వైసీపీకి మాజీ హోంమంత్రి సుచరిత గుడ్ బై.. పార్టీలో ఎవరైనా మిగులుతారా?
posted on Oct 24, 2024 9:28AM
వైఎస్ తరచూ చెప్పే దేవుడి స్క్రిప్ట్ అంటే అర్ధం ఏమిటో ఇప్పుడిప్పుడే జగన్ కు తెలుస్తోంది. అధికారం ఉందన్న అహంకారంతో అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదని అవగతమౌతోంది. జగన్ తో అంటకాగి, ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికీ, ఆయన దృష్టిలో పడటానికీ ఇష్టారీతిగా వ్యవహరించి, అడ్డగోలుగా ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేసి, దూషణలకు పాల్పడిన ఒక్కొక్కరికీ ఇప్పుడు బొమ్మ కనబడుతోంది. కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. నోరెత్తడానికే భయంతో వణికి పోతున్న పరిస్థితి.
ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని, పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలతో ఆ పార్టీ దయనీయంగా మిగిలింది. ఈ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ తీరును విమర్శిస్తూ, తమ రాజకీయ భవిష్యత్ ను వెతుక్కుంటూ వైసీపీని వీడుతున్నారు. ఎన్నికలలో పరాజయం తరువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన వలసన పరంపర ఇప్పుడు ఉధృతమైంది. ఆ పార్టీలో జగన్ వినా ఎవరైనా ఉంటారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయంటూ జగన్ కు దూరం అవుతున్న వైసీపీ నేతల సంఖ్య ఎంత పెద్దగా ఉందో అర్ధమౌతుంది. ఇప్పటికే వైసీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయింది. ఆ పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే కదలి వచ్చే కార్యకర్తలు కరవయ్యారు.
ఇక వైసీపీని వీడుతున్న నేతలలో పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అత్యంత కీలకంగా వ్యవహరిం చిన, జగన్ కు అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన, నమ్మిన బంట్లుగా వ్యవహరించిన వారే ముందు వరుసలో ఉండటం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది.
జగన్ కు సమీప బంధువు, ఆయనకు వరుసకు మామ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన ఈ వలసలు విరామం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. బాలినేని కంటే ముందు కిలారు రోశయ్య వైసీపీని వీడారు. ఇక ఆ వరుసలో సామినేని ఉదయబాను.. మోపిదేవి, బీదం మస్తానరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును మించిపోయేంత పొడుగు ఉంటుంది. తాజాగా బుధవారం మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఆ సందర్భంగా ఆమె నేరుగా జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్ కు బాధ్యత లేదనీ, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి లేదనీ, రాజకీయం అంటే ఆయనకు వ్యాపారమనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇప్పుుడు పార్టీ మారుతున్న వారి జాబితాలోకి మరో పేరు వచ్చి చేరింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత రాజకీయాలకు కొత్తే అయినా.. జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన నేతల్లో ఆమె ఒకరు. జగన్ సీఎం కాగానే.. సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు. అయితే సజ్జలతో విభేదాల కారణంగా జగన్ తన కేబినెట్ ను విస్తరించిన సమయంలో ఆమె మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ అసంతృప్తితోనే ఉన్న సుచరిత.. ఆ సమయంలో జగన్ పై, సజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ స్వయంగా పిలిచి బుజ్జగించడంతో అయిష్టంగానే పార్టీలో కొనసాగిన మేకతోటి సుచరిత.. ఇక ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పార్టీ మారడానికే నిర్ణయించుకున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు.