మంగళగిరి పీఎస్ లో సజ్జల

వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావలసిందిగా సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసు మేరకు సజ్జల మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ వద్ద భారీ  భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు బుధవారం విలేకరులతో మాట్లాడిన సజ్జల తనకు పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని, తనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేయడాన్ని తప్పు పట్టారు. కక్ష సాధింపు కాక మరోటి కాదన్నారు. పోలీసు వ్యవస్థను తెలుగుదేశం కూటమి నిర్వీర్యం చేసేసిందని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇన్ని ప్రశ్నలు వేసినా సజ్జల నోటీసు అందుకుని పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాక తప్పలేదు.  వాస్తవానికి సజ్జల సంధించిన ప్రశ్నలూ, చేసిన విమర్శలూ అన్నీ స్వయంగా తనను ఉద్దేశించి చేసుకున్నట్లుగా ఉన్నాయని పరిశీలకులు పరిశీలకులు అంటున్నారు.  గత ప్రభుత్వంలో అంటే జగన్ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారు. ఆ పోస్టులో ఆయన పని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం మాత్రమే. అంటే సజ్జల పాత్ర మొత్తం తెరవెనుకనే ఉండాలి. కానీ సజ్జల తెరముందుకు వచ్చేశారు. జగన్ సర్కార్ మంచి చెడ్డలన్నిటిలోనూ సజ్జల ప్రమేయం ఉంది. పాత్ర ఉంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు.  సకల శాఖల మంత్రిగా అన్ని శాఖలపైనా పెత్తనం చెలాయించారు.  అంతేనా జగన్ కు కళ్లూ, చెవులూ, నోరూ కూడా సజ్జలే అన్నట్లుగా సజ్జల హవా సాగింది.  జగన్ అధికారంలోకి వచ్చింది లగాయతూ, ఘోర పరాజయం వరకూ జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా  ఉన్నది సజ్జలేనని పార్టీ నేతలూ, క్యాడర్ ముక్తకంఠంతో చెబుతున్నారు. అందుకే గతంలో జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు భగ్గుమన్న అసమ్మతి నేతలంగా సజ్జలనే నిందించారు. అలాగే  ఎన్నికలలో టికెట్లు దక్కని నేతలూ సజ్జలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని భయంభయంగా తిరుగుతున్నవారు సైతం తమ ఈ పరిస్థితిని సజ్జలే కారణమని ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా ఇప్పుడు సజ్జల విచారణకు హాజరు కావడానికి కారణమైన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఉన్నది కూడా సజ్జలేనని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన వారు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడు సజ్జల  కూటమి ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలను పార్టీ శ్రేణులే పట్టించుకోవడం లేదు.  సజ్జలకు మద్దతుగా మాట్లాడేందుకు వైసీపీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. 

ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు కీలక బాధ్యతలు ?

ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు 20 భాగస్వామ్యపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. హర్యానా ఎన్నికలో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇవ్వాళ ఉదయమే విజయవాడ నుంచి చండీగడ్ బయలు దేరిన చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశానంతరం చంద్రబాబుకు కీలక పదవి అప్పగించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. గత లోకసభ ఎన్నికల్లోబిజెపి భాగస్వామ్య పక్షాలు అత్యధిక మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగే సమావేశం కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.      

కేసీఆర్ కు చంద్రబాబు మరో రిటర్న్ గిఫ్ట్.. బీఆర్ఎస్ పనైపోయినట్లేనా?

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేసీఆర్ విషయంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? 2019లో  తెలుగుదేశం పార్టీ ఓటమిపై కేసీఆర్ చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలకు చంద్రబాబు ఇప్పుడు అదే రీతిలో బదులు చెప్పడానికి రెడీ అయిపోయారా? ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో చెలరేగిపోతారన్న పేరున్న కేసీఆర్ చంద్రబాబు ఎత్తులతో చతికిలపడిపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని పోటీకి దూరంగా ఉంచడమే ప్రధాన కారణమని అంటున్నారు. సరే అది పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో బలోపేతంపై దృష్టి సారించింది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంపై నజర్ పెట్టారు.   కారణాలేమైతేనేం.. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం నేతలు చాలా వరకూ తమ దారి తాము చూసుకున్నారు. పార్టీని వీడారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరలేదు. ఆ విషయం విభజన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రస్ఫుటంగా అవగతమైంది.  తెలంగాణలో  ఏ ఎన్నిక జరిగినా...  పార్టీలన్నీ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ప్రాకులాడాయి, ప్రయత్నించాయి.  ఆ పార్టీ క్యాడర్  మద్దతు పొందిన పార్టీనే విజయం వరిస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం.   అది కేవలం నమ్మకం కాదు.. నూటిని నూరుపాళ్లూ వాస్తవం అన్న సంగతి  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సందేహాలకు అతీతంగా రుజువైంది.  ఎవరు ఔనన్నా కాదన్నా  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు.. ఉంటారు. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ  ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో  ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ  జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది.  ఈ విషయం గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టడంతో మరోసారి రుజువైంది.  ఇక ఇప్పుడు రాష్ట్రంలో పార్టీపై చంద్రబాబు దృష్టి పెట్టడం అంటే బీఆర్ఎస్ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాలు అంతంత మాత్రంగానే ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నా తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయిస్తానని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు. తెలంగాణలో స్థానిక ఎన్నికలలో  తెలుగుదేశం పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న బీఆర్ఎస్ బేజారైపోయింది. హైడ్రా, రుణమాఫీ, రైతు బంధు వంటి విషయాల్లో రేవంత్ సర్కార్ తీరును ప్రశ్నిస్తూ ఇప్పుడిప్పుడే ప్రజలలోకి వస్తున్న బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం ఎంట్రీతో జావగారిపోతున్నారు.  ఎందుకంటే తెలంగాణలో  తెలుగుదేశం కోసం అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు.  ఈ పదేళ్ల కాలంలో వారంతా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ మద్దతు 2023 ఎన్నికలలో  లభించకపోవడంతోనే బీఆర్ఎస్ పరాజయం పాలయ్యింది.  ఇప్పుడు మళ్లీ తెలంగాణ తెలుగుదేశం దగ్గరకు వస్తే.. పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. వాటిని చెక్కు చెదరకుండా కాపాడుతున్న క్యాడర్ ఉంది. మరి రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అంటే మాత్రం సమాధానం దొరకదు.  అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. తరచుగా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ భవన్ లో క్యాడర్ కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా  రాష్ట్రంలో పార్టీకి సమర్ధుడైన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఒక సారి చంద్రబాబు తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టాననీ, పూర్వ వైభవం దిశగా పార్టీని నడిపిస్తాననీ ప్రకటించగానే.. ఇంత కాలం అక్కడా ఇక్కడా సర్దుకుని పబ్బం గడిపేస్తున్న మాజీలంతా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇంత కాలం పార్టీలో ఉంటూ కూడా ఏ మాత్రం క్రియాశీలంగా లేని నేతలు అలర్ట్ అయిపోయారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని చెప్పుకుంటూ పార్టీ పదవుల కోసం రేసులోకి వచ్చేస్తున్నారు.  ఈ పదేళ్లలో పట్టుమని పది సార్లు కూడా ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టని నేతలు సైతం తామే పార్టీకి ఇంత కాలం పెద్దదిక్కుగా ఉన్నామని చెప్పుకోవడానికి పోటీలు పడుతున్నారు.  ఇలా పార్టీ పదవి కోసం అర్రులు చాస్తున్న వారిలో కార్యకర్తలలో పలుకుబడి ఉన్నవారెవరు అంటే  ఎవరూ కనిపించని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పదేళ్లుగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నామంటూ చెప్పుకుంటూ చొక్కాలు చించేసుకుంటున్న వారెవరికీ పార్టీ క్యాడర్ లో ఇసుమంతైనా పలుకుబడి లేదు.   తెలంగాణలో తెలుగుదేశం ఉంది. చాలా  బలంగా ఉంది. అయితే ఆ పార్టీకి రాష్ట్రఅధ్యక్ష పదవి మాత్రం ఖాళీగా ఉంది.  గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పదవి ఖాళీ అయ్యింది. అప్పట్లో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న  కాసాని జ్ణానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడన్న వాడే లేకుండా పోయారు.  తెలంగాణలో ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం తప్పుకోవడంతో అప్పట్లో పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి చంద్రబాబు ఏం తొందరపడలేదు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీలో ఉంటుందని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. దీంతో ఇక పార్టీ అధ్యక్షుడి ఎన్నిక లేదా ఎంపిక సత్వరమే జరగడం ఖాయం.   ఇప్పుడిక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారన్నది స్పష్టం కావడంతో రాష్ట్ర విభజన తరువాత   పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరి అక్కడ ఇమడలేక ఉక్కపోతకు గురి అవుతున్న పలువురు తెలుగుదేశం మాజీ నాయకులు హోం కమింగ్ అంటూ తెలుగుదేశం గూటికి చేరడానికి క్యూకడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కంగారు పడుతోంది. కంగాళీ అవుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం బలపడితే.. తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరమేనని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురౌతున్నారు. సరిగ్గా స్థానిక ఎన్నికల ముందు రాష్ట్రంలో పార్టీ పటిష్ఠతమై చంద్రబాబు దృష్టి సారించడం అంటే కేసీఆర్ కు రెండో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో పెట్టుబడులకు వేళాయె..!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతున్నారు. గురువారం నాడు ఛండీగఢ్‌లో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు అతిథిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం అని చెబుతూ, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఆహ్వానమంటూ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నూతన అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ డూయింగ్ బిజినెస్, ఫాస్ట్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. "ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ వ్యాపార, పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇంతకంటే మంచి సమయం లేదు. అభివృద్ధి ప్రయాణంలో ఏపీతో సహకరించండి. నూతన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.

అమరావతి... జంగిల్ గాయబ్!

వైసీపీ పాలనలో విధ్వసానికి గురైన రాజధాని నగరం అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం మొదటి అడుగు వేస్తూ జంగిల్ క్లియరెన్స్ పనులకు ఆగస్టు నెలలో శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముగింపు దశలో వున్నాయి. 24 వేల ఎకరాల భూమిలో 36 కోట్ల వ్యయంతో ఆగస్టు నెలలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు 96 శాతం పూర్తయ్యాయి. వర్షాల కారణంగా క్లియరెన్స్ పనులకు అడ్డంకులు ఏర్పాడ్డాయి. వర్షాలు తగ్గినప్పుడల్లా క్లియరెన్స్ పనులు కొనసాగించారు. ఈ పనుల కాంట్రాక్ట్ తీసుకున్న ఎన్‌సీసీ సంస్థ మొత్తం 24 ఎకరాలను 99 గ్రిడ్స్.గా విభజించి దాదాపుగా 4 వందల యంత్రాలతో పనులు చేపట్టింది. తొలగించిన ముళ్ళకంపలను ముక్కలు ముక్కలుగా చేయడానికి హైదరాబాద్ నుంచి ఎనిమిది ప్రత్యేక యంత్రాలు రానున్నాయి. కంపల ముక్కలను సిమెంట్ పరిశ్రమల్లో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వినియోగించున్నారు. కంపలన్నీ తొలగించిన తర్వాత అమరావతి రాజదాని ఇప్పుడు పునర్వైభవానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది.

మావోయిస్ట్ అగ్రనేత సుజాత అరెస్ట్ 

మావోయిస్ట్ పార్టీ  అగ్రనేత సుజాతను పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసిన విషయాన్ని ధృవీకరించచనున్నారు ఆమె భర్త  మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్ జీ  బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.  మావోయిస్ట్ మహిళా అగ్రనేతగా పేరుగాంచిన సుజాత కు కోటి రూపాయల రివార్డు ఉంది. చత్తీస్ ఘడ్ నుంచి ఖమ్మం వచ్చిన సుజాత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు పక్కా సమాచారం ఉంది. వెంటనే  ఆమె పట్టుకున్నారు. సుజాత  మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఇల్లందు నుంచి కొత్తగూడెంకు ఆటోలో వస్తుండగా  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చత్తీస్ గడ్ లో  జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో సుజాత లొంగిపోవడానికి వచ్చినట్లు సమాచారం. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. అనారోగ్యంతో సుజాత బాధపడుతుందని పోలీసులకు అందిన  సమాచారం.

