కొంపలు కూల్చడం ఆపండయ్యా.. సుప్రీం ఆదేశం!

ప్రభుత్వాలు 'బుల్డోజర్ న్యాయం' పద్ధతిని పాటించే విషయంలో సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు విచారణలో ఉన్న నేరస్తుల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులను బుల్డోజర్లతో కూల్చేసే పద్ధతిని పాటిస్తున్నాయి.  ఈ విషయంలో దేశస్థాయిలో మార్గదర్శకాల తయారీ కోసం మంగళవారం నాడు  సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వాదనలు విన్న అనంతరం అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి కూల్చివేతలను ఆపితే ఆక్రమణల తొలగింపు కష్టమవుతుందన్న ప్రభుత్వాల ప్రతినిధులను సుప్రీంకోర్టు బెంచ్ తిరస్కరించింది. ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వాల అభ్యంతరాలను కొట్టిపారేసింది. "తదుపరి విచారణ తేదీ వరకు మీ చర్యలను ఆపినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు" అని న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఈ నెలలో ఇప్పటికే రెండుసార్లు అనేక రాష్ట్రాలు చేపట్టిన బుల్డోజర్ చర్యల మీద సుప్రీం కోర్టు బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కూల్చివేతలను హీరోయిజంగా చూపే యత్నం చేయవద్దని ప్రభుత్వాలను హెచ్చరించింది. తమ అనుమతులు లేకుండా ఎటువంటి కూల్చివేతలు చేపట్టొద్దని తేల్చిచెప్పింది. ప్రభుత్వ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు విషయంలో మాత్రం తమ ఆదేశాలు వర్తించవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను మంగళవారం సాయంత్రం కలిసిన కేజ్రీవాల్, తన రాజీనామా లేఖను సమర్పించారు. కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. కేజీవాల్ రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాక.. త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారం చేస్తారు. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై కేజీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించారు. దిల్లీ ప్రజలు తనకు నిజాయతీపరుడని సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఆ పదవిని చేపట్టబోనని ఆయన శపథం చేశారు.

వివేకా హత్యకేసులో ఏదో జరగబోతోంది!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చలనం మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వున్నంతకాలం ఈ కేసును అణిచేశారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో వివేకా కుటుంబానికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం నాడు అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వివేకా హత్య విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆమెతోపాటు ఆమె భర్త కూడా వచ్చారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయనకు పీఏగా వున్న కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తమపై అక్రమ కేసు పెట్టారని, ఆ ఫిర్యాదు వెనుక వున్న నిజానిజాలను వెలికి తీయడానికి విచారణ జరిపించాని సునీత ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనకు అన్ని విషయాలూ తెలుసునని, తప్పకుండా విచారణ జరిపిస్తానని సునీతకు హామీ ఇచ్చారు. అలాగే పులివెందులకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలు ఏదో జరగబోతోందన్న సూచనలు అయితే ఇస్తున్నాయి.

మయన్మార్‌లో యాగీ తుఫాన్ విధ్వంసం!

భారీ వర్షాలతో మయన్మార్ (బర్మా) అల్లకల్లోలమైంది. ‘యాగీ’ అనే పేరుపెట్టిన తుఫాను మయన్మార్‌లో నానా యాగీ చేసింది. ఈ తుఫాను కారణంగా వరదలు పోటెత్తాయి. భారీ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 226 మంది మరణించారు. ఇంకా 77 మంది గల్లంతైనట్లు మయన్మార్ అధికారిక మీడియా వెల్లడించింది. లక్షల్లో ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలారు. దాదాపు ఆరు లక్షల 30 వేల మంది ఈ తుఫాను వల్ల ప్రభావితమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి కూడా తెలిపింది. మయన్మార్ ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత దారుణమైన వరదలు ఇవేనని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మయన్మార్ ఇప్పటికే అంతర్యుద్ధంతో సతమతమవుతెంది. ఈ యాగీ తుఫాను కారణంగా వేల ఎకరాల్లో పంట నాశనమైంది. రాజధాని నేపిడావ్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు, సరైన ఆశ్రయం లేక బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. రహదారుల వంటి మౌలిక సౌకర్యాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశాన్ని ఆదుకోవాలని అక్కడి సైనిక పాలక వర్గం జుంటా విదేశీ సాయాన్ని అభ్యర్థించింది. యాగీ తుఫాను కేవలం మయన్మార్‌లో మాత్రమే కాదు... వియత్నాం, థాయ్‌లాండ్, లావోస్ దేశాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. ఒక్క వియత్నాంలో 300 మందిని యాగీ కారణంగా మరణించారు.

