యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్.. సుప్రీం కోర్టు లైన్ క్లియర్

గ్రూప్ 1 మోయిన్స్ పరీక్ష యథావిధిగా జరగనుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లైన్ క్లియర్ చేసింది. పరీక్షను వాయిదా వేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఆరంభమైంది.   563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 మెయిన్స్ సోమవారం (అక్టోబర్ 21) నుంచి   27వ తేదీ వరకు  యథావిధిగా జరుగుతాయి. ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.  ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో  46   కేంద్రాల వద్దా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  

పుష్ప2 విడుదలకు క్వాష్ పిటిషన్ తో కష్టాలను కొనితెచ్చుకున్న అల్లు అర్జున్?

అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏపీ ఎన్నికల సమయంలో తన నంద్యాల పర్యటేన సందర్భంగా తనపైన నమోదైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ అల్లు అర్జున్ పై నమోదైన కేసు ఏమిటంటే... నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఒక రోడ్ షో కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల వేళ పోలీసు ఆంక్షలను ధిక్కరించి అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా కేసు నమోదైంది. ఆ కేసునే క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.    అప్పట్లో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచిన వేళ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దాదాపు మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అటువంటి తరుణంలో తెలుగుదేశం కూటమి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, ర్యాలీ నిర్వహించడం సంచలనం సృష్టించింది. దీనిపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెగా అభిమానులు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప2 సినిమాపై వారి ఆగ్రహం ప్రభావం తప్పకుండా పడుతుందన్న అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడిప్పుడే ఆ ఆగ్రహం చల్లారుతోంది. పైగా నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైనది చాలా చిన్న కేసు. పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కూడా లేదు. అసలా కేసు   పురోగతి ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదు. అటువంటి సమయంలో ఇప్పుడు హఠాత్తుగా అదీ పుష్ప 2 రిలీజ్ కు ముందు ఆ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడం కచ్చితంగా మెగాభిమానుల పాత గాయాలను కెలకడమే అవుతుంది. అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్ ద్వారా పుష్ప2 రిలీజ్ ముందు  అనవసరంగా ఇబ్బందులను కొని తెచ్చుకున్నారన్న భావన ఆయన అభిమానులలోనే వ్యక్తం అవుతుంది. 

దివ్వెల మాధురికి నోటీసులు

దివ్వెల మాధురి యూట్యూబర్ గా ఆమెకు ఉన్న గుర్తింపు అంతంత మాత్రమే. అయితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో  వ్యవహారంలో మాత్రం మహా పాపులర్. దివ్వెల మాధురి తన భర్తను, దువ్వాడ శ్రీనివాస్ తన భార్యా బిడ్డలను వదిలేసి మరీ సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ భార్యా కుమార్తెలు రోడ్డెక్కి ధర్నాలు సైతం చేశారు. అయితే దువ్వాడ, దివ్వెల ఇసుమంతైనా ఖాతరు చేయలేదు. ప్రజలేమనుకుంటారన్న సంకోచం లేకుండా బాహాటంగా తమ మధ్య సంబంధం, అనుబంధం ఉన్నదని చాటారు. ఇద్దరూ కూడా వివాహం చేసుకుంటామనీ, అందుకు సంబంధించిన ప్రొసీజర్ జరుగుతోందని చెప్పారు. ప్రొసీజర్ అంటే దువ్వాడ శ్రీను తన భార్యకు, దివ్వెల మాధురి తన భర్తకు విడాకులు ఇచ్చేయడం అన్న మాట. ఆ విడాకుల ప్రక్రియ పూర్తి అయిన తరువాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ సంయుక్తంగా, వేరువేరుగా కూడా ప్రకటనలు ఇచ్చేశారు. టీవీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. అక్కడితో ఆగకుండా వీరిద్దరూ తిరుమల వేదికగా ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటిది కూడా చేశారు. అదిగా ఆ విషయంలోనే దివ్వెల మాధురికి  తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుమల వేదికగా జరిగిన ఫోటో షూట్, ఆ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్వెల మాధురి తిరుమల కొండపై వ్యవహరించిన తీరు తిరుమల ఆలయ నియమాలకు భంగం వాటిల్లేలా ఉందని విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు మాధురిపై బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో అనుచిత ప్రవర్తన, మతపరమైన సెంటిమెంట్లకు భంగం కలిగించడం వంటి నేరాలకు మాధురి పాల్పడినట్లు పేర్కొంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు.   

