే కూటమిలో ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి లేదా? సొంతంగా మెజారిటీ లేకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే చాతుర్యం, సమర్థత మోడీలో కొరవడింది. అన్నీ నేనే.. అంతా నేనే అన్నట్లుగా పదేళ్ల పాటు ఎన్డీయే ప్రభుత్వాన్ని నడిపిన మోడీకి భాగస్వామ్య పార్టీలను గుర్తించడం, వాటిని అనివార్యంగా సముచిత ప్రాధాన్యతను ఇవ్వాల్సి రావడం కష్టంగా ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తాజాగా అమిత్ షా  జమిలి ప్రస్తావన తీసుకు వచ్చారు. అదేమీ కొత్త కాదు.. గత పదేళ్లుగా అవసరం ఉన్నా లేకపోయినా మోడీ, షా జోడీ జమిలి జపం చేస్తూనే వస్తోంది. ఇప్పుడు అమిత్ షా జమిలి అనడంలో కొత్తేం లేదు. కానీ.. ఆయన జమిలి ఎన్నికలు అని ఊరుకోలేదు. అవసరమైతే మధ్యంతర ఎన్నికలకు కూడా వెనుకాడబోమని చెప్పారు. దీంతోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడిపే విషయంలో మోడీ అడుగులు తడబడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో  అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం సాధ్యంకాదని  బీజేపీ  జమిలీ మాటఎత్తిన ప్రతిసారీ విపక్షాలు ఖండిస్తూ వస్తున్నాయి.  అయితే బీజేపీ మాత్రం జమిలీ ఎన్నికలు తమ అజెండా లో భాగమని,తప్పక అమలు చేస్తామని చెబుతూ వస్తోంది.   ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఇటీవల జమిలితో పాటు మధ్యంతరం అన్న మాట అనడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది.   వరుసగా మూడో సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువుదీరింది. అయితే గత రెండు సార్లకు భిన్నంగా ఈ సారి భాగస్వామ్య పక్షాల కరుణాకటాక్షాలుంటేనే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుంది.  తెలుగుదేశం, జేడీయూ మద్దతుపైనే మోడీ సర్కార్ భవిష్యత్ ఆధారపడి ఉంది.  ఆ రెండు పార్టీలూ కూడా బీజేపీ హిందుత్వ అజెండా అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవు. ఆ విషయం మోడీ, షా జోడీకి తెలుసు.   అందుకే అమిత్ షా జమిలి ఎన్నికలతో పాటు మధ్యంతర ఎన్నికల జపం కూడా ప్రారంబించారు.  లోక్ సభ,  అసెంబ్లీ ఒకేసారి జరిగితే.. ప్రాంతీయ పార్టీల హవా నడవదనీ, స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలకే ప్రాధాన్యత పెరిగి బీజేపీకి ప్లస్ అవుతుందన్నది కమలనాథుల అంచనా.  జమిలి ఎన్నికలతో దక్షిణాది రాష్ట్రాలలో కూడా బలోపేతం కావొచ్చునన్నది బీజేపీ ఆశ. ఆ కారణంతోనే అమిత్ షా నోట జమిలితో పాటు మధ్యంతరం మాట కూడా వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2026లో యూపీ, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో జమిలికి ముహూర్తం పెడితే అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నది బీజేపీ భావనగా చెబుతున్నారు.  

మోడీ అమెరికా టూరు.. ఆయన ప్లానే వేరు!

