బుంగమూతి పెట్టుకున్న లక్ష్మీపార్వతి!

లక్ష్మీపార్వతి అలిగారు.. బుంగమూతి పెట్టుకున్నారు. జగన్ తనను చిన్నచూపు చూస్తున్నారని హర్టయ్యారు. ఇంత అనుభవం వున్న తనను పక్కనపెట్టి, ఎంతమాత్రం రాజకీయ అనుభవం లేని వాళ్ళకి పదవులు ఇచ్చారని తెగ ఫీలైపోతున్నారు. తన బాధనంతా సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తూ, తనను అందరూ చిన్నచూపు చూస్తున్నారంటూ లబోదిబో అంటున్నారు. ఇంతకీ మేడమ్ గారు ఇంతలా ఫీలైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల వైసీపీ పార్టీకి సంబంధించిన పదవులను జగన్ ప్రకటించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితర పెద్ద తలకాయలకు పదవులు ఇచ్చారు. వాళ్ళతోపాటు ఒక చిన్న తలకాయ అయిన యాంకర్ శ్యామలకి కూడా ఒక పదవి ఇచ్చారు. అదికూడా ‘అధికార ప్రతినిధి’ లాంటి ప్రాధాన్యం వున్న పదవి ఇచ్చారు. ఇది లక్ష్మీపార్వతిని బాగా బాధపడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు మీద విషం కక్కే విషయంలో జగన్ ఆశయాలకు అనుగుణంగా తాను పని చేస్తున్నప్పటికీ తనకు పదవి ఇవ్వకుండా, శ్యామలలాంటి రాజకీయానుభవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని లక్ష్మీపార్వతి జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. ఈమధ్య కాలంలో లక్ష్మీపార్వతిని జగన్‌కి చెందిన టీవీ డిబేట్లకు కూడా పిలవటం లేదని తెలుస్తోంది. లక్ష్మీపార్వతి తిట్లు జనానికి రొటీన్ అయిపోయాయని, చంద్రబాబును లక్ష్మీపార్వతి విమర్శిస్తుంటే జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆమెను జగన్ టీవీకి దూరంగా పెట్టాలరని తెలుస్తోంది. చంద్రబాబు విషయంలో అగౌరవంగా మాట్లాడుతున్నందుకు గతంలో లక్ష్మీపార్వతికి నెలనెలా ఇచ్చిన గౌరవ వేతనాన్ని కూడా జగన్ పార్టీ బంద్ చేసినట్టు తెలుస్తోంది. గౌరవ వేతనం ఆగిపోవడం, పదవి ఇవ్వకపోవడం, తనను పక్కన పెట్టేయడంతో లక్ష్మీపార్వతి ఫ్రస్టేషన్లో వున్నట్టు తెలుస్తోంది.

బుగ్గన గారి నాన్‌లోకల్ పాలిటిక్స్!

వైసీపీలో మంచి వాగ్ధాటి ఉన్న నాయకులలో  మాజీ మంత్రి బుగ్గన ముందు వరుసలో ఉంటారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అంటే జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా బుగ్గన పీఏపీ చైర్మన్ గా వ్యవహరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన కేవలం ఢిల్లీలో కూర్చుని జగన్ ప్రకటించిన ఉచిత పథకాలు నెరవేర్చుందుకు  అప్పులు సంపాదించడం అన్న పనికే పరిమితమయ్యారు. అది వేరే సంగతి. దీంతో బుగ్గన ప్రతిష్ఠ మసకబారింది. ప్రజలలో పలుచన అయ్యారు. దాంతో 2024 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో వైసీపీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారం కోల్పోవడమే కాదు.. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలిపోయింది. ఆ పార్టీ తరఫున కేవలం 11 మంది మాత్రమే ఎన్నికయ్యారు. సరే ఆ సంగతలా ఉంచితే... ఓటమి తరువాత బుగ్గన తన నియోజకవర్గాన్నే కాదు, రాష్ట్రాన్ని కూడా వదిలేశారు. ఓటమి తరువాత ఇప్పటి వరకూ రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఆయన ఇప్పటి వరకూ రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. ఆ రెండు సార్లూ కూడా ఆయన హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ పెట్టారు. మొదటి సారి అసెంబ్లీలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలపై మాట్లాడారు. రెండో సారి తాజాగా సోమవారం (సెప్టెంబర్ 16)న మీడియాతో మాట్లాడారు. ఈ సారి ఆయన పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదంపై మాట్లాడారు. పోలవరం సవరించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేయడాన్ని తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయనకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే హక్కు ఉంది. దానిని ఎవరూ కాదనరు. అయితే ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి హైదరాబాద్ లోనే మీడియా సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్న దానికి బుగ్గన సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఓటమి తరువాత ఇంత వరకూ ఒక్కసారి కూడా సొంత నియోజవర్గంలో అడుగుపెట్టని బుగ్గన తగుదునమ్మా అని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏపీ సర్కార్ పై విమర్శలు గుప్పించడంలో ఆంతర్యమేమిటన్నది ఆయన చెప్పాల్సి ఉంది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్ తాను స్వయంగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటూ పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు నియోజకవర్గాలను వదిలేసి హైదరాబాద్ లో ఉంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ రివ్యూ మీటింగ్ లో నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారంటూ జగన్  పార్టీ నేతలపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయినా పార్టీ నేతలెవరూ ఖాతరు చేసిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీ ఓటమి తరువాత హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు మకాం మార్చేశారు. వారిలో చాలా మంది అరెస్టు భయంతో వణికి పోతున్నారు. ఇక బుగ్గన అందుకు మినహాయింపేమీ కాదు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకల్లో బుగ్గన చాలా చాలా కీలకం. ఆర్థిక మంత్రిగా ఆయన పాత్రే కీలకం ఆ కారణంగానే బుగ్గన కూడా అరెస్టు భయంతోనే ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.  

ఒకే రోజు 13 వేల 326 గ్రామ సభలు .. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు

పని చేయాలన్న చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉండాలే కానీ.. ప్రభుత్వాలు అద్భుతాలు చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నది. ముఖ్యంగా తొలి సారి మంత్రి పదవి చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన శాఖ పని తీరును గణనీయంగా మెరుగుపరిచారు.   ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒకే రోజు 13 వేల 326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ఈ ఘనతను గుర్తించింది. ఆ యూనియన్ ప్రతినిథులు సోమవారం (సెప్టెంబర్ 16) హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు ఒక సర్టిఫికెట్, మెడల్ బహూకరించారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి,  పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించి పూర్తిగా వంద రోజులు కూడా కాలేదు. వంద రోజులలోపుగానే ఒకే రోజు 13 వేల 326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం విశేషం.  

