నవంబర్ 11న ఏపీ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 11న చంద్రబాబునాయుడి ప్రభుత్వం పూర్తి స్థయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. తద్వారా కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదనీ, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదనీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టనుంది. ఇప్పటికే   బడ్జెట్‌ రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్ ప్రసంగానికి రెడీ అయిపోయారు. ఈ సారి బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ మేరకు ఆదాయం సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ప్రజలపై భారం మోపకుండా ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖను చంద్రబాబు ఆదేశించారు  అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్‌ సమర్పించారు.  2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ. 1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది. ఆ తరువాత ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి జూన్ నెలలో అధికార పగ్గాలను చేపట్టింది.   ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్న కారణంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుని,  ఆగస్టు మూడు నుంచి నవంబర్ వరకూ నాలుగు నెలల కాలానికి  రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్‌ఆమోదం పొందింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఎనిమిది నెలల పాటు ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ తోనే . మొత్తం 8 నెలల కాలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ తోనే గడిపేసింది.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు భారీ షాక్!

అమెరికా ఎన్నికల వేళ ఆ దేశంలోని ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ సంక్షోభంలో కూరుకుపోయింది. సంక్షోభం అంటే ఆర్థిక సంక్షోభం కాదు. కాలమిస్టులు వాషింగ్టన్ పోస్ట్ కు రాజీనామా చేశారు. అంతే కాదు పత్రిక సబ్ స్క్రైబర్లలో కనీసం ఎనిమిది శాతం మంది విత్ డ్రా అయ్యారు. ప్రింట్  అండ్ డిజిటల్ మీడియాకు సంబంధించి ఈ సబ్ స్క్రిప్షన్ ల రద్దు ఉంది. దాదాపు రెండు లక్షల మంది వాషింగ్ టన్ పోస్ట్ చదివే ప్రశక్తే లేదని ప్రకటించారు.  ఇందుకు కారణమేమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వాషింగ్టన్ పోస్ట్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు వ్యతిరేక స్టాండ్ తీసుకోవడమే కారణం. వాషింగ్టన్ పోస్ట్ ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటల వ్యవధిలో ఎనిమిది శాతం మంది పత్రిక సబ్ స్క్రైబర్లు  విత్ డ్రా అయ్యారు.  అలాగే ప‌లువురు కాలమిస్టులు రాజీనామా చేశారు. అయితే వీటివేటినీ వాషింగ్టన్ పోస్టు ధృవీకరించలేదు. అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మధ్య హోరోహోరీ పోరు సాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ పోస్టు ఒక సైడ్ తీసుకోవడాన్ని కాలమిస్టులు, సబ్ స్క్రైబర్లు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ ప్రభావం వాషింగ్ టన్ పోస్టు క్రెడిబులిటీపై ఏ మేరకు ప్రభావం చూపిందన్నది కొద్ది రోజులలో తేలుతుంది. అలాగే డోనాల్డ్ ట్రంప్ కు కమలా షారీస్ ఎంత గట్టి పోటీ ఇస్తున్నారన్నదది కూడా తేటతోల్లం అవుతుంది.  

షర్మిలా వర్సెస్ జగన్.. ఆస్తిగొడవలూ, రాజకీయాలు!

ఆస్తుల వ్యవహారంలో వైఎస్ కుటుంబం బజారున పడుతున్నది. ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని రాజకీయోక్తి. అదే నేడు జగన్,షర్మిల విషయంలో నిజమవుతున్నది.. ఆస్తుల  విభేదాలు ఎలా ఉన్నా వైఎస్ కుటుంబం లోని లొసుగులన్నీ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో బయటపడి వైఎస్ కుటుంబం నవ్వుల పాలౌతోంది.  జగన్, షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం కంటే ఆస్తి గొడవలే పెద్ద పీట వేసుకు కూర్చున్నాయి. జగన్ ఇక  షర్మిలపై వ్యాఖ్యలు చేయనని ప్రకటించడం తన ప్రతిష్ఠ మరింత మసకబారకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక షర్మిలపై వ్యాఖ్యలు చేయనని ప్రకటిస్తూ ఆయన రాసిన లేఖ.. షర్మిలను మరింత రెచ్చగొట్టేదిలా ఉంది తప్ప సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నంలా ఇసుమంతైనా లేదు.  ఎవరు ఎంతగా గింజుకున్నా, సొంత పరువు బజారున పడేసుకునేలా వ్యవహరించినా జగన్ షర్మిల మధ్య ఆస్తుల తగాదాను తీర్చాల్సింది న్యాయస్థానాలే తప్ప రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో ఓరిగేదేం ఉండదు.  ఇప్పటికే షర్మిల జగన్ మధ్య రాజకీయ వైరుద్ధ్యం, వ్యక్తిగత వైరం చల్లారే అవకాశాలు లేని స్థాయికి వెళ్లిపోయాయి. జగన్ రెండడుగులు ముందుకు వేసి తన కుటుంబ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయ వ్యవహారంగా మార్చేశారు. సొంత చెల్లి అన్న అనుబంధం మరిచి తన పార్టీ నేతల చేత షర్మిలపై అనుచితంగా విమర్శల దాడి చేయించారు. ఆమె వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడలేదు. మొత్తంగా జగన్ తీరు  పట్ల రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా ఏవగించుకునేలా ఉంది. వైఎస్ అభిమానులైతే జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే స్థాయిలో షర్మిల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. షర్మల కూడా అన్న అనుచిత తీరును,  ఆయన పార్టీ నేతల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్నారు.  వైఎస్ మరణం వెనుక టీడీపీ హస్తం ఉందని,ముఖ్యంగా చంద్రబాబు హస్తం ఉందని విజయసాయిరెడ్డి తదితరులు ఆరోపించడం, దానికి షర్మిల అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో గాడిదలు కాసారా ,క నీసం విచారణ కూడా ఎందుకు చేయలేదని ధ్వజమెత్తారు. కని పెంచిన తల్లి విజయమ్మ పై కూడా కేసు వేసిన విషనాగు జగన్ అని షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు.   వైఎస్ ఆస్తులు పంచారని,మిగిలినవి జగన్ స్వార్జితమేనని విజయసాయి చెప్పడం ఆశ్చర్యం. వైఎస్ చనిపోయే నాటికి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 2009లో జగన్ ఆస్తుల విలువ రూ.77 కోట్లు మాత్రమే. అది 2024కల్లా రూ.530కోట్లకు చేరింది. అదెలా సాధ్యమయ్యిందో జగన్ వివరించి ఉండాల్సింది. స్వార్జితం, చెమటోడ్చి సంపాదించాను అని జగన్ చెప్పడం నమ్మశక్యంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది పక్కన పెడితే చంద్రబాబు వదిలిన విషపు బాణం షర్మిల అని జగన్ అనుయాయిలు ఆరోపించడం,  ఆమెకు పీసీసీ పదవి ఇప్పించిందే చంద్రబాబు అని అనడం విడ్డూరంగానే కాదు, హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి.    ఏదిఏమైనా ఆస్తులు తగాదాలు రాజకీయాలతో కలపడం, సందర్భం వచ్చిందని దుమ్మెత్తిపోయడం సబబు కాదని,రాజకీయాలను మరింత దిగజార్చవద్దని వైఎస్ అభిమానులు జగన్ కు సూచిస్తున్నారు.  

 ఇచ్చాపురం నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ ...అక్టోబర్ 31 నుంచి  చంద్రబాబు శ్రీకారం 

ఎపిలో  కూటమి ప్రభుత్వం ఒక్కో ఎన్నికల హామీని నెరవేరుస్తుంది. గత ఎన్నికలముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీల్లో ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చాయి. కూటమి పార్టీలు అధికారంలో రావడంతో  మరో ఎన్నికల హమీ బుధవారం నుంచి అమలు కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి  ప్రారంభించనున్నారు. దీపావళి వేళ తొలి సిలిండర్ ఇవ్వనున్నారు.  ప్రతీ ఇంటిలో దీపాలు వెలిగించాలని, వెలుగులు నింపాలని  కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నెల 29 వ తేదీ ఉదయం 10 గంటల  నుంచే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. కోటి 55 లక్షల లబ్దిదారులకు ఉచితంగా సిలిండర్ లు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖామంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు.  ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఎల్పీజీ కనెక్షన్ కంపల్సరీ. ఈ పథకాన్ని అమలు చేయడానికి మూడు ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బుక్ చేసిన 48 గంటల లోపు లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుంది.   ప్రతీ నాలుగునెలలకు ఒక ఉచిత సిలిండర్ ఇవ్వనున్నారు. తొలుత డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే లబ్దిదారుల ఖాతాల్లో జమఅవుతాయి. సిలిండర్ కు 900 కోట్ల రూపాయలు  రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడనుంది.  మొత్తం మూడుసిలిండర్లకు 2 వేల 684 కోట్ల భారం ప్రభుత్వం మోయనుంది. 

బాలినేని.. మనిషొక చోట.. మనసొక చోట!

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి, వైసీపీ మాజీ నాయకుడు. అన్నిటికీ మించి జగన్ కు సమీప బంధువు. ఆయన ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి జనసేన గూటికి చేరారు. అయినా ఆయన మానసిక బంధం ఇంకా జగన్ తోనే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 28) మీడియాతో మాట్లాడుతూ జగన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి లైవ్ లో ఆయన పడిన ఇబ్బంది కళ్లకు కట్టినట్లు కనిపించింది. అలాగే తాను ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాటా తడబడుతూనే వచ్చింది. మొత్తంగా షర్మిల, జగన్ మధ్య ఆస్తుల తగాదా విషయంపై మాట్లాడడానికి ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడిన మాటలు వింటే మనిషి జనసేనలోనూ మనసు వైసీపీతోనూ ఉందని పించేలా ఉన్నాయి.  వాస్తవానికి ఆయన వైసీపీలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం, జనసేన నేతలు, శ్రేణులపై సాగించిన దాష్టికాలు, దౌర్జన్యాలూ ఇన్నీ అన్నీ కావు. అందుకే ఆయన జనసేన గూటికి చేరుతున్న సమయంలో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనసేన కార్యకర్తలూ ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు.  అయితే పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో గట్టిగా మాట్లాడలేకపోయారు. తెలుగుదేశం శ్రేణులూ మౌనం వహించాయి. ఇక  సోమవారం (అక్టోబర్ 28) ఆయన మీడియా ముందు ఎలాంటి శషబిషలూ లేకుండానే తాను వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషినని చెప్పుకున్నారు. అంతే కాదు షర్మిల, జగన్ ల మధ్య ఆస్తుల వివాదంపై తన వైఖరి ఏదో స్పష్టంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. జగన్ కు విమర్శిస్తూ ఒక్క మాట కూడా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసేలా ఆయన తీరు ఉంది. షర్మిలతో ఆస్తి వివాదంలో వైసీపీ చంద్రబాబు పేరు లాగడం కరెక్టు కాదు అన్న మాట కూడా ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మద్దతుగా ఆయన గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయారు. దీంతో  బాలినేనిపై తెలుగుదేశం, జనసేన శ్రేణులలో అనుమానాలు మరింత పెరిగాయి. ఆయన జనసేన గూటికి చేరడం వెనుక కూటమి ఐకమత్యాన్ని దెబ్బతీసే కుట్ర ఉందా అన్న సందేహాలు వారిలో వ్యక్తం అవుతున్నాయి.   ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎంలే కారణం అంటూ బాలినేని ఆరోపించడమే కాకుండా,  ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలంటూ ఈసీని కోరారు. మొత్తంగా బాలినేని తాజా మీడియా మీట్ లో బాలినేనిలోని వైసీపీ అనుకూలత ప్రస్ఫుటంగా బయటపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జగన్ పాలన అంతానికి బీజం వేసిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కి ఏడాది!

నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ కుట్రతో  స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసింది.  ఆ సందర్భంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం మహామహా తలపండిన నేతలనే ఆశ్చర్యానికి గురి చేసింది.  రాజకీయాలతో సంబంధం లేకుండా జనం వెల్లువలా బయటకు వచ్చి ఆందోళనలకు దిగారు. కులం, మతం, రాజకీయం, రాష్ట్రం, దేశం ఇలా ఎలాంటి తేడాలూ లేకుండా ప్రపంచం నలుమూలల చంద్రబాబు అరెస్టునకు నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనలకు, నిరసనలకూ ఎవరూ పిలుపు ఇవ్వలేదు. ఎవరికి వారుగా స్వచ్ఛందంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి రోడ్లపైకి వచ్చారు. నిర్బంధాలను లెక్క చేయలేదు. ఎవరాపగలరు మా ఆగ్రహాన్ని. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అరెస్టులతో చంద్రుడి వెలుగులను దాచలేరు అంటూ జనం నినదించారు. ఒక నేతను అరెస్టు చేస్తే ఇంత జనాగ్రహమా? ఏమిటి ఆయన గొప్పతనం? ఎందుకింత ప్రజాభిమానం.  , ఆయనేమీ దేవుడు కాదే. ఇంద్రుడూ కాదు , చంద్రుడూ కాదు. ఎందరో నాయకుల్లో ఆయనొకరు, కానీ, ఆయన కోసం ప్రపంచంలో  తెలుగువారు ఉన్న ప్రతి దేశంలో ఆందోళనలు జరిగాయి. ఆయనను విడుదల చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.  అవన్నీ ఒకెత్తైతే గచ్చిబౌలిలో  నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ మరో ఎత్తు. ఆ సభ ఒక అద్భుతం. ఎవరెవరో, ఎక్కడెక్కడ నుంచో   వచ్చి చంద్రబాబు కోసం గళం విప్పారు.  దేశ విదేశాల నుంచి   విభిన్న వర్గాల ప్రముఖులు, సామాన్యులు ఒక్కటిగా మారి చంద్రబాబు గోప్పతనాన్ని వివరించారు. ఆయన అరెస్టు అక్రమమని నినదించారు. చరిత్రలో న భూతో  న భవిష్యతి అన్నట్లుగా జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కు నేటికి ( 29 అక్టోబర్ 2025) సరిగ్గా ఏడాది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ఐదేళ్లు అరాచక పాలన సాగించారు. మంచి, చెడ్డా, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా ప్రత్యర్థులను వేధించడమే పాలన అన్నట్లుగా ఆయన హయాంలో అరాచకం తాండవమాడింది.  అందులో భాగంగానే రాజకీయ కక్షతో  జగన్   చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో నిర్బంధించారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి ముందు వరకూ జగన్ సర్కార్ పై ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత ఆగ్రహం ఉన్నా.. నిర్బంధం, పాశవిక దాడులకు భయపడి జనం ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుని ఉన్నారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ గడిపారు. కానీ ఎప్పుడైతే  జగన్ అక్రమంగా చంద్రబాబును జైలుకు పంపారో అప్పుడిక జనం భయాన్ని వదిలేశారు. జగన్ దుర్మార్గంపై తిరగబడ్డారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలను చేశారు. ఆసమయంలోనే చంద్రబాబుకు సంఘీభావంగా   దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చి గచ్చిబౌలిలో  చంద్రబాబు గ్రాటిట్యూడ్ కన్సర్ట్ నిర్వహించారు.  సాధారణంగా ఎవరైనా అరెస్టైతే ఆయన చేసిన అక్రమాల గురించి ప్రజలు చర్చించుకుంటారు. ఆయన అన్యాయాలపై మాట్లాడుకుంటారు. కానీ చంద్రబాబు అరెస్టైన తరువాత ప్రజలలో ఆయన గొప్పతనం గురించి చర్చ జరిగింది. ఆయన సాధించిన ఘనతల గురించి జనం మాట్లాడుకున్నారు. ఇక సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ అయితే  చంద్రబాబు నాయుడు గొప్ప తనాన్ని మరో మారు   ప్రపంచం కళ్లకు కట్టింది.  అవును  హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో  సరిగ్గా ఏడాది కిందట జరిగిన ఆ సభ చంద్రబాబు నాయుడు దార్శనికతకు దర్పణంగా నిలిచింది. ఎప్పుడో, పాతికేళ్ళ నాడు కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై నిలిచిన దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రన్నకు ఐటీ వందనం చేసింది. తెలుగు యువత హైటెక్  భవితకు బంగరు బాటలు పరిచిన  విజనరీకి వందనం చేసింది. వందనం చేయటమే కాదు. గళం విప్పి గర్జించింది.  ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు యువకులు.  చంద్రబాబు విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామనీ, అందుకే ఆయనకు కృతజ్ణతలు తెలపుకోవడంతో పాటు ఆయన అక్రమ అరెస్టును ఖండించి ఆయను సంఘీభావంగా నిలబడేందుకే వచ్చామని ఎలుగెత్తి చాటారు.  వేలాది ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబుకు జై కోట్టారు.. సీబీఎన్ జిందాబాద్.. మేము సైతం బాబు కోసం లాంటి స్లోగన్లు చేశారు.  హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ను నిర్మించి పాతికేళ్లు అయిన సందర్భంగా.. ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమలో  పలువురు మాట్లాడిన మాటలు.. చేసిన ప్రసంగాలు చంద్రబాబు గొప్పతనం మరోమారు కళ్ల ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాయి.    ఆయన ముందు చూపుతో నాటిన విత్తు ఈరోజు ఏ విధంగా మహా  వృక్షమై, తమవంటి లక్షల మందికి  ఎలా నీడను అందిస్తున్నదో, దేశ  విదేశాల్లో తాము సాధించిన విజయాలకు చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఆదర్శంగా నిలిచారో వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు నడకను, నడతను దగ్గర నుంచి చూసిన పెద్దలు, ఆయనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు.  ఎక్కడా రాజకీయ ప్రసంగాలు లేకుండానే ఐటీ ఉద్యోగులు చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేయడం ఎంత దుర్మార్గమో చాటారు. జగన్ అరాచకత్వంపై, అడ్డగోలు విధానాలపై జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుని బయటకు రావడానికి కారణమయ్యారు. ఆ గ్రాటిట్యూడ్ సభతో జగన్ పతనానికి బీజం పడిందని చెప్పవచ్చు. 

కేరళలో భారీ అగ్ని ప్రమాదం, 150 మందికి గాయాలు, 8 మంది పరిస్థితి ఆందోళనకరం 

కేరళలో టెంపుల్ ఫెస్టివల్ కోసం నిల్వ ఉంచిన బాణాసంచా పేలి 150 మంది గాయాలపాలయ్యారు ఎనిమిది మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. కేరళలోని కాసర్ గోడ్ లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదం వల్ల భారీ మంటలు వ్యాపించాయి. నీలేశ్వర్ సమీపంలోని ఓ ఆలయంలో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను కాసర్ గోడ్, మంగళూరులోని  ఆస్పత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జిల్లా యంత్రాంగం అంతా ప్రమాద స్థలికి చేరుకుని అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులకు సహయకచర్యలు చేపట్టారు. బుధవారం నరకచతుర్ధషి, గురువారం దీపావలి సంబరాలు ఘనంగా జరుపుంటున్న నేపథ్యంలో బాణాసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో విషాదచాయలు అలముకున్నాయి. 

వైసీపీకి బైబై.. కూట‌మి పార్టీల్లోకి నేతలు క్యూ

ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌ తగులుతోంది. అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల  కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు.. ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో రెచ్చిపోయారు. అహంకారంతో పెట్రేగిపోయారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌తోపాటు, ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారినీ తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని నిర్ల‌క్ష్యం చేశారు. ఫ‌లితంగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. అధికారం కోల్పోయిన నాటినుంచి ఆ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు వైసీపీని వీడ‌గా.. మ‌రికొంద‌రు ముఖ్య‌నేత‌లు సైతం జ‌గ‌న్ కు బైబై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  అధికారం కోల్పోయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఖ‌రిలో మార్పు రావ‌డం లేద‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు. ప్ర‌భుత్వంపై అస‌త్య ప్ర‌చారం చేయ‌డంతో పాటు.. సొంత మీడియా, అనుకూల మీడియాతో త‌ప్పుడు రాత‌లు రాయిస్తూ ప్ర‌జ‌ల్లో వైసీపీని మరింత ప‌లుచ‌న చేస్తున్నార‌ని సొంత పార్టీ నేతలే  జ‌గ‌న్ తీరుపై మండిప‌డుతున్నారు. మ‌రోవైపు సొంత చెల్లి ష‌ర్మిళ‌కు వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తుల‌ను ఇవ్వ‌కుండా ఇబ్బందులు పాలు చేయ‌డంతో పాటు.. త‌ల్లి విజ‌య‌మ్మ‌పైనా వైసీపీ నేత‌లు దుర్భాష‌లాడుతుండ‌టం ప‌ట్ల ఆ పార్టీ శ్రేణులు  తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గ్రాఫ్ పడిపోతుండటంతో ఇంకా ఆ పార్టీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావిస్తున్న పలువురు నేత‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బైబై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. జగన్ రెడ్డి తీరు కారణంగానే వైసీపీ ఖాళీ అయిపోతోందంటున్నారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన త‌రువాత ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డితోపాటు ప‌లువురు నేత‌లు ఇప్ప‌టికే వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో కీలక మ‌హిళా నేత‌గా పేరున్న వాసిరెడ్డి పద్మ సైతం కొద్దిరోజుల కిందట పార్టీకి గుడ్ బై చెపెప్పేశారు.  అంతేకాదు.. ఆ సందర్భంగా  జగన్‌ తీరుపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. పార్టీలో అంతా తానే అనేలా జగన్ వ్యవహరిస్తారని.. ఇతరుల మాటకు కొంచెం కూడా విలువ ఇవ్వరంటూ మాటల తూటాలు పేల్చేశారు.  అయితే, ఆమె ఏ పార్టీలో చేరుతార‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగుదేశం లేదా కాంగ్రెస్ లో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఆ విషయం పక్కన పెడితే వైసీపీ నుంచి మ‌రో ఇద్ద‌రు కీలక మ‌హిళా నేత‌లు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతున్నది. వీరిద్ద‌రూ వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా చేసిన వారే కావ‌టం గ‌మ‌నార్హం.  మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత జ‌గ‌న్ కు బైబై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వార్తలు గుప్పుమంటున్నాయి. గుంటూరు జిల్లాల్లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కీలక నేత అయిన మేకతోటి సుచరిత మొదటి నుంచీ  పార్టీకి వీర విధేయురాలిగా ఉన్నారు. అలాంటి సుచరిత పార్టీని వీడుతున్నారనే వార్తలు రావటం  వైసీపీ శ్రేణుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో మిన‌హా.. మంత్రి ప‌ద‌వి పోయిన త‌రువాత వైసీపీలో సుచరితకు ప్రాధాన్యత  లేకుడా పోయిందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. తమ నేత పేరు కూడా వినిపించని పరిస్థితి రావటంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మేకతోటి సుచరిత త్వరలో వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆమె జ‌న‌సేన పార్టీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే జ‌నసేన నేతలతో టచ్ లోకి వెళ్లారనీ, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే  మేకతోటి సుచరిత  వైసీపీకి రాజీనామా చేసి జ‌న‌సేన కండువా క‌ప్పుకుంటార‌ని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  ఇక జగన్  కేబినెట్ లో  మంత్రిగా ప‌నిచేసిన మ‌రో మ‌హిళా నేత విడద‌ల ర‌జిని కూడా వైసీపీకి గుడ్ బై చెప్ప‌బోతున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. జగన్ గుంటూరు పర్యటనల్లో రజినీ  కడా పాల్గొంటున్నా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అలాగే పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.  అసలు రజిని  రాజకీయ అరంగేట్రం చంద్రబాబే చేయించారు. అప్పట్లో రజిని తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు కూడా. సైబ‌రాబాద్‌లో మీరు నాటిన మొక్క‌ను సార్ నేను అంటూ  అప్పట్లో చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించి రాజ‌కీయాల్లో ఫేమ‌స్ అయ్యారు. తరువాత  వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన కొత్తల్లో ఆ పార్టీ పట్ల ఆకర్షితురాలై వైసీపీలో చేరారు. కొద్ది కాలానికే ఆ పార్టీలో కీల‌క నేత‌గా మారారు. వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. వైసీపీ ఓటమి తరువాత రజిని పార్టీని వీడే ఉద్దేశంలో ఉన్నాన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  విడద‌ల ర‌జ‌నీ ఇటీవ‌ల బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డితో భేటీ ఆ వార్తలకు బలం చేకూర్చింది.  బాలినేని ఇటీవలే వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో రజిని బాలినేని ద్వారా ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో  మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన త‌రువాత వైసీపీకి గుడ్ బై చెప్పే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు బీజేపీ నుంచి కూడా ర‌జ‌నీకి ఆహ్వానాలు వ‌చ్చిన‌ట్లు పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో చ‌ర్చ జ‌రుగుతున్నది. మరో వారంరోజుల్లో విడుదల రజనీ పార్టీ మార్పుపై క్లారిటీ వస్తుంద‌ని అంటున్నారు.  అలాగే మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బైబై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని గట్టిగా వినిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా వున్న మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి పార్టీ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నాని అంటున్నారు. నాలుగు సార్లు కందుకూరు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మహిధర్ రెడ్డి  ఇటీవలి కాలంలో వైసీపీకి దూరం జరిగారు.    పార్టీ ఘోర ఓట‌మి త‌రువాత పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ముఖం చాటేస్తున్నారు.  ఆయ‌న తెలుగుదేశంలో చేరేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అదే విధంగా తెలుగుదేశం సైతం మహీధర్ రెడ్డి రాకపట్ల సానుకూలంగానే ఉందని అంటున్నారు.  దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీని వీడి టీడీపీ గూటికి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది.

డిసెంబర్ 9 నుంచీ ఏపీలో సీ ప్లేన్ సర్వీసులు!

జగన్ చీకటి పాలన పోయి తెలుగుదేం కూటమి పాలనలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అమరావతి, పోలవరం నిర్దుష్ట కాలవ్యవధిలో పూర్తి అవుతాయన్న విశ్వాసం ప్రజలలో ఏర్పడింది. అన్ని రంగాలలోనూ పురోగతి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇక కేంద్రం నుంచీ ఇతోధిక సహకారం అందుతోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో టూరిజం పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో తొలి సారిగా సీప్లేన్ సేవలు ప్రారంభం కావడానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులు ప్రారంభమౌతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖలో వెల్లడించారు. ఇందు కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకూ ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు సాకారం కావడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారనీ, ఆయన చొరవ వల్లే ఇంత తొందరగా ఈ ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఒకే రోజు  బెజవాడ దుర్గమ్మను, శ్రీశైలం మల్లికార్జున స్వామినీ దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.  

జగన్ చీకటి జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లోకి!

జగన్ పాలనలో పారదర్శకత అన్నది దేవతావస్త్రమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది.  జగన్ చెప్పే మాటల్లో, పాలనలో ఎక్కడా పారదర్శకత కనిపించేది కాదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉత్తుత్తి ఆదేశాలు ఇచ్చేవారు. ఆ సంగతి తెలుసు కనుక అధికారులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకునే వారు కాదు.  ప్రభుత్వం జీవోలు విడుదల చేసేది కానీ అవి ఎవరికీ ఎక్కడా కనిపించేవి కావు.   కోర్టులకు మాత్రం తమ ప్రభుత్వం అత్యంత పాదర్శ కంగా పాలన సాగిస్తోందని చెప్పుకునేది. కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి  విరుద్ధంగా వ్యవహరించేది.   ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఇదేళ్ల పాలనా ఇలాగే సాగింది.   జగన్ హయాంలో ప్రభుత్వం ఎన్నో రహస్య జీవోలను ఇచ్చింది.  ప్రతి జీవో పబ్లిక్ డొమైన్ లో ఉండాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించేది. జగన్ ఐదేళ్ల పాలనలో జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉండాలన్న ఆదేశాలను కనీసం నాలుగు సార్లు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు జగన్ అధికారంలో ఉన్నంత కాలం అమలు కాలేదు. అంటే జగన్ ఉత్తుత్తి ఆదేశాలు ఇచ్చారన్న మాట.  ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం రహస్యంగా ఉంచిన జగన్ హయాంలోని జీవోలన్నిటినీ పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని నిర్ణయించింది. ఆ రహస్య జీవోలన్నిటినీ జీఓఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాల‌ని నిర్ణ‌యించింది.  2021 ఆగ‌స్టు 15 నుంచి 2024 ఆగ‌స్టు 28 వ‌ర‌కూ ర‌హ‌స్యంగా ఉంచిన అన్ని జీవోలనూ   ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.  ఈ మేరకు ఇంత కాలం గోప్యంగా ఉన్న జీవోలన్నిటినీ  ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది.  జీఓఐఆర్ వెబ్‌సైట్‌  ప్రారంభ‌మైన 2008 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అన్ని జీఓలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ,  వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 2021 ఆగ‌స్టు 15 నుంచి 2024 ఆగ‌స్టు 28 వ‌ర‌కు జారీ అయిన  జీఓలు మాత్ర‌మే అందుబాటులో లేవ‌ని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ వెల్ల‌డించింది. ఇప్పుడు వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 

 మాంస ప్రియులకు బంపర్ ఆఫర్...  యానాంలో చౌకగా చీరమే చేపలు 

సరిగ్గా దీపావళికి ముందు సముద్ర జలాల్లో కనిపించే చీరమే చేప యానాం మార్కెట్లో అందుబాటులో వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఈ చీరమే చేప అత్యధికంగా అందుబాటులో  వచ్చింది. సప్లయ్ ఎక్కువైతే డిమాండ్  తగక్కువవుతుంది.  గతంలో 30 నుంచి 40 వేల రూపాయలకుకు బకెట్ చీరమే దొరికేది. ప్రస్తుతం పదివేల రూపాయలకు బకెట్ దొరకడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సంప్రదాయంగా చీరలతో ఈ చేపలను మత్స్యకారులు పట్టుకుంటారు. కాబట్టి దీనికాపేరు వచ్చింది. చేప జాతులలో అతి చిన్నది ఈ చేప. దీని  జీవిత కాలం కూడా తక్కువే. సంవత్సరానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఈ చేప అందుబాటులోకి రావడంతో కస్టమర్లు బాగానే వస్తున్నప్పటికీ చీరమే చేపల ధరలు పడిపోవడం మత్స్య కారులు నిరుత్సాహానికి గురయ్యారు . కార్తిక మాసం కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చీరమే  చేప అమ్మకాలు పెరగవచ్చని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పాత చీరలతో పట్టే చీరమే ప్రస్తుతం ఆధునిక యంత్రాల ద్వారా పట్టుకుంటున్నారు . గోదావరి పాయలు కలిసే భైరవపాలెంలో ఈ చేపలు అత్యధికంగా దొరుకుతాయి.ఈ చీరమే చేప  శేర్ రెండు వేలకు విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు.    

రాజ్ పాకాల ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

జన్వాడలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పార్టీ వ్యవహారం ముదిరి పాకాన పడింది. తాము ఇచ్చిన నోటీసులకు రాజ్ పాకాల స్పందించకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లుగా పరిగణించిన పోలీసులు ఆయన ఇంటికి నోటీసులుఅంటిం చారు.విచారణకు హాజరు కావాలనీ లేదంటే అరెస్టు చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు.  రాజ్ పాకాల పరారీలో ఉండటంతో  పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఇలా ఉండగా నిన్నటి నుంచి ఆచూకీ చిక్కకుండా పరారీలో ఉన్న రాజ్ పాకాల తనను కుట్రపూరితంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందన్నది వెంటనే తెలియరాలేదు.  దీంతో కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చే లోగా పోలీసులు రాజ్ పాకాలను అరెస్టు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

సెల్ ఫోన్ రీచార్జీ ధరలు తగ్గుతాయా?

టెలికాం సంస్థలు త్వరలో సెల్ ఫోన్ రీచార్జీ ధరలను తగ్గించే అవకాశాలున్నాయా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. టెలికాం సంస్థలు సంస్కరణల బాట పట్టాయి. తమ లైసెన్స్ ఫీజులు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వారి డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే సర్వీస్ ప్రొవైడర్లు రీచార్జి ధరలను తగ్గించే అవకాశం ఉంది. ఎయిర్ టెల్, జియో, వీఐ రీచార్జ్ ప్లన్ లు తగ్గించేందుకు  సర్వీస్ ప్రొవైడర్లు సుముఖంగా ఉన్నారు. ఇటీవల రీచార్జ్ ధరలను పెంచడంతో  చాలా మంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు షిప్ట్ అయిపోయారు. ఇదే ఒరవడి ముందు ముందు కొనసాగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో ప్రైవేటు టెలికాం సంస్థలు సంస్కరణల బాట పట్టాయి.  అవి కోరినట్లుగా  కేంద్రం వాటి లైసెన్సు ఫీజును తగ్గించేందుకు అంగీకరిస్తే  రీచార్జ్ ధరలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేటు టెలికాం సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే వీటికి ప్రాతినిథ్యం వహిస్తున్న  సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) టెలికాం ఆపరేటర్లపై విధించే లైసెన్స్ ఫీజును తగ్గించాలని అధికారికంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్థూల ఆదాయంలో ఎనిమిది శాతంగా ఉన్న ప్రస్తుత లైసెన్స్ ఫీజును ఒక శాతానికి తగ్గించాలని సీఓఏఐ కేంద్రాన్ని కోరింది.  అలా  తగ్గిస్తే నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లు,  విస్తరణలు సులభతరం అవుతాయని చెబుతోంది.  

వేణు స్వామిపై చర్యలకు హైకోర్టు ఆదేశం

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామిపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నాగచైతన్య, శోభితల వివాహ నిశ్చితార్థం సమయంలో వారి విడాకులు ఖాయం అంటూ వారి వ్యక్తిగత జీవితంపై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై  వేణు స్వామిపై  పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయగా..  మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసి  తమ ముందు హాజరు కావాలని గతంలో వేణుని ఆదేశించిన సంగతి తెలిసిందే.   తనను హాజరు కమ్మని ఆదేశించే అధికారం మహిళా కమిషన్ కు లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది.  వేణు స్వామిని తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించే అధికారం మహాళా కమిషన్ కు ఉందని పేర్కొంటూ.. వేణు స్వామిపపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మహాళా కమిషన్ ను ఆదేశించింది. 

ఎన్టీఆర్ పాటకు డ్రైవర్ డ్యాన్స్.. లోకేష్ ట్వీట్.. కథ సుఖాంతం!