మల్లారెడ్డి మాస్ డ్యాన్స్.. స్టెప్పులతో ఇరగదీశారు!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మామూలోడు కాదు. ఆయన రాజకీయ నాయకుడే .. వ్యాపారవేత్త, ప్రముఖ విద్యాసంస్థల అధినేత కూడా. ఆయన ఏం మాట్లాడినా? ఏం చేసినా సంంచలనమే అవుతుంది. పూలమ్మినా, కట్టెలమ్మినా, పాలమ్మినా అంటూ ఆయన మాస్ డైలాగులతో చాలా చాలా పాపులర్ అయ్యారు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆయన డైలాగుల్లో పంచ్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ కారణంగానే ఆయన పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పరిస్థితి.   గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్లారెడ్డి సభలు, సమావేశాలు, ప్రసంగాలకు మంచి స్పందన లభించింది.   ‘ఔను.. పూలమ్మినా.. పాలమ్మినా’ అంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక్క ప్రసంగం.. సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యింది. అటువంటి మల్లారెడ్డి తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆయన డ్యాన్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 27 న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ ఈవెంట్ వేదికగానే మల్లారెడ్డి తన మాస్ స్టెప్పులతో చెలరేగిపోయారు.  ఏడు పదుల వయస్సులోకూడా ఆయన కుర్రాళ్లతో సమానంగా మాస్ స్టెప్పులు వేసి అలరించారు.  గతంలో పలు ఈవెంట్లలో  మల్లారెడ్డి చేసిన డ్యాన్సులు ఒకెత్తు,  ఈ సారి డ్యాన్సు స్టెప్పులు మరో ఎత్తు అన్నట్లుగా ఆయన డ్యాన్స్ ఉంది. సంగీత్ లో మాస్ స్టెప్పులు వేయడం కోసం మల్లారెడ్డి కొరియోగ్రాఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి మనవరాలి పెళ్లి సంగీత్ లో మల్లారెడ్డి స్టెప్పులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీగా మారిపోయాయి. 

వయనాడ్ లో బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకను ఓడించనుందా? 

వయనాడ్​లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై , రాష్ట్ర బీజేపీ మ‌హిళా మోర్చా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌వ్య హ‌రిదాస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇద్దరు మహిళా నేతల మధ్య  నువ్వా నేనా  అనే  పోరు నెలకొంది. భారతీయ జనతా పార్టీ వయనాడ్ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌(39) పేరును కన్ఫర్మ్ కావడంతో  ఆమె  రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. కాలికట్ యూనివర్సి నుంచి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు నవ్య. ప్రస్తుతం కోజీకోడ్ కార్పొరేషన్​లో బీజేపీ కార్పోరేటర్ గా ఉన్నారు . వరుసగా ఆమె రెండు సార్లు కార్పోరేటర్ గా ఉన్నారు  2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  ఓ సారి కోజీకోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్​డీఏ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ దేవర్కోవిల్ చేతిలో ఓడిపోయారు. తాజాగా వయనాడ్ లోక్​సభ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. కాగా,ఆమె పై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. గాంధీ కుటుంబం  వయనాడ్ ను సెకండ్ ఆప్షన్ గా ఎం చుకుందన్నారు  నవ్యహరిదాస్ .  

ఆంధ్రప్రదేశ్ కు మరో వాయు‘గండం’?

ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అన్నట్లుగా ఒకదాని వెంట ఒకటిగా తుపానులు రాష్ట్రంపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను కారణంగా మరో నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు భారీ నుంచి అతి భారీ వర్షాల గండం ఉందని పేర్కొంది ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న  ఆవర్తనం  ప్రభావంతో  వచ్చే  24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్ప పీడనం బలపడి ఆ నెల23 నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఈ తుపాను 24వ తేదీన  తీవ్ర తుపానుగా మారి 25వ తేదీన ఒడిశా, లోని గోపాలపూర్‌, పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25తేదీలలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ల రాదనీ హెచ్చరించింది.  

మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్టు

మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు మధురైలో అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న పినిపే శ్రీకాంత్ గత కొంత కాలంగా పరారీలో ఉన్నాడు. ఆయనను పోలీసులు మధురైలో గుర్తించి అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి.   కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ అయినవిల్లి గ్రామంలో వాలంటీర్ గా పని చేసేవాడు. మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కు అనుచరుడు. అదే క్రమంలో పినిపే శ్రీకాంత్ కు సన్నిహితుడిగా మారాడు. ఇటీవలి ఎన్నికలలో పి. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పినిపే శ్రీకాంత్ ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో పినిపే శ్రీకాంత్ కు అన్ని విధాలుగా జనుపల్లి దుర్గాప్రసాద్ సహాయ సహకారాలు అందించారు.  కాగా ఆ క్రమంలో కోనసీమకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. అప్పట్లో ఆ ఆందోళన హింసాకాండకు దారి తీసింది. ప్రధానంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు హింసాకాండ చెలరేగింది. ఆ అల్లర్లలో పినిపే విశ్వరూప్ ఇంటిని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో దాదాపు నెల రోజుల పాటు అమలాపురం వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి. కర్ఫ్యూ కూడా విధించారు. ఆ సమయంలోనే అంటే 2022 జూన్ 6న జనుపల్లి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. అతడి మృతదేహం అదే  నెల 10 ముక్తేశ్వరం రేవు వద్ద అభించింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లతో దర్యాప్తును సాగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటికి పినిపే విశ్వరూప్ మంత్రిగా కూడా ఉండటంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారన్న విమర్శలూ వెల్లువెత్తాయి.  ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి ప్రమేయం ఉందని వెల్లడి కావడంతో పోలీసులు పినిపే శ్రీకాంత్ ను ఈ కేసులో ఏ1గా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన ధర్మేష్ అనే యువకుడు విచారణఏలో పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకు జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య జరిగిందని వెల్లడి కావడంతో శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు.  పరారీలో ఉన్న శ్రీకాంత్ మధురైలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.  