సాధరణంగా ‘ఊరకరారు మహానుభావులు’ అనే మాట ఉపయోగిస్తూ వుంటాం. మన ప్రధానమంత్రి మోడీ గారి విషయంలో మాత్రం ‘ఊరక వెళ్ళరు మహానుభావులు’ అనే కొత్త పదాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే, ప్రధాని మోడీ అతి త్వరలో అమెరికా యాత్ర చేయబోతున్నారు. ఇందులో కొత్త విషయం ఏముంది? మోడీ గారు విదేశాలకు వెళ్ళడం, ఏ దేశం వెళ్తే ఆ దేశం అధ్యక్షుడినో, ప్రధానమంత్రినో గాఠ్ఠిగా కౌగలించుకోవడం, మన దేశంలో మీడియా ఆ ఫొటోలు పెద్దపెద్దగా ప్రచురించి, ప్రపంచ మొత్తాన్నీ నడిపేంచే శక్తి గల ‘విశ్వగురు’ మన మోడీ గారు అని కీర్తించడం మామూలేగా అనుకుంటున్నారు కదూ? అయినప్పటికీ, ఈ మామూలు విషయాన్నే మరోసారి మామూలుగా చర్చించుకుందాం.  త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బైడన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. ఆయన పార్టీకే చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష పోటీలో నిలిచారు. అలాగే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీలో వున్నారు. అమెరికా ఎన్నికలలో కొన్ని ప్రాంతాల్లో ప్రవాస భారతీయుల ఓట్లు బాగా ప్రభావం చూపుతాయి. పైగా ఈసారి ఎన్నికలలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ బరిలో వున్నారు. ఇలాంటి సందర్భంలో మోడీ అమెరికా వెళ్తే ఆయనకు లభించే గౌరవమే వేరు. మోడీ అమెరికా టూర్ వుందనే విషయం తెలియగానే, డోనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందించారు. మోడీ అమెరికా రాగానే తప్పకుండా కలుస్తాను అని ప్రకటించారు. దానికి అర్థం ఏమిటంటే, మోడీతో చాలా సన్నిహితంగా మెలగటం ద్వారా తాను ఇండియాకి స్నేహితుడినని, తాను అధ్యక్షుడు అయితే అమెరికాలో వున్న ఎన్నారైలకు ఎంతో మంచి చేస్తానన్న సందేశాన్ని వ్యాపింపజేస్తారు. అలాగే బైడెన్, కమలా హ్యారిస్ కూడా మోడీని బాగా గౌరవించడం ద్వారా ఎన్నారైల మెప్పు పొందాలని కోరుకుంటారు. ఇలాంటి సందర్భంలో అమెరికా వెళ్తే మోడీకి రెండు పక్షాల నుంచి లభించే గౌరవ మర్యాదలు మామూలుగా వుండవు. ఆ గౌరవ మర్యాదలను మన ఇండియాలో మీడియా ఏరకంగా ప్రొజెక్టు చేస్తుందో చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. మోడీ గారు అమెరికా వెళ్తే అమెరికా అధ్యక్షుడితోపాటు అధ్యక్ష పోటీలో వున్న ఇద్దరు అభ్యర్థులూ మోడీని ఎంతో గౌరవించారు. ఇదీ మోడీ గారి లెవల్ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అందుకే మనం ‘ఊరక వెళ్ళరు మహానుభావులు’ అనుకోవాలి.

లోకేష్ ప్రజాదర్బార్‌కి విశేష స్పందన!

వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నంతకాలం ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం లభిస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బార్‌ సందర్భంగా ప్రజలు నేరుగా లోకేష్‌ని కలిశారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ప్రజాదర్బార్ సందర్భంగా లోకేష్ దగ్గరకి వైసీపీ నాయకులు చేసిన దుర్మార్గాల బాధితులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటున్న లోకేష్, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. అలాగే ప్రజల నుంచి తనకు అందుతున్న వినతిపత్రాలను సంబంధిత మంత్రులు, అధికారులకు అందిస్తూ, ఆయా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారాలు చూపించాలని లోకేష్ ఆదేశిస్తున్నారు. సాధారణంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టినప్పుడు ఆ వినతి పత్రాలు సంబంధిత శాఖల మంత్రులకు, అధికారులకు ఎప్పుడు చేరుతాయో అర్థంకాని పరిస్థితి. అయితే నారా లోకేష్ నిర్వహిస్తన్న ప్రజాదర్బార్ మాత్రం అందుకు భిన్నంగా, లోకేష్ మార్కుతో కొనసాగుతోంది. ప్రజల నుంచి తనకు అందిన వినతిపత్రాలను లోకేష్ వెంటనే సంబంధిత శాఖ మంత్రులకు అందిస్తున్నారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగినప్పుడు లోకేష్ ఈ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 

వైఎస్ అవినాష్.. అరెస్టు తప్పదా?

మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు, విచారణ ఇక జెట్ వేగంతో సాగనున్నాయా? అంటే మంగళవారం ( సెప్టెంబర్ 17) అనూహ్యంగా జరిగిన పరిణామాలను గమనిస్తే ఔనని అనక తప్పదు.  వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు విషయంపై చర్చించారు. సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో జగన్ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టింపు లేకుండా వ్యవహరించారు. పైపెచ్చు.. ఈ కేసులో నిందితులను వెనకేసుకు వచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాకా? సీబీఐ దర్యాప్తు ఎందుకు మా రాష్ట్ర పోలీసులు ఉన్నారుగా అన్నారు.  అయితే వివేకా కుమార్తె  డాక్టర్ సునీత మాత్రం ఊరుకోలేదు. సీబీఐ దర్యాప్తు  కోసం పట్టుబట్టి సాధించారు.  అయితే జగన్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు కల్పించింది.   ఏకంగా సీబీఐ అధికారులపైనే కేసులు నమోదయ్యాయి. వారిపైనే దాడులు జరిగాయి. దీంతో సునీత మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరారు.   సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేయడంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను   తెలంగాణలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదలీ చేసింది. దాంతో అప్పట్లో వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒక దశలో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా సీబీఐ సిద్ధమైంది. అయినా అరెస్టు చేయలేదు. అది వేరే సంగతి.    అధికారం అండతో వివేకా హత్య కేసు దర్యాప్తు, విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన జగన్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. కూటమి సర్కార్ కొలువు దీరింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణ స్పీడ్ ట్రాక్ లోకి వస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే వివేకా కుమార్తె సునీత  ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం (సెప్టెంబర్ 17) భేటీ అయ్యారు. వివేకా హత్య కేసులో న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.  దీంతో ఇక ఈ కేసు విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మన ఫోన్లు పేలవన్న గ్యారంటీ ఏంటి?

మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను పూర్తిగా స్వాధీనం చేసుకుందని బాధపడిపోతూనే వుంటాం. అయినా మనం మన చేతిల్లో ఫోన్లు వదలం. నిద్ర లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకు మాత్రమే కాదు.. ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా మన ఫోన్ మనల్ని అంటిపెట్టుకుని వుండాల్సిందే. మన జీవితంలో భాగమైపోయిన, మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని అంతం చేయగలదు. ఏదో ఒకరోజు ఆ ఫోను బాంబులాగా ఢామ్మని పేలిపోయి మన పేరు ముందు ‘స్వర్గీయ’ అనే పదాన్ని చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పరిస్థితులు, టెక్నాలజీ అంత దారుణంగా తయారయ్యాయి మరి. లెబనాన్‌కి చెందిన తీవ్రవాద గ్రూప్ ‘హెజ్‌బొల్లా’ సభ్యులు ఉపయోగించే పేజర్లు రెండ్రోజుల క్రితం పేలిపోయాయి. ఆ పేలుళ్ళ ధాటికి తొమ్మిదిమంది హెచ్‌బొల్లా గ్రూప్ మిలిలెంట్లు అక్కడికక్కడే చనిపోయారు. హెజ్‌బొల్లా గ్రూప్ కొద్ది నెలల క్రితమే ఆ పేజర్లను తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. అయితే మొస్సాద్ స్పై ఏజెన్సీ పేజర్లను తయారు చేసిన సంస్థతో కుమ్మక్కై తమకు సరఫరా చేసే పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చిందని హెజ్‌బొల్లా గ్రూప్ ఆరోపిస్తోంది. పేలుళ్ళకు కారణమైనవారిని వదిపెట్టమని హెచ్చరించింది. పేజర్లను తయారు చేసిన సంస్థ మాత్ర తమకు ఏ పాపమూ తెలియదని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికా మాత్రం, ఈ పేలుళ్ళకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ గొడవని అలా వుంచితే, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులలో పేలుడు పదార్థాలు అమర్చి, ఎప్పుడు పేల్చుకోవాలంటే అప్పుడు పేల్చుకోవచ్చనే విషయం స్పష్టమవుతోంది. అలాంటి అవకాశం వున్నప్పుడు మన చేతిలో వున్న ఫోన్ కూడా ఒక మినీ బాంబ్ అని మనం ఎందుకు అనుమానించకూడదు? మనం ఉపయోగించే ఫోన్లకి, మన శత్రుదేశం చైనాకి అవినాభావ సంబంధం వుంటుంది. ఫోన్ల మీద మేడిన్ చైనా అని వున్నా, వుండకపోయినా ఆ ఫోన్‌ తయారీ దశలో ఎక్కడో ఒకచోట చైనాతో లింక్ వుండే వుంటుంది. మన ఇండియా అంటే అగ్గిమీద గుగ్గిలం అయిపోతూ వుండే చైనా మన దేశానికి సరఫరా అయ్యే ఫోన్లలో ఏ చిన్న బాంబు నిక్షిప్తం చేసిందో ఏం పాడో! అసలే ఆ చైనావాళ్ళు మహా ముదుర్లు. విశ్వామిత్ర సృష్టి చేయడంలో ఆరితేరినవాళ్ళు. మన ఫోన్లో ఏ చిప్పు లాగానో, ఏ తీగ లాగానో కనిపించే బాంబుని సెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏ దుర్ముహూర్తానో అది పేలినా పేలవచ్చు. అతిగా భయపడుతున్నట్టు, బయపెడుతున్నట్టు అనిపించినా, తాజాగా పేజర్ల పేలుడు జరిగిన నేపథ్యంలో మన చేతిలో వున్న ఫోన్‌ని కూడా అనుమానించడంలో తప్పు కాదేమో!

జాని మాస్టర్ కోసం గాలింపు.. బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు  

 ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు.  ప్రస్తుతం ఆయన నెల్లూరులో ఉన్నట్లు సమాచారం. జాని మాస్టర్ దగ్గర పని చేస్తున్న 21 ఏళ్ల మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్  పోలీసులకు  ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జాని మాస్టర్ పై నాన్ బెయిల్ కేసు నమోదైన  నేపథ్యంలో బుధవారం నార్సింగ్ పోలీసులు బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాత జానిమాస్టర్ హైద్రాబాద్ లోని తన ఇంటి నుంచి పారిపోయాడని పోలీసువర్గాలు తెలిపాయి. త్వరలో అరెస్ట్ చేయడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.  సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికి వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు జాని మాస్టర్ ఇంటికి చేరుకుంటున్నారు. గత రెండురోజులుగా జానీ మాస్టర్ పత్తాలేకపోవడంతో   ఫలితం లేకుండా పోయింది.  సెక్స్  ఆరోపణలు రావడంతో తమ పార్టీ  నుంచి  జాని మాస్టర్ ను సస్పెండ్  చేసిన జనసేన బాధిత యువతికి అండగా నిలిచింది.  బాధిత యువతి ఫిర్యాదుమేరకు జాని మాస్టర్ భార్య కూడా ఈ నేరానికి సహకరించినట్లు తెలుస్తోంది. 

వైసీపీ ‘కాపు’రంలో మిగిలేది ముగ్గురేనా?

వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ కు రాష్ట్రంలో గాలి ఆడటం లేదు.  ఇంత కాలం వైసీపీకి ‘కాపు’ కాసిన నేతలు కూడా దూరం జరుగుతున్నారు. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీని వీడుతున్నారు.  అలాంటి వారిలో ఇంత కాలం జగన్ కు సన్నిహితంగా ఉన్న వారే ముందుగా బయటకు వస్తుండటం విశేషం. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని, గుంటూరు జిల్లా కు చెందిన కిలారు వెంకటరోశయ్యలు, జగన్ కు, వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇరువురూ కూడా వారి వారి నియోజకవర్గాలలో బలమైన నేతలే. ఇరువురూ కూడా జగన్ కు సన్నిహితులుగా ముద్రపడిన వారే. అయితే ఎన్నికల ఫలితాల తరువాత కొంత కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వీరు.. ఆ తరువాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ సందర్భంగా వారు జగన్ తీరు పట్ల కొన్ని సునిశిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయభాను పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారు. ఉదయభాను వైఎస్సార్ హయాం నుంచి ఆయనకు, ఆయన తరువాత జగన్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక సారి కాంగ్రెస్ నుంచి, ఆ తరువాత రెండో సారి  వైసీపీ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయభాను అప్పటి నుంచి జగన్ పట్ల, వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తిగానే ఉన్నారు.  అయితే జగన్ సామినేని ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. అదేమిటంటే జనసేనానిని పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయాలని, అయితే అందుకు సామినేని ఉదయభాను అంగీకరించలేదు. దాంతో జగన్ ఆయనను దూరం పెట్టారు.  పవన్ పై ఇష్టారీతిన విమర్శలు, వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోవడానికి రెడీ అయిన పేర్నినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారు.  ఇప్పుడు సామినేని ఉదయభాను జనసేన గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే సామినేని ఉదయభాను జనసేన నాయకుడు నాగబాబుతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా ఉదయభాను జనసేనలో చేరికను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో  సామినేని ఉదయభానుకు కీలక పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అదలా ఉంచితే..కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లే మిగిలేటట్లు ఉన్నారు. వారు వైసీపీకి ‘కాపు’ కాయగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారు తమ నోటి దురుసుతో ప్రజలలో ప్రతిష్ట కోల్పోయారు. 

