యూట్యూబ్ జర్నలిస్ట్ ల నియంత్రణకు చట్టం దిశగా రేవంత్ సర్కార్ ?
posted on Sep 11, 2024 @ 1:30PM
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. గతంలో కెసీఆర్ ప్రభుత్వం మీడియాను అణచి వేసింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియా గొంతు నొక్కేయడానికి బిఆర్ఎస్ చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. వైఎస్ ఆర్ రాజశేఖరరెడ్డి హాయంలో జర్నలిస్ట్ లకు 70 ఎకరాల కేటాయింపు జరిగింది. న్యాయవివాదాల్లో చిక్కుకుని గత రెండేళ్ల క్రితం తుది తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పును అధికారం కోల్పోయే వరకు కెసీఆర్ అమలు చేయలేదు. జర్నలిస్ట్ లకు అన్యాయం జరిగిందని అప్పటి పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గొంతెత్తి మాట్లాడారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఆ భూములను అప్పగిస్తుందన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్ట్ లకు భూమి అప్పగించే కార్యక్రమం రవీంద్రభారతిలో జరిగింది. తన చేతుల మీదుగా జవహార్ హౌజింగ్ సొసైటీకి మెమో అంద జేసిన రేవంత్ రెడ్డి సందర్బంలేకుండానే యూట్యూబ్ చానల్స్ పై మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ఇటీవలె ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లు ప్రజాపాలన అమలు తీరుతెన్నులను తెలుసుకోవడానికి వెళ్లారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టు ల్లో ఒక యూ ట్యూబర్ ఉన్నారు. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ముఖ్యమంత్రికి వర్తించవా అని మరో యూట్యూబర్ రేవంత్ స్వగ్రామానికి వెళ్లారు. ఎఫ్ టిఎల్ , బఫర్ జోన్ లో ఉన్న రేవంత్ ఇల్లును ఆ యూట్యూబర్ షూట్ చేశారు.ఈ ఇల్లును హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు కూల్చడం లేదని ఆ యూట్యూబర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడం రేవంత్ రెడ్డికి అగ్రహం కలిగించింది.
మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా ఇక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ యూట్యూబర్ గత ఎన్నికల్లో కెసీఆర్ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. మహిళా జర్నలిస్ట్ ల టార్గెట్ గా రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో మాట్లాడినట్టు పరిశీలకులు చెబుతున్నారు. అంతకు క్రితం రోజు ఈ యూట్యబర్ రేవంత్ ను ఏకిపారేయడం గమనార్హం. రేవంత్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇంతవరకు ఏ మీడియా సంస్థ ప్రచారం చేయలేదు. కానీ ఈ యూట్యూబర్ రేవంత్ టార్గెట్ గా ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి మిగుడు పడలేదు. యూట్యూబర్ల సహాకారంతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవే యూట్యూబ్ లను కట్టడి చేయాలని చూస్తోంది. ఏరుదాటకముందు వీరమల్లన్న ఏరుదాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు తయారయ్యింది అని నెటిజన్లు అంటున్నారు. ఈ యూట్యూబ్ లను కట్టడి చేయడానికి జర్నలిస్ట్ లకు భూమి అప్పగంచే కార్యక్రమమే వేదిక అయింది. పేట్ బషీర్ బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగించే మెమో అందజేత కార్యక్రమంలో యూట్యూబ్ ల నియంత్రణకు శ్రీకారం చుట్టారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రసంగంలో కూడా యూట్యూబర్లు టార్గెట్ అయ్యారు. అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డులు యూ ట్యూబ్ జర్నలిస్ట్ లకు ఇచ్చే విషయం చర్చ జరుగుతుందన్నారు.
యూట్యూబర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం లబ్దిదారులైన జర్నలిస్ట్ లు, యూ ట్యూబ్ జర్నలిస్ట్ లకు మధ్య చిచ్చు రాజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. గతంలో కెసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరి అవలంబించింది. జవహార్ సొసైటీ జర్నలిస్ట్ లకు కొత్తగా జర్నలిజంలో వచ్చిన జర్నలిస్ట్ లకు ఈ భూమిని ముడిపెట్టారు. అందరికీ ఒకే సారి అంటూ వాయిదాలు వేశారు. సతీలీలావతి సినిమాలో కమల్ హసన్ దగ్గరికి ఫ్రెండ్ భార్య వచ్చి నా భర్త ఎప్పుడొస్తాడు అని అడిగితే దసరాకు వస్తాడు అని చెబుతాడు. దసరాకు రాకపోయే సరికి ఫ్రెండ్ భార్య మళ్లీ కమల్ హసన్ ను అడిగితే దీపావళికి వస్తాడు అని చెబుతాడు. దీపావళికి రాకపోయేసరికి మళ్లీ ఫ్రెండ్ భార్య అడుగుతుంది. ఈ సారి సంక్రాతికి తప్పకుండా వస్తాడని కమల్ హాసన్ చెబుతాడు. ఇలా కెసీఆర్ కూడా ఆ పండుగ ఈ పండుగ అని జర్నలిస్ట్ లకు మభ్యపెట్టాడు.రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూమిని కానీ రేవంత్ రెడ్డి యూట్యూబర్లను కించపరిచేలా మాట్లాడి చర్చనీయాంశమయ్యారు. రెండుదశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న భూమిని లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో కేవలం యూట్యూబర్లను టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది. యూట్యూబ్ పెట్టుకున్న జర్నలిస్ట్ లకు ఎమర్జెన్సీ తలపించేలా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే మీడియా ముఖ్యభూమిక వహిస్తుంది. నాలుగో మూలస్థంభమైన మీడియా పాత్రను యూట్యూబ్ జర్నలిస్ట్ లు చక్కగా పోషిస్తున్నారు. ఆయా పార్టీలకు వత్తాసుపలికే యూట్యూబర్లు ఉండనే ఉన్నారు. వారిని అడ్డం పెట్టుకుని యూట్యూబ్ జర్నలిస్ట్ లను ఒకే గాటన కట్టడం సబబు కాదని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు. పత్రికలు, టీవీ చానల్స్ కూడా పార్టీలవారిగా మీడియా సంస్థలను నిర్వర్తిస్తున్నాయి. అంతమాత్రాన వారికి ఇచ్చే అక్రిడేషన్, హెల్త్ కార్డులను బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆపలేదు కానీ సోషల్ మీడియాపై నియంత్రణ రేఖ పెట్టాలని రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని వినిపిస్తోంది.