కట్ట పుట్టాలమ్మ ఆలయ శిల్పాలను కాపాడుకోవాలి!

పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి సమీపంలోని కరకంబాడి కట్ట పుట్టాలమ్మ దేవాలయం ముందున్న మధ్య యుగ శిల్పాలను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.  ఎస్.వి. భక్తి ఛానల్ సీనియర్ ప్రొడ్యూసర్ మరియు వారసత్వ ప్రేమికుడు బి.వి.రమణ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శనివారం నాడు ఈ శిల్పాలను పరిశీలించారు. ఆలయ మండపంలో కుడివైపున వీరభద్ర, అమ్మవారు, గణేశా,  శిల్పాలు ఎడమవైపున ఆత్మార్పణ వీరుడు, ద్వారపాల శిల్పాలు భూమిలో కూరుకుపోయి, పసుపు రంగుతో నిండిపోయి ప్రాచీనతను కూలిపోతున్నాయని, ఆ విగ్రహాలను పైకి లేపి, రంగులు తొలగించి, పీఠాలపై నిలబెట్టాల్సిన అవసరముందని కరకంబాడి ఆలయ నిర్వాహకులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.  విజయనగర అనంతర కాలం నుంచి, బ్రిటిష్ కాలం వరకు కరకంబాడి-మామండురు -కృష్ణాపురం పాలెగాళ్లు అయిన నాయిని వంశీయులు కడప, నెల్లూరు, చెన్నపట్నం నుంచి, తిరుపతికి వచ్చే భక్తులు అడవి జంతువులు, దొంగల నుండి కాపాడే బాధ్యతలు నిర్వర్తిం చేవారని, ఆ పాలెగాళ్లే, పుట్టాలమ్మ ఆలయాన్ని నిర్వహించే వారని, ఈ శిల్పాలు కూడా అప్పట్నుంచి పూజాలందుకొంటున్నాయని బి.వి. రమణ చెప్పారు.  400 సంవత్సరాల చరిత్ర కలిగి, పురావస్తు ప్రాధాన్యత గల ఈ శిల్పాలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలని ఆలయ అధికారులను, గ్రామస్తులను  శివనాగిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శిల్పి పెంచల ప్రసాద్ పాల్గొన్నారు.

కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కెటీఆర్ 

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఇవ్వాళ పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి నివాసానికి రావడం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డి పై దాడి జరగడంతో బిఆర్ఎస్ నేతలు  చేసిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అరికెపూడిపై హత్యాయత్నం  కేసు నమోదు చేసింది. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని  రేవంత్ రెడ్డి  ఇవ్వడంతో బిఆర్ఎస్ లో నిప్పు రాజేసింది. దీనికి తోడు అరికెపూడి, కౌశిక్ రెడ్డి మధ్య మాటలయుద్దం బిఆర్ఎస్ లో మరింత నిప్పు రాజేసింది.  తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి బిఆర్ఎస్ ప్రయోజనం పొందాలని చూస్తుందా?  అంటే ఔననే అనినిపిస్తుంది. అరికెపూడిని దూషిస్తూ రెచ్చగొట్టిన కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్  మరోమారు రెచ్చగొడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే కౌశిక్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేశారని  వినిపిస్తోంది

పొయ్యి మీద పెట్టకుండానే నూనె కాగుతుంది... ఎలా?

పొయ్యి మీద పెట్టకుండానే నూనె సలసలా కాగుతోంది. అవునా.. నిజమా అనుకుంటున్నారా? అవును ఇది పాక్షికంగా నిజమే. ఇది ఏ మ్యాజిక్కో కాదు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా నూనె ప్యాకింగ్‌లో వుండగానే సలసలా కాగుతోంది. ఎందుకంటే, వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దానివల్ల వంట నూనె ధరలు భారీగా పెరగబోతున్నాయి. పండగలు వస్తున్నాయి.. పిండివంటలు చేసుకుంటాం. ఇలాంటి సమయంలో నూనెల ధరలు పెంచితే ఎలా అని బాధపడుతున్నారా? మీరెంత బాధపడినా ఉపయోగం లేదు. కేంద్రం డెసిషన్ తీసుకుంది. ఇది ఫైనల్ అంతే!  ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మీద ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా 20 శాతం దిగుమతి సుంకాన్ని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చింది. అలాగే రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ మీద ఇప్పటి వరకు 12.5 శాతం వున్న దిగుమతి సుంకాన్ని దేశ ప్రజల మీద ప్రేమతో 32.5 శాతానికి పెంచారు. ఈ దిగుమతి సుంకాల పెంపు మాత్రమే కాకుండా, అదనంగా అగ్రికల్చరల్ సెస్‌ని కూడా వడ్డిస్తారు. దాంతో వంటనూనెలు పొయ్యిమీద పెట్టకుండానే ప్యాకింగ్‌లోనే కాగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారు... పండగ చేసుకోమంటారు.. ఎలామరి? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మనసు చేసుకుని నూనెల ధరలు ఎందుకు పెంచిందో తెలుసా? ఇలా ధరలు పెంచడం వెనుక చాలా గొప్ప కారణం వుంది. వంట నూనెల దిగుమతుల కారణంగా దేశంలో నూనెగింజల్ని సాగుచేసే రైతులు నష్టపోతున్నారట. ఇప్పుడు దిగుమతి చేసుకునే నూనెల ధరలు పెంచడం వల్ల నూనెగింజల్ని సాగుచేసే రైతులకు మేలు జరుగుతుందట. అందుకే కేంద్రం నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచిదట. దీనికీ, దానికీ సంబంధం ఏంటని ఆలోచించి బుర్ర హీటెక్కుతోందా? ఒకవైపు నూనె ఎలాగూ హీటెక్కింది. దాని గురించి ఆలోచించి బుర్రలు కూడా హీట్ చేసుకోవడం అవసరమా? నూనె అవసరం అనుకుంటే, తక్కువ నూనెతో వంటలు చేసుకోండి. అది కూడా మా వల్ల కాదు అంటే, నీళ్ళతో ట్రై చేయొచ్చేమో ఆలోచించండి. అంతేగానీ, ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే, పేదవాడి ఆలోచన బుర్రకు చేటు!

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 20 న జరగనుంది. హైడ్రా దూకుడుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానం పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.  రాష్ట్రంలో ఇటీవలె కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాకారం కోరే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు విషయంలో చర్చించనున్నారు. రుణ మాఫీ జరగలేదన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రైతు భరోసాపై చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నిదరఖాస్తులు తీసుకోవాలో కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.

ఓలమ్మో.. దువ్వాడ సీరియల్లో కొత్త ట్విస్టు..!