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అయినా అనుక్షణం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అలర్ట్ గా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా స్పందిస్తున్నారు. ఆ కష్టాన్ని, నష్టాన్ని తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకు ఉదాహరణ చెప్పాలంటే... ఇటీవల ఆర్టీసీ బస్  డ్రైవర్ ఒకతను దేవర సినిమాలోని దావుడి పాటకు డ్యాన్స్ చేశారు. అదేంటి డ్యాన్స్ చేయడానికీ లోకేష్ ప్రతి ఒక్కరి కష్టంలోనూ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారనడానికి సంబంధం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ డ్రైవర్ ఏదో తన ఇంట్లోనో లేకపోతే డ్యూటీ దిగిపోయిన తరువాతో ఈ డ్యాన్స్ చేయలేదు. బస్సును మార్గ మధ్యంలో నిలిపేసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఆయన చేసిన ఆ డ్యాన్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆయన ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించారని గానీ, బస్సు మధ్యలో ఆపేయడం వల్ల తమకు సమయం వృధా అయ్యిందని కానీ ఎటువంటి కంప్లయింట్లూ రాలేదు. అయినా విధి నిర్వహణలో నిర్లక్యంగా వ్యవహరించాడంటూ ఆ కండక్టర్ ను ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అయితే డ్రైవర్ ను ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేయడానికి ముందే లోకేష్ ‘సూపర్ డ్యాన్స్ బ్రదర్.. కీపిటప్, బస్సులో ప్రయాణీస్తున్న వారు కూడా ఎలాంటి ఫిర్యాదులూ చేయకుండా  నీ డ్యాన్స్ ను నాలాగే యంజాయ్ చేసి ఉంటారు ’ అంటూ ట్వీట్ చేశారు.  ఇప్పుడు విషయానికి వస్తే.. ఆ డ్రైవర్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని ట్వీట్ చేస్తూ ఓ నెటిజన్ లోకేష్ కు ట్యాగ్ చేస్తూ.. విధుల్లో క్రమశిక్షణ, సమయ పాలనా అత్యంత ముఖ్యమైనవే అయినా.. ఎవరికీ నష్టం కలిగించని ఈ చిన్న పాటి వినోదం అందించిన ఆ కండక్టర్ ను సస్పెండ్ చేయడం అన్యాయం అని పేర్కొని, అతడి సస్పెన్ష్ ఎత్తివేసేలా చూడాలి అని కోరారు. లోకేష్ వెంటనే స్పందించారు. ఆ నెటిజన్ కు వెంటనే బదులిస్తూ ఆ కండక్టర్ సస్పెన్షన్ వెనక్కు తీసుకుంటారు. ఆయన వెంటనే విధుల్లో చేరుతారు అని పేర్కొన్నారు. అంతే కాదు తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత కలుస్తానని ఆ నెటిజన్ కు రిప్లై ఇచ్చారు. లోకేష్ ఇమ్మీడియెట్ రెస్పాన్స్ పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పొలిటికల్ బాంబ్ డీకోడ్... కెటీఆర్ అరెస్ట్ ? 

హైదరాబాద్ లో 144 సెక్షన్ కేవలం  మతకలహాలు జరిగినప్పుడు మాత్రమే ఉండేది. కానీ ఈ నెల 27 వతేదీ నుంచి హైద్రాబాద్ లో 144 సెక్షన్ అమలవుతోంది. మంత్రి పొంగులేటి సియోల్  పర్యటనలో ఉన్నప్పుడు పొలిటికల్ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. దీపావళికి ముందు ఒక ఎత్తు  దీపావళి తర్వాత ఒక  ఎత్తు అని పొంగులేటి ఇచ్చిన స్టేట్ మెంట్  కొత్త చర్చకు దారి తీస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో పొంగులేటి ప్రకటన క్లూ దొరికినట్టు తెలుస్తోంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమాలకు మినహాయింపు ఉంటుందని పోలీస్ కమిషన్ సివి. ఆనంద్ వెల్లడించారు జన్వాడా ఫాంహౌజ్ లో పోలీసుల దాడుల నేపథ్యంలో కెటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది . కెటీఆర్ టార్గెట్ గా గత కొంతకాలంగా  ప్రకటనలు వెలువడుతున్నాయి. జన్వాడ ఫాం హౌజ్ లో  కుటుంబ సభ్యులు పట్టపట్టడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కెటీఆర్ అరెస్ట్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది.  .బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో 144 సెక్షన్ అమలవుతోందని తెలుస్తోంది నవంబర్ 1 నుంచి 8 వరకు బిఆర్ఎస్ కీలక నేతలు అరెస్ట్ కానున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కెసీఆర్ , హరీష్ రావులు అరెస్ట్  అయ్యే అవకాశాలున్నాయి. అయితే కాళేశ్వరం దర్యాప్తు ఫైనల్ స్టేజిలో ఉంది.   కెసీఆర్ తర్వాత కెటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కెటీఆర్ టార్గెట్ గా పని చేస్తోంది. కెటీఆర్ బామ్మర్ది కి  రాజ్ పాకాల చెందిన జన్వాడా  ఫాం హౌజ్ లో దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణ డిజిపికి ఫోన్ చేసినట్టు సమాచారం. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని కెసీఆర్ డిజిపి జితేందర్ పై అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

షర్మిలే రైట్.. వైసీపీ అంగీకరించేసిందా?

చేతులు పూర్తిగా కాలిపోయాకా.. ఆకుల కోసం వెతికినట్లుంది వైసీపీ తీరు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస ముందు చూపుకూడా లేని పార్టీగా ఇప్పటికే వైసీపీ పలు సందర్భాలలో రుజువు చేసుకుంది. ఆ పార్టీ పూర్తిగా వైసీపీ అధినేత జగన్  ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడిచే పార్టీ. అధికారంలో ఉన్న ఐదేళ్లూ దోచుకోవడం, దాచుకోవడం, ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు అన్నట్లుగా సాగింది. ఎందుకంటే అవే జగన్ కు ఇష్టం కనుక. ప్రత్యర్థులను అనుచిత వ్యాఖ్యలతో విమర్శించే వారికే పార్టీలో గుర్తింపు అన్న విధానం కారణంగా ఆ పార్టీ నేతలంతా నోరేసుకుని పడిపోయేవారు. బూతుల పంచాంగంలో నిష్ణాతులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి మాటే ఎత్తక, కేవలం కక్ష సాధింపు చర్యలే పాలన అన్నట్లుగా వ్యవహరించిన కారణంగానే జగన్ పార్టీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అధికారం కోల్పోయిన తరువాతైనా పార్టీ అధినేతలో, నేతల్లో మార్పు వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం. ప్రజా మద్దతు తమవైపే అంటూ స్వోత్కర్ష వినా.. పార్టీ ఓటమికి కారణాలపై ఇంత వరకూ ఆ పార్టీ సమీక్షించింది లేదు. ఆత్మ విమర్శ చేసుకున్నది లేదు.  ఇక తాజాగా జగన్, ఆయన సోదరి మధ్య ఆస్తి తగాదా పార్టీ ప్రతిష్టను మరింతగా దిగజార్చింది. వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను పాతాళంలోకి పడిపోయేలా చేసింది. అయితే షర్మిలపై జగన్ ఏమైనా మాట్లాడితే ఏదో సొంత గొడవ అనుకోవచ్చు. కానీ షర్మిలపై విమర్శలు గుప్పించడం, ఆమె ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడమే పార్టీ విధానం అన్నట్లుగా  పార్టీ నేతలు మైకుల ముందుకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం చేశాయి చేస్తున్నాయి. ఈ రెండు వారాలలో వైసీపీ నేతలు షర్మిలను దూషించడానికే తక్కువలో తక్కువ రెండు డజన్ల ప్రెస్ మీట్లు పెట్టారు. కేతిరెడ్డి, జూపూడి, పేర్నినాని, రాచమల్లు, సతీష్ రెడ్డి, సుధాకర్ బాబు, వరుధు కల్యాణి, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి.. ఇలా వైసీపీ నేతలందరూ షర్మిలపై బురద జల్లడానికే మైకుల ముందుకు వచ్చారు. ఇక జగన్ సొంత మీడియా  అయితే షర్మల వ్యక్తిత్వ హననమే లక్ష్యం అన్నట్లుగా డిబేట్లు నిర్వహించింది. కథనాలు వండి వార్చింది. అయితే ఆలస్యంగానైనా షర్మిల విషయంలో పార్టీ పరంగా ఇలా విరుచుకుపడటం వల్ల ప్రయోజనం సంగతి అటుంచి నష్టం జరుగుతోందని తెలుసుకున్న వైసీపీ ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా నోరెత్తవద్దని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని పిలుపు నిచ్చింది. కోర్టులు ఉన్న అంశం కనుక అక్కడే తేల్చుకుందామని, రాజకీయ చర్చలు వద్దని స్ఫష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది.   అయితే అసలీ రచ్చను మొదట మొదలెట్టిందే వైసీపీ. జగన్ సహా ఆ పార్టీ నేతలంతా మూకుమ్మడి దాడి చేసినట్లుగా షర్మిలపై విరుచుకుప్పడారు. కనీస లాజిక్ కూడా అందకుండా.. వైఎస్ మరణాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ లకు ఆపాదిస్తూ అటువంటి వారి మేలు కోసం షర్మిల పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆస్తుల విషయంలో షర్మిలను జగన్ దగా చేశారని జనం నమ్ముతున్నారనీ, ఈ విషయంలో తాము షర్మిలపై ఎంతగా విమర్శలు చేస్తే అంతగా నష్టపోవడం ఖాయమనీ నిర్ధారించుకున్న తరువాత ఇక ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే అప్పటికే అలస్యమైపోయింది. షర్మిల విషయంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ప్రతిష్ఠ పూర్తిగా మంటగలిసిపోయింది. చేతులు పూర్తిగా కాలిపోయిన తరువాత ఇప్పుడు ఆకుల కోసం వెదుకుతున్న చందంగా వైసీపీ షర్మిల విషయంలో ఇక నోరెత్తకూడదని తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీకి ఒనగూడే ప్రయోజనం ఏం లేదు సరికదా.. ఇప్పటి దాకా తాము చేసిన విమర్శలన్నీ తప్పు, అవాస్తవాలని స్వయంగా ఒప్పుకున్నట్లైంది. 

గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. గోదావరిలో తేలుతూ ఇష్టమైన, రుచికరమైన ఆహారం తింటూ విహరించే  అద్భుత అనుభవం రాజమహేంద్రవరం వాసులకు అందుబాటులోకి వచ్చింది. పోలవరం- భద్రాచలం టూర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆ టూర్  మొత్తం రోజంతా పడుతుంది. అదో ఎక్స్ పీరియెన్స్ అయితే.. పెద్దగా సమయం వృధా అవ్వకుండా.. ఇలా హోటల్ కు వెళ్లి అలా వచ్చేసే అవకాశం ఉన్న ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో రెండు వంతెనల మధ్య ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి.. రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలో బ్రిడ్జి లంక వద్ద ఏర్పాటైన ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ఆదివారం (అక్టోబర్ 27) ప్రారంభించారు.  పద్మావతి ఘాట్‌ సమీపంలోని టూరిజం కంట్రోల్‌ రూమ్‌ నుంచి బోటులో పయనించి.. గోదావరి మధ్యలోని ఇసుక తిప్పలను ఆనుకుని నీటిలో తేలియాడుతున్న ఈ రెస్టారెంట్‌ వద్దకు చేరుకోవాలి.  రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇది ఏపెన్ అయ్యి ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి.  ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో ఒకే సారి  170 మంది  కూర్చునేందుకు అవసరమైన సిట్టింగ్‌ సామర్థ్యం ఉంది. సిల్వర్‌ స్పూన్‌, ఆహ్వానం కిచెన్‌ ప్రాంచైజీస్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌ విధానంలో ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు.