వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రాఘవరెడ్డి అరెస్టు

నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందా? జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని సరిహద్దులనూ దాటేసి ఇష్టారీతిగా అడ్డగోలుగా వ్యవహరించిన ఒక్కొక్కరిపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమైందా అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఔననే అనాల్సి వస్తోంది. తాజాగా జగన్ అడ్డా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పులివెందులలో మంగళవారం (నవంబర్ 5) అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో వర్రా రవీంద్రరెడ్డి సోషల్ మీడియా వేదికగా విపక్ష నేతలపై అసభ్యకర పోస్టులతో రెచ్చిపోయారు. అప్పట్లో జగన్ అండ ఉండటంతో ఎన్ని ఫిర్యాదులు అందినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా వర్రా రవీంద్రరెడ్డి ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు టార్గెట్ గా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి.  రవీందర్‌రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అంతేకాదు రవీంద్ర రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేకా హత్యకేసులో జగన్, అవినాష్‌రెడ్డిపై విమర్శలు చేసిన షర్మిల, సునీతపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అప్పట్లో ఆ పోస్టుల్లో.. అవసరమైతే సునీతను కూడా లేపేయండి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్‌ తల్లి విజయమ్మపైనా పోస్టులు పెట్టడం సంచలనంరేపింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల, సునీతలు మనస్తాపంతో వర్రా రవీంద్ర రెడ్డిపై అప్పట్లో హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు  అదలా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. కూటమి నేతలపై అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై మంగళగిరితో పాటు పలు ప్రాంతాల్లో, అలాగే హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. ఈ నేపథ్యంలోనే  పోలీసలు వర్రారాఘవరెడ్డిని  పులివెందులలో అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.  వర్రారవీందర్ రెడ్డి జగన్ అండతోనే సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై చెలరేగిపోయి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారనడానికి ఆయన జగన్, భారతిలతో దిగిన ఫొటోలే సాక్ష్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

హస్తినకు పవన్.. అమిత్ షాతో భేటీ.. విషయం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం (నవంబర్ 6) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో పాల్గొంటారు. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెడతారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పోలీసుల పనితీరు, హోంమంత్రి వంగలపూడి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో హఠాత్తుగా పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అప్పాయింట్ మెంట్ ఫిక్సయ్యిందని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ కు హస్తిన నుంచి పిలుపు వచ్చిందా? లేక ఆయనే అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   ఇలా ఉండగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ చేతికి ఆయుధం అందించినట్లుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలలో విభేదాలు ఉన్నాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయంటున్నారు. కూటమి ఐక్యత బీటలు వారిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.  ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా  ఉంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం, జనసేనల మధ్య గ్యాప్ ను సూచిస్తున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది. ఒక వేళ పవన్ స్వయంగా అప్పాయింట్ మెంట్ కోరి మరీ అమిత్ షాను క లిసేందుకు హస్తిన పర్యటన పెట్టుకుంటే.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకుని, రాష్ట్రంలో పరిస్థితులను ఆయన తెలియజేస్తారనీ, అలా కాకుండా అమిత్ షాయే పవన్ కల్యాణ్ ను హస్తినకు పిలిచి ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవలసిన అంశాలను బహిరంగంగా వెల్లడించడమేంటని క్లాస్ పీకుతారనీ అంటున్నారు. ఏది ఏమైనా పవన్ వ్యాఖ్యలు  రాజకీయంగా పెనుదుమారం రేపాయనడంలో సందేహం లేదు.  

నందిగామలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో  మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.  పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో చెలరేగిన మంటలు క్షణాల్లోనే పరిశ్రమ అంతా వ్యాపించాయి. అదృష్ట వశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.  సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది  సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఐదు ఫైర్ ఇంజన్ లతో  అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో  పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. 

7 శతాబ్దాల నాటి ఇంద్రేశ్వరాలయాన్ని పునరుద్ధరించాలి

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి నాగర్ కర్నూల్ కు తాడూరుకు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో  ఇంద్రకల్ గ్రామ పొలాల్లో ఉన్న కాకతీయుల కాలం ఇంద్రేశ్వరాలయం శిథిలావస్థలో ఉందని కాపాడి భావి తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్  ఈమనిశివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.  నాగర్ కర్నూల్ కు చెందిన ప్రముఖ సాహిత్య అభిమాని, జర్నలిస్ట్ ముచ్చర్ల దినకర్ .కవి ఎదిరేపల్లి కాషాన్నలు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఇంద్రేశ్వరాలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. గర్భాలయం ,అర్థ మండపం, మహా మండపం తో పాటు ఉన్న ఇంద్రేశ్వరాలయం 700 సంవత్సరాల నాటి కాకతీయ ఆలయ వాస్తు శిల్పానికి అద్దం పడుతుందన్నారు. ఆలయం విలువల ద్వారా శాఖలు శివలింగం దేవతలు మిగతా మండపాలతో ఆటో నందులు చక్కటి మహిషాసురమర్ధిని శిల్పాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉన్నాయని అన్నారు. చరిత్ర కు ప్రాధాన్యత గల ఈ శిల్పాలను  భధ్ర పరిచి ఆలయాన్ని పునరుద్ధరించాలని  శివనాగిరెడ్డి గ్రామస్తులకు విన్నపం చేశారు . ఆలయానికి మరమ్మ త్తులు చేసి గత వైవాన్ని సంతరించుకునేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుం వెంకటేశ్వర రెడ్డి గ్రామస్తులు కొత్తపల్లి జానయ్య ,వీ తిరుపతయ్య తోపాటు  పలువురు పాల్గొన్నారు.