మరో సారి తెలంగాణలో ఐటీ సోదాలు 

హైద్రాబాద్లో  40 చోట్ల ఏకకాలంలో   ఐటీ సోదాలు  జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ , అన్విత బిల్డర్స్, అధినేత అచ్చుత్ రావ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు గురువారం  తెల్లవారు జామునుంచి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అన్విత బిల్డర్స్ ఇటీవల ఫ్రీ లాంచ్ ఆఫర్స్ ప్రకటించి మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఐటీ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఐటీ శాఖ ఆరోపించింది. రాత్రి వరకు ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉంది.

బోరుగడ్డని అరెస్టు చేయడానికి చేతులెలా వచ్చాయ్?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు చాలా దారుణమైన పని చేశారు. వైసీపీ నాయకుడు, శాంతికాముకుడు, మృదుభాషి, సంస్కారవంతుడు, సభ్యతకు మారుపేరు, నీతి నిజాయితీలకు నిలువుటద్దం, మంచివాడు, సౌమ్యుడు, విద్యావేత్త, అన్నిటికంటే ముఖ్యంగా దళితుడు అయిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ని బుధవారం నాడు గుంటూరులోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో వుండగా జగన్‌ కోసం తన పన్నీటి కొలను లాంటి, హంసలు విహరించే మానస సరోవరం లాంటి, అమృతం బోరులాంటి  తన చక్కటి నోటితో బోరుగడ్డ అనిల్ ఎన్నెన్నోమృదుమధుర భాషణలు చేశాడు. కానీ దారుణం... ఏ పాపమూ ఎరుగని శాంతిదూత అయిన బోరుగడ్డ అనిల్‌ ఇప్పుడు పోలీసుల అదుపులో వున్నాడు. అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే, బోరుగడ్డ అనిల్ దళితుడు కాబట్టే అరెస్టు చేశారు. ఆయన దళితుడు కాకుండా వుంటే అందరూ నెత్తిన పెట్టుకుని ఊరేగేవారు. కేవలం దళితుడు అయినందువల్లే తన భర్తని అరెస్టు పోలీసులు అరెస్టు చేశారని ఆయన భార్య గద్గద స్వరంతో బాధపడుతూ వుంటే వింటున్నవాళ్ళకి గుండెలు కరిగిపోయి కళ్ళలోనుంచి బయటకి వస్తున్నాయి. నా భర్త ఏం చేశాడని పోలీసులు అరెస్టు చేశారని ఆ మహా ఇల్లాలు ఆవేశంగా ప్రశ్నించడం చూస్తుంటే ఎంత బాధ కలుగుతోందో చెప్పలేని పరిస్థితి. నిజమే... బోరుగడ్డ అనిల్ ఏం చేశాడు? ఏమీ చేయలేదు. నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడు.  తాను తన భర్తని ఇంట్లో పెట్టి తాళాలు వేసి ఆస్పత్రికి వెళ్ళానని, ఈలోపే పోలీసులు వచ్చేసి తాళాలు పగులగొట్టి, ఇంట్లో వున్న తన భర్తని అరెస్టు చేశారని ఆమె ఆక్రోశిస్తూ చెబుతుంటే ఎంత దారుణమో కదా అనిపిస్తోంది. బోరుగడ్డ అనిల్ లోపల వున్నట్టు పోలీసులకు తెలిస్తే, ఆస్పత్రికి వెళ్ళిన ఆయన భార్య వచ్చేవరకూ పోలీసులు ఇంటి ముందు పడిగాపులు కాయాలిగానీ, తాళాలు పగులగొట్టి మరీ అరెస్టు చేయడమేంటి? పగిలిపోయిన తాళాల రిపేరు ఖర్చులు పోలీసులు ఇస్తారా? ఒకవేళ తాళాలు రిపేరు కానంతగా డ్యామేజ్ అయిపోతే కొత్త తాళాలు ఈ పోలీసులు కొనిస్తారా? పైగా వాళ్ళ పిల్లలు కూడా లోపల వున్నారట. పిల్లల ముందే తండ్రిని అరెస్టు చేశారని ఆ మాతృమూర్తి బాధపడుతోంది. పిల్లలముందు తండ్రిని అరెస్టు చేయకూడదనే కనీస మానవత్వాన్ని మరచిపోయిన పోలీసులు ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? తన భర్త తనకు కనిపించకుండా పోయి రెండు గంటలు అయిందని ఆ మహా ఇల్లాలు తల్లడిల్లిపోతుంటే చూడలేని పరిస్థితి. అయినా, పాపం... లోపల రెస్టు తీసుకుంటున్న బోరుగడ్డ అనిల్‌ని అరెస్టు చేయడమేంటి? రెస్టు తీసుకోవడమే నేరమా? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  ఇంటిపట్టున లేకుండా ఆ ఊరికీ, ఈ ఊరికీ తిరిగీ తిరిగీ అలసిపోయాడు బిడ్డ. ఆ అలసట తీర్చుకోవడం కోసం ఇంటికి వచ్చి రెస్టు తీసుకుంటుంటే పోలీసులు అరెస్టు చేశారు. రెస్టు తీసుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేయడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే అని ఈ పోలీసులకు తెలియదా? రెస్ట్ ఈజ్ రెస్ట్.. రెస్ట్ ఫర్ రెస్ట్.. రెస్ట్ మీన్స్ రెస్ట్ అని ఈ పోలీసులకు తెలియదా? కరెక్టే, వైసీపీ అధికారంలో వుండగా బోరుగడ్డ అనిల్ అప్పట్లో ప్రతిపక్షంలో వున్న వాళ్ళని అందర్నీ నోటికొచ్చిన బూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని చంపుతానని అన్నాడు. ఆమాత్రం దానికే అరెస్ట్ చేస్తారా? చంపుతానని అన్నాడే తప్ప చంపాడా? చంపలేదు కదా? అలాంటప్పుడు అరెస్టెందుకు చేశారు? బోరుగడ్డ అనిల్ చంపుతానని అన్నందుకే అంత ఫీలైపోవాల్సిన అవసరమేంటి? ఏదో మాటవరకి చంపుతా అని వుంటాడు. అలాంటి మాటల్ని లైట్‌గా తీసుకోవాలనిగానీ, ఇలా అరెస్టు చేయడమేంటి? వైసీపీ అధికారంలో వున్న సమయంలో బోరుగడ్డ అనిల్ అలా మాట్లాడాడే తప్ప, అధికారం పోయిన తర్వాత ఒక్క మాట అయినా అన్నాడా? లేదే!? అలాంటిప్పుడు ఎందుకు అరెస్టు చేశారు? ఇది పాత  కక్షలను మనసులో పెట్టుకుని చేసిన అరెస్టు అని క్లియర్‌గా తెలిసిపోతోంది కదా? అయినా అప్పట్లో బోరుగడ్డ అనిల్ ఆ రేంజ్‌లో మాట్లాడ్డం వల్లే కదా జనం వైసీపీ గవర్నమెంట్‌ని దించేసి చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. కనీసం ఈ కృతజ్ఞత కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ప్రభుత్వానికి కృతజ్ఞత అనేదే వుంటే బోరుగడ్డ అనిల్‌కి ఎమ్మెల్సీ ఇచ్చి, హోమ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టాలి. అలాంటిది పోలీసులతో అరెస్టు చేయిస్తారా? సమాజంలో  మానవత్వం చనిపోయింది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ వుంటుందా?  అసలు ఆ మానవతా మూర్తిని అరెస్టు చేయడానికి చేతులెలా వచ్చాయంట? చివరిగా చెప్పేది ఒకటే... బోరుగడ్డ అనిల్‌ని వెంటనే విడుదల చేయాలి. పగలగొట్టిన తాళాలకు బదులు కొత్త తాళాలు కొనివ్వాలి!

విడదల రజినీ అవినీతి లీలలు ఇన్నిన్ని కావయా?!

సైబరాబాద్ మెక్క, మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోందా? అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడిన విడదల రజని ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పదా అంటే పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం ఔననే అంటున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  పల్నాడు స్టోన్ క్రషన్ యాజమాన్యం ఏకంగా విడదల రజినీపై తమ నుంచి రెండున్నర కోట్లు వసూలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉండగా విడదల రజిని అక్రమాలపై పలువురు బాధితులు హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలన్నిటిపై విచారణ జరుగుతోంది. రజినీ బాధితుల్లో సామాన్యుల నుంచి బడా బడా వ్యాపారుల వరకూ ఉన్నారు. ఇక కబ్జాల ఆరోపణలైతే లెక్కే లేదు. ఇక  జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటీ 16 లక్షల రూపాయల కమిషన్‌ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.  కేసు నమోదు అయ్యేలోగానే జగ్రత్తపడిన విడదలరజినీ రైతులకు ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారని చెబుతారు.   అదే విధంగా  2024 ఎన్నికల ముందు చిలక‌లూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని తన వద్ద విడద‌ల ర‌జ‌నీ ఆరు కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి రాజేశ్‌ నాయుడు ఆరోపించారు. ఆ సొమ్ము వెనక్కు ఇచ్చేయాలని పట్టుబట్టారు. దీంతో కొంత మొత్తం రజినీ తిరిగి ఇచ్చేశారు. అయితే మిగతా సొమ్ము కోసం ఆయన గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఇబ్బందులు, కేసులతో అసలే ఉక్కిరి బిక్కిరి అవుతున్న రజినీ  నాడు నేడు పనుల్లో పాల్పడిన మరో అవినీతి బాగోతం బయటకు వచ్చింది. చిలకలూరి పేటలోని శారద హైస్కూల్ లో నాడు నేడు పనుల పేరు చెప్పి 40 లక్షల రూపాయలను రజనీ నొక్కేశారంటూ ఆ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. నాడు నేడు పనులలో అవినీతి, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పడింది.  ఇప్పుడు విడదల రజినిపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో కూడా రజినీకి ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు. 

మానవరూపంలో మృత్యువు.. లారెన్స్ బిష్ణోయ్!