జగన్ జెండా పీకేయడం ఖాయం.. బాలినేని ఉవాచ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండా పీకేయడానికి రెడీ అయిపోయారా?  వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇక లాంఛనమేనా? అన్న అనుమానాలు గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయిన జగన్ ఆ లాంఛనం పూర్తి చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయన సోదరి షర్మిల అడ్డుపడుతున్నారనీ వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఆ కారణంతోనే జగన్ అడపదడపా ఆందోళనలకు, తన హయాంలో అడ్డగోలుగా అక్రమాలకు, దాడులకు, దౌర్జన్యాలకూ పాల్పడి ఇప్పుడు అరెస్టయిన వారిని పరామర్శించేందుకు తప్ప తాడేపల్లి ముఖమే చూడటం లేదని అంటున్నారు. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై అక్కడ నుంచి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివప్రసాద్ ద్వారా కాంగ్రెస్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారనీ అంటున్నారు. అయితే నిన్నటి వరకూ ఇవి కేవలం ఊహాగాన సభలు మాత్రమే. అయితే ఇప్పుడు జగన్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయారని, ఇవ్వాళ కాకుంటే రేపు ఆ లాంఛనం పూర్తికావడం ఖాయమనీ తేలిపోయింది. జగన్ విలీన ప్రయత్నాల గురించి ఆ పార్టీ సీనియర్ నేత, స్వయంగా జగన్ కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డే కుండబద్దలు కొట్టేశారు. ఏదో లోపాయికారీ సంభాషణల్లోనే, వ్యక్తిగత బాతాఖానీలోనో ఆయనీ మాటలు చెప్పలేదు. పార్టీలోని తన వర్గం వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనీ మాటలు చెప్పారు. అసలు ఇప్పటికే విలీన ప్రక్రియ పూర్తై ఉండేదనీ, కానీ జగన్ సోదరి షర్మిల గట్టిగా అడ్డుపడటంతో అది వాయిదా పడిందని బాలినేని చెప్పారు. ఇప్పుడు కాకపోతే రేపు, ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది.. వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడానికి కూడా డీకే శివకుమార్ మధ్యవర్తిత్వమే కారణం. ఇప్పుడు జగన్ కూడా సోదరి బాటనే అనుసరిస్తూ.. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆయననే ఆశ్రయించారు. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చినా, షర్మిల అభ్యంతరం కారణంగా విలీన ప్రక్రియకు బ్రేక్ పడిందని బాలినేని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం,  అటు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్రపోషిస్తుండటంతో బలమైన జాతీయ పార్టీ అండ లేకుండా మనుగడ కష్టమన్న భావనకు జగన్  రావడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.  తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో జాతీయ పార్టీ సాయం లేనిదే  బతికి బట్టకట్టటం కష్టమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ మనుగడ పూర్తిగా భాగస్వామ్య పక్షాలు అందునా తెలుుగదేశంపై ఆధారపడి ఉంది. సొంతంగా పూర్తి బలం లేని బీజేపీ ప్రభుత్వ మనుగడ విషయంలో తెలుగుదేశం, జేడీయూలపైనే ఆధారపడి ఉంది. బీజేపీ అయితే జేడీయూ కన్నా తెలుగుదేశం పార్టీనే విశ్వసనీయ ప్రతిపక్షంగా భావిస్తోంది. చంద్రబాబు విజన్, విశ్వసనీయత కారణంగా అకారణంగా, రాజకీయ లబ్ధి కోసం ఆయన కూటమి నుంచి వైదొలిగే అవకాశాలు లేవనీ, ఆయన కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు  కేంద్రంలోని కూటమి ప్రభుత్వం భంగం వాటిల్లేలా వ్యవహరించనంత వరకూ చంద్రబాబు కూటమికి మద్దతుగానే ఉంటారన్నది బీజేపీ నమ్మకం. ఆ కారణంగానే జగన్ కు కేసుల నుంచి రక్షణ విషయంలో బీజేపీ ఏ మాత్రం సహకారం అందించే అవకాశాలు లేవు. అదే సమయంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ పంచన చేరితే.. తనపై కేసుల విచారణ వేగవంతం కాకుండా కేంద్రంపై పొలిటికల్ ప్రెషర్ తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్దేశంతోనే జగన్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తహతహలాడుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలన్నీ నూటికి నూరు పాళ్లూ వాస్తవమే అనడానికి తాజాగా బాలినేని తన అనుచరులు, అనుకూల కార్పొరేటర్లతో జరిపిన సమావేశంలో వైసీపీ కాంగ్రెస్ విలీనం నిజమేనని చెప్పడమే తార్కాణం. 

ఐఏఎస్‌లను అయ్య.. ఐపీఎస్‌లను కొడుకు ముంచారు!

అధికారులు అధికారంలో ఉన్న వారితో అంటకాగి.. వారి కోసం అడ్డగోలు పనులు చేస్తే పర్యవసానం అనుభవించక తప్పదని పలు మార్లు రుజువైంది. తాజాగా కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కూడా ఆ అధికారులు నిబంధనలను పట్టించుకోకుండా ఏలిన వారి కళ్లల్లో ఆనందం చూడడమే తమ జన్మకు సార్థకత అన్నట్లు ప్రవర్తించిన కారణంగానే ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు.  సాధారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలా మంది సవిల్ సర్వీసెస్ గోల్ గా ఎంచుకోవాలని భావిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన వారు యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు. సివిల్స్ సాధించడం కోసం వారెలా కృషి చేశారు. రోజుకు ఎన్నిగంటల పాటు చదివారు. ఎలా విజయం సాధించారు ఇత్యాది విషయాలను ఎంతో ఆసక్తిగా వింటారు. చదువుతారు. అయితే అలా సివిల్స్ సాధించి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు తమ స్థాయికి తగని పనులు చేస్తే మాత్రం ప్రజలలో వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పరపతి, పలుకుబడి ఉండదు. ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పరిస్థితి కూడా అదే.   జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిల సస్పెన్షన్ ఆర్డర్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతకం చేశారు. వీరు ముగ్గురూ కూడా గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాధికారులుగా కాక వైసీపీ కార్యకర్తలుగా పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విశ్లేషకులు వీరిని ఐపీఎస్ లుగా కాకుండా వైపీఎస్ లుగా అభివర్ణించేవారు. అయితే ఇప్పుడు మాత్రం వారు తమ స్థాయికి తగని, నిబంధనలు అంగీకరించని రీతిలో వైసీసీ అగ్రనాయకత్వం మెప్పు కోసం అడ్గగోలుగా వ్యవహరించారనడానికి తిరుగులేని సాక్ష్యం దొరకడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.  ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం అనేది ప్రభుత్వానికి అంత తేలిక ఏమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకూ ఐఏఎస్ లేదా ఐపీఎస్ లు సస్పెండైన ఘటన ఇది రెండోది మాత్రమే. ఇంతకు ముందు గుజరాత్ లో షహ్రాబుద్దీన్ కేసులు ఇలా అధికారులు సస్పెండయ్యారు. ఆ తరువాత ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండయ్యారు.  ఏపీలో తాజాగా సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ లూ అధికారులు తాము చేసిన తప్పిదం కారణంగానే అడ్డంగా బుక్కయ్యారు.  సినీనటి కాదంబరి జత్వానీపై వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేయడానికి ముందే ఐపీఎస్ అధికారులు ఆమెను అరెస్టు చేయడానికి ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ ముగ్గురు అధికారుల సస్పెన్ష్ ఆర్డర్ ను బట్టి అప్పటి ఐంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పటి విజవాడ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సీఎంవో కార్యాలయానికి పిలిపించుకుని కాదంబరి జత్వానీని ముంబై నుంచి తీసుకురావలసిందిగా ఆదేశించారు.  కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలూ పరిశీలించకుండానే, శ్రద్ధ పెట్టకుండానే జత్వానీని ముంబై నుంచి తీసుకురావడాన్ని తీవ్రమైన అధికార దుర్వినియోగంగా ప్రస్తుత ప్రభుత్వం భావించి వారిపై సస్సెన్షన్ వేటు వేసింది. అంతుకు ముందే  డీజీపీ నివేదిక ఆధారంగా ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ముగ్గురు ఐపీఎస్ లను సర్కార్ సస్పెండ్ చేసింది. కొసమెరుపేంటంటే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ క్విడ్ ప్రొకొకు సహకరించి  ఐఏఎస్ అధికారులు కొందరు జైలు పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అడ్డగోలుగా కేసులు, అరెస్టులకు పాల్పడి ఐపీఎస్ అధికారులు సస్పెండయ్యారు. ఇప్పుడు జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు పర్యవసానం అనుభవించక తప్పదు. విచారణ ఎదుర్కొని దోషులుగా తేలితే కటకటాల పాలు కాకా తప్పదు.  

 సిఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కును  ఇచ్చిన చిరంజీవి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని   ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోమవారం కలిసారు. సిఎంరిలీఫ్ పండ్ కు 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తన కుమారుడు రాంచరణ్ తరపున కూడా 50 లక్షల చెక్కును సిఎంరిలీఫ్ ఫండ్ కు అంద జేశారు. చిరంజీవి సచివాలయానికి వచ్చినప్పుడు  మంత్రి  సీతక్క కూడా అక్కడే  ఉన్నారు చెరో రెండు చెక్కులను అంద జేయడానికి వచ్చిన మెగాస్టార్ తో రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. యుపిఎ హాయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా పని చేసిన సంగతితెలిసిందే. వీరి భేటీలో  తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.  ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లో వచ్చిన చిరంజీవి ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి పదవిని అధిరోహించారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్నిపునరుద్దరించుకోని చిరంజీవి ఆ పార్టీకి దూరమయ్యారు.  రాజీనామా చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేదు. ఎపిలో  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన   కూటమి ప్రభుత్వానికి మద్దత్తు పలికారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన జనసేన 21 స్థానాలు పోటీ చేసి అన్ని స్థానాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల కంటే సినిమాల మీద కాన్ సన్ ట్రేట్ చేస్తున్నారు. 

 ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక కేసు 

ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది.   తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూనియర్ డ్యాన్సర్(21) ఒకరు  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఢీషో ద్వారా టాలివుడ్ లో అడుగుపెట్టటిన  కొరియాగ్రాఫర్ అనతి కాలంలో మంచి గుర్తింపు పొందారు అగ్రహీరోలకు కొరియాగ్రాఫర్ గా పని చేశాడు.  ఔట్ డోర్ షూటింగ్స్ కోసం  ముంబై, చెన్నయ్ వంటి నగరాలకు వెళ్లినప్పుడు  తనను పలుమమార్లు అత్యాచారం చేశాడని ఆమె  పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగ్ లో ఉంటున్న తన ఇంటికి కూడా తరచూ వస్తూ లైంగికంగా వేధించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ కేసు నమోదు చేశారు.  విచారణ కోసం ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బిఎన్ఎస్ (370) సెక్షన్ క్రింద జాని మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. 506,323 లోని క్లాజ్ 2. క్లాజ్ 2ఎన్  సెక్షన్ల క్రింద వేర్వేరు కేసులు నమోదయ్యాయి.  జానీ మాస్టర్ పై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి.   

చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నారు.. ఎవరా ముగ్గురు?

వరద సమస్య తగ్గుముఖం పడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన మీద పూర్తి దృష్టి పెట్టబోతున్నారు. సోమవారం నాడు చంద్రబాబు గుజరాత్ పర్యటనకి వెళ్ళి వచ్చాక, వీలు చూసుకుని ఒకటీ రెండు రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇదేదో రొటీన్‌గా జరిగే భేటీ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 20వ తేదీతో వంద రోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల పాటు ఏయే ఎమ్మెల్యే ఎలాంటి పనితీరు కనబరిచారు అనే అంశం మీద వారి దగ్గర్నుంచే చంద్రబాబు సమాచారం తీసుకుని, రివ్యూ చేయబోతున్నారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు మీద చంద్రబాబు ఆగ్రహంగా వున్నట్టు సమాచారం. ఒక మహిళా ఎమ్మెల్యే భర్త తీరు మీద చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. ఆ మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నుంచి షాక్ పొందబోతున్నారు. ఆ ముగ్గురు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయిగే కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం కార్యకర్తలను పట్టించుకోకుండా వైసీపీ కార్యకర్తలను వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిని కూడా చంద్రబాబు హెచ్చరించనున్నట్టు తెలుస్తోంది.  షాకింగులు, వార్నింగుల సంగతి అలా వుంచితే, చంద్రబాబు త్వరలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభవార్తలు కూడా వినిపించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మొదటగా 18 కార్పొరేషన్లకు ఛైర్మన్ల పేర్లను ప్రకటించే అవకాశం వుంది. అలాగే మిగతా అన్ని నామినేటెడ్ పదవులను దసరా లోపు భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