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ 

 హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నుంచి (నవంబర్ 5)  స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.  వాహనదారులు  ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్  లేకుండా ప్రయాణిస్తే , రాంగ్ సైడ్  డ్రైవింగ్ కు కు వ్యతిరేకంగా ప్రయాణిస్తే కఠినచర్యలు తీసుకుంటున్నట్టు హెచ్చరించారు.  ఈ సంవత్సరం ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు జరిగి 215 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారే . హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగించనున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) పి. విశ్వప్రసాద్ తెలిపారు. తలకు గాయమైతే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 

జై తెలుగుదేశం నినాదం.. కమలదళానికి బలం...!

ఆంధ్రప్రదేశ్ లో  బీజేపీకి సొంత బలం లేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు సందేహాలకు అతీతంగా రుజువైంది. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో  కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోగలిగింది. జాతీయ పార్టీగా తన బలానికి మించిన సీట్లను కూడా బేరమాడి సాధించుకోగలిగింది. అలా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లిన ప్రతి సారీ ఆ పార్టీ స్కోర్ బిగ్ జీరోయే. అందుకే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం బలమే తన బలం అనుకుని సర్దుకు పోతున్నట్లు కనిపిస్తోంది. అలవికాని చోట అధికులమనరాదన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంలో రాష్ట్రం నుంచి బీజేపీ కోటా కింద ఒకే ఒక్కరినే నియమించినా బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సరికదా అదే మహాప్రసాదం అన్నట్లుగా ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది. అసలు రాష్ట్రంలో బీజేపీ స్టేక్ కోరుకోవడం లేదు. తెలుగుదేశం మిత్రపక్షంగా సంసారపక్షంగా సర్దుకు పోవడమే మేలని భావిస్తోంది. దక్షిణాదిలో బలపడాలన్న తన ఆకాంక్ష నెరవేరాలంటే, కేంద్రంలో మోడీ సర్కార్ సజావుగా సాగాలంటే.. ఏపీలో వేలు పెట్టకపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేసింది.  అయితే బీజేపీ ఈ నిర్ణయానికి రావడానికి వెనుక పదేళ్ల కథ, వ్యథ ఉన్నది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయగా, బయట నుంచి జనసేన మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అలాగే కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం చేరింది.   అయితే  విభజిత ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా విపక్ష పార్టీతో చేతులు కలిపింది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూత నివ్వాల్సిన కేంద్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దగా చేసింది. విభజన హామీలు నెరవేర్చడం అటుంచి.. రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అప్పటి  ప్రతిపక్ష  వైసీపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ.. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు దోహదం చేసింది. మోడీ సర్కార్ పేరుకే ఎన్డీయే ప్రభుత్వమైనా.. మిత్రపక్షాలను ఏనాడూ లెక్క చేసిన పాపాన పోలేదు. అన్నిటికీ మించి తన చిరకాల మిత్రుడైన తెలుగుదేశం పార్టీ పట్ల ఒక విధమైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది.  చిరకాల మిత్రుడని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన మిత్రపక్షం. ఆ పార్టీ అధినేత, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడు. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం మెండుగా ఉండేవి. మిత్ర ధర్మం పాటించే విషయంలో రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడేవి. అయితే అది వాజ్ పేయి హయాం. మోడీ హయాం వచ్చే సరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  మోడీ హయాంలో మిత్రపక్షాలను గౌరవం ఇవ్వడం అటుంచి ఏ మాత్రం అవకాశం చిక్కినా వాటిని కబలించడానికి లేదా బలహీన పరచ డానికి వెనుకాడని పరిస్థితి నెలకొంది.  మరీ ముఖ్యంగా ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రభుత్వం, దార్శనికత, ప్రజాభిమానం మెండుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం బీజేపీకి రుచించలేదు. అందుకే  ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వెళ్లే వరకూ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. విభజన హామీల మాట అటుంచి రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులను కూడా విడుదల చేయకుండా వేధించింది. సరే చివరికి తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.  సరే 2019 ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ నోటాతో పోటీ పడి ఓట్లు తెచ్చుకుంది.  అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదిపింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూడా పరాజయం పాలై విపక్షానికి పరిమితమైంది. ఆర్థిక  కేసులలో నిండా మునిగి ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంది. దీంతో బీజేపీ జగన్ ను గుప్పిట ఉంచుకుని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడమే ధ్యేయంగా పావులు కదిపింది.  అందులో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని బలహీనం చేసే కుట్రలు చేసింది. లేదా ఆ కుట్రలకు వత్తాసు పలికింది.   అయితే 2024 ఎన్నికల నాటికి బీజేపీకి వాస్తవం బోధపడింది. వైసీపీ అరాచక అస్తవ్యస్థ పాలన పట్ల ప్రజాగ్రహాన్ని గ్రహించి తెలుగుదేశంతో జట్టు కట్టింది. ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి పట్టం గట్టారు. దీంతో తత్వం బోధపడిన బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం అన్న అంశాన్ని పక్కన పెట్టేసి, తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని పదిలపరుచుకుంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నది. 

ముందుకు వస్తారా? ముఖం చాటేస్తారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి అన్న విషయం బీఏసీ సమావేశం నిర్ణయిస్తుంది. అయితే  ఓ పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పీ అసెంబ్లీ, మండలి సమావేశాల నోటిఫికేషన్ ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్  జారీ చేశారు. ఈ సమావేశాలలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. రాష్ట్ర విత్తమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. వీటిలో చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులు కూడా ఉంటాయంటున్నారు.  అయితే వీటన్నిటికంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనగానే అందరి ఆసక్తీ ఆ 11 మంది ఎమ్మెల్యేలపైనే ఉంది. ఆ పదకొడు మంది ఎమ్మెల్యేలూ సభకు హాజరౌతారా? డుమ్మా కొడతారా? అన్న ఆసక్తి రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా ఉంది. ఇంతకీ ఆ 11 మంది ఎమ్మెల్యేలూ ఎవరనుకుంటున్నారా... వాళ్లే వైసీపీ ఎమ్మెల్యేలు.  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మర్యాద ఇవ్వడమే కాదు.. తీసుకోవడమూ రాదని ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చిన రోజే తేలిపోయింది. గైర్హాజరైతే ఉన్న ఎమ్మెల్యే గిరీ కూడా పోతుందన్న ఒకే ఒక్క కారణంతో ఆయన ఆ రోజు అసెంబ్లీకి వచ్చారు. ఆయన విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఆ నాడు జగన్ కు అర్హత లేకపోయినా, ఆయన కారును అసెంబ్లీ గేటు లోపలికి అనుమతించారు. అక్షర క్రమంతో సంబంధం లేకుండా ముందుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. అయినా ఆ మర్యాద, గౌరవం నిలబెట్టుకోవడం తెలియని జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఇలా ప్రమాణ స్వీకారం చేసి.. అలా వెళ్లిపోయారు. కనీసం తన పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం వరకూ కూడా కూర్చోలేదు. పోనీ అది పక్కన పెట్టినా.. మంత్రుల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వలేదంటూ.. బయటకు వెళ్లి విమర్శలు గుప్పించారు. దీనిని బట్టే ఆయనకు అసెంబ్లీలో కూర్చునే ఉద్దేశం లేదని అవగతమైపోతున్నది.  రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై హస్తిన వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చిన జగన్.. అదే సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  వాస్తవానికి జగన్ రెడ్డికి అసెంబ్లీలో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు.  ఈ నేపథ్యంలోనే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా, డుమ్మా కొడతారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.   

తెలంగాణలో ఆత్మార్పణ కథ సుఖాంతం... ఎపిలో అఘోరీ అలజడి

అఘోరీ ఆత్మార్పణం కథ సుఖాంతం అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ అలజడి ప్రారంభమైంది. కేదార్ నాథ్ నుంచి తెలంగాణలో ఎంటర్ అయిన అఘోరీని గత నెల సిద్దిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీస్వగృహమైన మంచిర్యాలకు తరలించారు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ చేసి మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడిలో వదిలేశారు.  సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఈ నెల ఒకటోతేదీన ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరీ ప్రకటించడంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. అఘోరీ గత కొన్ని రోజులుగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో శాంతి భధ్రతల సమస్య వస్తుందని పోలీసులు ఊహించారు. ఇందులో భాగంగా హైద్రాబాద్ లో 144 సెక్షన్ తీసుకువచ్చినట్టు సీనియర్ పోలీసు ఉన్నతాధికారి తెలుగు వన్ తో అన్నారు. కెటీఆర్ అరెస్ట్ వార్తలు రావడంతో 144 సెక్షన్ అనివార్యమైందని ఆయన అన్నారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి సియోల్ పర్యటనలో ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణం దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో కెసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ నేతల అరెస్ట్ వల్ల హైద్రాబాద్ లో అల్లర్లు చెలరేగే అవకాశముందని ఇంటెలిజెన్స్, ఎస్ బి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో అఘోరీ ప్రస్తావనకూడా వచ్చింది. తెలంగాణలో గత కొంతకాలంగా మతకలహాలు జరగడం లేదు. అఘోరీ విద్వేష ప్రసంగాలపై కూడా రేవంత్ సర్కార్ మిన్నకుండిపోయింది. మళ్లీ మతకలహాల ముప్పు పొంచి ఉందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. హైద్రాబాద్ లో కేవలం మత కలహాల సమయంలో మాత్రమే విధించే 144 సెక్షన్ రేవంత్ సర్కార్  హాయంలో విధించడం చర్చనీయాంశమైంది.  మరో వైపు ఈటెల నేతృత్వంలో బిజెపి నేతలు గవర్నర్ ను కల్సి  హైద్రాబాద్ లో శాంతి భధ్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఫిర్యాదు చేశారు. మతోన్మాదులు ముత్యాలమ్మ గుడిలోని అమ్మవారిని ధ్వంసం చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు.  ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన చేస్తున్న హిందుత్వ వాదులపై   పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని బిజెపి నేతలు తప్పు పట్టారు.  ఈ నేపథ్యంలో వివాదాస్పద అఘోరీ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో  సుసైడ్ చేసుకుంటానని ప్రకటన చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  సడెన్ గా అఘోరీ కేదార్ నాథ్ లో ప్రత్యక్షం కావడంతో అఘోరీ పారిపోయినట్లు వదంతులు వచ్చాయి.  ఈ వదంతులను స్వయంగా అఘెరీ కొట్టివేశారు. తాను ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని పెట్రోల్ బాటిళ్లతో సిద్దిపేటలో ప్రత్యక్ష కావడం పోలీసులకు చెమటలు పట్టాయి. అఘోరీపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. నగ్నంగా అఘోరీ తిరగడం, నెంబర్ ప్లేట్ లేకుండా అఘోరీ కారులో ప్రయాణించడాన్ని కూడా వారు తప్పు పట్టారు. అఘోరీకి మానసిక చికిత్స అవసరమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తనను తాను నియంత్రించుకోలేని అఘోరీ సనాతన ధర్మం పరిరక్షిస్తానని కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని సనాతన ధర్మం చెబుతుంది. తనపై సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని అఘోరీ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని సంప్రదాయవాదులు తప్పు పడుతున్నారు. అఘోరీ జనారణ్యంలోకి రారని వారు అంటున్నారు. భారతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అఘోరీ రోడ్డుకెక్కడం చర్చనీయాంశమైంది.  యూట్యూబ్ చానెళ్లకు  అఘోరీ వందల ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనక మతలబు ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఆపరేషన్ అఘోరీ చేపట్టిన పోలీసులు    మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలేశారు.  ఇప్పుడు ఎపి పోలీసులకు కూడా అఘోరీ తలనొప్పిగా మారారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు టోల్ గేట్ సిబ్బంది అఘోరీని అడ్డుకోవడం వివాదాస్పదమైంది. తన శరీరాన్ని తాకే ప్రయత్నం జరిగిందని అఘోరీ అంటున్నారు. తెలంగాణ పోలీసులు అఘోరీని వదిలించుకున్నప్పటికీ ఆంధ్ర పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో 2019 ఆగస్టులో జరిగిన విలేకరి హత్య కేసులో దాడిశెట్టి రాజా నిందితుడు. హతుడు సత్యనారాయణ 2019 ఆగస్టు 15న  అన్నవరంలోని తన నివాసానికి వెళుతుండగా లక్ష్మీదేవి చెరువుగట్టుపై దుండగులు అడ్డగించి, కత్తులతో నరికి చంపారు. ఆ హత్య సూత్రధారి వైసీపీ నేత దాడిశెట్టి రాజా అంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు దాడిశెట్టి రాజాతో పాటు మరో ఆరుగురిపై చార్జిషీట్ నమోదు చేశారు. అయితే జగన్ అప్పట్లో తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో దాడిశెట్టి రాజాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దాడిశెట్టి రాజీ మంత్రి అయిన తరువాత ఆయనపై ఉన్న కేసు ముందుకు సాగలేదు.  2023లో దాడిశెట్టి రాజా పేరును చార్జిషీట్ నుంచి తొలగించారు.  దీంతో హతుడు సత్యనారాయణ సోదరుడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత తప్పకుండా న్యాయం చేస్తానని అప్పట్లో లోకేష్ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పేరును చార్జిషీట్ లో నమోదు చేశారు. దీంతో దాడిశెట్టి రాజీ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. ఇక దాడిశెట్టి రాజా అరెస్టు లాంఛనమే.  