రెక్కీ చేసెయ్... ప్రాణం తీసెయ్.. ఇదే, రెండుపదుల వయసులోనే ఫస్ట్ మర్డర్ చేసి.... హత్యల శాస్త్రంలో అక్షరాభ్యాసం చేసిన లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌సభ్యులకు చెప్పే నేరకమంత్రం. ముప్ఫై ఒక్క సంవత్సరం వయసు వచ్చేసరికి లారెన్స్ బిష్ణోయ్ మోడ్రన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. మర్డర్ చేయడం ఈజీనా, మంచినీళ్ళు తాగడం ఈజీనా అని అడిగితే... మర్డర్ చేయడమే ఈజీ అని మొహమాటం లేకుండా చెప్పే ఏడు వందలమంది కరడుగట్టిన సభ్యులతో దేశమంతటా గ్యాంగ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు సబర్మతీ జైల్లో వున్నాడు. అయినప్పటికీ తాను లేని లోటుని ఈ సమాజం ఫీల్ అవనివ్వడు. అందుకే తన గ్యాంగ్‌ సభ్యులతో బ్లాక్‌మెయిల్స్, మర్డర్స్ చేయిస్తూ మకుటంలేని మాఫియా మహారాజులా వెలుగుతున్నాడు. లారెన్స్  బిష్ణోయ్ జైలు నుంచి ఆదేశిస్తాడు.. బయట వున్న అతని గ్యాంగ్ మెంబర్స్ చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తారు.. అది మర్డరైనా.. మరేదైనా! అప్పుడెప్పుడో పాతతరం వాళ్ళకి దావూద్ ఇబ్రహీం.. హాజీమస్తాన్, ఛోటా రాజన్ లాంటి గ్యాంగ్స్.స్టర్స్ గురించి తెలుసు.. మూడు పదుల వయసులోనే మర్డర్లు, కిడ్నాపులు, బ్లాక్‌మెయిలింగ్స్ లాంటి ముప్పైకి పైగా కేసులని తన కీర్తికిరీటంలో ధరించిన మోడ్రన్ మొద్దుశ్రీను లారెన్స్ బిష్ణోయ్‌‌ గురించి తెలుసుకునే అవకాశం ఈనాటి కొత్తతరానికి కలుగుతోంది. ఆమధ్య జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిక్ హత్యతో తన మరణశాసనాలను హిస్టరీని అప్‌డేట్ చేసుకున్న లారెన్స్ బిష్ణోయ్ జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని తరిద్దాం. లారెన్స్ బిష్ణోయ్ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పుట్టాడు. అతని తండ్రి హర్యానాలో పోలీస్ కానిస్టేబుల్. ఇంటర్మీడియట్ వరకు అబోహర్‌లో చదువుకున్న బిష్ణోయ్ ఆ తర్వాత చండీగఢ్ డీఏవీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదివాడు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. పట్టా అందుకున్నాడు. కాలేజీలో, యూనివర్సిటీలో వున్నంతకాలంలో లారెన్స్ బిష్ణోయ్ చదివింది తక్కువ... విద్యార్థి రాజకీయాలు నడిపింది ఎక్కువ. కాలేజీలో చదివే రోజుల్లో కాలేజీ ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థిని ముచ్చటగా మర్డర్ చేసుకున్నాడు. ఆ తర్వాత లుథియానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన మీద పోటీ చేస్తున్న అభ్యర్థి బుర్రకి బుల్లెట్ రుచి చూపించాడు. రెండు పదులు నిండీనిండకుండానే డజన్లకొద్దీ నేరాలు ఘోరాల చేసిన బిష్ణోయ్ మీద బోలెడన్ని  కేసులు నమోదయ్యాయి. బంగారానికి తావి అబ్బినట్టు.. అయ్యగారిది అసలే క్రిమినల్ బ్రెయిన్.. దానికి తోడు ‘లా’ కూడా చదివి చట్టానికి చుట్టమయ్యాడు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని స్వేచ్ఛగా తిరిగాడు. బెదిరింపులే పెట్టుబడిగా ఒకవైపు నేర సామ్రాజ్యాన్ని, మరోవైపు  వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అడపాదడపా జైలుకు వెళ్ళినా, దాన్ని కూడా తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికే ఉపయోగించుకున్నాడు. జైల్లో వున్న కరడుగట్టిన నేరస్తులకు తన గ్యాంగ్‌లో మెంబర్‌షిప్ ఇచ్చేవాడు.. అలా ఏడువందలకు పైగా కర్కోటర్లతో బలమైన ముఠాని క్రియేట్ చేసుకున్నాడు.  ఇంత ఘనమైన చరిత్ర వున్న బిష్ణోయ్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాని హత్య చేయడానికి తన ఫ్రెండ్ అయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌కి తీహార్ జైల్లోంచే సహకరించాడు. ఈ నేరంలో బిష్ణోయ్ హస్తం వుందని తెలిసినా, చట్టం గుట్టుమట్లు, లోటుపాట్లు బాగా తెలిసిన బిష్ణోయ్ మీద పోలీసులు ఏ చర్యా తీసుకోలేకపోయారు. 2023లో ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్‌దూల్ సింగ్‌ గిల్ హత్యని, కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యని మేమే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ సగర్వంగా ప్రకటించుకుంది. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, హీరో సల్మాన్‌ఖాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖుల సన్నిహితుడు బాబా సిద్ధిక్‌ని హత్య చేయడం ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ కొత్త కలకలానికి తెర తీసింది.  రెండు దశాబ్దాల నిశ్చబ్దం తర్వాత ముంబైలో మళ్లీ తుపాకీ మోత మోగింది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలో నెత్తుటి ధారలు పారించిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ బాబా సిద్ధిక్ హత్యతో ముంబైలో అడుగుపెట్టింది.  బాలీవుడ్ సెలబ్రెటీలకు సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తామే చంపామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు ఆ గ్యాంగ్ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు సినీ నటుడు సల్మాన్ మీద కోపంతోనే బాబా సిద్ధిక్‌ని బిష్ణోయ్ చంపించాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ బిష్ణోయ్‌కి సల్మాన్‌ఖాన్ మీద ఎందుకు కోపం? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1999లో సల్మాన్ ఖాన్ నటించిన హమ్ సాథ్ సాథ్ హై సినిమా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం రాజస్థాన్‌లో జరిగింది. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, తన సహనటులతో కలిసి అక్కడి అడవుల్లో విహరించే కృష్ణ జింకలను వేటాడాడు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఆ తరువాత కేసు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇంతవరకు సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడలేదు. కృష్ణ జింకలను లారెన్స్ బిష్ణోయ్ సామాజిక వర్గం తమ కులదైవానికి ప్రతీకగా పూజిస్తుంది. కృష్ణ జింకలను పవిత్ర జంతువులుగా ఆరాధిస్తుంది. బిష్ణోయ్ సామాజివర్గానికి చెందినవారు చనిపోయాక కృష్ణ జింకలుగా పుడతారన్న బలమైన నమ్మకం వారిలో వుంది. కృష్ణ జింకల విషయంలో బిష్ణోయ్‌ల ప్రేమ ఏ స్థాయిలో వుంటుందంటే... ఎప్పుడైనా తల్లి కృష్ణజింక చనిపోయి దాని పిల్లలు అనాథలు అయితే, బిష్ణోయ్ సామాజికవర్గంలోని మహిళలు వాటిని తమ బిడ్డల్లాగా ప్రేమగా పెంచుతారు. బాలింతలుగా వున్న మహిళలు ఆ కృష్ణజింక పిల్లలకు చనుపాలు ఇచ్చి పెంచుతారు. అలాంటి పవిత్ర జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపాడని బిష్ణోయ్ సామాజిక వర్గంలో ఆగ్రహం వుంది. ఒక సందర్భంలో లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడాడు. నాకు సల్మాన్‌ఖాన్‌ని చంపాలన్న ఉద్దేశం లేదు.  మా బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన ముకం ముక్తి ధామ్ ఆలయానికి సల్మాన్ ఖాన్ వెళ్ళి క్షమాపణలు చెబితే మేం ఆయన్ని క్షమిస్తాం అన్నాడు. అయితే సల్మాన్ ఖాన్ సదరు ఆలయానికి వెళ్ళిందీ లేదు.. క్షమాపణ చెప్పిందీ లేదు. అందువల్ల సల్మాన్ మీద వున్న కోపం లారెన్స్ బిష్ణోయ్‌కి పెరిగిపోయి వుంటుందని, సల్మాన్‌కి షాక్ ఇవ్వడం కోసమే ఆయన సన్నిహితుడైన మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ని హత్య చేయించి వుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   బిష్ణోయ్ గ్యాంగ్ తమ ఉనికి చాటుకోవడం కోసం గతంలో ఒకసారి  సల్మాన్ ఇంటి దగ్గర ఫైరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ బిగ్ టార్గెట్‌ను షూట్ చేయకపోతే భయం ఉండదని అనుకుని.. బాబా సిద్దిఖీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో దావూద్ ఇబ్రహీం కూడా ఇలాగే బాలీవుడ్‌ను టార్గెట్ చేసేవాడు. పలువురి మీద దాడులు చేయించాడు. ఇలా బెదిరించే దావూద్ బాలీవుడ్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతారు. తర్వాత మెల్లగా మాఫియా కబంధ హస్తాల నుంచి బాలీవుడ్ బయటపడింది. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ రూపంలో మరోసారి ముంబైలో మాఫియా తలెత్తుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి.  హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలని దాటి ఇప్పుడు ముంబై మీద కూడా తన పంజా విసిరిన లారెన్స్ బిష్ణోయ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్రాండ్ ఐడెంటిటీ చూపిస్తున్నాడు. లారెన్స్ తీహార్ జైల్లో వుంటూనే, కెనడాలో వున్న తన సోదరుడి ద్వారా అక్కడ నేర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం వుందని కెనడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. బిష్ణోయ్ గ్యాంగ్‌ని భారత ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కెనడా ప్రభుత్వం నోరు పారేసుకుంది. అక్కడతో ఆగకుండా నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను కూడా చేర్చింది. ఇండియా మీద బురద చల్లడానికి బిష్ణోయ్ గ్యాంగ్ చేస్తున్న నేరాలను కెనడా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.  రాజకీయ నాయకుడు ఎక్కడున్నా రాజకీయ నాయకుడే. తన ప్రయోజనం కోసం ఎన్ని నాటకాలైనా ఆడతాడు. కెనడా ప్రధాని ట్రూడో కెనడాలో ప్రజలతో పాటు సొంత పార్టీలో కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కెనడాలో వున్న సిక్కుల ఓట్లు కూడా చాలా కీలకం. కెనడాలో వున్న సిక్కుల్లో ఎక్కువ శాతం ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చేవారే. ఖలిస్తాన్ లీడర్ నిజ్జర్‌ని హత్య చేయించిన బిష్ణోయ్‌కి, ఇండియా ఏజెంట్లకి సన్నిహిత సంబంధాలు వున్నాయన్న అబద్ధాన్ని కెనడా ప్రభుత్వం అక్కడి సిక్కుల్లో బలంగా నాటగలిగింది. ఇండియా వ్యతిరేకించే ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా కూడా సిక్కుల్లో తమకు మద్దతు పెంచుకుంటోంది. ఒకవైపు ఖలిస్తాన్ ఉద్యమాన్ని సమర్థించడంతోపాటు, మరోవైపు నిజ్జర్ హత్య ఇండియా, బిష్ణోయ్ కలసి చేశారన్న అంశాన్ని ప్రచారం చేయడం ద్వారా కెనడా ప్రధాని రాజకీయంగా లాభం పొందాలని అనుకుంటున్నాడు.  తన రాజకీయ వ్యూహంలో లారెన్స్ బిష్ణోయ్‌ని ఒక పావులా వాడుకుంటున్నాడు. బిష్ణోయ్ చేయించిన హత్య పుణ్యమా అని ఇండియా - కెనడా దేశాల మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడింది. ఆ అగాథాన్ని కెనడా నాయకులు ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కెనడా చేసిన కవ్వింపు చర్యలకు ప్రతిచర్యగా భారత ప్రభుత్వం ఇండియాలో వున్న కెనడా ప్రతినిధులను దేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది.  రేపో మాపో కెనడా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం వుంది. స్వదేశంలో ఆగడాలతో ఆగకుండా  ఇండియా - కెనడా మధ్య కూడా నిప్పు పెట్టిన లారెన్స్ బిష్ణోయ్ సబర్మతీ  జైల్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు.

నాంపల్లి కోర్టుకు కేటీఆర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ దావాకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందకు కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్ల కోర్టుకు హాజరు కానున్నారు. కొండా సురేఖపై కేటీఆర్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావాపై ఈ నెల 14న విచారించిన కోర్టు.. కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేయాలని ఆదేశిస్తూ కేసును  శుక్రవారం (అక్టోబర్ 18)కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఆయనతో పాటుగా సాక్షులుగా  బీఆర్ఎస్ నేతలు బాల్క సమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రావణ్ కూడా నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. 

కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తొలి నుంచీ కాంగ్రెస్ లో ఉండి, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తల పట్ల రేవంత్ చిన్న చూపు చూస్తున్నారన్న ఆగ్రహం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచీ పార్టీలో ఉన్న వారి పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాత, కొత్త కాంగ్రెస్ విభేదాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రచ్చకెక్కాయి. ధర్నాలు, నిరసనల రూపంలో రోడ్డున పడ్డాయి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో  కడియం శ్రీహరికి వ్యతిరేకంగా స్థానిక నేతలు ధర్నాకు దిగారు. మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్నవారికి కాకుండా  కడియం శ్రీహరి వర్గీయులకే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తున్నారనీ, పెద్దపీట వేస్తున్నారనీ ఆరోపిస్తూ కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ స్థానిక నేత సింగాపురం ఇందిర నాయకత్వం వహించారు. ఇందిర మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో కడియం వర్గీయులకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ ఆ కమిటీలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగింపు!

సాధారణంగా కోర్టుల్లో వుండే న్యాయదేవత (లేడీ ఆఫ్ జస్టిస్) విగ్రహం కళ్ళకు నల్లటి రిబ్బన్‌తో గంతలు కట్టి వుంటాయి. సినిమాల్లో అయితే ఆ కళ్ళ గంతలను పదేపదే జూమ్ వేసి మరీ చూపిస్తూ వుంటారు. చట్టానికి చెవులే తప్ప కళ్ళు వుండవనే మాటకి అనుగుణంగా కళ్ళకు గంతలు కడతారు. దీన్ని ఆధారంగా చేసుకుని ‘‘చట్టానికి కళ్ళులేవు తమ్ముడూ’’ అంటూ సినిమా కవులు పాటలు కూడా రాసేశారు. కళ్ళకు గంతలు, చేతిలో ఖడ్గం ఇదీ న్యాయదేవత సమగ్ర స్వరూపం. అయితే ఇప్పుడు ఆ స్వరూపంలో మార్పు వచ్చింది. సుప్రీం కోర్టులో న్యాయదేవత విగ్రహం కొత్త మార్పులతో కనిపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ న్యాయదేవత విగ్రహం స్వరూపాన్ని మార్చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో మార్పులతో కూడిన న్యాయదేవత విగ్రహం కనిపిస్తోంది. ‘‘చట్టం గుడ్డిది కాదు’’ అనే సందేశాన్ని ఇచ్చే విధంగా న్యాయదేవత కళ్ళకు కట్టి వుండే నల్ల రిబ్బన్‌ను తొలగించారు. అలాగే అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా పేర్కొంటూ వస్తున్న న్యాయదేవత చేతిలోని ఖడ్గం స్థానంలో భారత రాజ్యాంగం వుంది. న్యాయదేవతకు మరో చేతిలో వుండే త్రాసును యథాతథంగా వుంచారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో ఈ కొత్త విగ్రహం కనిపించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటిష్‌ చట్టాలకు వీడ్కోలు పలికి కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయ దేవత విగ్రహంలోనూ మార్పులు జరగాలని జస్టిస్ చంద్రచూడ్ గతంలోనే సూచించారు. ‘న్యాయదేవత కళ్ళకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఖడ్గం హింసకు ప్రతీకగా కనిపిస్తోంది. అందువల్ల దానిని తొలగించాలి’’ అని అన్నారు.

అపర గజనీలా సజ్జల డ్రామాలు!

ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలన అంతా త‌ప్పుల‌మీద త‌ప్పులు చేయ‌డ‌మే, ప్ర‌తిప‌క్ష టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డమే అధికారం అన్నట్టుగా సాగింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో  వైసీపీ నేత‌ల్లో   వ‌ణుకు మొద‌లైంది. పోలీసుల అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తించిన ఒక్కొక్క‌రిపై కూట‌మి ప్ర‌భుత్వం గురిపెట్టింది. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకొని త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పై ఇప్ప‌టికే కొర‌డా ఝుళిపిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం.. ఇక‌ నుంచి గ‌డిచిన ఐదేళ్ల‌లో అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ నేత‌ల అక్ర‌మాల‌ు, దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌ల‌ను వెలికితీస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసుకు సంబంధించిన ద‌ర్యాప్తు వేగంగా కొన‌సాగుతోంది. వైసీపీ హ‌యాంలో కొంద‌రు ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలోకి వెళ్లి దాడికి పాల్ప‌డ్డారు. కార్యాల‌యంలో ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం  చేశారు. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. అయినా, దాడికి పాల్ప‌డిన‌వారిపై వైసీపీ ప్ర‌భుత్వం ఏ   చ‌ర్య‌లు తీసుకోలేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ కేసుకు సంబంధించి ద‌ర్యాప్తును ప్రారంభించింది. ఇప్ప‌టికే 65మందిని విచారించి 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో త‌న‌కు అరెస్టు నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది.  టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విదేశాల‌కు వెళ్ల‌కుండా ఇప్ప‌టికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత‌లు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తల‌శిల ర‌ఘురామ్‌ల‌ను ప‌లు ద‌ఫాలుగా పోలీస్ స్టేష‌న్ కు పిలిచి విచారించారు. కేసు కొలిక్కి వ‌స్తున్న నేప‌థ్యంలో దాడి ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న ముఖ్య నాయ‌కుల‌ను విచారించేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స‌జ్జ‌ల‌కు మంగ‌ళ‌గిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో గురువారం (అక్టోబర్ 17) ఉద‌యం పదిన్నర గంట‌ల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో  విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. ఈ నోటీసుల‌పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ‌తాన్ని మ‌రిచిన గ‌జ‌నీలా వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో ఎవ‌రిపైనా దాడులు జ‌ర‌గ‌లేద‌న్న స‌జ్జ‌ల‌.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందంటూ చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి వైసీపీ   ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌ర‌గ‌ని రోజు లేదని చెప్పొచ్చు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును క‌నీసం ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండానే అరెస్టు చేసి దాదాపు రెండు నెల‌లు జైల్లో పెట్టారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పైనా అక్ర‌మ కేసులు బ‌నాయించారు. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోని కీల‌క నేత‌లంద‌రిపై అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధింపుల‌కు గురిచేశారు.  2014-2019 మ‌ధ్య‌కాలంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టిన దాఖ‌లాలు లేవు. కానీ, వైసీపీ హ‌యాంలో మాత్రం వంద‌ల మంది టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టారు. కొంద‌రిని అకారణంగా జైళ్ల‌కు పంపించారు. మ‌రికొంద‌రిని జైళ్ల‌లో హ‌త్య‌లు చేసేందుకు సైతం వైసీపీ అనుకూల పోలీసులు ప్ర‌య‌త్నించారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల ద‌గ్గ‌ర నుంచి సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు.. మొత్తంగా వైసీపీ అరాచ‌కాల‌ను ప్ర‌శ్నించిన ప్ర‌తి ఒక్క‌రిపై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయించి ఇబ్బందుల‌కు గురిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడుల‌కు పాల్ప‌డిన వారిపై కొర‌ఢా ఝుళిపిస్తోంది. అయితే, స‌జ్జ‌ల  తనకు నోటీసులు వచ్చే సరికి సుద్దపూసలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు పాలనలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని గ‌గ్గోలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు తనకు ఇటీరియమ్ ప్రొటక్షన్   సెప్టెంబర్ 20వ తేదీనే ఇచ్చిందని.. అలాంటప్పుడు తనకు ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారంటూ స‌జ్జల ప్ర‌శ్నించారు. త‌న‌ను త్వ‌ర‌లోనే అరెస్టు చేస్తార‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ స‌జ్జ‌ల భ‌యాందోళ‌న వ్య‌క్తం చేశారు.  మీడియా స‌మావేశంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి భ‌యాన్నిచూసి వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో స‌జ్జ‌ల‌, ఇత‌ర వైసీపీ పెద్ద‌ల మాట‌లువిని చ‌ట్టానికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించామ‌ని,  ఇప్ప‌డు  జైళ్ల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్న ఆందోళ‌న వైసీపీ నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి... టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌తో స‌త్సంబంధాలు పెంచుకొని ఆయా పార్టీల్లోకి వెడితే మేల‌న్న భావ‌న‌కు కొంద‌రు నేత‌లు వ‌చ్చేస్తున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి‌. ఐదేళ్ల పాల‌న‌లో ఏపీలో అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న బ్యాచ్   త్వ‌ర‌లోనే   కర్మఫలం అనుభవించక తప్పదన్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.

ఏపీకి మెరుపు వరదల ముప్పు!

వర్షాలు ఏపీని వణికించేస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో  దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు భారీ వర్షాలకు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి.   నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య,, ప్రకాశం, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్,  అనంతపురం కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు(ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ప్రకాశం జిల్లాలోని 4 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 4 మండలాల్లో, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటుందని హచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇలా ఉండగా  భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను నివేదించాలని సూచించారు.  కాగా నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కొండాపురం మండలం, సత్యవోలు అగ్రారం మిడత వాగులోపొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  

కాంగ్రెస్ కు జ్ఞానోదయం?!

హర్యానా ఫలితాలతో కాంగ్రెస్ కు జ్ణానోదయం అయినట్లుంది. అతి విశ్వాసంతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న రాష్ట్రాన్ని చేజార్చుకున్న హస్తం పార్టీ ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముందు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల కు ముందు నుంచీ కూడా సర్వేలన్నీ, చివరాఖరుకు బీజేపీ అనుకూల మీడియా సంస్థలు కూడా హస్తం జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఉద్ఘాటించాయి. పోలింగ్ పూర్తయిన తరువాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ విజయానికి తిరుగులేదనే చెప్పాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తల్లకిందులయ్యాయి. దరిమిలా ఈసీ కూడా సర్వేలకూ, ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదని చెప్పేసింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలకూ కూడా కాశ్మీర్, హర్యానాలతో పాటే ఎన్నికలు జరగాల్సి ఉంది. కారణాలేమైతేనేం.. భద్రత కారణాలు చూపుతూ ఎన్నికల సంఘం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు నవంబర్ లో ముహూర్తం నిర్ణయించింది. జార్ఖండ్ లో రెండు విడతలలో నవంబర్ 13, 20 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. మహారాష్టరలో ఒకే విడతలో నంబంర్ 20న పోలింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ నవంబర్ 23న వెలువడతాయి. నవంబర్ 20 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అదీ సంగతి. జార్ఖండ్, మహారాష్ట్ర లలో వివిధ సర్వేలు కూడా ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉంటాయనే చెప్పాయి. పీపుల్స్ మూడ్ బీజేపీకి అనుకూలంగా లేదని తమ సర్వేలలో తేలిందని పేర్కొన్నాయి.  అయితే ఈ సారి కాంగ్రెస్ ఆ సర్వేల ఫలితాల ప్రవాహంలో కొట్టుకుపోవడానికి రెడీగా లేదు. అందుకే రెండు రాష్ట్రాలకూ ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. జార్ఖండ్ కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను, మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలట్ లను, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానికి తెలంగాణ మంత్రి సీతక్క, సయ్యద్ నసీర్ హుస్సేన్ లు పరిశీలకులుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు గంటల ముందు వీరి నియామకాలను ప్రకటించింది. హర్యానా ఎన్నికలలోలా గెలుపు ముంగిట బోర్లా పడకుండా ఈ పరిశీలకులు ఏ మేరకు కాంగ్రెస్ ను కాపాడుతారో చూడాల్సిందే.  

సీఈసీకి తప్పిన ప్రమాదం

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తృటిలొ  పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతి కూల వాతావరణంలో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ పిథోర్ గఢ్ జిల్లాలో బుధవారం (అక్టోబర్ 16) జరిగింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఉత్తరాఖండ్ అదనపు సీఈవోతో కలిసి ఆయన ఉత్తరాఖండ్ లోనిమున్సియారీకి వెడుతున్నారు. మార్గ మధ్యంలో పర్వత ప్రాంతాలలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో  చిక్కుకుంది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. వాతావరణం పరిస్థితులు మెరుగుపడిన తరవాత సీఈసీ యథావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించి మున్సియారీకి వెళ్లారు.  

కొండాసురేఖకు బిగ్ షాక్... గురువారం  ఢిల్లీకి అసమ్మతి వర్గం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , మంత్రి కొండాసురేఖ మధ్య జరిగిన  వివాదం  చిలికి చిలికి గాలి వానగా మారింది. బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటోలు లేకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొట్టుకునే వరకు వెళ్లడంతో కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదంలో మంత్రి తల దూర్చడమే కాకుండా ఇన్ స్పెక్టర్ కుర్చీలో కూర్చొని పోలీస్ కమిషనర్ , సిఐలను దూషించడం వివాదాస్పదమైంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత దీపా దాస్ మున్షీకి ఫిర్యాదు చేసిన  వరంగల్ కాంగ్రెస్ నేతలు రేపు ( అక్టోబర్ 17) న ఢిల్లీ వెళ్లి  ఎఐసిసి నేత కెసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వేములవాడలో మంత్రి రాక సందర్బంగా స్వామి వారికి సమర్పించే నైవేద్యం ఆలస్యం చేయడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని వారు అన్నారు. సినీ హీరో నాగార్జున కుటుంబ సభ్యుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే క్రిమినల్ కోర్టులో రెండు వేర్వేరు పరవు నష్టం దావాలను మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. ఒకటి నాగార్జున , మరోటి కెటీఆర్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. సమంతకు క్షమాపణ చెప్పినప్పటికీ  ఈ వివాదం సద్దుమణగలేదు. పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గొడవ సద్దుమణిగినది అని చెప్పినప్పటికీ వరంగల్ కాంగ్రెస్ నేతలు తాడో పేడో తేల్చుకుంటామని అధిష్టానం దగ్గరికి బయలు దేరనున్నారు. అధిష్టానం సీరియస్ గా తీసుకుంటే కొండా సురేఖ మంత్రి పదవి ఊడే అవకాశం ఉంది.