మాదాపూర్ మైహోం గణేషుడి లడ్డూ రూ.29 లక్షలు

గణేష్ ఉత్సవాలను వేడుకగా నిర్వహించిన అనంతరం గణేషుడి లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. కమ్యూనిటీలలోనూ, వీధులలోనూ, వాడవాడలా గణేష మంటపాలు ఏర్పాటు చేసి గణేష్ చతుర్ది నుంచి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తరువాత గణేష నిమజ్జనం జరుగుతుంది. ఆ నిమజ్జనానికి ముందు మండపాలలో గణేషుని లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీ. ఇప్పటి వరకూ గణేష్ లడ్డూ వేలం విషయంలో బాలాపూర్ గణేషుడు బాగా పాపులర్. బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం ధర ఏటికేడు పెరుగుతూ వస్తోంది. ఒక్క జంట నగరాల జనమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలూ కూడా బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో ఎంత ధరకు వెళ్లిందన్న విషయంపై ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా మాదాపూర్ మైహోంలో ఏర్పాటు చేసిన గణేష్ మంటపంలో లడ్డూ వేలంలో  ఇప్పటివరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లడ్డూగా.. బాలాపూర్ గణేషుని లడ్డూ మాత్రమే ఉండేది. కాగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు   మాదాపూర్ మైహోమ్ భుజాలో గణేషుని లడ్డూకు నిర్వహించిన వేలానికి విశేష స్పందన లభించింది. హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూ రూ.29లక్షలు పలికింది. దీంతో బాలాపూర్ గణేషుడిని మించి అత్యంత ఖరీదైన లడ్డూగా మైహోం భుజా అపార్ట్ మెంట్స్ గణేషుడు కొత్త రికార్డు సృష్టించారు.  

ఇది సాఫ్టువేర్ ఇంజనీర్ అనబడే ఓ సుద్దపూస కథ!

కొంతమంది మోసపోవడానికే పుడతారు. పెద్దగా చదువుకోనివారి కంటే, బాగా చదువుకుంటున్నాం... బోలెడంత సంపాదిస్తున్నాం... మోడ్రన్‌గా జీవిస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చేవారే గోతిలో పడుతున్నారు. ఎంత వెర్రిబాగులవాడు అయినా ఆ రకంగా మోసపోరు గానీ.. బాగా చదువుకున్నవారు, సాఫ్ట్.వేర్ ఇంజనీర్లం అంటూ పోజులు కొట్టేవారు వాళ్ళు మాత్రం చాలా సిల్లీగా మోసపోతున్నారు. ఇలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. లేటెస్ట్.గా ఒక సాఫ్ట్.వేర్ ఇంజనీర్ చాలా సాఫ్ట్.గా మోసపోయాడు. అది కూడా సైబర్ మోసం. సంప్రదాయినీ... సుద్దపూసనీ అయిన సదరు సాఫ్ట్.వేర్ ఇంజనీర్ ఎలా మోసపోయాడో తెలుసుకుందాం. తిరుపతిలో సాఫ్ట్.వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడికి ఈనెల ఐదో తారీఖునాడు కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేశారు. తమను తాము సైబర్ క్రైమ్ పోలీసులుగా చెప్పుకున్నారు. నువ్వు ఇరాన్‌కి అక్రమంగా వస్తువులు సరఫరా చేశావ్.. ఠాఠ్.. ఠూఠ్.. అన్నారు. ఈ కేసు మీద విచారణ జరపడానికి నువ్వు వెంటనే ముంబై రావాలని చెప్పారు. సర్లేగానీ, నీ బ్యాంక్ ఖాతా వివరాలు, నీ ఫోన్‌కి వచ్చే ఓటీపీ ఇవ్వు అన్నారు. దాంతో ఈ సాఫ్ట్.వేర్ బుద్ధావతారం వాళ్ళు చెప్పినట్టే అన్ని వివరాలూ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ సాఫ్ట్.వేర్ సార్‌కి ఓ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు మా బ్యాంక్ నుంచి 13 లక్షల 80 వేల రుణం తీసుకున్నావనేది ఆ ఫోన్ సారాంశం. దాంతో షాకైపోయిన ఆ సాఫ్ట్.వేర్ సుద్దపూస చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఏం చేస్తారు? కేసు పెడతారు. ఈయన గారు తెలివితక్కువగా మోసపోతే, పోలీసులు తంటాలుపడి ఈయన గారిని రక్షించేసేయాలి. అంతేగా? చదువుకుంటే సరిపోదు...!

సెప్టెంబర్ 17 వివాదానికి రేవంత్ ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనా?

తెలంగాణకు సంబంధించినంత వరకూ  సెప్టెంబర్ 17 వ తేదీకి ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.  ఎందుకంటే అదే తేదీన నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యం   భారత యూనియన్  అధీనంలోకి వచ్చింది. అయితే  మొదటి నుంచి హైదరాబాద్ సంస్థానం భారత్ లో  విలీనమైన రోజును గుర్తించే విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.  విమోచననా , విలీనమా , విద్రోహమా అనే చర్చ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చర్చకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేసినట్లుగానే కనిపిస్తోంది. రేవంత్ నిర్ణయం ఆయన రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిరుత్తురులను చేసేసిందనే చెప్పాలి. రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సెప్టెంబర్ 17ను విమోచన దినం, విలీనదినం అన్న వివాదం జోలికి వెళ్లకుండా హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన తేదీని   ప్రజా పాలనా దినోత్సవంగా పరిగణిస్తామని ప్రకటించడం ద్వారా సెప్టెంబర్ 17 చుట్టూ ఉన్న వినవాదానికి తెరదించేశారనే చెప్పాలి.   హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని ప్రాంతాలు రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా కర్ణాటకలోనూ కలిశాయి. దాంతో కర్నాటక ప్రభుత్వం ఆ తేదీని అధికారికంగా గుర్తించింది.  అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వాలు గానీ, రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలంగాణ కానీ  విమోచన పేరు మీద కానీ, విలీనం పేరుతో కానీఉత్సవాలు నిర్వహించ లేదు. అందుకు కారణాలు లేకపోలేదు.  బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి లభించింది. అయితే హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం భారత యూనియన్ లో విలీనం చేయడానికి నిరాకరించారు. స్వతంత్ర రాజ్యం గుర్తింపు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే హైదరాబాద్   విలీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సైనిక చర్యకు దిగింది. దాంతో నిజాం 1948 సెప్టెంబర్ 17వ తేదీన సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్  ముందు లొంగిపోయారు. అయితే, కమ్యూనిస్టులు 1951 అక్టోబర్ 20వ తేదీ వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు.  భారత యూనియన్ సైనిక చర్య వెనక కేవలం నిజాం ప్రభువును లొంగదీసుకోవడమే కాదు, కమ్యూనిస్టు లను అణచివేసే వ్యూహం, ప్రణాళికా  కూడా ఉంది.  అందులో భాగంగానే నిజాం ప్రభువును లొంగదీసుకుని భారత యూనియన్ లో విలీనం చేసుకుని కమ్యూనిస్టులను తుడిచిపెట్టే చర్యకు దిగింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపీ డిమాండ్ చేస్తూ వస్తున్నది.   అయితే, బిజెపికి తెలంగాణ పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేదని, అందుకే ఆ పార్టీకి విమోచన దినోత్సవంగా జరిపే హక్కుల లేదన్నది వామపక్షాల వాదన.   విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించడానికి అధికారంలో ఉంటూ వచ్చిన అన్ని పార్టీలకు కూడా చిక్కులు తెచ్చి పెట్టే విషయమే. మజ్టీస్ లేదా ఎంఐఎం విమోచన దినంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తుంది. మెజారిటీ ముస్లింలకు కూడా అది మింగుడు పడని విషయం. ముస్లింల ఓటు బ్యాంక్ ను కోల్పోతామనే భయంతో అధికారంలో ఉన్న పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా నిర్వహించడానికి సిద్ధంగా లేవు. ఇందుకు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతీతం కాదు. అయితే, సెప్టెంబర్ 17వ తేదీని ఏదో రూపంలో గుర్తించాల్సిన పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిలోనే సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పాలనా దినోత్సవంగా పరిగణిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  మొత్తం మీద, సెప్టెంబర్ 17వ తేదీకి ప్రాముఖ్యం ఇస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన  వివాదానికి తెరదింపేసిందనే భావించవచ్చు.

కేజ్రీవాల్ రాజీనామా.. ముందస్తు తథ్యం!?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.  ప్రజలు మళ్లీ తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చేవరకూ తాను సీఎం చెయిర్ లో కూర్చునేది లేదని తేల్చేశారు. ప్రజా తీర్పునకు కట్టుబడి ఉంటానని, ఒక వేళ వారు తనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినా దానికి కట్టుబడి ఉంటాననీ, ప్రజా తీర్పును శిరసావహిస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిలుపై విడుదల అయిన తరువాత ఆయన ఢిల్లీలో ని పార్టీ కేంద్ర కార్యా లయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలోనే రాజీనామా ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోప ణలను ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్.   ఆరు నెలల పాటు తీహార్ జైలులో గడిపారు.   బెయిల్ లభించిన రోజు రాత్రే తీహార్ జైలు నుంచి విడుదలైన  అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రి ఆతిషీ, ఎంపీ సంజయ్ సింగ్, ఇతర నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు.  అనంతరం కేజ్రీవాల్  పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని అన్నారు.  బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా  ఆధారరహితఆరోపణలేనన్న విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాననీ,  అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నననీ చెప్పారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు భావిస్తే ఓటు వేస్తారని, అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. మొత్తం మీద తన నిర్ణయంతో కేజ్రీవాల్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ప్రజలు ఓటేస్తే తనను వారు నిర్దోషిగా ప్రకటించినట్లే. అప్పుడు పదవి చేపడతారు.ఇప్పుడు మాత్రం తన రాజీనామా ప్రకటన ద్వారా ప్రజల నుంచి సానుభూతి లభించడం మాత్రం ఖాయం.  తన రాజీనామా ప్రకటనతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రజా మద్దతుతో పదవీ బాధ్యతలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఓ మూడు నాలుగు నెలల పాటు సీఎం పదవికి దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయ కుట్రలో భాగంగానే తనను బీజేపీ మద్యం కుంభకోణం కేసులో ఇరికించిందన్న సందేశాన్ని ఆయన బలంగా ప్రజలకు ఇవ్వగలుగుతారు. ఢిల్లీ వంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన తనకున్న పరిమిత అధికారాలతోనే పాలనలో తనదైన ముద్ర వేశారు. ఆ విషయంలో హస్తిన ప్రజలకు ఆయనపై అభిమానం ఉంది. పైగా అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా రాజకీయాలలోకి వచ్చిన కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలను జనం పెద్దగా నమ్మిన దాఖలాలు లేవు. ఆయన బెయిలుపై విడుదల కాగానే చేసిన రాజీనామా ప్రకటన, అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టనని చెప్పడం ద్వారా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జ‌త్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ లు ఔట్‌ .. సీఎంవో కార్యాల‌యంలో ఏం జ‌రిగిందంటే?