మళ్లీ పాదయాత్రా జగన్.. జనం పారిపోతారు జాగ్రత్త!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నారా..  వ‌చ్చే నాలుగేళ్లు పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లో ఉండేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా..?  అన్న ప్రశ్నలకు వైసీపీ వ‌ర్గాల నుంచి అవుననే స‌మాధానమే వినిపిస్తోంది.  2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నద‌ని, కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై త‌న‌పై చంద్ర‌బాబే కేసులు పెట్టించారంటూ ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ క‌న్నీరు పెట్టుకున్నంత ప‌ని చేశారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందారు. సాధార‌ణంగా ఏ రాజ‌కీయ నాయ‌కుడు పాద‌యాత్ర చేసినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తానని,   అండ‌గా ఉంటానని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తారు. కానీ, గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర కేవ‌లం ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు మాత్ర‌మే సాగింది. పాదయాత్రలో తనను కలిసిన వారి బుగ్గలపై ముద్దులు పెడుతూ, బుగ్గ‌లు నిమురుతూ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. అంతేకాక‌.. వైసీపీ అధికారంలోకి వ‌స్తే అద్భుత పాల‌న అందిస్తాన‌ని హామీలు గుప్పించారు. ఒక్క‌ చాన్స్ ఒకే ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్ర‌జ‌ల‌ను  వేడుకున్నారు. జ‌గ‌న్ మాయ‌మాట‌ల‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు ఆ ఒక్క చాన్స్ ఇచ్చారు.  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌ట్టం క‌ట్టారు.  వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌ని భావించిన ప్ర‌జ‌ల‌కు సీఎం పీఠం అదిరోహించిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న విశ్వ‌రూపాన్ని చూపించారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్దిరోజుల‌కే ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని కూల్చేశారు. అక్క‌డి నుంచి రాష్ట్రంలో అరాచ‌క పాల‌నను జ‌గ‌న్ మెద‌లు పెట్టారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టేసి మూడు రాజ‌ధానులు అంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు.  విశాఖ కేంద్రంగా పాల‌న సాగిస్తాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జ‌గ‌న్ హ‌యాంలో వైసీపీ నేత‌లు రెచ్చిపోయారు. తెలుగుదేశం, జ‌న‌సేన  నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేశారు. మ‌రోవైపు.. ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టించి జైళ్ల‌కు పంపించారు. కొంద‌రు పోలీసులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రించారు. అలాగే  జగన్ అరాచ‌క పాల‌న‌ను ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం జైళ్ల‌కు పంపించ‌డం వైసీపీ ఐదేళ్ల పాల‌నలో నిత్య‌కృత్యంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి మ‌రిచి  కేవ‌లం దోపిడీ చేయడానికే అధికారంలోకి వ‌చ్చామ‌న్న‌ట్లుగా జగన్ ఆయన పార్టీ నేతలు వ్యవహరించారు.  అధికారం కోసం పాదయాత్ర చేసి, ప్రజలకు ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. తాడేపల్లి ప్యాలెస్ విడిచి బయటకు వచ్చిన ప్రతిసారీ దారి పోవవునా పరదాలు కట్టుకుని తిరిగారు. జనం సమస్యలు పట్టించుకోవడం, పరిష్కరించడం మాట అటుంచి సమస్యలు వినడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. నిలదీసిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో వైసీపీయులు రెచ్చిపోయారు. జగన్ పాలనలో సమాజంలోని ఏ వర్గం సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితి నెలకొంది. ఇదేళ్ల పాటు పంటి బిగువున జగన్ అరాచక, దుర్మార్గ పాలనను భరించిన జనం 2024 ఎన్నికలలో గ‌ట్టి షాకిచ్చారు. కసిగా ఓటేసి జగన్ పార్టీని ఘోరంగా ఓడించారు.  క‌నీసం ప్ర‌తిప‌క్ష  హోదానుకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు.    ఇప్పుడు తెలుగుదేశం కూటమి  అధికారంలో ఉంది. దీంతో జగన్ లో భ‌యం మొద‌లైంది. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం వ‌రుస‌గా కేసులు న‌మోదు చేస్తున్నది. తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లను పోలీసులు అరెస్టుచేయ‌గా.. మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, నారా లోకేశ్ పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్యలు చేసిన వారిపైనా కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. మరో వైపు ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి క్రూరమైన మైండ్ సెంట్ లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరగా.. మరికొందరు వైసీపీ నేతలు రాజీనామాలు చేసి కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా మంది నేతలు కూడా పార్టీకి రాంరాం చెప్పేందుకు రెడీగా ఉన్నారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. మరోవైపు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మతో ఆస్తి విబేధాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. దీనికితోడు జగన్ పై పాతకేసుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో అవినీతిపై జగన్ పై కేసులు నమోదు అయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి.   దీంతో జగన్ ను జైలు భయం వెంటాడుతోంది.  తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసే నాటికి పాదయాత్ర పేరుతో  ప్రజల మధ్య ఉండాలని జగన్ భావిస్తున్నారన్న  వైసీపీ వర్గాల్లో చర్చజరుగుతున్నది. పాదయాత్రలో ఉండగా అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని, తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాస్తో కూస్తో మేలు జరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పాదయాత్ర ప్రారంభించి.. వీలున్నప్పుడల్లా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లొచ్చని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి మళ్లీ ప్రజల్లో సానుభూతి పొందేందుకు జగన్ పాదయాత్రను ఎంచుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే, గతంలోలా ప్రజలు జగన్ ను ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను రుచి చూసిన ప్రజలు.. ఈ సారి పాదయాత్ర అంటూ తమ వద్దకు వస్తే ఆహ్వానించడం సంగతి అటుంచి అంటేనే ప్రజలు ఆమడదూరం పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. చివరి క్షణంలో సోషల్ మీడియా ద్వారా ట్రంప్, బైడెన్ ప్రచారం!