ఏంటీ... తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ దువ్వాడ డైలీ సీరియల్ నుంచి విముక్తి లభించదా? అయిపోయినట్టే అయిపోతుంది.. మళ్ళీ స్టార్టవుతుంది. కథ కంచి వెళ్ళినట్టే వుంటుంది.. మళ్ళీ బేతాళ కథాలాగా మొదటికి వస్తుంది. ఇప్పుడు ఈ ఆయనకిద్దరు కథ మరో కొత్త ట్విస్టు తీసుకుంది. మొన్నామధ్య దువ్వాడ శ్రీనివాస్ ఒక తెలివైన పని చేశానని అనుకుంటూ, తాను వుంటున్న ఇంటిని దివ్వెల మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌కి, ఆయన భార్య దువ్వాడ వాణికి మధ్య ఇష్యూ ఆ ఇంటి వల్లే కాబట్టి, ఇప్పుడు ఆ ఇల్లు మాధురి పేరిట రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇక దువ్వాడ వాణి చేసేదేమీ లేదని, సదరు ఇంటికి వెళ్ళే అవకాశం లేదని, దాంతో ఈ వివాదం  సద్దుమణుగుతుందనే అభిప్రాయాలు వినిపించాయి. హమ్మయ్య.. సుదీర్ఘంగా సా........గుతున్న ఒక డైలీ సీరియల్ ముగిసిందన్న ఆనందం తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమైంది. రేటింగ్ తగ్గిపోయి అల్లాడుతున్న తెలుగు టీవీ సీరియళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు తమకు మళ్ళీ రేటింగ్ పెరుగుతుందని ఆనందపడ్డారు. అయితే వాళ్ళ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈ దువ్వాడ సీరియల్ కొత్త ఎపిసోడ్‌తో మళ్ళీ మొదలైంది.  ఊహించని విధంగా దువ్వాడ వాణి తన కుమార్తెతో కలసి మళ్ళీ సదరు ఇంటికి వెళ్ళారు. కోర్టు ఆమెకు ఆ ఇంటిలోకి దువ్వాడ వాణి వెళ్ళొచ్చనే ఆదేశాలు ఇచ్చిందట. దాంతో ఆమె ఆ ఇంటి ఆవరణలోనే సెటిలయ్యారు. తలుపులు ఓపెన్ చేస్తే చాలు.. లోపలకి వెళ్ళి అన్నం కూరలు వండేసుకుని, టీవీ చూస్తూ తినడానికి ప్రిపేర్‌గా వున్నారు. ఇంటి లోపల వున్న దివ్వెల వాణి  మాత్రం ఇలాంటి డేంజర్ ఏమీ జరక్కుండా తలుపులు బిగించేశారు. ఇంటి ఆవరణలో కూర్చున్న దువ్వాడ వాణి మీడియాని పిలిపించి రచ్చ చేస్తున్నారు. ఓ యాభై మంది సబ్‌స్క్రైబర్లు వున్న యూట్యూబర్ మైకు పుచ్చుకుని వెళ్ళినా ఆమె తన  ఆవేదన వ్యక్తం చేస్తూ స్టోరీ అంతా చెబుతున్నారు. దువ్వాడ వాణి ప్రస్తుతం చెప్పేది ఏమిటంటే, ‘‘ఈ ఇల్లు నేను ఇచ్చిన డబ్బుతో కట్టించినదే. దీన్ని అమ్మడానికి దువ్వాడ శ్రీనివాస్‌కి హక్కు లేదు. దువ్వాడ శ్రీనివాస్ చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. ఈ ఇల్లు నాది. ఈ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను. అప్పటి వరకు ఈ ఇల్లు వదిలిపెట్టను. కోర్టు కూడా నేను ఈ ఇంట్లో వుండొచ్చని ఆర్డర్ ఇచ్చింది’’ అంటూ స్పష్టంగా చెబుతున్నారు. అందువల్ల తెలుగు టీవీ డైలీ సీరియళ్ళకు మరికొంతకాలం రేటింగ్‌లు వుండవని అర్థం చేసుకోవాలి మరి!

 హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

 హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  హైడ్రా భయంతో ఇక కబ్జాలుండవని న్యాయస్థానం వాఖ్యానించింది. చెరువులు, నాలాలను ఆక్రమించిన వాళ్లు  కొందరు హైకోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జీవో 99 ప్రకారం అక్రమ కట్టాలను హైడ్రా కూల్చి వేసింది. . రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కూల్చివేతలకు తాము అడ్డంకి కాదని కానీ చట్టబద్దంగా జరగాలని ప్రతిపక్షపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాటసాని భార్య కూడా అమీన్ పూర్ చెరువు బఫర్ జోన్ లో కూల్చిన ప్రహారి గోడను పునర్నిర్మాణం చేయాలని  డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో  హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్లలో నివాసముంటున్న వారికి నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.పేద ప్రజల ఇళ్ల కూల్చివేతలను తాము వ్యతిరేకిస్తున్నామని బిజెపి ప్రకటిస్తే,  బడా కాంగ్రెస్ నేతల ఇళ్లను కూల్చేయాలని బిఆర్ఎస్ అంటోంది. జిహెచ్ ఎంసీ , నెక్లెస్ రోడ్డులోని కట్టడాలను కూల్చి  ఫాతిమా కాలేజిని కూల్చేయాలని  మజ్లిస్ పార్టీ డిమాండ్ చేసింది.    ఆదివారం నాడు మరికొన్ని కూల్చివేతలు చేయాలని  ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేని చంపబోయాడా?

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేష్టలు మరీ వింతగా వున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడం, పీఏసీ ఛైర్మన్‌గా ఎన్నికవడం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరికెపూడి గాంధీ మీద విమర్శలు చేశారు. దాంతో ఆయన పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గరకి వెళ్ళి వివాదం సృష్టించారు. పాడి కౌశిక్‌రెడ్డి కూడా నేను మాత్రం తక్కువా అన్నట్టు గాంధీ ఆంధ్రుడు అని, ఎక్కడి నుంచి బతకడానికి వచ్చాడని వ్యాఖ్యానించారు. చినికి చినికి గాలివానలా మారుతున్న ఈ వివాదం హత్యాయత్నం కేసు వరకు వెళ్ళింది. ఆరికెపూడి గాంధీ తన ఇంటికి వచ్చి తన మీద హత్యాయత్నం చేశారని పాడి కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్ళిన వ్యవహారంలో ‘హత్యాయత్నం’ లాంటి పెద్ద సీన్ ఏమీ లేకపోయినా గచ్చిబౌలి పోలీసులు గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తున్న బుద్ధవనం

హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి శ్రీ దాజి కమలేష్ పటేల్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం ఒక అద్భుత బౌద్ధ వారసత్వ ప్రదర్శనశాలయని అంతర్జాతీయ హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి శ్రీ దాజి కమలేష్ పటేల్ అన్నారు. శుక్రవారం నాడు నాగార్జునసాగర్ లోని హార్ట్ ఫుల్ నెస్ (రామచంద్ర మిషన్) కేంద్రాన్ని సందర్శించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రెడ్డి ఆహ్వానంపై శ్రీ దాజి బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధ వనంలోని మహాస్థూపం లోపల బుద్ధుని పరమ పవిత్రమైన దాతు పేటికలను, బౌద్ధాలయాన్ని సందర్శించారు .బుద్ధవనములోని ప్రధాన ఆకర్షణలైన బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, 27 అడుగుల శ్రీలంక అవకన బుద్ధ ప్రతిమ, స్తూప వనాల గురించి ఆయనకు బుద్ధవనం బుద్ధిష్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు .మహస్తుపం చుట్టూ ఉన్న శిలాఫలకాలలోని బుద్ధుని జీవిత ఘట్టాలు, ఆయన సంచరించిన ప్రదేశాలు, బౌద్ధానికి చేయూతనిచ్చిన పోషకులు, జాతక కథలు ఇంకా 1700 సంవత్సరాల తరువాత మళ్లీ జీవం పోసుకున్న అమరావతి శిల్పకళ  ప్రాశస్త్యం పై శివనాగిరెడ్డి శ్రీ బాజీకి వివరించగా ఎంతో ఆసక్తిగా విన్నారు. బుద్ధవనం ఏర్పాటు చేసిన  నేపథ్యాన్ని, బౌద్ధ వారసత్వ విలువలను ఈ తరానికి అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని, ఆచార్య నాగార్జున ని తాత్విక చింతనను వ్యాపింప చెయ్యటానికి తీసుకుంటున్న చర్యలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మరియు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రకాశ్ రెడ్డి ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో జన్కో సీఎం డి రోనాల్డ్ రోస్ ,ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ విశాలాక్షి  , బయో జెన్ కేర్ డైరెక్టర్ బి పార్థసారథి, బుద్ధవనం అధికారి సుధన్ రెడ్డి, మిర్యాలగూడ డి. ఎస్. పి రాజశేఖర్ రాజు, బుద్ధ వనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్రావు తదితరులు పాల్గొన్నారు

కౌశిక్ రెడ్డి, శంభీర్ పూర్ రాజు  హౌజ్ అరెస్ట్ 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయినా అరికెపూడి ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని కౌశిక్ రెడ్డి పట్టబట్టడంతో పోలీసులు హౌజ్ అరెస్గ్ చేశారు. ఆయనతో పాటు శంభీర్ పూర్ రాజు హౌజ్ అరెస్ట్ అయ్యారు.   ప్రస్తుతం కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు ఇంట్లోనే హౌజ్ అరెస్ట్ అయ్యారు. నిన్న కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన కేసులో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీని ఎవన్ నిందితుడిగా చేర్చారు. గత వారం రోజులుగా బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్దం కొనసాగుతూనే ఉంది. నిన్న కౌశిక్ రెడ్డి నివాసంలో హౌజ్ అరెస్ట్ అయితే ఇవ్వాళ మాత్రం శంభీర్ పూర్ రాజు  ఇంట్లో హౌజ్  ఇరువురు అరెస్ట్ అయ్యారు. 

అదానీపై హిండెన్ బర్గ్ మరో బాంబు!

అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక మోడీ అండదండలు, ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి.  అదే సమయంలో అదానీ  అదానీ లక్ష్యంగా  అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్  చేస్తున్న ఆరోపణలు, వెలువరిస్తున్న నివేదికలు  మాత్రం ఆయన వ్యవహార శైలీ, వ్యాపార విస్తరణల వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలకు తావిస్తునే ఉన్నాయి.  ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న అదానీపై హిండెన్ బర్గ్ తాజాగా మరో బంబు పేల్చింది.  అదానీ  మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డారని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఈ విషయం స్విస్ అధికారుల విచారణలో తేలిందని కూడా హిడెన్ బర్గ్ ప్రకటించింది.  అందుకే తమ దేశంలో ఉన్న అదానీ గ్రూప్‌కు చెందిన అనేక బ్యాంక్ అక్కౌంట్లను స్విట్జర్లాండ్ సీజ్ చేసిందని పేర్కొంది. ఇలా పలు స్విస్ బ్యాంక్ అకౌంట్లలలో జమ చేసిన 310 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో  2600 కోట్ల రూపాయల పైనే  సీజ్ అయ్యాయని హిండెన్ బర్గ్ పేర్కొంది. స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్న హిండెన్ బర్గ్ బ్రిటన్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంది.   ఈ వార్త కూడా చదవండి.. అదానీ మహా పతనం వెనుక కుట్ర? అయితే సహజంగానే హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. స్విస్ కోర్టు ప్రొసీడింగ్స్ తో ఎలాంటి సంబంధం లేదన్న అదానీ గ్రూప్, ఆ దేశంలోని తమ బ్యాంక్ అక్కౌంట్లేవీ సీజ్ కాలేదని వివరణ ఇచ్చింది. తమ గ్రూప్ మార్కెట్ విలువను పతనం చేయడానికీ, ప్రతిష్టను దెబ్బతీయడానికి హిండెన్ బర్గ్  ప్రయత్నిస్తున్నదని విమర్శించింది.  మోడీ ప్రధానిగా తొలి సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచే అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించడం ఆరంభమైందన్నది మాత్రం వాస్తవం. అయితే గత ఏడాది  అదానీ    ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, కృత్రిమంగా షేర్ విలువలు పెంచడం, అవినీతి, మనీ లాండరింగ్  తదితర ఆరోపణలు గుప్పిస్తూ హిండెన్ బర్గ్ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ ప్రభావంతో అప్పటి వరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ ఆ తరువాత నెల రోజుల వ్యవధిలోనే 26వ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.  ఆ సమయంలో అదానీ గ్రూపు షేర్ల విలువ సగానికి పైగా పతనమైంది. సరే ఆ తరువాత ఎలాగోలా కోలుకుందనుకోండి. అది వేరే సంగతి అప్పట్లో..  అయినా అదానీ గ్రూపు సంస్థలపై మదుపర్ల విశ్వసనీయత సన్నగిల్లిందన్నది వాస్తవం. అప్పట్లో అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ నివేదిక వెనుక ఉన్నది మరో పారిశ్రామిక దిగ్గజం, విప్రో వ్యవ స్థాపకుడు అయిన ప్రేమ్ జీ అన్న ప్రచారం జరిగినా కూడా మదుపర్లలో అదానీ గ్రూపుపై నమ్మకం కలగలేదు. ఇప్పుడు తాజాగా అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డులను ఉటంకిస్తూ చేసిన ఆరోపణలు మార్కెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరో గ్రేట్ ఫాల్ ను అదానీ గ్రూపు సంస్థలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

24 గంటల్లో పాస్ పోర్టులు అప్పగించండి.. జోగిరమేష్, దేవినేని అవినాష్ కు సుప్రీం ఆదేశం

  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై , చంద్రబాబు నివాసంపై దాడి కేసులలో నిందితులు అయినా దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులలో నిందితులైన వీరిరువురూ ముందస్తు బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ హై కోర్టు వీరి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసినప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న వీరిద్దరూ, ముందస్తు బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదు. అయినా దేవినేని అవినాష్, జోగురమేష్ లు 24 గంటలలో ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులకు తమతమ పాస్ పోర్టులను అప్పగించాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలనీ, దర్యాప్తు అధికారులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వెళ్లాలనీ స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించకుంటే రక్షణ ఉండదని హెచ్చరించింది.  దేవినేని అవినాష్ తెలుగుదేశం కేంద్రకార్యాలయంపై దాడి కేసులో నిందితుడు కాగా, జోగు రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు. 

