కొండా సురేఖపై పరువు నష్టం దావా  కేసులో కెటీఆర్ స్టేట్ మెంట్ రికార్డు

మంత్రి కొండా సురేఖపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో  మాజీ మంత్రి కెటీఆర్ వేసిన పరువు నష్టం దావా సోమవారం విచారణకు వచ్చింది.   కేటీఆర్‌  కంటే ముందు హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇవాళ నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్​ తరఫు న్యాయవాది ఉమా మహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.  ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్​మెంట్​తో పాటు నలుగురు సాక్షులు స్టేట్​మెంట్లు రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేటీఆర్, సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్​మెంట్లు రికార్డ్ చేయనుంది. నాగ చైతన్య, సమంత విడాకులకు కెటీఆర్ ప్రధాన కారణమని మంత్రి కొండా సురేఖ మీడియా ఎదుట బాహాటంగా ఆరోపించారు. అయితే సమంతకు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ కెటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కెటీఆర్ కోర్టులో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తొలుత అతని స్టేట్ మెంట్ కూడా రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. కొండా సురేఖపై పరుదు నష్టం దావా వేసిన నాగార్జున స్టేట్ మెంట్ ను ఇప్పటికే రికార్డు చేసిన కోర్టు కెటీఆర్ స్టేట్ మెంట్ కోసం వేచి చూస్తోంది. 

మద్యం దుకాణాల లాటరీ వేడుక!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ వేడుక జరుగుతోంది. ప్రతి జిల్లాలో లాటరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. లాటరీ తీసి దుకాణదారులను ఎంపిక చేసే కార్యక్రమం అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతోంది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు లాటరీలో తమ పేరు రావాలని కోరుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలలో లాటరీలు తీస్తున్నారు. లాటరీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులను ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే నేరుగా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కూడా కల్పించారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహులు లాటరీ జరిగే ప్రదేశానికి వచ్చారు. అయితే కొంతమంది దరఖాస్తుదారులు రాలేదు. వారి ప్రతినిధులు వచ్చారు. దరఖాస్తుదారుడు స్వయంగా రాకపోయినా పర్లేదని అధికారులు చెబుతున్నారు. లాటరీలో షాపు కేటాయించిన దరఖాస్తుదారులకు అధికారులే స్వయంగా ఫోన్ చేసి సమాచారాన్ని అందిస్తున్నారు. మచిలీపట్నంలో రెండు వైన్ షాపులను ఇతర రాష్ట్రాలకు చెందినవారు దక్కించుకున్నారు. మచిలీపట్నంలోని 1వ నంబర్ షాపును కర్నాటకకు చెందిన మహేష్ ఎ. బాతే‌కి దక్కింది. 2వ నంబర్ షాపు ఉత్తరప్రదేశ్‌కి చెందిన లోకేష్ చంద్‌కి దక్కింది. 

భారీ వర్షాలు.. చంద్రబాబు యాక్టివ్!

భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్టివ్ అయ్యారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్.లో ముఖ్యాంశాలు... * రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. * చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. పర్యవేక్షణ ఉంచాలి.  కట్టలు తెగే పరిస్థితి వున్నదేమో గమనించాలి. * అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న ప్రాంతాలలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి . * ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్‌లు పంపి అలెర్ట్ చేయాలి . * వాగులు, కాలువల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి . * వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి . * అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయవచ్చు. * కంట్రోల్ రూమ్‌కి వచ్చిన ప్రజల విజ్ఞప్తులపై వేగంగా స్పందించాలి .  * సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా నీటి పారుదల శాఖ చర్యలు తీసుకోవాలి . * ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపిన అధికారులు. * ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని వివరించిన అధికారులు. మంగళవారం నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపిన అధికారులు . * నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా వుంచినట్టు తెలిపిన అధికారులు.

అమెరికా జగనన్నపై మరోసారి హత్యాయత్నం!