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు మంగళవారం (నవంబర్ 5) జరుగుతున్న సంగతి తెలిసందే. ఈ ఎన్నికలలో  24.5 కోట్ల మంది అమెరిక‌న్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. వారిలో ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల‌ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సర్వేలు, ఒపీనియన్ పోల్స్ కూడా ఈ ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందన్న విషయంలో ఇతమిథ్ధంగా చెప్పలేకపోయాయి. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్వింగ్ స్టేట్స్ లో కూడా స్వింగ్ కమలా హారిస్, ట్రంప్ లలో ఎవరివైపు ఉందన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో ఎన్నికల ప్రారంభానికి ముందు, అంటే చివరి క్షణంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు  ఓటర్లను ఉద్దేశించి వేర్వేరుగా పెట్టిన పోస్టులలో  ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థించారు.    డెమెక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పై విజయం సాధించడం ఖాయమంటూ తన పోస్టులో పేర్కొన్న జోబైడెన్.. అందుకు మీరంతా ఓటు వేయాలని కోరారు. ముందుస్తు ఓటు వేయని ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.   ఇక డోనాల్డ్ ట్రంప్ అయితే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుకుందామని, అందు కోసం మీరంతా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.  డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి క‌మ‌లా హ్యారిస్ అధికారంలోకి వ‌స్తే ప‌శ్చిమాసియా ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతుంది. ఆమె మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని ప్రారంభిస్తార‌ని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.   శాంతిని పున‌రుద్ధ‌రించడం కోసం తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు.  

పవన్ వ్యాఖ్యలపై పరిణితితో స్పందించిన అనిత!.. వివాదమేమీ లేదని చాటిన మంత్రి నారాయణ

పిఠాపురం పర్యటనలో  ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లోనూ, ప్రభుత్వంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. కేబినెట్ లో సహచర మంత్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం కూటమి సర్కార్ కు ఇబ్బందికరంగా పరిణమించాయనడంలో సందేహం లేదు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి రాష్ట్ర హోంమంత్రిగా అనిత బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే  మీరు ఏం చేస్తున్నారు?  అంటూ సంధించిన ప్రశ్నలూ ఒక అనితనే కాక మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరును ప్రశ్నించడంగానే భావించాల్సి ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కూడా భాగమే.   అటువంటి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో  అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు చేపడుతానని హెచ్చరించడం సీఎం చంద్రబాబు తీరును కూడా ఎత్తి చూపినట్లుగానే పరిశీలకులు భావిస్తున్నారు.   పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కారణంగా కూటమి ప్రభుత్వానికి ఏర్పడిన ఇబ్బందిని అధిగమించడానికి చంద్రబాబు రంగంలోనికి దిగుతారు. ఆయన పరిణితి, విభేదాల పరిష్కారం నేర్పు తెలియంది కాదు.  అయితే ఇక్కడ చెప్పుకోవలసింది పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించిన తీరును. ఎంతో పరిణితితో, అంతకు మించిన హుందా తనంతో ఆమె పవన్ వ్యాఖ్యలను స్వీకరించారు. వంగలపూడి అనిత ఎంత ఫైర్ బ్రాండ్ లీడరో అందరికీ తెలిసిందే. జగన్ అరాచక పాలనను వ్యతిరేకంగా ఆమె ఎంత గట్టిగా పోరాడారో తెలియంది కాదు. అటువంటి వంగలపూడి అనిత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఎంతో పాజిటివ్ గా తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ వాస్తవాలేనని తనకు తెలుసునన్నారు. పవన్ కల్యాణ్ దేని గురించి మాట్లాడుతున్నారో తనకు తెలుసున్నారు. వాటిపై తాము చర్చించామన్నారు. ముఖ్యమంత్రితో రాష్ట్రంలో పరిస్థితుల గురించి తాను జరిపిన చర్చలలో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారని చెప్పిన అనిత.. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలూ త్వరలోనే తీసుకుంటామని చెబుతూనే తప్పు  చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ మాటల్లో రాజకీయాలు లేవని చెప్పడం ద్వారా అనిత తన పరిణితిని చాటుకున్నారు. పవన్ కల్యాణ్ అవేశంతో అనాలోచితంగా అంతర్గతంగా చర్చించుకోవలసిన అంశాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే.. ఎంతో పరిణితితో అనిత వాటిని పాజిటివ్ గా తీసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు.  అయితే.. పవన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నిలేపాయనడంలో సందేహం లేదు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. తెలుగుదేశం, జనసేన సఖ్యత చెడిందా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలలో తప్పేముందని మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా శాఖ సరిగా పని చేయడం లేదని అనిపిస్తే  ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారని అందులో తప్పేముందని ప్రశ్నించారు. వారి స్పందన వల్ల ఆ శాఖలు అలర్ట్ అవుతాయని అన్నారు.  రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అఘాయి త్యాలపై పవన్ కల్యాణ్ స్పందించారనీ, కొన్ని సంఘటనలలో పోలీసులు వేగంగా స్పందించలేదని ఆయన అన్నారు. ఆయన హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తమౌతుందని నారాయణ వివరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఎంత మాత్రం వివాదాస్పదం కావని స్పష్టం చేశారు. అలాగే కూటమి పార్టీలలో ఎలాంటి విభేదాలూ లేవని క్లారిటీ ఇచ్చారు. 

వలసలు ఆగవు.. వైసీపీ మిగలదు!

ఐదేళ్ల అరాచక పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్.. అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే బాటలో నడుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే గిట్టదని చాటి చెబుతున్నారు. అవినీతి సొమ్ము పంపకాలలో తల్లి సోదరితో వచ్చిన తాగాదాపై కూడా రాజకీయం చేస్తూ, తాను రాసిచ్చిన స్క్రిప్టునే చదవాలని పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సొంత మీడియా, సోషల్ మీడియాలో తల్లీ చెల్లికి వ్యతిరేకంగా వార్తలను గుప్పించడమే కాకుండా, పార్టీ నేతలను కూడా మీడియా సమావేశాలు పెట్టి మరీ వారిని దూషించమని ఆదేశిస్తున్నారు. అయితే వైసీపీలోని మెజారిటీ నేతలు మాత్రం పార్టీ రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. మీ ఇంటి విషయాలు ప్రైవేటుగా తేల్చుకోండి.. బజారున పడి మీ పరువుతో పాటు పార్టీ పరువూ తీయకండి అని జగన్ కు చెప్పాలని భావిస్తున్నారు. అయితే ఒకరి మాట వినేరకం కాకపోవడంతో ఆయనతో నేరుగా ఆ విషయం చెప్పలేక, చెప్పినా ఫలితం ఉండదు కనుక.. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీని వీడుతున్నారు. అలా వీడుతున్న వారిలో జగన్ హయాంలో ఆయన అండ చూసుకుని ఇష్టారీతిగా రెచ్చిపోయిన వారు, విలువలను వదిలేసి ప్రతిపక్ష నాయకులు, విపక్ష పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారూ కూడా ఉండటమే విశేషం. జగన్ తానా అనకముందే తందానా అంటూ భజన చేసి ఆయన దృష్టిలో పడాలంటే.. తిట్లు, దూషణలే భాషగా మార్చుకోవాలని భావించి అలా ఇష్టారీతిగా చెలరేగిపోయిన వారు ఇప్పుడు జగన్ కు దూరం జరుగుతున్నారు. అవకాశం ఉంటే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి, జగన్ కు గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో సర్దుకున్నారు. ఇక జగన్ అధికారంలో ఉండగా నోటికి పని చెప్పి, మంచీ చెడు అన్న విచక్షణ మరిచి ఇష్టారీతిగా బూతలతో చెలరేగిపోయిన వారికి కూటమి పార్టీల్లో అవకాశం లేకుండా పోయింది. అటువంటి వారు కూడా జగన్ కు దూరంగా ఉంటే ఇప్పుడు కాకపోతే తరువాతైనా ఏదో  ఒక పార్టీలో చోటు దొరుకుతుందన్న ఆశతో పార్టీని వీడే యోచన చేస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్.  ముందుగా అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకుంటే... వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై నోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్  పార్టీ  ఘోర పరాజయం తరువాత   ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు.  అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందంటూ అప్పట్లో తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేశారు.   ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో  ఎవరికీ ముఖం చూపలేక చాటేశారు. అటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు తన పరిస్థితి ఇలా కావడానికి కారణంగా వైసీపీ అధినేత జగన్ అని భావిస్తున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.  అయితే జనసేన తలుపులు ఆయన కోసం తెరుచుకునే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే విపక్షంలో ఉన్న సమయంలోనే అనిల్ అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ కు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఇహనో ఇప్పుడో ఆయనపై విచారణకు ఆదేశించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉంటే సరిపోదనీ, జగన్ తో విభేదించి బయటకు వచ్చానని చాటుకోవడం ద్వారా కూటమి ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చవచ్చనీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  భావిస్తున్నారనీ, అందుకే పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ విషయానికి వస్తే.. వైసీపీ శ్రేణులలో ఆయన పార్టీ మారరన్న విశ్వాసం వ్యక్తం అవుతున్నప్పటికీ  జోగి రమేష్ కేసుల చక్రబంధం నుంచి బయటపడాలంటే పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. జోగి రమేష్ జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజానిజాలను పక్కన పెడితే జోగి రమేష్ వైసీపీలో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు.   వీరిద్దరే కాకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు మరి కొందరు మాజీలు కూడా రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వలసలు జోరందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా వైసీపీకి బైబై చెప్పేసి బయటకు వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటుందంటున్నారు. అసలు వైసీపీ మిగులుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మేకతోటి సుచరిత, విడదల రజిని కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారు కూడా నేడో రేపో  పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. 

అధికారంలో ఉన్నామా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నామా?

రాష్ట్రంలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థ‌లు ఇలా ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల‌ హ‌వా వేరే లెవ‌ల్ లో ఉంటుంది. ఓటర్లను నమోదు చేయించడం దగ్గర నుంచీ  అన్నివిధాలా ప్ర‌తిప‌క్ష పార్టీ కంటే ప‌ది అడుగులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు ముందుంటారు. కానీ ప్రస్తుతం ఏపీలో  ప‌రిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏపీలో ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉమ్మ‌డి తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే తెలుగుదేశం కూట‌మి అభ్యర్థులను ప్ ప్రకటించింది.  వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా, గుంటూరు అభ్యర్థిని ప్రకటించింది, తెలుగేశం కూట‌మి నుంచి ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, అలాగే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్ పేరును సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రకటించారు. అయితే, అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకం.  కానీ, ఈ రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఓట‌ర్లుగా చేర్ప‌డంలో కూట‌మి ఎమ్మెల్యేలు, నేత‌లు విఫ‌మ‌వుతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఓటర్ల  నమోదుకు   మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. కానీ, కూట‌మి నేత‌ల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో 3.5ల‌క్ష‌ల ఓట్ల‌కు గాను ల‌క్ష‌ మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. అదేవిధంగా ఉమ్మ‌డి కృష్ణా - గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో 3.5ల‌క్ష‌ల మంది ఉంటే కేవ‌లం 1.50ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ఓట‌ర్లుగా న‌మోద‌య్యారు.  వారం రోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో స‌మావేశం అయ్యారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల విజ‌య‌మే ల‌క్ష్యంగా కూట‌మి పార్టీల్లోని నేత‌లు క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు.  6వ తేదీ వ‌ర‌కు ఓట్ల న‌మోదు ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని,  ఆ లోపు ఓట‌ర్ల న‌మోదును పూర్తి చేయాల‌ని ఆదేశించారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య‌నేత‌లు ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల‌ను చేర్పించ‌డంపై పెద్ద‌గా దృష్టిసారించ‌డం లేదు. రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గ నేతలకు ఇచ్చిన ఆదేశం ఒకటి, ఆచరణలో జరుగుతున్నది ఇంకొకటి. పరస్పర సమన్వయలోపం బహిర్గతమ‌వుతోంది. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవ ర్గంలో గతంలో మూడు లక్షలకుపైబడి ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓటర్ల చేర్పింపులో మాత్రం కూటమి నేతలు నిర్లిప్తంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు  కూటమి నేతల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం లేకపోవడం కూడా ఓటర్ల నమోదులో వెనుకబాటుకు దారితీసింద‌ని తెలుస్తోంది.  గ్రాడ్యుయేట్స్‌ ఎక్కువగా ఉన్న ఏలూరు కార్పొరేషన్‌తో సహా మునిసిపాలిటీలు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లి గూడెం వంటి ముఖ్యప్రాంతాలలో ఓటర్ల నమోదు అత్యధికంగా సాగాలని పక్షం రోజుల క్రితమే మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఏలూరులో ప్రత్యేక సమావేశం జరిగింది. కానీ ఆ త‌రువాత ఓట్ల న‌మోదులో పార్టీల నేత‌లు ఆశించిన స్థాయిలో శ్ర‌ద్ద చూప‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. రెండు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధిక శాతం కూట‌మి ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా  ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల న‌మోదులో వెనుక‌బ‌టం వారి నిర్ల‌క్ష్యాన్ని ఎత్తుచూపుతోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ సొంత ప‌నుల‌పై దృష్టి పెట్టడం వ‌ల్ల ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల న‌మోదులో వెనుక‌బ‌డ‌టంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ముఖ్య‌నేత‌లు, ఎమ్మెల్యేల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇలా అయితే, రాబోయే కాలంలో క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని.. వ‌చ్చే రెండు రోజుల్లో అనుకున్న స్థాయిలో ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల న‌మోదు జ‌ర‌గాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం.  ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి పార్టీల్లోని నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వైసీపీ పట్టభద్రుల ఓట్ల నమోదు విషయంలో దూకుడుగా వెడుతున్నది. వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న రెండు చోట్లా కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ జీరో రిజల్ట్ సాధించింది. అయినా కూడా ఓట్ల నమోదు విషయంలో దూకుడుమీద వెడుతూ పైచేయి సాధిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.  దీంతో తాజాగా చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ను అయితే నేరుగా రాజకీయాల పట్ల సీరియస్ లేకపోతే కష్టం అని వార్నింగ్ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో రెండు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోక‌వ‌ర్గాల్లోని కూట‌మి ఎమ్మెల్యేలు, నేత‌లు రాబోయే రెండు రోజుల్లో ఏమేర‌కు ఓటర్లను న‌మోదు చేయిస్తారో వేచి చూడాల్సిందే.

నందిగం సురేష్ కు మరో సారి షాక్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరోసారి షాక్ తగిలింది. మంగళగిరి కోర్టు అతనికి రిమాండ్ పొడిగించింది. మహిళ హత్యకేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. నేటితో రియాండ్ ముగియడంతో పోలీసులు అతడిని  మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 2020లో రెండు సామాజిక వర్గాల గొడవలో మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్యకేసులో నందిగం సురేష్ 78వ నిందితుడు. ఈ కేసునమోదైన తర్వాత నందిగం అరెస్ట్ అయ్యాడు. తొలుత రెండు రోజుల విచారణలో నందిగంపై ఆధారాలు లభ్యం కావడంతో కోర్టు 14 రోజు ల రిమాండ్ విధించింది. తాజాగా సోమవారం మరో 14 రోజులు రిమాండ్ విధించింది. అంటే ఈ నెల 14 వరకు నందిగం జైల్లో ఉంటాడు. 

గొప్ప విలువలకు పట్టంగట్టిన కారా మాస్టారు

కథా రచనలోనూ, నిజజీవితంలోనూ కాళీపట్నం రామా రావు మాస్టారికి గొప్ప విలువలు ఉన్నాయి. వాటిని ప్రతి వ్యక్తి అలవర్చు కోవాలి.  శ్రీకాకుళం సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్ లో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శత జయంతి కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం (ఎచ్చెర్ల) ఉప కులపతి కె.ఆర్. రజని పాల్గొన్ని ప్రసంగించారు.  అక్షరమే దైవంగా భావించిన కారా మాస్టారి జీవితం, చేసిన రచనలు ఎన్నటికీ ఆదర్శనీయమని రజజని అన్నారు. జ్ఞానం, విజ్ఞత, విలువలు, ధీరత్వం వంటి సుగుణాలు కారా మాస్టారు నుంచి నేటి తరం గ్రహించాలని, ఇవి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడాలన్నారు. తల్లి లాంటి మాతృభాషా పరిరక్షణకు, అందులోని రచనలను భావితరాలకు అందించేందుకు కృషి జరగాలని సూచించారు.   మాజీ  ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం ప్రభావంతో రచయితలకు కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటగడుతు న్నారని, తెలుగు వారు విడిపోతున్నారని అన్నారు. ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ కారా లాంటి కథకుడు లేరని, తన జీవిత సార్థకతకు కొన్ని నియమాలను ఆయన పెట్టుకున్నారని చెప్పారు. ఎవరూ చెప్పని గొప్ప విషయాలు సాహిత్యం చెప్పిందని భావించి సాహిత్యానికి అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి కారా మాస్టారు అని కొనియాడారు. ప్రకృతి నియమాలు, సమాజ నియమాలు పాటించాలన్న నియమాన్ని ఆయన  జీవితాంతం ఉల్లంఘించలేదని తెలిపారు. రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగ నాథం మాట్లాడుతూ సమాజంలోని సమస్యల మూలాలను తెలుసుకోగలిగితే మంచి కథలు రాసి సమస్యలకు పరిష్కారం అన్వేషించ గలమని కారా మాస్టారు చెబుతుండేవారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కథానిలయంను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి రచనలను ప్రపంచానికి పరిచయం చేయడమే కారా మాస్టారుకు మనం ఇచ్చే నివాళి  అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత చీకటి దివాకర్ మాట్లాడుతూ తెలుగు కథకుల్లో మూడు తరాలు వారికి ప్రతినిధిగా కారా మాస్టారు నిలిచారన్నారు. గోనె సంచులు పట్టుకుని ఊరురా తిరిగి కథలు సేకరించారని అన్నారు. విశ్వసాహితి అధ్యక్షులు పొన్నాడ వరాహ నరసింహులు, సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షులు కె.శ్రీనివాస్, కారా మాస్టారి కుమారుడు కె.సుబ్బారావు, గరిమెళ విజ్ఞాన సమితి అధ్యక్షుడు వి.జి.కె.మూర్తి తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమం కొనసాగింపులో భాగంగా ప్రత్యేక సదస్సు జరిగింది. కారా మాస్టారు రచనలు, కథలపై రచయితలు, ఉపాధ్యాయులు దుప్పల రవికుమార్, కంచె రాన భుజంగరావు, మల్లిపురం జగదీష్, డా. కె. ఉదయ్ కిరణ్, ఎ.మోహనరావు, బాడాన శ్యామలరావు, బాల సుధాకర మౌళి, చింతాడ తిరుమలరావు, పూజారి దివాకర్ పత్ర సమర్పణ చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ శత జయంతి కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు, భాషాభిమా నులు, అనుచరులు, విద్యార్థులు పాల్గొన్నారు.