ప్రేమను పంచే మిలాదున్ నబీ

పాతబస్తీ పురవీధుల్లో నలుగురు కల్సి  రాత్రిపూట చబుత్రాల మీద కూర్చోవడం రివాజు. అక్బర్ , మెహమూద్ ఒక చబుత్రా మీద కూర్చున్నారు.  మెహమూద్ బర్త్ డే ఉండటంతో అక్బర్ పార్టీ అడిగాడు. ‘ క్రాస్ రోడ్ లోని బవర్చీ దాబా వెళదామా...  బిర్యానీ తిందామా ’అని మెహమూద్ ను అక్బర్ అడిగాడు. మరుసటి రోజే మిలాదున్ నబీ ఉంది కదా బర్త్ డే చేసుకోవడం లేదు నేను అని జవాబిచ్చాడు మెహమూద్.  రాత్రి పూట బర్త్ డే చేసుకోవడం ఇస్లాంలో లేదు అని చెప్పాడు మెహమూద్. అదే సమయంలో అక్కడ్నుంచి  వెళుతున్న మౌలానా  చెవిలో  ఈ మాట పడింది. వెంటనే ఆగిపోయాడు. వారిద్దరిని తన దగ్గరికి రమ్మన్నాడు    మిలాదున్ నబీ నేపథ్యంలో  మౌలానా ఒక రోజు తక్రీర్ ( ప్రవచనం) నిర్వహించారు. మిలాదున్ నబీ  అంటే మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సం. అరబ్బీలో జన్మనివ్వడాన్ని మిలాద్ అని సంభోధిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ లో ఈ పండుగ మూడో నెలలో వస్తుంది. ఆ నెల పేరు రబీ ఆల్ అవ్వాల్ అని పిలుస్తారు.  మహమ్మద్ ప్రవక్త పుట్టింది కేవలం ముస్లింల కోసం కాదు సకల జనుల కోసం. మహమ్మద్ ప్రవక్త మతాలకు అతీతమనే చెప్పొచ్చు.  మహమ్మద్ ప్రవక్త పుట్టింది సౌదీ అరేబియాలో  క్రీస్తు శకం 570 నుంచి క్రీస్తు శకం 632 వరకు. ఆయన పుట్టిన రోజు మరణించిన రోజు ఒకే రోజు కావడం గమనార్హం.  మానవాళికి ప్రేమ,  ఐక్యతను పంచిన మహమ్మద్ ప్రవక్త  జన్మదినాన్ని ముస్లింలకు చెందిన షియా, సున్నీ తెగలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.  ఈ పండగ సందర్భంగా ఖురాన్ పఠనం విధిగా పాటించాలి. ప్రార్థనలు జరుపుకుంటారు. అన్నదానాలు, రాత్రిపూట కూడా ప్రార్థనలు నిర్వహించడం సర్వ సాధారణం. ముస్లింలలో సలాఫీ, వహబీ సిద్దాంతాలున్నవారు మిలాదున్ నబీని  పర్వ దినంగా జరుపుకుంటారు.  మెజారిటీ ముస్లిం  ప్రజలు ఇప్పటికీ ఈ రోజును అశుభమైనదిగా భావించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ముస్లింలు దీనిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగలలో మిలాదున్ నబీ  ఒకటిగా మారింది. కొందరు మిలాదున్ నబీ వేడుకలు జరుపుకోవడానికి డబ్బుల్లేవు అంటారు. స్నేహితుల కోసం బర్త్ డే వేడుకలు జరుపుకుంటారు.  భార్య బంగారం కోసం ఖర్చు చేస్తారు. ముస్లింలకు రెండు రకాల  పెద్ద పండుగలు వస్తాయి. ఒకటి ఈదుల్ ఫితర్(రంజాన్) , రెండోది ఈదుల్ అదా(బక్రీద్ ).ఈ రెండు పండలు శుచి, శుభ్రతకు పెద్ద పీట వేస్తాయి.  ప్రతీ శుక్రవారం  ముస్లింలకు చిన్న పండుగ అని చెప్పొచ్చు. ముస్లింల పండగ  ఖురాన్  ప్రకారం పగటి పూట చేసుకోవాలి. రాత్రిపూట పడుకుని సూర్యోదయం కాగానే పండుగలు చేసుకోవాలి. రాత్రిపూట వేడుకలు జరపడం ఇస్లాంలో లేదు. ఇతర మతాలు కొన్ని మిడ్ నైట్ వేడుకలు జరుపుకుంటాయి. ఇది ప్రమాదకరం. రాత్రి పూట వేడుకల్లో మద్యం, మగువ చేరుతుంది. ఇస్లాంలో ఈ రెండూ  నిషేధం. రాత్రిపూట వేడుకలు జరపడాన్నిఇస్లాం వ్యతిరేకిస్తుంది.  అల్లాకే వాస్తే  యైసా మత్ కరో భాయ్ . మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సహాన్ని ఘనంగా జరుపు కోవాలి అని మౌలానా తన తక్రీర్ లో చెప్పారు. ఆ మరుసటి రోజు జరిగే మిలాదున్ నబీ వేడుకలు మహమూద్, అక్బర్ లు ఘనంగా జరిపారు. అన్నదానాలు చేశారు. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు.    (ఈ నెల 17న మిలాదున్ నబీ సందర్బంగా)   - బదనపల్లి శ్రీనివాసాచారి  

