కూల్చివేతలతో ఆగమాగం.. బెడిసికొడుతున్న రేవంత్ దూకుడు!
posted on Sep 12, 2024 @ 10:56AM
హైదరాబాద్ లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెండు గదుల ఇళ్ల దగ్గర నుంచి ఖరీదైన విల్లాలు.. ఏవైనా సరే.. చెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో ఉంటే నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నారు. దీంతో గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాపైనే చర్చ జరుగుతోంది. ఉదయం నిద్రమత్తు వదలకముందే బుల్డోజర్లు వస్తుండటంతో అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎన్నోఏళ్లుగా ప్రభుత్వ అనుమతులతో నివాసం ఉంటున్న భవనాలను సైతం హైడ్రా కూల్చివేస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. హైడ్రా దూకుడుతో సీఎం రేవంత్ సర్కార్‌పై తొలుత ప్రశంసల జల్లు కురిసినప్పటికీ.. కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ వ్యతిరేక గళం పెరుగుతోంది. అయినా రేవంత్ ఏమాత్రం పట్టించుకోకుండా.. హైడ్రా విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఖరాఖండీగా చెప్పస్తున్నాడు. రేవంత్ మొండి పట్టుదలతో కాంగ్రెస్ నేతల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుండటం గమనార్హం.
ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది. రామ్‌నగర్ మణెమ్మ గల్లీలో మూడు, గగన్ పహాడ్ అప్పాచెరువులో 14, అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాధాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్ పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. హైడ్రా విషయంలో తాజాగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వాళ్లు చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేయడం వల్లనే నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు. పేదలకు హైడ్రా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పిన రేవంత్.. బడాబాబులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేని లేదని తేల్చిచెప్పారు.
రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో దూకుడుగా వ్యవహరిస్తుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ నేతల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో గెలవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టిసారించారు. హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను, నగర మేయర్, డిప్యూటీ మేయర్‌తో సహా పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తద్వారా నగరంలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చిన హైడ్రా కాంగ్రెస్ వ్యూహానికి అడ్డుగా మారుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. నగరంలో రాజకీయంగా, ఇతర రంగాల్లో పలుకుబడి కలిగిన వారి ఇళ్లను అక్రమ కట్టడాలుగా గుర్తించి హైడ్రా కూల్చివేస్తోంది. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు వీరు సహకారం అందించారు. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అలాంటి వారికి రక్షణగా నిలవాల్సింది పోయి.. హైడ్రా పేరుతో వారికి నష్టం జరిగేలా ప్రవర్తిస్తే ఎలాఅంటూ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. దీంతో హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు విడిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
హైదరాబాద్ నగరం దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మాణం చేసి ప్రపంచ దేశాల్లోని ప్రముఖ ఐటీ, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశారు. అప్పటి నుంచి పలు రంగాల్లోని ప్రముఖ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్‌రెడ్డి, కేసీఆర్.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి ఎవరైనా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే సమయంలో హైడ్రా పేరుతో నగరంలోని అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే, చెరువు, పార్కు స్థలాల్లో చేపట్టిన పలు నిర్మాణాలకు గతంలోని ప్రభుత్వాలు అన్ని అనుమతులు ఇచ్చాయి. కొందరైతే తాము ఇల్లు నిర్మించుకున్న స్థలం బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో ఉందని తెలియదని, అధికారులు కూడా అభ్యంతరం చెప్పలేదని చెప్పకొస్తున్నారు. అన్ని అనుమతులు ఉండటంతోనే మేము నిర్మాణాలు చేపట్టామని వాపోతున్నారు. అయినా, అలాంటి భవనాలను కూడా రేవంత్ సర్కార్ కూల్చివేస్తుండటంతో నగర వాసుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పేదలు రూపాయిరూపాయి పోగుచేసుకొని కట్టుకున్న ఇల్లు సైతం బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో ఉందంటూ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అటు బడాబాబులతో పాటు పేద వర్గాల ప్రజలుసైతం హైడ్రాపై ఆగ్రహంతో ఉన్నారు. హైడ్రా ప్రారంభంలో ప్రతిపక్ష పార్టీలు రేవంత్ నిర్ణయానికి కాస్తా సానుకూలంగానే స్పందించాయి. కానీ, రానురాను హైడ్రా తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాయి. అన్ని వైపుల నుంచి విమర్శల దాడి పెరుగుతుండంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రేవంత్ తీరులో ఇప్పటికైనా మార్పు రాకుంటే రాబోయే కాలంలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావటం కష్టమన్న భావనను పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.