గుజరాత్ సదస్సులో చంద్రబాబుపై ప్రశంసల వరద!

నిన్నమొన్నటి వరకు విజయవాడలో బుడమేరు వరదను ఎదుర్కొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సోమవారం నాడు గుజరాత్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రశంసల వరద వచ్చిపడింది. ఆ ప్రశంసల వరదలో చంద్రబాబు నాయుడు తడిచిముద్దయ్యారు. ‘ఇన్వెస్ట్ ఇన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ ఇన్ ఎ క్లియర్ ఫ్యూచర్’ అనే అంశం మీద ఇన్వెస్ట్ 2024 పేరుతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన సదస్సులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం అక్కడకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఎంతో నచ్చింది. ఎవ్‌రెన్ సంస్థ సీఈఓ సుమన్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలో ఎందుకు అంత స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర వున్న ఒకే ఒక సమాధానం సరిపోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన తన విజన్ చాలా క్లియర్‌గా వుంది. ఆయనకు రంగంలో వున్న చాలా స్పష్టత వుంది. ఒకరోజు అంతా వెచ్చిస్తే గానీ నేర్చుకోలేని విషయాలను చంద్రబాబు నాయుడు ఒక్క అరగంటలోనే అందరికీ అర్థమయ్యేలా వివరించారు. చంద్రబాబు నాయుడి ప్రసంగం వినడం వల్ల మాకు ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. సమయం కూడా ఆదా అయింది. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో నాకు అర్థం కావడం వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంతో అనువైన రాష్ట్రంగా నాకు అనిపిస్తోంది. అందుకే పెట్టుబడులు పెడుతున్నాను’’ అన్నారు.

ప్రశంసనీయంగా నిమజ్జన ప్రక్రియ!

హైదరాబాద్‌లో గణేశ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ప్రశంసనీయంగా జరుగుతోంది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటలకే పూర్తయిపోయింది. వేలాదిమంది భక్తుల జయజయధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్.లోని నాలుగో నంబర్ క్రేన్ దగ్గర సప్తముఖ ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శోభాయాత్రకు సెక్రటేరియట్ సమీపంలో స్వాగతం పలికారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.  సాధారణంగా ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశ విగ్రహ నిమజ్జన కార్యక్రమం చాలా ఆలస్యంగా జరిగేది. నిమజ్జనం రోజు ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాతో, మర్నాటి తెల్లవారుఝామునే నిమజ్జనం జరిగేది. ఈసారి మాత్రం పకడ్బందీ ప్రణాళికతో చాలా త్వరగానే నిమజ్జనాన్ని పూర్తి చేశారు. అలాగే నిజమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు పెద్దగా ఇబ్బందులేవీ తలెత్తలేదు. మొత్తానికి గతంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమాలకు, ఈ ఏడాది జరిగిన కార్యక్రమాలకు మధ్య చాలా ప్రశంసనీయమైన మార్పు కనిపిస్తోంది.

కేటీఆర్ చాయ్, సమోసా అమ్ముకునేవాడు!

హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించి, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ దేశంలోకి కంప్యూటర్ రంగం రావడానికి తలుపులు తెరవకపోతే, కేటీఆర్ సిద్దిపేటలో చాయ్, సమోసా అమ్ముకుంటూ జీవించేవాడని అన్నారు. సీఎం రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘ట్విటర్ పిట్ట ట్విట్టర్లో పెడుతున్నాడు.. అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే కేటీఆర్ సన్నాసీ. లేకపోతే ఇక్కడ్నే ఎక్కడ్నో గుంటూర్లో ఇడ్లీ, వడ అమ్ముకుంటూ తిరిగేవాడివి. అక్కడకి చదువుకుంటానని వెళ్ళావు కదా.. అక్కడే ఇడ్లీ, వడ అమ్ముకుంటూ బతికేవాడివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్, సమోసా అమ్ముకుంటూ సిద్దిపేటలోనే వుండేవాడివి. రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేశాడు కాబట్టే నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక ఐటీ మంత్రివి అయ్యావు. లేకపోతే ఐటీ శాఖనే వుండేది కాదు. రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేశాడు కాబట్టే ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయ్యాడు. లేకపోతే ఆ దిక్కుమాలిన వాడి బాధే మనకు వుండేది కాదు. దేశ సమగ్రతను కాపాడటానికి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని సచివాలయం ఎదుట, ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు.. కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదం దిగలేదు’’ అన్నారు.