తెలంగాణ సచివాలయం వద్ద గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన 

గ్రూప్ 1 అభ్యర్థులను   బిఆర్ఎస్ పరామర్శించినప్పటికీ ఆందోళన కారుల నుంచి సంఘీభావం వం రాలేదు ఈ  సంఘటన తెలంగాణ సచివాలయం దగ్గర జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులు సచివాలయం ఎదుట బైఠాయించారు. గ్రూప్ 1 పరీక్షలను  వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సచివాలయం ఎదుట గ్రూప్ 1 అభ్యర్థులు బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేత బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం గేట్లను మూసివేశారు గ్రూప్ -1 అభ్యర్థుల పోరాటం  కంటిన్యూ అవుతోంది.  మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద వీరికి బీఆర్​ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. అయితే ఈ సమయంలో బీఆర్​ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.  బీజేపీ, బిఆర్ ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న గ్రూప్‌ వన్‌ అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన  బిఆర్ ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌లను గ్రూప్‌వన్‌ అభ్యర్థులు అడ్డుకున్నారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గో బ్యాక్‌అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడకు బీజేపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఇదిలా వుండగా  కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడకు చేరుకున్నారు. గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు 

జనసేన గూటికి ముద్రగడ పద్మనాభం కుమార్తె

ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన గూటికి చేరారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ మొత్తం కాపు జాతికి తానే ప్రతినిధిని అని చెప్పుకోవడాన్ని అప్పట్లో క్రాంతి తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తన తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్ పై చేస్తున్న విమర్శలను తాను ఖండిస్తున్నానని చెప్పి జనసేనకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.    అప్పట్లోనే  క్రాంతి భారతి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే అందుకు సున్నితంగా తిరస్కరించారు. తండ్రీ కూతుళ్లను విడదీయడం తన అభిమతం కాదంటూ పవన్ కల్యాణ్ ఎన్నికల తరువాత ఆమె చేరికను ఆహ్వానని చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఎన్నికలు పూర్తయ్యాయి. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన గూటికి చేరారు. అన్నట్లుగానే పవన్ కల్యాణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.   