మన ఆంధ్రాలో జగనన్న తరహాలోనే అమెరికాలో కూడా ఒక పెద్దమనిషి వున్నాడు. ఆయన పేరు అమెరికా జగనన్న అలియాస్ డొనాల్డ్ ట్రంప్. ఈయన గతంలో ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. రెండోసారి కూడా అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అనుకున్నాడు. అయితే ఫెయిలయ్యాడు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడు అవ్వాలన్న ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే వెరైటీ ఏంటంటే, డోనాల్డ్ ట్రంప్ మీద కూడా మన జగనన్న మీద జరిగినట్టే హత్యాయత్నాల మీద హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఆమధ్య ఆయన ఎన్నికల ప్రచారంలో వున్నప్పుడు థామస్ మాథ్యూ క్రూక్ అనే ఒక వ్యక్తి ట్రంప్ మీద హత్యాయత్నం చేశాడు. ఆ మిస్టర్ క్రూక్ షార్ప్ షూటర్ కానట్టుంది.. బుల్లెట్ ట్రంప్ చెవిని రాసుకుంటూ వెళ్ళింది. ఆ షూట్ చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేశారు. తన మీద ఈ హత్యాయత్నం అధికార పార్టీయే చేయించింది అని ట్రంప్ గగ్గోలు పెట్టారు. అయితే, ఆయన గగ్గోలుని ఎవరూ పట్టించుకోలేదు. ఇదంతా ఎలక్షన్లలో సానుభూతి పొందడం కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామాగా చాలామంది అమెరికన్లు బాహాటంగానే విమర్శించారు.  మొన్నామధ్య ట్రంప్ ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతూ వుండగా ఒక వ్యక్తి ట్రంప్‌ని  హత్య చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడని, తుపాకీ తీసుకుని ట్రప్ దగ్గరకి రాబోతూ వుండగా భద్రతాదళాలు అతన్ని పట్టుకున్నాయని వార్తలు వచ్చాయి. దీన్ని కూడా అమెరికా జనం లైట్‌గా తీసుకున్నారు. బుల్లెట్ చెవిని రాసుకుని వెళ్ళినప్పుడే జనం పట్టించుకోలేదు. ఇప్పుడు రెక్కీ జరిగిందని అంటే పట్టించుకుంటారా? ఇప్పుడు మరోసారి అంటే, ముచ్చటగా మూడోసారి ట్రంప్‌ని హత్యచేసే ప్రయత్నం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలిఫోర్నియాలోని కోచెల్లా ప్రాంతంలో ట్రంప్ ర్యాలీ నిర్వహించిన సమయంలో వేం మిల్లర్ అనే వ్యక్తి రెండు తుపాకులు జేబుల్లో పెట్టుకుని తిరిగాడని, దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఏంటో... ఇలా ఎలక్షన్‌ టైమ్‌లో వరుసగా జరుగుతున్న ఈ హత్యాయత్నాలు చూస్తుంటే మనకి మన జగనన్నే గుర్తొస్తూ వుంటాడు.

 ఆటోలో గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చిన  మంత్రి కొండాసురేఖ 

మంత్రి కొండాసురేఖ భర్త కొండామురళి, ఎమ్మెల్యే రేవూరి  ,  వర్గీయుల మధ్య గొడవ  చిలికి చిలికి గాలివానగా మారింది. కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయడం మంత్రి కొండాసురేఖకు కోపం తెప్పించింది. వెంటనే ఆమె ఆటో కట్టుకుని గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులతో ఘర్షణ పడ్డారు. బతుకమ్మవేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటోలు లేకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది.  పరకాల నియోజకవర్గంలో ప్లెక్సీల విషయంలో ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. వీరిలో కొండా వర్గీయులు ఉన్నారు.  తమ అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారు అని మంత్రి కొండాసురేఖ పోలీస్ కమిషనర్, సి ఐల ను పోలీస్ స్టేషన్ లోనే నిలదీశారు. పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కుర్చీలో మంత్రి కొండా సురేఖ కూర్చొని పోలీసులను నిలదీశారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఇటీవల సినీ హీరో నాగార్జున కుటుంబం మీద వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన మంత్రి కొండాసురేఖ నాంపల్లికోర్టులో పరవు నష్టం దావా కేసులో ఇరుక్కున్నారు. తాజాగా  వరంగల్ నర్సంపేట రోడ్డులో జరిగిన ఘర్షణతో మరోసారి వార్తల్లోకెక్కారు. 