కాదంబరి జత్వానీ కేసులో అప్రూవర్ గా విశాల్ గున్ని?

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో సస్పెండైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ అప్రూవర్ గా మారారా అంటే ఆయన వాంగ్మూలాన్ని బట్టి ఔననే అనాల్సి వస్తోంది. జత్వానీ అరెస్టు వ్యవహారంలో  తాను, మరో ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశాల మేరకే వ్యవహరించామని విశాల్ గున్ని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.  విచారణలో భాగంగా విశాల్ గున్ని మూడు పేజీల వాంగ్మూలంలో జత్వానీ అరెస్టు విషయంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు. తనపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని స్పష్టంగా చెప్పేశారు. పై అధికారుల ఆదేశాలను శిరసావహించాననీ, అలా చేయకపోతే  ఏమౌతుందో తెలుసు కనుకనే వారు చెప్పిందల్లా చేశాననీ కుండబద్దలు కొట్టేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ తనను సీఎంవోకు పిలిపించిన దగ్గర నుంచీ ముంబై వెళ్లి కాదంబరి జెత్వానీనీ, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చే వరకూ జరిగిన ప్రతి విషయాన్నీ ఆయన కళ్లకు కట్టినట్లు స్టేట్ మెంట్ ఇచ్చారు.   సరిగ్గా కాదంబరి జెత్వానీని ముంబైలో కిడ్నాప్ చేసి ఇబ్రహీంపట్నం తీసుకురావడానికి రోజులు ముందు విశాల్ గున్ని విశాఖ రేంజ్ డీజీపీగా నియమితులయ్యారు. అయితే కాదంబరి జెత్వానీ విషయంలో ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తేనే విశాఖ రేంజ్ డీఐజీగా కొనసాగుతావని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు బెదిరించారు. జెత్వానీ అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక అంతా తాడేపల్లిలోని అప్పటి సీఎంవోలో జరిగింది. ప్రణాళికను పీఎస్సార్ ఆంజనేయులు రూపొందిస్తే విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలు అమలు చేశారు.  అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత జత్వానీ ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. ఇక ఈ కేసులో సస్పెండైన విశాల్ గున్నీ వాంగ్మూలంతో  ఐపీఎస్ అధకారులు పూర్తిగా ఇరుక్కున్నారు. కేసు నమోదు కావడం కంటే ముందే ముంబైకి విమాన టికెట్లు బుక్ చేయడంతో ఇక తప్పించుకోలేని విధంగా చిక్కుకున్నారు. ఇక ఈ కేసులో విశాల్ గున్నీ తనను కాపాడుకోవడానికి అప్రూవర్ గా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే జరిగితే.. జత్వానీ కేసులో ప్రమేయమున్న రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.  

ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశి

అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేదెవరో తేలిపోయింది. మంత్రి అతిశి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో కేజ్రీవాల్ తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన క్షణం నుంచీ నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.  మంగళవారం (సెప్టెబర్ 17) సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఆ సందర్భంగా తన రాజీనామా లేఖను ఆయనకు అందజేస్తారు. కాగా మంగళవారం ఉదయం జరిగిన ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో  ఆప్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా అతిశిని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అతిశి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.  కేజ్రీవాల్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన అతిశి ఉన్నత విద్యావంతురాలు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టయిన తరువాత ఆమెను కేజ్రీవాల్ కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తరువాత కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు. అప్పటి నుంచీ ఆమె ఆప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా, పార్టీని కూడా ముందుండి నడిపించారు. కాగా ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రభుత్వం తరఫున జాతీయ జెండాను ఎగుర వేసేందుకు కేజ్రీవాల్ ఆమెకు అవకాశం ఇచ్చారు. కాగా కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేసిన తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ భార్య సహా పలువురి పేర్లు వినిపించినప్పటికీ కేజ్రీవాల్ అతిశీనే ఎంపిక చేశారు. 

