పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ పాలన పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా పరిణమించింది. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అధ:పాతాళానికి పడిపోయింది. రాజధాని అమరావతి నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిలిచిపోయింది. వ్యవసాయం పడకేసింది. శాంతి భద్రతలు గాలిలో దీపంగా మారాయి. జనం భయం గుప్పిట్లో వణికిపోతూ కాలం గడిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పన మాటే వినిపించలేదు. ఇదేమిటంటూ ఎవరైనా ప్రశ్నిస్తే జైళ్లు నోళ్లు తెరిచాయి. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. సమాజంలోని అన్ని వర్గాలూ జగన్ ఐదేళ్ల హయాంలో కష్టాల కడలిలో కాలం గడిపారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరిగి అధికార పగ్గాలు చేపట్టగానే.. కష్టాలు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రం మళ్లీ ప్రగత పథంలో పరుగులు పెడుతోందన్న నమ్మకం కలిగింది. ఇక రాష్ట్ర ఆదాయానికీ, ప్రగతికీ, పురోభివృద్ధికీ, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకూ అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం పుంజుకుంటోంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. తరలిపోయిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఇక మరిన్న పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగనుంది. అందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ 'సినర్జీ' పేరుతో నిర్వహించే కీలక వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమకు చెందిన 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులు హాజరౌతారు. అమెరికా మాజీ అధ్యక్షులు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ వంటి స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఇటువంటి సదస్సుకు ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేశ్‌ను విశిష్ట అతిథిగా సినర్జీ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో లోకేశ్ చొరవ... ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారిందని గుర్తించిన సినర్జీ ప్రతినిథులు పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై లోకేశ్ ను ప్రసంగించాల్సిందిగా కోరింది.
ఆ సదస్సులో పాల్గొనడమే కాకుండా లోకేష్ అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిథులు, పెట్టుబడిదారులతో వరుస భేటీలు కానున్నారు. శుక్రవారం అక్టోబర్ 25) ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిథులతో భేటీ అవుతారు. అలాగే శనివారం (అక్టోబర్ 26) పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. అనంతరం భారత కాన్సులేట్ జనరల్ తో సమావేశం అవుతారు. ఆ తరువాత ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆ మరుసటి రోజు ఆదివారం అంటే అక్టోబర్ 27న ఆస్టిన్ లో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. 28న శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 29న లాస్ వెగాస్ లో ఇటీ సర్వ్ సినర్జీ సదస్సులో ప్రసంగిస్తారు. అలాగే అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్టోబర్ 30న లాస్ వెగాస్ లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శిస్తారు. అలాగే స్టార్టప్స్, ఎంటర్ పెన్యూర్స్ తో భేటీ అవుతారు. అక్టోబర్ 31న జార్జియాలోని శినిమౌంటేన్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నవంబర్ 1న న్యూయార్క్ లో పెట్టుబడి దారులతో సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్ కు భారీ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలను ఆకర్షించి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడమే తన పర్యటన లక్ష్యమని లోకేష్ చెప్పారు.
తన అమెరికా పర్యటనకు ఒక రోజు ముందు లోకేష్ దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతనిధులతో భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో జరిగిన ఈ భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపట్టని చర్యలు, పరిశ్రమల స్థాపనకు ముందకు వచ్చే వారికి ఇస్తున్న రాయతీల గురించి వారికి వివరించారు. లోకేష్ ప్రజంటేషన్ కు ముగ్ధులైన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు అంగీకరించారు.