ఏపీకి మరో వాయు‘గండం’

ఏపీని వర్షాలు వరదలు వదిలిపెట్టేలా లేవు. భారీ వర్షాలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగండం పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం అప్రమత్తమైంది. వ బంగాళాఖాతంలో సెప్టెంబరు మూడోవారంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రంవైపు కదిలే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ఈ నెల చివరి వారంలో ఆంధ్రప్రదేశ్ లో మరో మారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.   కేదార్ నాథ్ లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు ఇక పోతే భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్ నాథ్ లో దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుకున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటం, భోజనం కూడా లేకపోవడంతో గత రెండు రోజులుగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వచ్చేందుకు ఎటువంటి రవాణా సదుపాయం లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో వారిని క్షేమంగా రాష్ట్రాలనికి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం ప్రయత్నాలు ప్రారంభించింది. హెలికాప్టర్ ను పంపేందుకు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుున్నారు. ఇలా ఉండగా తెలుగుదేశం ఎంపీ అప్పలనాయుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని క్షేమంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని ఆయన అన్నారు.  

కౌశిక్ రెడ్డిపై కేసు... విధులకు ఆటంకం కలిగించినందుకే

తెలంగాణ రాజకీయాలు మరోమారు రంజుగా మారాయి. కాంగ్రెస్ , బిఆర్ఎస్ నేతల మాటలు ఉద్రిక్తతకు దారితీసాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న మాటలయుద్దం చర్చకు దారితీసాయి.. నిన్న అరికెపూడిగాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఎగరేస్తానని సవాల్ చేసిన కౌషిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ అయ్యారు. బిఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు నివాసంలో నుంచి బయలు దేరబోతున్న  కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అనుమతి ఇచ్చిన పోలీసులు తనకు  ఎందుకు  ఇవ్వడం లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  మా ఎమ్మెల్యేను నేను కలిస్తే మీకు ఇబ్బంది ఏమిటి? అరికెపూడి నన్ను లంచ్ కు పిలిచాడు వెళ్లనివ్వండి అని కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  తమ విధులకు ఆటంకం కలిగించినందుకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేజ్రీవాల్ కు బెయిలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  అరెస్టైన కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే. ఢిల్లీ మద్యం కుభకోణం కేసు విచారణ సమీప భవిష్యత్ లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కాగా కేజ్రీవాల్ సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారనీ, సాక్ష్యులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనలను సర్వోన్నత న్యాస్థానం తోసిపుచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలూ చేయరాదని కేజ్రీవాల్ కు షరతు విధించింది. కేజ్రీవాల్ పై ఈడీ నమోదు చేసిన కేసులో గతంలోనే బెయిలు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు బెయిలు మంజూరైంది. కాగా కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేస్తూ ఈడీ కేసులోని షరతులే ఇప్పుడు కూడా వర్తిస్తాయని పేర్కొంది.  

హరీష్ రావు సహా పలువురు మాజీ మంత్రుల హౌస్ అరెస్టు

గత రెండు రోజులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మధ్య  జరుగుతున్న మాటలయుద్ధం ముదిరి గురువారం (సెప్టెంబర్ 12) పాకాన పడిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల అంశంపై సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం సాగుతున్నది. గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానని కౌశిక్‌ శపథం చేశారు. అయితే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు, కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో గురువారం దాదాపు గంటన్నరపాటు అక్కడి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత సైబరాబాద్‌ కమిషనరేట్‌కు హరీశ్‌, కౌశిక్‌ తరలించారు. ఇలా గురువారం అంతా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇలా ఉండగా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు నిచ్చారు. శుక్రవారం (సెప్టెంబర్ 13) గాంధీ ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. దీనిపై హరీష్ రావు మండి పడ్డారు. తమ పార్టీ నేతల హౌస్ అరెస్టును ఖండించారు. అరెస్టు చేసిన నేతలు, శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.  ఇలా ఉండగా పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ రాయదుర్గం పోలసులు బీఎన్ఎస్ యాక్ట్ 132, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

జగన్ కు నో పాస్ పోర్టు.. లండన్ టూర్ క్యాన్సిల్?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీతయ్యలాంటి వారు. ఎవరి మాటా వినరు. చివరికి ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా ఖాతరు చేయరు. ఎవరిమాటా వినని జగన్ కు సలహాదారులెందుకో మరి అని పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడెందుకీ ప్రస్తావన అనకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి కాదు. దాంతో ఆయనకు డిప్లమేటిక్ పాస్ పోర్టు రద్దైపోయింది. అయితే పాస్ పోర్టు రెన్యువల్ కు హైకోర్టు అనుమతించింది.  జగన్ పాస్ పోర్టును ఆయన కోరిన విధంగా  ఐదేళ్ల రెన్యువల్ కు ఆమోదం తెలిపింది. దీంతో జగన్ లండన్ యానానికి అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు.  అయితే జగన్ కు ఐదేళ్ల పాస్ పోర్టు కు అనుమతించిన హైకోర్టు.. కింది కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అదీ నిబంధనల ప్రకారం ఆయన స్వయంగా కోర్టుకు వెళ్లి మరీ పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది.  అయితే జగన్ ఎవరి మాటా వినే రకం కాదు కదా!  అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి వచ్చిన ఆయనకు ఇప్పుడు కోర్టుకు వెళ్లడం చిన్నతనంగా అనిపించింది. అయినా తనపై కేసుల విచారణకే కాదు.. కోడికత్తి కేసులో బాధితుడిగా కోర్టుకు  హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన కోర్టు మెట్లక్కడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించేందుకు కోర్టుకు వెళ్లేందుకు ఆయన సుతరామూ ఇష్టపడటం లేదు. అందుకే ఆయన పాస్ పోర్టు ఇప్పటికీ రెన్యువల్ కాలేదు. కోర్టు తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా.. ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించలేదు. ఈ లోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఆయన లండన్ పర్యటనకు కారణంగా చెప్పిన కుమార్తె పుట్టిన రోజు అయిపోయింది.  దీంతో ఆయన లండన్ యాత్ర రద్దైనట్లేనని భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన లండన్ వెళ్లాలన్నా మరో కారణం చూపాలి.  మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవాలి.  కచ్చితంగా ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోర్టులో కౌంటర్ అఫడివిట్ దాఖలు చేస్తుంది. మళ్లీ వాదనలు తప్పవు. అప్పుడైనా ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందే. అందుకు ఆయన సుముఖంగా లేరు. దీంతో జగన్ ఇక విదేశీయానం అన్న మాటే ఎత్తకపోవచ్చు. 

 అరికెపూడిపై కేసు నమోదు చేయాలి: హరీష్ రావు 

బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ మండిపడ్డారు. కౌషిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్  చేసిన పోలీసులు ఎమ్మెల్యే అరికపూడి అనుచరులు కౌశిక్ రెడ్డిపై  దాడి చేసినప్పటికీ నిలువరించలేకపోయారని హరీష్ రావ్ అన్నారు. అరికెపూడిపై ఎప్ఐఆర్ నమోదయ్యే వరకు ఇక్కడనుంచి కదిలేది లేదని ఆయన సైబరాబాద్ పోలీసులను హెచ్చరించారు. అరికెపూడిపై హత్యాయత్నం కేసు పెట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి ఇంటి గోడ దూకి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు బహుకరిస్తానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు పట్టారు. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్ ముట్టడించారు. లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.