వృద్ధులకు ఆయుష్మాన్ భవ

వృద్ధులకు ఎట్టకేలకు ఒక సంక్షేమ పథకం ప్రారంభమైంది.  లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానం మేరకు  డెబ్భ య్యేళ్లు, అంతకు పైబడినవారికి ఆయుష్మాన్‌ భారత్‌ , ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను వర్తింప చేస్తోంది.  వృద్ధుల ఆరోగ్య భద్రతకు సంబంధించినంత వరకూ ఇది అతి ప్రధానమైనదని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఆరోగ్య బీమా పథకంలో ఉన్న  లోటుపాట్లను ఇది భర్తీ చేస్తుంది. సామాజిక, ఆర్థిక స్థితిగతు లతో సంబంధం లేకుండా దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలలో ఆరుకోట్ల మందికి పైగా వృద్ధులకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది.    దీనికి కేంద్ర మంత్రివర్గం  గత వారం ఆమోద ముద్ర వేసింది.  దీని వల్ల ఖజానాపై  రూ. 3437 కోట్ల భారం పడుతుందని అంచనా.  ప్రైవేట్‌  సంస్థల, ఇ.ఎస్‌.ఐ బీమా పథకాలను అనుభవిస్తున్న వారికి కూడా ఈ  పథకం వర్తిస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం  తీసుకున్నవారు ఈ పథకానికి, తాజా పథకానికి మధ్య ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బీమా పథకానికి కొన్ని పరిమితులున్నాయి. దీని కింద వృద్ధు లకు 5 లక్షల రూపాయల వరకే బీమా సౌకర్యం లభిస్తుంది. ఒక కుటుంబంలో ఒకరిని మించి వృద్ధులున్న పక్షంలో వారిద్దరూ ఈ పథకాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.    దేశంలో వృద్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందువల్ల ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చడమనేది హర్షించాల్సిన విషయమే. ముఖ్యంగా వృద్ధులకు ఆరోగ్యం ప్రధాన అవసరంగా ఉన్న స్థితిలో ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ముదావహం.  నిజానికి దేశంలో ఆరోగ్య బీమా వర్తిస్తున్న వృద్ధుల సంఖ్య అతి తక్కువ.  సి.జి.హెచ్‌.ఎస్‌ తో సహా ప్రస్తుతం అమలులో ఉన్న అనేక ఆరోగ్య పథకాలు ఆస్పత్రులలో చేరిన వారికి, సంబంధిత ఖర్చులకు మాత్రమే వర్తిస్తాయి. ఓపీడీలకు, ఔట్‌ పేషెంట్‌ సేవలకు వర్తించవు. నిజానికి, సుమారు 60 శాతం రోగుల విషయంలో రోగ నిర్దారణ  పరీక్షలకు, మందులకు  ఎక్కువగా ఖర్చవుతుంటుంది. ఇతర దేశాల్లో ఇటువంటి బీమా పథకాలు అమలు జరుగుతున్న తీరును పరిశీలించి, ఆరోగ్య బీమాను కొత్త విభాగాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది.  

వణికిస్తున్న కొత్త వైరస్ ఎంపాక్స్!

వైరస్ అనే పేరు వింటేనే జనం భయంతో వణికి పోతున్న పరిస్థితి.  కరోనా వైరస్ సృష్టించిన విలయం, గాయం నుంచి బయటపడిన ప్రజలు వైరస్ అనే పదం వింటేనే వణికి పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో వైరస్ విజృంభిస్తోందంటూ హెచ్చరిక చేసింది. ఎంపాక్స్ అనే వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వైరస్ ఎంపాక్స్ ఇండియాలోకి కూడా ప్రవేశించిందని ప్రకటించింది.  విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో  కేంద్రం అప్రమత్తం అయింది.   ఎంపాక్స్‌ అనే ఈ వైరస్‌ లక్షణాలు కనిపించిన ఈ ప్రయాణికుడిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెళ్లడించింది. అయితే ఆ ప్రయాణీకుడి పేరు, ఏ దేశం నుంచి వచ్చాడు అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.    ఎంపాక్స్‌ వైరస్‌ అనేక ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే వ్యాపిస్తున్నందువల్ల గత నెల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర స్థితిని కూడా ప్రకటించింది. ఈ ఎంపాక్స్‌ వైరస్‌ గాలి నుంచి, నీటి నుంచి సంక్రమించే మహమ్మారి కాదు. ఇది శారీరక సంబంధాల వల్ల, సన్నిహితంగా మెలగడం వల్ల వ్యాప్తి చెందడం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో పుట్టి పెరిగి, చుట్టుపక్కల అనేక దేశాలకు వ్యాపించిన ఎంపాక్స్ ఇటీవల ఐరోపా దేశాలకూ వ్యాపించింది. వాస్తవానికి ఎంపాక్స్ కట్టడిలో అగ్రరాజ్యాలు క్షంతవ్యం కాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. కేవలం ఆఫ్రికా దేశాలకు, అదీ పేద దేశాలకు మాత్రమే ఎంపాక్స్ పరిమితం అని భావించి, దీని నివారణకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కూడా దానికి ఆఫ్రికాకు పంపించేందుకు చొరవ చూపలేదు. ఇప్పుడీ వైరస్ ఐరోపాకు వ్యాప్తి చెందడంతో  ఎంపాక్స్ వ్యాక్సిన్ ను ఆ దేశాలకు  రవాణా చేస్తున్నాయి. అది పక్కన పెడితే  ప్రపంచ దేశాల మధ్య రాకపోకల కారణంగా  వైరస్ లు వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి.  వీటిని మొగ్గలోనే తుంచేయాలి. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.   2022 జనవరి, 2024 ఆగస్టులకు మధ్య 120 దేశాల్లో లక్ష మందికి పైగా   ఎంపాక్స్‌ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.   ఇక ఇండియా విషయానికి వస్తే   వైరస్‌ లకు సంబంధించిన చరిత్ర ఉన్న దేశాల నుంచి  వచ్చే ప్రయాణికులందరి మీదా నిఘా  ఉంచాలి. ముఖ్యంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పూర్తి స్థాయిలో పర్య వేక్షణ ఉండాలి.  ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించినా, ఈ లక్షణాలున్నట్టు అనుమానం కలిగినా అటువంటి వ్యక్తులను వెంటనే  ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా.. ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి మంగళవారం (సెప్టెంబర్ 17) రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ అప్పాయింట్ మెంట్ తీసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై ఆరు నెలలు జైలులో ఉన్న కేజ్రీవాల్ బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసు ఇప్పుడప్పుడే తేలే పరిస్థితి లేదనీ, అందుకే తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఫ్రెష్ మేండేట్ కోరాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు తరువాతే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటాననీ ఆయన ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని ఆయన కోరుతున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయి.  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారు. అయితే వాటిలో ఒక్కటీ నిరూపితం కాలేదు. పైపెచ్చు ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని సాక్షాత్తూ సుప్రీం కోర్టే వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో కేజ్రీవాల్ పలుకుబడి పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆధారరహిత ఆరోపణలతో కేంద్రంలోని బీజేపీ సర్కారే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందన్న భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.   ఈ నేపథ్యంలో తన నిర్ణయంతో కేజ్రీవాల్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ప్రజలు ఓటేస్తే వారు కేజ్రీవాల్ ను నిర్దోషిగా నమ్మినట్లే అవుతుంది. ఇక తన రాజీనామా ప్రకటన ద్వారా ప్రజల నుంచి సానుభూతి లభిస్తుంది. తన రాజీనామా ప్రకటనతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రజా మద్దతుతో పదవీ బాధ్యతలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. కొంత కాలం పాటు సీఎం పదవికి దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయ కుట్రలో భాగంగానే  బీజేపీ తనను మద్యం కుంభకోణం కేసులో ఇరికించిందన్న సందేశాన్ని తన రాజీనామాద్వారా ప్రజలలోకి బలంగా పంపించారని చెప్పొచ్చు. అదలా ఉండగా కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో కేజ్రీవాల్ భార్య సహా కొందరు ఆప్ మంత్రులు ఉన్నారు.  కాగా ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఈ ఐటెం తప్పకుండా చదవండి...కేజ్రీవాల్ రాజీనామా.. ముందస్తు తథ్యం!?

ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం రూ. 1.10 కోట్లు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నిమజ్జనోత్సవాన్ని ఎటువంటి అవాంతరాలూ లేకుండా సాఫీగా జరిగేలా చూసేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  జంటనగరాల్లో వాడవాడలా కొలువుదీరిన గణేష్ లు నిమజ్జనం కోసం శోభాయాత్రగా తరలుతున్నారు. ఇక ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేశారు.   శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 10 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు  గంగమ్మ ఒడికి చేరేందుకు కదిలాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై..ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన ఖైరతాబాద్ గణేషుడిని టస్కర్ పైకి చేర్చారు. కాగా ఈ ఏడాది  ఖైరతాబాద్ గణపతికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ సారి ఆదాయంలో ఖైరతాబాద్ వినాయకుడు గత రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు.  ఖైరతాబాద్ మహాగణపతి   ఆదాయం కోటీ 10 లక్షల రూపాయలు వచ్చింది.  ఇందులో హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 70 లక్సలు కాగా, హోర్డింగులు, ఇతర ప్రకటనల రూపంలో మరో 40 లక్షలు ఆదాయం వచ్చింది. ఆన్ లైన్ విరాళాలను ఇంకా లెక్కించాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధుడైన ఖైరతాబాద్ గణేషుడికి ఆన్ లైన్ లో కూడా భారీగా విరాళాలు వస్తుంటాయి. అవి కూడా లెక్కించిన అనంతరం ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇక బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం ప్రారంభం కావాల్సి ఉంది.  బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది. ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలానికి కొత్త నిబంధనలు పెట్టారు.  గతేడాది వేలంలో గణేషుడి లడ్డూ 27 లక్షల రూపాయలు పలికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేలంలో గత ఏడాది పలికినంత సొమ్మును అంటే 27 లక్షల రూపాయలను ముందే డిపాజిట్ చేయాలని నిబంధన విధించారు. ఆ సొమ్ము డిపాజిట్ చేసి పెద్ద సంఖ్యలో వేలంలో పాల్గొనేందుకు భక్తులు ముందుకు వచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ లో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. బండ్లగూడ జాగీర్  కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో ఏర్పాటు చేసిన గణేష్ మంటపంలో గణేషుడి లడ్డూ వేలంపాటలో అత్యధికంగా కోటీ 87 లక్షలు పలికింది.  

గంగమ్మని అదుపుచేసిన అపర భగీరథుడు కన్నయ్య నాయుడు!