పాపం పండింది.. మ‌హిళ ప‌ట్ల నీచంగా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌పై వేటు ప‌డింది. వైసీపీ  హ‌యాంలో కొంద‌రు  ఐపీఎస్ అధికారులు  మ‌హిళ‌ల ప‌ట్ల‌ నీచంగా ప్ర‌వ‌ర్తించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ పెద్ద‌ల సూచ‌న‌ల‌తో తాము ఉన్న‌తస్థాయి అధికారుల‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయి వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రించారు.  తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంపించారు. అంత‌టితో ఆగ‌కుండా లాఠీల‌తో కుళ్ల‌ పొడిచారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ప్ర‌భుత్వంలో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించిన ఐపీఎస్‌ల పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ముంబై న‌టి కాదంబ‌రి జ‌త్వానీ కేసులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌త్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జ‌త్వానీ ఫిర్యాదు మేర‌కు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. ఇక, విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను కూడా ఏపీ ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసింది.  గ‌త నెల‌లో ముంబై న‌టి జ‌త్వాని ఏపీ పోలీసుల‌ను క‌లిశారు. త‌న‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని, త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ముంబైలో తాను పెట్టిన కేసును వెనక్కు తీసుకునేందుకు తనపై విజయవాడలో అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. కుక్కల విద్యాసాగర్‌ అనే వైసీపీ నాయకునితో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో అక్రమ కేసు పెట్టించి తనను, త‌న‌ తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపి ముంబై కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశార‌ని న‌టి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల సిఫార్సుతో రంగంలోకి దిగిననాటి ఇంటెలిజెన్స్ డీజీపీ పీఎస్సార్‌, అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని కనుసన్నల్లో పోలీసులు వ్యవహరించారని, తెర వెనుక పథకం రచించి పీఎస్సార్‌ కథ నడిపించారని న‌టి ఆరోపించారు. న‌టి ఆరోప‌ణ‌ల‌పై నిజానిజాల‌ను నిగ్గుతేల్చేందుకు డీజీపీ ద్వార‌క తిరుమ‌ల‌రావు విచార‌ణ‌కు ఆదేశించారు. విచారణాధికారి స్రవంతి రాయ్‌ ఎదుట బాధితురాలు వెల్లడించిన అంశాలకు సంబంధించిన నివేదిక విచార‌ణ అధికారి ద్వారా డీజీపీకి చేరాయి. మూడు రోజుల క్రితం ఆ నివేదిక‌ను డీజీపీ ప్ర‌భుత్వానికి నివేదించారు. ఈ నివేదికలో సదరు ముగ్గురు ఐపీఎస్‌ల ప్రమేయాన్ని స్పష్టంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీంతో ఆ ముగ్గురినీ సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు.  న‌టి జ‌త్వానీ కేసులో విశాల్‌ గున్నిని సస్పెండ్‌ చేయడానికి కారణాలను జీవోలో ప్రభుత్వం పేర్కొంది. జ‌త్వానీపై విజ‌య‌వాడ ఇబ్ర‌హింప‌ట్నం పోలీస్ స్టేష‌న్ లో 2024 ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదైంది. అయితే.. ప్రాథమిక విచారణ జరపకుండానే నటి జత్వానీని అరెస్ట్‌ చేసేందుకు విశాల్ గున్ని సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీపీ సీతారామాంజనేయులను 2024 జనవరి 31న సీఎంవో కార్యాల‌యంలో కలిశారు. ఆయన మౌఖిక ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 2న ముంబై వెళ్ళారు. అదేరోజు ఉద‌యం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఏడున్నర గంటలకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అధికారిక రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే బయలుదేరి ముంబై వెళ్ళారు. డీసీపీ హోదాలో అధికారిక విధుల కోసం వెళ్ళిన గున్నీ కనీసం అందుకు సంబంధించి ట్రావెల్‌ అలెవెన్స్‌ను ప్రభుత్వం నుంచి క్లెయిమ్‌ చేసుకోకపోవడాన్ని డీజీపీ నివేదిక  ఆక్షేపించింది. అదే విధంగా నటి అరెస్ట్‌ చేసే విషయంలో కనీసం వారికి ముందుగా తెలియ చేయ‌లేదు.  నిబంధనలు పాటించలేదు. ఇదంతా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్‌, అప్పటి విజయవాడ  సీపీ కాంతిరాణా మౌఖిక ఆదేశాలతో చేసినట్లు నివేదిక పేర్కొంది.  సస్పెండ్ అయిన విశాల్‌ గున్ని విజయవాడ, హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విజ‌య‌వాడ విడిచి వెళ్లరాదని ప్రభుత్వం జీవోలో ఆదేశించింది. అయితే, ప్ర‌భుత్వం ఇచ్చిన మూడు జీవోల‌ను ప‌రిశీలిస్తే.. ముంబై న‌టి కాదంబ‌రి జ‌త్వానిని అరెస్టు చేసింది 2024 ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన. అంత‌కంటే రెండు రోజుల ముందు జ‌న‌వ‌రి 31వ తేదీన ఇటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజ‌నేయులు, విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గ‌ున్నిలు సీఎంఓలో భేటీ అయ్యారు. జ‌త్వానిని అరెస్టు చేసి తీసుకురావాల‌ని సీతారామాంజ‌నేయులు కాంతిరాణా, విశాల్ గ‌న్నిల‌కు సూచించారు. అయితే, సీఎంఓ కార్యాల‌యంలో  వీరు భేటీ కావ‌డానికి కార‌ణం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.  సీఎంవోలో వీరు భేటీ కావడంతో  జత్వానీ అరెస్టు  వెనుక వైసీపీ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ఇందులో ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలిసే ఈ వ్య‌వ‌హారం జ‌రిగింద‌ని తెలుగుదేశం నేత‌లు అంటున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు జ‌త్వాని కేసును సీరియ‌స్ గా తీసుకోవ‌డంతో.. మున్ముందు కాలంలో ఈ కేసులో ప్ర‌మేయం ఉన్న‌వారు సైతం కటకటాల పాలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కౌశిక్‌రెడ్డి వెనుక కాంగ్రెస్ నేత.. రేవంత్‌కు చెక్ పెట్టేందుకేనా?

తెలంగాణ‌లో రాజ‌కీయాలు  హీటెక్కాయి. ఎమ్మెల్యేలు అరెక‌పూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం కాస్తా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య గొడ‌వ‌గా మారింది. ఇరు పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ స‌వాళ్లు విసురుకుంటున్నారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును బీఆర్ఎస్‌లోని కొంద‌రు నేత‌లు సైతం త‌ప్పుబ‌డుతున్నారు. అరెక‌పూడి గాంధీని ఉద్దేశిస్తూ ఆంధ్రోడు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం వెనుక మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని, ఆంధ్రా వాళ్ల‌ను రెచ్చ‌గొట్టి తెలంగాణ వాదంతో మ‌ళ్లీ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని కేసీఆర్ చూస్తున్నారంటూ కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌టానికి కేసీఆర్ అండ‌దండ‌లు ఉన్నాయో లేదో కానీ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ మంత్రి ప్ర‌మేయం మాత్రం ఉందంటూ  రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని తెర‌పైకి తేవ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తేవాల‌న్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.  త‌ద్వారా రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేసేయడానికి చాన్స్ ఉంటుందని ప్ర‌భుత్వంలో  కీల‌కంగా ఉన్న ఓ మంత్రి... కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపార‌ని కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డికి అండ‌గాఉన్న మంత్రి ఎవ‌రు? అనే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.  పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. అయితే, గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వం.. పీఏసీ చైర్మ‌న్‌ ప‌ద‌విని అప్పటి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కి ఇవ్వ‌కుండా ఎంఐఎం పార్టీకి అప్ప‌గించింది. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష హోదా కోల్పోయింది. ఆ కార‌ణంగానే ఎంఐఎంకు పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చామ‌ని అప్ప‌ట్లో బీఆర్ఎస్ నేత‌లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి కేటాయింపులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అప్ప‌టికే పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వికోసం బీఆర్ఎస్ హ‌రీష్ రావు పేరు  ప్ర‌తిపాదించింది.  ప్ర‌భుత్వం గాంధీకి ప‌ద‌విని ఇవ్వ‌డాన్ని బీఆర్ఎస్ నేత‌లు తప్పుపట్టడమే కాకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాంధీ కూడా పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారని, ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యే కావ‌డంతోనే గాంధీకి ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నది. గాంధీ సైతం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాన‌ని, కాంగ్రెస్ పార్టీలో చేర‌లేద‌ని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ ను వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్ ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఇదే స‌మ‌యంలో కౌశిక్ రెడ్డి మీడియా స‌మావేశం పెట్టి గాంధీ ఇంటికి వెళ్తా.. బీఆర్ఎస్ కండువా క‌ప్పుతాన‌ని స‌వాల్ చేశాడు.. ప్ర‌తిగా గాంధీ స్పందిస్తూ.. నువ్వు రాకుంటే నేనే నీ ఇంటికి వ‌స్తా అంటూ బ‌దులిచ్చాడు. వీరిద్ద‌రి స‌వాళ్ల‌తో ర‌చ్చ మొద‌లైంది.  కౌశిక్ రెడ్డి, అరెక‌పూడి గాంధీ స‌వాళ్ల‌తో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఇరువురి నేత‌ల ఇండ్ల వ‌ద్ద బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి త‌న ఇంటికి రాక‌పోవ‌డంతో గాంధీనే త‌న అనుచ‌రుల‌తో కొండాపూర్‌లోని కౌశిక్ నివాసం వ‌ద్ద‌కు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవ‌టంతో తీవ్ర ఉద్రిక్త‌తల మ‌ధ్య కౌశిక్ నివాసంపై రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు గాంధీని, ఆయ‌న అనుచ‌రుల‌ను అరెస్టు చేశారు. ఆ త‌రువాత హ‌రీశ్ రావు, బీఆర్ఎస్ నేత‌లు కౌశిక్ రెడ్డి నివాసం వ‌ద్ద‌కు వెళ్లి గాంధీ, ఆయ‌న అనుచ‌రుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌మేయంతోనే గాంధీ దాడికి పాల్ప‌డ్డారంటూ విమ‌ర్శించారు. అయితే, కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రోడు అంటూ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించ‌డంతో ఈ వివాదం కాస్త తెలంగాణ‌, ఆంధ్రా వివాదంగా మారింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక కేసీఆర్ ఉన్నారని.. మ‌రోసారి ఆంధ్రావాళ్ల‌ను తిట్ట‌డం ద్వారా తెలంగాణ వాదాన్ని తెర‌పైకి తెచ్చి రాజ‌కీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాల‌న స‌క్ర‌మంగా సాగ‌నివ్వ‌కుండా కేసీఆర్ కుట్ర‌లు చేస్తున్నారని, కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక కేసీఆర్ ఉన్నారా లేదా అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా కొన‌సాగుతున్న వ్య‌క్తి మాత్రం ఉన్నారనీ, రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీనుంచి దింపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.  దీంతో ఆ వ్య‌క్తి ఎవ‌రనే అంశంపై తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్నది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వెనుక కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోని ఓ మంత్రి ఉన్నారని తెలంగాణ బీజేపీ త‌న అధికారిక ట్విట‌ర్ ఖాతాలో పేర్కొంది. కౌశిక్ రెడ్డికి అభ‌యం ఇస్తున్న‌ట్లుగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని పోలి ఉన్న బొమ్మ‌ను కార్టూన్ రూపంలో విడుద‌ల చేసింది. ఈ కార్టూన్ పై తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి ద‌గ్గ‌రి బంధువు. కాంగ్రెస్ పార్టీలో ఉత్త‌మ్ మ‌నిషిగానే కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అప్ప‌టి నుంచి రేవంత్ రెడ్డిపై వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. దీనికితోడు ఇటీవ‌ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ సంభోదించారు. అంతటితో ఆగకుండా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, తన నాలుకపై నల్లటి మచ్చలు కూడా ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌లు కాంగ్రెస్ లోని వ‌ర్గ విబేధాల‌ను బ‌హిర్గ‌తం చేశాయి. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని రేవంత్ పై రాజ‌గోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారని టాక్ న‌డుస్తోంది. మొన్న రాజ‌గోపాల్ రెడ్డి, నేడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక ఉత్త‌మ్ ఉన్నారని, రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దింప్పేందుకు వేగంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద  కౌశిక్ రెడ్డి వివాదం కాంగ్రెస్ లో విభేదాలను బహిర్గతం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తిరుమలేశుని సర్వ దర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల దర్దీ విపరీతంగా పెరిగింది. వరుస సెలవలు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం, మంగళవారం కూడా సెలవలు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు పోటెత్తారు. ఆదివారం (సెప్టెంబర్ 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ క్యూకాంప్లెక్స్ దాటి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (సెప్టెంబర్ 14) శ్రీవారిని మొత్తం 80 వేల 735 మంది దర్శించుకున్నారు. వారిలో 40 వేల 524 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 19 లక్షల రూపాయలు వచ్చింది. 

చెన్నై డ్రామా స‌క్సెస్‌.. రోజా దెబ్బ‌కు దిగొచ్చిన జ‌గ‌న్‌!

మాజీ మంత్రి,  వైసీపీ మ‌హిళా నేత రోజా దెబ్బ‌కు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగొచ్చారు. దీంతో రోజా ఆడిన చెన్నై డ్రామా సూప‌ర్ స‌క్సెస్ అయింద‌ని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ న‌డుస్తోంది. ఇంత‌కీ రోజా ఏం ప్లాన్ చేశారు? పెద్దిరెడ్డి వ‌ర్గాన్ని కాద‌ని రోజాకే జ‌గ‌న్ జై కొట్ట‌డానికి కార‌ణ‌మేంటి? అనే విష‌యాల్లోకి వెడితే ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తెలుగుదేశంలో ఉన్నంత కాలం అంద‌రూ మెచ్చేలా రాజ‌కీయాలు చేసిన ఆర్కే రోజా..  వైసీపీలో చేరిన త‌రువాత తోటి మ‌హిళ‌ల చేత కూడా ఛీ అనిపించుకునేలా రాజ‌కీయ ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో రోజా మాట తీరుతో మ‌హిళలు సిగ్గుతో తల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ సహా ప‌లువురు  నేత‌ల‌పై రోజా అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. మ‌హిళా నేత‌ననే విష‌యాన్ని మ‌రిపోయి అధికార అహంతో రెచ్చిపోయారు. ఈ క్ర‌మంలో రోజా తీరుపై వైసీపీ నేత‌లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రోజా వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌ని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని కొంద‌రు వైసీపీ నేత‌లు ఆమెపై ప‌లు సార్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని, వేరే వారికి న‌గ‌రిలో టికెట్ కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కానీ, జ‌గ‌న్ మాత్రం రోజాకే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగానేకాక.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ ఓడిపోయింది.  వైసీపీ ప్ర‌భుత్వం కొన‌సాగిన‌న్ని రోజులు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజా పెద్దఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మంత్రి హోదాను అడ్డుపెట్టుకొని త‌న సోద‌రుల‌తో క‌లిసి  భూదందాకు పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేకాదు..  క్రీడల శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో శాప్ మాజీ ఛైర్మన్ సిద్ధార్థ రెడ్డితో క‌లిసి  ఆడుదాం ఆంధ్ర, ‘సీఎం కప్‌’ల పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల ద్వారా రూ. 100 కోట్ల అక్రమాలకు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనికితోడు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌ల ప‌ట్ల అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించార‌న్న విమర్శలూ ఉన్నాయి.  దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ముఖ్య‌ నేతలంతా రోజాకు వ్య‌తిరేక వ‌ర్గంగా మారిపోయారు. నగరికి చెందిన వైసీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతి సైతం రోజా తీరుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గ‌తంలో రోజా అధిష్టానానికి ఫిర్యాదులు  చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ ప‌డినా రోజా తీరులో మార్పురాక‌పోవ‌డంతో పాటు.. ఆమెను వ్య‌తిరేకించిన సొంత పార్టీ నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు కనీస ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో రోజా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.  రాష్ట్రంలోనూ ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆమె చెన్నై వెళ్లిపోయారు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో గ‌త మూడు నెల‌లుగా రోజా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆమె చెన్నై రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. త‌మిళ‌నాడులో సినీ హీరో విజ‌య్ కొత్త పార్టీని పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో రోజా ఆంధ్రా రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పి, వైసీపీకి రాజీనామా చేసి విజ‌య్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌ను రోజా ఖండించ‌క‌పోగా.. ఆమె ట్విట‌ర్ అకౌంట్ లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బొమ్మ‌ను తొల‌గించారు. దీంతో ఆమె చెన్నై రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్న భావ‌న‌కు వైసీపీ నేత‌లు కూడా వ‌చ్చేశారు. ఇదే స‌మ‌యంలో ఆంధ్రా రాజ‌కీయాల్లోనే కొన‌సాగాల‌ని జ‌గ‌న్ రోజాకు సూచించార‌ని, ఈ క్ర‌మంలో ఆమె కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్లు గ‌త నెల రోజుల క్రితం ప్ర‌చారం జ‌రిగింది. రోజా ష‌ర‌తుల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒప్పుకోవ‌టంతో గ‌త ప‌ది రోజుల నుంచి ఆమె కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రోజా.. ఈవీఎంల వ‌ల్ల‌నే వైసీపీ ఓడిపోయింద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు..  వైసీపీలోనే తాను కొన‌సాగుతాన‌ని, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని రోజా చెప్పారు.  రోజా పెట్టిన ష‌ర‌తుల ప్ర‌కార‌మే.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు వ్య‌తిరేక వ‌ర్గంగా ఉన్న వైసీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతిలను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున క్రమశిక్షణ   చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  న‌గరి నియోజకవర్గంలో రోజా, కేజే దంపతుల మధ్య మొద‌టి నుంచి వార్ న‌డిచింది. ఒకే పార్టీలో ఉన్నా.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో కేజే దంప‌తులు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల‌నే తాను ఓడిపోయాన‌ని, వారిని పార్టీని తొల‌గించాల‌ని జ‌గ‌న్ కు రోజా ష‌ర‌తు పెట్ట‌డంతోనే వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు న‌గరి నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ న‌డుస్తోంది. దీంతో చెన్నై డ్రామాతో రోజా త‌న పంతాన్ని నెగ్గించుకున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. రోజా కోసం కేజే దంప‌తుల‌ను స‌స్పెండ్ చేస్తూ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని వైసీపీలోని కొంద‌రు నేత‌లు త‌ప్పుబ‌డుతున్నారు. రోజాను సంతృప్తి పర్చడానికి వారిని సస్పెండ్ చేయడంకన్నా.. రోజాను పట్టించుకోకుండా నగరిలో రాజ‌కీయంగా మంచి పట్టున్న కేజే దంపతులకే ఇంచార్జ్ పోస్టు ఇస్తే బాగుండేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద చెన్నై డ్రామాతో రోజా జ‌గ‌న్  మెడలు వంచి  త‌న పంతాన్ని నెగ్గించుకున్నారని చెప్పొచ్చు.

జనసంద్రమైన ఖైరతాబాద్ 

వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ గణ నాథుడిని చూడటానికి భక్తులు బారులు తీరారు. శని, ఆదివారం మాత్రమే గణ నాథుడిని చూసే అవకాశం ఉండటంతో వేలాదిమంది ఖైరతాబాద్ చేరుకుంటున్నారు. గత సంవత్సరం దాదాపు 20 లక్షల మంది గణ నాథుడిని చూసిన ప్రజలు ఈ యేడు మరో పది లక్షలమంది ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని నిర్వాహాకులు తెలిపారు. దేశంలోనే అతపెద్దదైన గణేష్ విగ్రహాన్ని దర్శించడం సోమవారం ఉండదని వారు చెప్పారు. మంగళవారం నిమజ్జనం కార్యక్రమానికి 25 వేల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విగ్రహన్ని  మంగళవారం మధ్యాహ్నంలోపు తరలించాలని పేర్కొంది సెప్టెంబర్ ఏడో తేదీన వినాయకచవితి ప్రారంభమైంది. వరుసగా తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు భక్తులు పోటెత్తే అవకాశాలు ఉండటంతో నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు..  ప్రతీయేడు మాదిరిగా  ఈ నెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. రెండో శనివారం , ఆదివారం, మిలాదున్ నబీ, నిమజ్జనం కాబట్టిఈ నెల 14 నుంచి 17 వరకు  విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభ్యమయ్యాయి.  

ఆంధ్రప్రదేశ్‌లో నిద్రమొహం అధికారులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిద్రమొహం అధికారులు ఎక్కువైపోయారు. జగన్ ఐదేళ్ల పాలనలో నిద్రపోతూ టైమ్‌పాస్ చేసిన చాలామంది అధికారగణం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే నిద్రని కంటిన్యూ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి తమ నిద్రని డిస్ట్రబ్ చేసిందని హర్టవుతున్న అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో దండిగా వున్నారు. అందుకే ఏపీలో అనేక ప్రభుత్వ శాఖల అధికారులు ఇంకా జగనే సీఎంగా వున్నారన్న కలలు కంటూ హాయిగా నిద్రపోతున్నారు. అందువల్లనేనేమో ప్రభుత్వ శాఖలకు చెందిన చాలా వెబ్‌సైట్స్.లో హోమ్ పేజీలో ముఖ్యమంత్రి ఫొటో అయితే మారింది. అయితే లోపలి పేజీల్లో మాత్రం ఇప్పటికీ జగన్‌ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, జగన్ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన వివరాలే వుంటున్నాయి. అంటే, మొక్కుబడిగా హోమ్ పేజీలో వివరాలు మార్చారు. లోపల ఎవరు చూస్తార్లే అనుకున్నారే ఏంటోగానీ, జగన్ ప్రభుత్వం తాలూకు పీడకలలే ఆయా పేజీల్లో కనిపిస్తున్నాయి. అలాగే ప్రజలకు జారీ చేసే కీలకమైన ప్రభుత్వ రికార్డుల మీద కూడా ఇంకా జగన్ ఫొటోనే దర్శనమిస్తోంది. ప్రభుత్వ రికార్డులతోపాటు ధ్రువీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల మీద జగన్ ఫొటో ఇప్పటికీ దర్శనమిస్తోంది. మరి ప్రభుత్వ అధికారులు ఎప్పుడు నిద్ర లేస్తారో... చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఎప్పుడు గుర్తిస్తారో!