రైలు ప్రమాదం... ఆ 7 నిమిషాల్లో ఏం జరిగింది?

తమిళనాడులోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ దగ్గర శుక్రవారం నాడు జరిగిన భాగమతి ఎక్స్.ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగి వుందన్న అనుమానంతో విచారణ జరుగుతోంది. ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా? సిగ్నలింగ్ వైఫల్యం వల్ల జరిగిందా? కుట్ర కోణమా? ఇతర కారణాలు ఏవైనా వున్నాయా అనే అంశాల మీద ఎన్ఐఏ, రైల్వే భద్రతా విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. భాగమతి ఎక్స్.ప్రెస్ ప్రధాన లైన్‌లో కాకుండా లూప్ లైన్లోకి వెళ్ళి గూడ్స్.ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు బోగీలు కాలిపోయాయి. మొత్తం పన్నెండు బోగీలు ధ్వసమయ్యాయి. ఈ ప్రమాదంపై విచారణ నిమిత్తం రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. గత సంవత్సరం ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే ఈ ప్రమాదం కూడా జరగడంతో ఏదైనా కుట్రకోణం వుందా అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో రికార్డ్ అయిన డేటా లాగర్‌ని తీసుకుని, ప్రమాదానికి ముందు ఏం జరిగిందో పరిశీలించారు. భాగమతి ఎక్స్.ప్రెస్‌కి ముందు మరో ట్రైన్ అదే మార్గంలో వెళ్లింది. అయితే ఆ ట్రైన్ లూప్ లైన్‌లోకి వెళ్ళలేదు. ఆ ట్రైన్‌కి, ఈ ట్రైన్‌కి మధ్య ఏడు నిమిషాల వ్యవధి వుంది. ఈ ఏడు నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనేది ఇప్పుడు కీలకంగా మారింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో దర్యాప్తు బృందాలు వున్నాయి.  రైలు ట్రాక్ మారడానికి వాడే సిగ్నలింగ్ గేర్, స్విచ్ పాయింట్‌ని ట్యాంపర్ చేసినట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. కవరైపేట్టై స్టేషన్‌కి సమీపంలోనే వున్న పొన్నేరి రైల్వే స్టేషన్లో ఇటీవల పట్టాల ఇంటర్ లాకింగ్ వ్యవస్థను టాంపరింగ్ చేసినట్టు బయటపడటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పట్టాలకు సంబంధించిన బోల్టులు, నట్లు మాయమైనట్టు గుర్తించారు. 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ భారీ వర్షం హెచ్చరిక!

ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న  హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడన ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల సోమవారం నాడు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం వుంది. ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనం బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ రెయిన్ అలెర్ట్ జారీ చేశారు.  • సోమవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది.  • బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. • నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం. • భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్.కు దూరంగా ఉండాలి. • బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదు. • మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. • పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలి. • వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా వుంది. అందువల్ల పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు  చెట్ల క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.

దేవరగట్టు ఉత్సవంలో 70 మందికి గాయాలు!

దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం వల్ల 70 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. కర్నూలు జిల్లా హోళగుంద సమీపంలోని దేవరగట్టులో ప్రతి ఏటా దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ప్రజలు కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇది ఈ ప్రాంతంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతి సంవత్సరం జరిగే ఈ బన్నీ ఉత్సవం సందర్భంగా గతంలో ఎన్నోసార్లు కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా వున్నాయి. అయినప్పటికీ ఈ సంప్రదాయం ఆగలేదు. ఈ సంవత్సరం భారీ స్థాయిలో బన్నీ ఉత్సవం జరిగింది. ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. 70 మంది ఈ సందర్భంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమించిందని సమాచారం. ఈ సంవత్సరం ఇలా జరిగిందని వచ్చే సంవత్సరం జనం ఆగరు. కర్రలతో కొట్టుకోవడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో షరా మామూలే.

జ‌గ‌న్ తీరు.. వైసీపీ బేజారు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ అనాలోచిత‌ నిర్ణ‌యాలు ఆ పార్టీ శ్రేణుల‌ను ఆందోళనకు గురి చేయడమే కాదు, ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది వైసీపీ నేత‌ల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. ఓ అప‌రిచితుడిలా జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ నేత‌ల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చెప్పినా వినే మ‌న‌స్త‌త్వం జ‌గ‌న్‌ది కాదు. గ‌డిచిన ఐదేళ్ల‌లో అధికారంలో ఉండ‌టంతో ఆయ‌న ఆడింది ఆట‌ పాడింది పాట అన్నట్లుగా సాగింది. ప్ర‌స్తుతం జగన్ అధికారంలో లేరు. ఆయన పార్టీకి కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు. అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా ప్రభుత్వాన్నీ, పార్టీనీ నడిపిన జగన్ ఇప్పుడు రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ఈ విషయాన్నివైసీపీ నేతలో స్వయంగా అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. జగన్ తీరు పట్ల  ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.  అధికారంలో ఉన్న‌ప్పుడు అన్ని పార్టీల నేత‌లను చెడామాడా తిట్టేసిన నేతల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది‌. వ్యూహాల్లేకుండా, అడ్డగోలు నిర్ణయాలతో  త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును జగన్ నాశనం చేస్తున్నారని ప‌లువురు వైసీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జగన్ తీరుతో విసుగు చెంది పలువురు ఇఫ్పటికే పార్టీని వీడారు. మరి కొందరు వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.  అయినా జ‌గ‌న్ డోంట్ కేర్ అంటూ పేర్కొంటుండ‌టం పార్టీలో మిగిలిన నేతలు, శ్రేణుల్లో మ‌రింత ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది.  జ‌గ‌న్  ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రాజ‌కీయాలు చేయ‌డం ఏమాత్రం తెలియ‌ద‌ని వైసీపీ నేత‌లు బాహాటంగానే అంటున్నారు. రాజ‌కీయాల్లో అవ‌స‌ర‌మైన చోట త‌గ్గాలి.. ఆధిప‌త్యం చెలాయించాల్సిన‌ చోట ప‌ట్టువిడ‌వ‌కుండా పోరాడాలి.. అదే స‌మ‌యంలో త‌మ‌ను న‌మ్ముకున్న వారికి ర‌క్ష‌ణ‌గా ఉండాలి. కానీ, జ‌గ‌న్  మాత్రం ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో తాను చెప్పిందే చేయాలి అన్న‌ట్లుగా పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు ఇస్తున్నారు‌. గ‌త ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉండ‌టంతో జ‌గ‌న్ చెప్పిన‌ట్లు విన్న వైసీపీ నేత‌లు.. ప్ర‌తిప‌క్షంలోనూ జ‌గ‌న్ అదే వ్య‌వ‌హార‌శైలితో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్య‌ర్ధుల నియోజ‌క‌వ‌ర్గాలు మార్చ‌వ‌ద్ద‌ని జ‌గ‌న్‌కు వైసీపీ సీనియ‌ర్ నేతలు ప‌దేప‌దే సూచించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం నియోక‌వ‌ర్గాల అభ్యర్థులను ఇష్టారీతిగా మార్చేశారు.  ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మికి అదికూడా ఓ కార‌ణం. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఓ ఆరు నెల‌ల స‌మ‌యం ఇద్దామ‌ని, ఆ త‌రువాత వారి ప‌నితీరులో లోపాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్దామ‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చేసిన సూచనలను జగన్ ఇసుమంతైనా ఖాతరు చేయకుండా  చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క్షణం  నుంచే విమ‌ర్శ‌లు చేయ‌డంతో జనంలో జగన్ పట్ల, వైసీపీ పట్లా ఉన్న వ్యతిరేకత మరింత ఎక్కువైందని వైసీపీ నేతలే అంటున్నారు.   విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు ఆ పార్టీ నేత‌ల‌కే ఆగ్ర‌హాన్ని తెప్పించింది. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌వారికి స‌హాయం చేయాల్సిందిపోయి అధికారంలోకి కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం జ‌గ‌న్ రాజ‌కీయ అజ్ణానానికి నిద‌ర్శ‌మ‌న్న భావన వైసీపీలోనే వ్యక్తమైంది.   వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఆ ప్రాంతంలో జ‌గ‌న్ నామ‌మాత్రంగా ప‌ర్య‌టించారు.. అలాకాకుండా వ‌ర‌ద‌ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారిని ప‌రామ‌ర్శించి ఆర్ధిక స‌హామ‌యో, ఇత‌ర రూపాల్లో స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తే బాగుండేది. కానీ, జ‌గ‌న్ మాత్రం అలాంటి ప‌నులేమీ చేయ‌కుండా త‌న సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌భుత్వంపై బుద‌ర‌జ‌ల్లే ప్ర‌య‌త్నానికే ప్రాధాన్య‌త‌నిచ్చాడు. దీనికితోడు వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం అందించిన ఆర్థిక స‌హాయం విష‌యంలోనూ జ‌గ‌న్, అనుకూల మీడియా అస‌త్య‌ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో మ‌రింత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణమైందని అంటున్నారు.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించిన స‌మ‌యంలో ఈవీఎంలు బెస్ట్ అని చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ఈవీఎంల వ‌ల్ల‌నే ఓడిపోయామ‌ని చెబుతుండ‌టంతో ఆయ‌న‌లో రాజ‌కీయ అవ‌గాహ‌నలేమిని స్ప‌ష్టంగా తెలియ‌జేస్తున్నద‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు.  హ‌రియాణా ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌లు ఈవీఎంల‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. ఏపీలోనూ అదే ప‌ద్ద‌తిలో జ‌రిగింద‌ని చెబుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతికే మొగ్గు చూపాలని జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు. అయితే 2019లో మాత్రం ఈవీఎంలను స‌మ‌ర్ధించిన జ‌గ‌న్‌.. ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హ‌రియాణా ఎన్నిక‌ల్లో ఈవీఎంల గురించి జ‌గ‌న్ మాట్లాడ‌టంతో ఆయ‌న ఇండియా కూట‌మిలోకి వెళ్లేందుకు చూస్తున్నారా అన్న చ‌ర్చ మొదలైంది. ఇప్ప‌టికే ఎన్డీయేలో జగన్ కు స్థానం లేకుండా పోయింది. బీజేపీ కూడా గతంలో జగన్ పట్ల ఉన్న సానుకూలత కనబరచడం లేదు. ఇక  ఇండియా కూట‌మిలోకి వెళ్లేందుకు జ‌గ‌న్ చేస్తున్న ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆయన సొంత చెల్లెలు షర్మిల మొదట్లోనే గండి కొడుతున్నారు.  దీంతో రెండింటికి చెడ్డ రేవ‌డిలా జగన్, వైసీపీ ప‌రిస్థితి ఉంది.  జ‌గ‌న్ తీరులో మార్పురాకుంటే రాబోయే కాలంలో వైసీపీ క‌నుమ‌రుగు కావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

గూడ్స్.ని ఢీకొన్న భాగమతి ఎక్స్.ప్రెస్!

భాగమతి ఎక్స్.ప్రెస్ చెన్నై సమీపంలో ఆగివున్న గూడ్స్ ట్రైన్.ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు బోగీలు కాలిపోయాయి. పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా దర్భంగా  వెళ్లాల్సిన భాగమతి ఎక్స్.ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని కోచ్‌లు చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని కోచ్‌లు ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. రెండు కోచ్‌లో కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇంత దారుణమైన ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరూ మరణించలేదు. పది మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును భాగమతి ఎక్స్.ప్రెస్ ఢీకొన్నప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. వారందరినీ సమీపంలో వున్న ఆస్పత్రులకు తరలించారు.

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌ ఖాయం‌.. కొండా సురేఖపై వేటు తథ్యం?

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం కుద‌ర‌డం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. దీంతో మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారికి నిరాశే ఎదుర‌వుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు అవుతోంది. అయినా పూర్తిస్థాయి కేబినెట్ లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేబినెట్ విస్త‌ర‌ణ‌కు రేవంత్ రెడ్డికి   పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ద‌స‌రా త‌రువాత  ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే విష‌యంపై టీపీసీసీ చీఫ్  మ‌హేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ద‌స‌రా త‌రువాత ఎట్టి ప‌రిస్థితుల్లో కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని చెప్ప‌డంతో.. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారు త‌మ ప్ర‌య‌త్నాల‌ను మ‌రోసారి షురూ చేశారు. అయితే, ఈసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణంలో మంత్రి కొండా సురేఖ‌కు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో మ‌రో బీసీ ఎమ్మెల్యేను మంత్రిగా తీసుకుంటార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.   ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మ‌యంలో ఆయ‌న‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో మొత్తంగా తెలంగాణ కేబినెట్‌లో 12 మంది కొలువుదీరారు. కేబినెట్‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి న‌లుగురు, బీసీ, ఎస్సీ సామాజిక వ‌ర్గాల నుంచి ఇద్ద‌రు చొప్పున‌, ఎస్టీ, క‌మ్మ‌, వెల‌మ సామాజిక వ‌ర్గాల నుంచి ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. మ‌రో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం కేబినెట్‌లో నాలుగు ఉమ్మ‌డి జిల్లాల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించ‌లేదు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆ నాలుగు జిల్లాల‌కు క‌చ్చితంగా చోటు క‌ల్పించాల్సి ఉంటుంది. మ‌రో వైపు కేబినెట్ విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే జిల్లాల వారిగా ఆశావ‌హ ఎమ్మెల్యేలు అధిష్టానానికి విన్న‌వించుకున్నారు. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారి పేర్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలోనే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధిష్ఠానం కూడా సామాజిక వ‌ర్గాల వారిగా, జిల్లాల వారిగా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల్సిన వారి పేర్ల‌ను  ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది.  మొత్తం ఆరు బెర్త్ లు ఖాళీ ఉండ‌గా.. ప్ర‌స్తుతం జ‌ర‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో నాలుగు మంత్రి ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తార‌ని తెలుస్తోంది. వీరిలో ఏఏ సామాజిక వ‌ర్గాల వారికి అవ‌కాశం క‌ల్పిస్తార‌నే ఆంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చర్చ జరుగుతోంది.  మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ‌పై వేటు ప‌డుతుంద‌ని కొద్ది రోజులుగా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఆమె కేటీఆర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడే స‌మ‌యంలో హీరో నాగార్జు కుటుంబంపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నాగచైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణ‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాక బాలీవుడ్ హీరోయిన్ల ప్ర‌స్తావ‌న తెస్తూ కేటీఆర్ పై విమ‌ర్శ‌లు చేశారు. సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించాయి. హీరో నాగార్జున, ఆయ‌న కుటుంబం మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుంది.  టాలీవుడ్‌ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖ‌లు నాగార్జున‌కు మ‌ద్ద‌తుగా నిలిచి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఓ విధంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై యుద్ధ‌ భేరి మోగించిన‌ట్ల‌యింది. వివాదం పెద్ద‌ది కావ‌డంతో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను కొండా సురేఖ వెన‌క్కు తీసుకున్నారు. హీరోయిన్ స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయినా శాంతించ‌ని నాగార్జున ఆమెపై నాంప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఇటీవ‌ల నాగార్జున‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు  నాంప‌ల్లి కోర్టుకు హాజ‌ర‌య్యారు. తాజాగా కేటీఆర్ సైతం కొండా సురేఖపై నాంప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా కొండా సురేఖ వ్యాఖ్య‌లు చేశార‌ని కోర్టులో పిటీష‌న్ వేశారు. వీటికి సంబంధించి నాంప‌ల్లి కోర్టు కొండా సురేఖ‌కు నోటీసులు  జారీ చేసింది. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌లో ఆమె మంత్రి ప‌ద‌వి పోవ‌టం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీలోనూ చ‌ర్చ మొద‌లైంది. ఈ విష‌యంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొలిగించే ఆలోచ‌న‌లో అదిష్టానంకు లేద‌ని చెప్పారు. తాజా విష‌యంపై ఆమెను అధిష్టానం వివ‌ర‌ణ కూడా కోర‌లేద‌ని, ఇదంతా రాజ‌కీయంగా కొండా సురేఖ‌పై బీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న అస‌త్య ప్ర‌చారం అన్నారు. కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో భావోద్వేగానికి గురై ఆమె నాగార్జున కుటుంబానికి సంబంధించి వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆ త‌రువాత త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకున్నార‌ని గుర్తుచేశారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణంలో కొండా సురేఖపై వేటు ప‌డుతుంద‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తేల్చిచెప్పారు. మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డికూడా కొండా సురేఖ‌కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని, దీంతో ఆమెకు మంత్రి ప‌ద‌వికి వ‌చ్చిన ప్ర‌మాద‌మేమీ లేద‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు.

బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు!

కృష్ణా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంలో బెజవాడ కనకదుర్గమ్మ జలవిహారాన్ని ప్రభుత్వం రద్దు  చేసింది. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు శనివారం (అక్టోబర్ 12)తో ముగుస్తాయి. ఆ సందర్భంగా దుర్గమ్మవారు హంసవాహనంపై కృష్ణా నదిలో విహరించడం ఆనవాయితీ. అయితే ఆ జలవిహారాన్ని ప్రభుత్వం నదిలో వరద పోటు కారణంగా రద్దు చేసింది.  ప్రతి ఏటా విజయ దశమి రోజున బెజవాడ కనకదుర్గమ్మను  రాజరాజేశ్వరి దేవిగా  అలంకరించి కృష్ణానదిలో తెప్పోత్సవం, హంసవాహన సేవ నిర్వహిస్తారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. అయితే కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో  ఈ ఏడాది తెప్పోత్సవం  రద్దైంది. 

నందిగం సురేష్ ఫైన్.. మళ్లీ జైలుకు!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ గురువారం తనకు ఛాతీలో, భుజంలో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు అధికారులు ఆయనను హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించిన సంగతి తెలిసిందే.   జీజీహెచ్ లో వైద్యలు ఆయన పరీక్షలు నిర్వహించారు. సిటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ సహా అన్ని చికిత్సలూ చేసిన తరువాత ఆయన ఆరోగ్యం బాగుందని నివేదిక ఇచ్చారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తరలించారు. నందిగం సురేష్ ను ఆస్పత్రికి తీసుకువచ్చిన సంగతి తెలిసి పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. 

నిహాన్ హిడాంక్యోకు నోబెల్ శాంతి పురస్కారం

అణ్వాయుధాలు, అణుయుద్ధాలు లేని ప్రపంచాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకు 2024 నోబెల్ శాంతి బహుమతి లభించింది.   నాగసాకి అణుబాంబు దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నే సంస్థ నిహాన్ హిడాంక్యో. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పోరాడుతున్న ఈ గ్రూప్ ను నోబెల్ కమిటీ అత్యున్నత శాంతి బహుమతిని ప్రకటించింది. అణ్వాయుధాలను మళ్లీ వాడకూడదన్న డిమాండ్ తో నిహాన్ హిడాంక్యో సంస్థ పలు ప్రదర్శనలు నిర్వహించింది. అణ్వాయుధ రహిత సమాజం కోసం పోరాడుతున్న నిహాన్ హిడాంక్యో కృషికి గుర్తింపుగా ఆ సంస్థను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించింది. 

అయ్యో పాపం.. రూపాయి..!

ప్రపంచ దేశాల్లో మన ఇండియా రేంజే వేరు. మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇంకా కొద్ది సంవత్సరాలు ఆగితే మన ఇండియా ప్రపంచంలోనే ఒక అగ్ర దేశంగా అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలూ గట్రా జరిగితే, మా మధ్య గొడవలు పరిష్కరించండి మహాప్రభో అని అన్ని దేశాలూ మన దేశం వైపే చూస్తాయి... ఇవన్నీ మన దేశంలోని రాజకీయ నాయకులు చెప్పే మాటలు.. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో మన పరిస్థితి ఏంటో మన రూపాయిని అడిగితే చెబుతుంది. శుక్రవారం నాడు మన రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం  84.05 రూపాయలకు చేరింది. పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల రూపాయికి ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.