అక్టోబర్ 2, 2009. ఈ తేదీ బహుశా ఎవరు గుర్తుపెట్టుకున్నా, గుర్తుపెట్టుకోకపోయినా కర్నూలు ప్రజలకు మాత్రం నిద్రలో లేపి అడిగినా ఠక్కున గుర్తొస్తుంది. ఆరోజు కృష్ణానది వరద విలయానికి చిగురుటాకులా వణికిపోయిన కర్నూలు నగరం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది. దాదాపు 50 మందికి పైగా ఆ వరదల్లో మృత్యువాతపడ్డారు. వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇదంతా అందరికీ గుర్తుంటుంది. కానీ, ఆ వరదల్లో 250 గ్రామాలు, రెండు నగరాల ప్రజలు జలసమాధి కాకుండా కాపాడిన ఒక యోధుడు వున్నాడంటే నమ్ముతారా? ఇది సినిమా స్టోరీ కాదు. కృష్ణమ్మ సాక్షిగా ప్రాణాలకు తెగించి శ్రీశైలం బ్యారేజ్ కొట్టుకుపోకుండా కాపాడి, లక్షలమంది ప్రాణాలకు తన ప్రాణం అడ్డుగా వేసిన యోధుడాయన. ఆయనే నాగినేని కన్నయ్య నాయుడు. మొన్న తుంగభద్ర గేట్లు కొట్టుకు పోయినప్పుడు, డ్యామ్‌కు ఇంకా వరద కొనసాగుతుండగానే గేట్లు అమర్చి, వేలమంది రాయలసీమ రైతుల గుండెల్లో ఆందోళన తొలగించిన మహామనిషి. నిన్నమొన్నటి ప్రకాశం బ్యారేజ్ వరదల్లో బోట్లు ఢీకొని విరిగిన కౌంటర్ వెయిట్‌లను కేవలం ఐదు రోజుల్లోనే యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి, యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్‌లను అమర్చిన కర్మయోగి, ధీశాలి!  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు. గుజరాత్ సహా దక్షిణ భారత దేశంలో 90 శాతం డ్యామ్‌లు ఆయన చెయ్యి పడకుండా పూర్తి కాలేదంటే అతిశయోక్తి కాదు.  ఆరోజు అక్టోబర్ ఒకటో తేదీ 2009. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఊహించనంత వర్షపాతం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంటోంది. క్రమక్రమంగా వరద ఉద్ధృతమై, డ్యామ్ కొట్టుకుపోయేంత ప్రవాహం. ఎందుకలా జరిగిందో తెలియదుగానీ, డ్యామ్ అధికారులు ఒక్కరు కూడా అందుబాటులో లేరు. ఒకరు సెలవులో, మరొకరు మరో ఊరిలో. ఇలా ఏవేవో కారణాలతో ఏ ఒక్క అధికారీ డ్యామ్ వద్ద లేరు. కేవలం సూపర్‌వైజర్ మాత్రమే వున్నాడు. గేట్లు ఎత్తి వరదను కిందకి వదిలే అధికారం ఆయనకి లేదు. ఇక పై అధికారులు ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకుని అధికారులు బయల్దేరారు. కానీ, వెళ్ళేసరికి మరుసటి రోజు మధ్యాహ్నం అయింది. అంటే, అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం అప్పటికే వరదమరింత ఉద్ధృతమయ్యి, రిజర్వాయర్ లెవల్ దాటి ఒక మీటరు ఎత్తులో వరద ప్రవహిస్తోంది. అప్పుడు పరుగుపరుగున గేట్లు ఎత్తే ప్రయత్నం జరిగింది. నాలుగో నంబర్ గేటు ఎత్తగానే ఆ వరద ధాటికి ఒక్కసారిగా ఎనిమిది రోప్స్ తెగిపోయాయి. ఏం చేయాలో అధికారులకు అర్థంకాలేదు. ఒకవేళ డ్యామ్ ఇలాగే వదిలేస్తే లక్షలమంది ప్రాణాలు వరదలో కలిసిపోతాయి. ఎలాగైనా వరదను కంట్రోల్ చేయాలి. అప్పుడు ఒక వ్యక్తి గుర్తొచ్చారు వారికి. వెంటనే ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి హైదరాబాద్‌లో వున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి అక్కడకి వెళ్ళేలోపు ఏమైనా జరగొచ్చు. ప్రభుత్వం అప్రమత్తమై హెలికాప్టర్ని సిద్ధం చేసింది. కానీ, దట్టమైన మేఘాలు ఉండటం వల్ల హెలికాప్టర్ కర్నూలుకు చేరుకునే పరిస్థితి లేదు. మరోవైపు అంతకంతకూ వరద పెరుగుతూనే వుంది. అప్పటికే డ్యామ్ కొట్టుకుపోతుందనే వార్త రాష్ట్రం అంతా వ్యాపించింది. ఏం జరుగుతోందోనని ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఆ డ్యామ్ పరిసర ప్రాంత ప్రజలు. అప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టింది. ఇక చేసేది లేక హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంగుండానే డ్యామ్‌ వద్దకు బయల్దేరి వచ్చేసరికి 3వ తేదీ ఉదయం పదిన్నరకి గాని రాలేకపోయారు. అప్పటికే డ్యామ్ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందంటే, డ్యామ్ మొత్తం ఆ వరద ధాటికి వణుకుతోంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క డ్యామ్ మొత్తం ఊగిపోతుందీ అంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో. ఇక కొద్ది నిమిషాల్లోనే డ్యామ్ కొట్టుకుపోయి వరదంతా గ్రామాల మీద పడుతుంది అనేలాంటి పరిస్థితి అక్కడి అధికారులను కలవరపెడుతోంది. కానీ, ఫోన్ అందుకుని అక్కడకి వచ్చిన ఆ ఒక్కడు మాత్రం ఆలోచనల్లో పడ్డారు. ఒకపక్క ఆ డ్యామ్‌లో శవాలు కొట్టుకొస్తున్నాయి. భయంతో ప్రభుత్వ సిబ్బంది ఎవరూ ముందుకు రావడం లేదు. వెంటనే మనసులో నేను కూడా ఈ శవాల్లో కొట్టుకుపోతే నా కుటుంబాన్ని నువ్వే పోషించు దేవుడా అంటూ దణ్ణం పెట్టుకున్నారాయన. వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కడే డ్యామ్ గేట్లను ఎత్తడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది? డ్యామ్‌ను ఎలా కాపాడగలిగారు? ఇదే అసలైన మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయన ఎందుకంటున్నారు? ఆయన మాటల్లోనే విందాం.. అపర భగీరథుడు కన్నయ్య నాయుడితో ‘తెలుగువన్’ ఇన్‌పుట్ ఎడిటర్ శుభకర్ మేడసాని చేసిన ఎక్స్.క్లూజివ్ ఇంటర్వ్యూ ఈ లింక్ ద్వారా చూడండి.    

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అడ్వైజరీ కమిటీ!

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు  శనివారం (సెప్టెంబర్ 14)  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజక వర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాభవన్ లో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజావాణి లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి కూడా నిర్వహించాలని నిర్ణయించారు.    బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం  వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. . 

జానీ మాస్టర్ పై జనసేన సస్పెన్షన్ వేటు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. అంతే వెంటనే ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే పవన్ జానీవాకర్ పై కేసు నమోదైందని తెలియగానే  సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల ప్రచారంలో  జనసేన పార్టీ తరఫున జానీ మాస్టర్ చురుకుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి, పవన్ కల్యాణ్ కు సన్నిహితంగా మెలిగే వ్యక్తి అయినా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా జానీ మాస్టర్ పై పవన్ కల్యాణ్ సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జానీ మాస్టర్ సినీ పరిశ్రమలో కొరియా గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పదవి నుంచి జానీ మాస్టర్ కు ఉద్వాసన పలకాలని కొరియోగ్రాఫర్ అసోసియేషన్   నిర్ణయం తీసుకుంది. సోమవారం (సెప్టెబర్ 16)నే ఈ మేరకు చర్య తీసుకోవాలని అసోసియేషన్ భావించినప్పటికీ, అసోసియేషన్ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం (సెప్టెంబర్ 17) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జానీ మాస్టర్ కు ఉద్వాసన పలికేందుకు నిర్ణయించింది. ఇలా ఉండగా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఇలా కేసు నమోదు కాగానే అలా జానీ మాస్టర్ పై జనసేన సస్పెన్షన్ వేటు వేసింది. జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అలాగే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా జానీ మాస్టర్ ను దూరం పెట్టింది. 

బెబింకా తుఫానుతో చైనా బెంబేలు!

చైనా దేశ ఫైనాన్షియల్ క్యాపిటల్ నగరం షాంఘైను భారీ తుఫాను ‘బెబింకా టైఫూన్’ బెంబేలెల్తిస్తోంది. గత 70 సంవత్సరాలతో పోలిస్తే ఇదే అతి పెద్ద తుఫాను అని చైనా వాతావరణ శాఖ చెబుతోంది. ఈ తుఫాను కారణంగా షాంగైలో ప్రజా జీవితం చిన్నాభిన్నమైంది. సోమవారం నాడు గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తుపాను షాంఘై నగరాన్ని తాకింది. సాధారణంగా షాంఘై నగరం తుఫాన్లు వచ్చే ప్రాంతం కాదు. 1949లో వచ్చిన టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన భారీ తుపాను ఇదే. దీంతో ఆదివారం రాత్రి నుంచి షాంఘైలోని రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేశారు. పార్కులు, వినోద ప్రదేశాలను మూసేశారు. ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్సులో యాగి తుపాను నానా యాగీ చేసింది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు జనం ఇబ్బందిపడ్డారు. 

రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

 తెలంగాణ సచివాలయం దగ్గర మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ గూర్చి కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా కూతురు ఇందిరాగాంధీ ఎటువంటి పదవులు అనుభవించలేదన్నారు. కొందరు సన్నాసులు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లి విగ్రహంకు బదులుగా రాజీవ్ విగ్రహావిష్కరణ ఏమిటి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావ్ ప్రశ్నించారు.