అంతా సజ్జల కనుసన్నలలోనే.. జత్వానీ కేసులో బలపడుతున్న అనుమానాలు!

సినీ నటి కాదాంబరి జత్వానీ కేసులో  ముగ్గురు ఐపీఎస్ లు అడ్డంగా బుక్కైపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి మరీ వారి చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారు. జత్వానీని అరెస్టు చేయడం, ముంబై నుంచీ తీసుకురావడం వరకూ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణాతాతా, విశాల్ గున్నీలు.. పోలీసుల్లా కాకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా వ్యవహరించిన తీరు దిగ్భ్రమ కొలుపుతోంది. విశాల్ గున్నీ మూడు పేజీల వాంగ్మూలంతో.. ఈ ఐపీఎస్ లను వెనకుండి నడిపించింది అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది సందేహాలకు అతీతంగా తేలిపోయింది.  జత్వానీ కేసులో జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్సార్  ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీ  వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ల ప్రమేయానికి సంబంధించి అత్యంత కీలక ఆధారాలను గూగుల్ టేకౌట్ ద్వారా దర్యాప్తు అధికారులు సేకరించారు.    ఈ కేసులో జత్వానీ ఫిర్యాదు మేరకు నిందితుడు కుక్కల విద్యాసాగరరావు పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు సాంకేతికతను ఉపయోగించారు.   కుక్కల విద్యాసాగర్  సెల్‌ ఫోన్ నెంబర్‌ ఆధారంగా ఆయన ఆనుపానులు కనుగొనే ప్రయత్నంలో గూగుల్‌ టేకౌట్‌ను ఉపయోగించడంతో  మొత్తం గుట్టు బయటపడింది.  జత్సానీని ముంబై నుంచి తీసుకువచ్చే రోజు అంటే ఫిబ్రవరి 2న విద్యాసాగర్‌ ముంబైలోనే విశాల్‌ గున్నీతోనే ఉన్నట్లు వెల్లడైంది.   తాడేపల్లి ప్యాలెస్ స్కెచ్ మేరరు  జెత్వానీ కదలికలు, అమె నివాసం వంటి విషయాలు తెలిసిన వ్యక్తిగా  విద్యాసాగర్‌ కూడా ముంబై  వెళ్లినట్లు తెలిసింది.  దీంతో పోలీసులు కుక్కల విద్యాసాగరరావు కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేసే యోచనలో  ఉన్నట్లు తెలిసింది.  ఈ కేసులో సజ్జల ప్రమేయంపై కూడా స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే.. హోంమంత్రి అనిత.. జత్వానీ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదనీ,  ఈ కేసులో సలహాదారులు, సూత్రధారులను వదిలిపెట్టే ప్రశక్తే లేదని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే.. ముగ్గురు ఐపీఎస్ లనూ సస్పెండ్ చేసిన తరువాత కూడా కేసు నమోదుకు జాప్యం ఎందుకన్న అసహనం తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు జనాలలో కూడా వ్యక్తం అవుతోంది.  అలాగే సజ్జలపై కూడా కేసు నమోదు చేయాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.   ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన దాష్టీకాలకు కాదంబరి జత్వానీ కేసు పరాకాష్టగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కాదంబరి  జత్వానీ విషయంలో ముగ్గురు ఐపీఎస్ లూ వ్యవహరించిన తీరు.. అత్యంత అమానవీయం, అమానుషం. వారి తీరు  ఐపిఎస్ చరిత్రకే మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. జగన్ హయాంలో అరాచకాలను తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా మంది జత్వానిలు వెలుగు చూస్తాయని పరిశీలకులు అంటున్నారు. జత్వానీ కేసు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి లాండ్ మార్క్ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.