చత్తీస్ గడ్ లో పేలిన మావోయిస్టుల బాంబు

కేంద్ర కమిటీ సభ్యురాలైన సుజాతక్క అరెస్ట్ తో మావోయిస్టులు  చెలరేగిపోతున్నారు.    మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు చత్తీస్ గడ్ లో మావోయిస్టులు మరోమారు చెలరేగిపోయీరు.  బాంబులు పేల్చడంతో నలుగురు  పోలీసులకు గాయాలయ్యాయి. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నారాయణపూర్ జిల్లా అంబూజ్ మడ్ లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో చత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో వందలాది మంది చనిపోయారు. సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారమందింది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో చికిత్స పొందుతున్న సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ అరెస్ట్ ను పోలీసులు ధృవీకరించలేదు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు తలదాచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు పీక్స్ కు?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన నాటి నుంచీ బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకు పోతున్నట్లుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలోకి వచ్చి పదేళ్లయినా ఇంకా కుదురుకోలేదు. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో పుంజుకోవడానికి వచ్చిన అవకాశాలను సైతం ఆ పార్టీ అంతర్గత విభేదాలతో చేజార్చుకుంటోంది. దీనికి తోడు పార్టీ అధినేత ఓటమి తరువాత ఫాం హౌస్ కే పరిమితం కావడం కూడా పార్టీ రోజు రోజుకూ క్షీణించడానికి కారణంగా మారింది.  గత పది నెలలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు మూడు సందర్భాలతో తప్ప ప్రజలలోకి వచ్చింది లేదు. పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఒక విధంగా ఒక్క పరాజయంతో కేసీఆర్ కాడె వదిలేశారని పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి.  అధినేత నిష్క్రియాపరత్వం కారణంగా పార్టీలో ఆధిపత్య పోరు పీక్స్ కు వెళ్లిందంటున్నారు.  ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, కేసీఆర్ తనయుడు అయిన కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు అయిన హరీష్ రావుల మధ్య పార్టీ నిట్టనిలువుగా చీలిపోయిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీఆర్ఎస్ రెండవ శ్రేణి నాయకత్వం, క్యాడర్ లో చాలా వరకూ మాజీ మంత్రి హరీష్ రావు  వెనుక ర్యాలీ అవుతుంటే.. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలో తన స్థానాన్ని, ఆధిపత్యాన్నీ నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్, హరీష్ రావుల మధ్య పెరిగిన దూరం పార్టీలో సమన్వయం లేకుండా పోవడానికి కారణమౌతోంది.   మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా.. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకు పెద్దగా మద్దతు లభించడం లేదు. సిద్దిపేటలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లూ వెలిసినా, కేటీఆర్  పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.   రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి కూడా కేటీఆర్ ఎందుకో ముందుకు రాలేదు.   దీంతో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావే స్వయంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు బీఆర్ఎస్ లో వర్గపోరు ఆరంభమైందనీ, ఇది కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా రూపాంతరం చెందడానికి పెద్దగా సమయం తీసుకునే అవకాశాలు లేవనీ అంటున్నారు.  ఈ ఊహాగానాలు ఇలా సాగుతుండగానే.. వాటికి బలం చేకూర్చే విధంగా తాజాగా కేటీఆర్  తాజాగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం ఏర్పాటు చేసిన స్క్రీన్ పై  రెండు బీఆర్ఎస్ లోగోలు ఉన్నాయి. వాటిలో ఒక దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో ఉంటే.. రెండో దానిపై కేటీఆర్ ఫొటో ఉంది. దీంతో బీఆర్ఎస్ లో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించి పార్టీ పగ్గాలను కేటీఆర్ చేపట్టనున్నారన్న వాదన పార్టీ శ్రేణుల్లోనే మొదలైంది. కేటీఆర్ ప్రణాళికాబద్ధంగా పార్టీలో హరీష్ ప్రాధాన్యతను తగ్గించే విధంగా పావులు కదుపుతున్నారన్న భావన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో కూడా హరీష్ కు పార్టీలో అన్యాయం జరుగుతోందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  మొత్తం మీద బీఆర్ఎస్ లో అంతర్గత పోరు పతాకస్థాయికి చేరిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. 

నాగర్ కర్నూలులో దారుణం.. యువకులకు ఎస్ఐ శిరోముండనం

అహంకారం తలకెక్కి కొందరు పోలీసులు చేస్తున్న పనులు మొత్తం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటుగా పరిణమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. యూనిఫారం ఉందన్న పొగరుతో కొందరు పోలీసు అధికారులు సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూలులో ఓ ఎస్ఐ  ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు. వీరు చేసిన నేరమేదైనా ఉందా అంటే  అది వారిలో ఒక యువకుడు ఎస్ ఐ ముందు తలదువ్వుకోవడమే. ఇక వివరాలలోకి వెడితే.. నాగర్ కర్నులులో ముగ్గురు యువకులు పెట్రోలు పోయించుకునే విషయంలో స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఘర్షణ పడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై జగన్ ఆ యువకులను అదుపులోనికి తీసుకుని పీఎస్ కు తీసుకు వచ్చారు.  అక్కడ వారిని విచారిస్తుండగా.. వారిలో ఓ యువకుడు జేబులోంచి దువ్వెన తీసి తలదువ్వు కున్నాడు.దీంతో అనంతరం వారిని విచారిస్తుండగా ఓ యువకుడు ఎస్సై ముందు తల దువ్వుకు న్నాడు. దీంతో తన ముందే తల దువ్వుకుంటువా అంటూ ఆగ్రహంతో రగిలిపోయిన ఎస్సై ఆ ముగ్గురు యువకుకు శిరోముండనం చేయించారు. ఈ ఘటనతో వారిలో ఓ  యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తు తం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఎస్ఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు సదరు ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు నిరసన కారులకు నచ్చచెప్పి, ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

అన్నవరం ప్రసాదంలోనూ కల్తీ?!

ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెలుగులోకి రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కల్తీ నెయ్యి వినియోగం విషయంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఆ విషయం అలా ఉండగానే.. శబరిమల ప్రసాదంలోనూ కల్తీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఇప్పుడు తాజాగా అన్నవరం సత్యన్నారాయణ స్వామి ప్రసాదంలోనూ కల్తీ జరుగుతోందని వెల్లడైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో  కొలువై ఉన్న సత్యనారాయణ మూర్తి దేవాలయంలో భక్తులకు అందజేసే ప్రసాదంలో కల్తీ జరుగుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్న భక్తుల పరమ పవిత్రంగా భావిస్తారు. అన్నవరం ప్రసాదం రుచి విషయంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. భక్తులు సత్యదేవుని  దర్శించుకున్న తరువాత ఎంతో భక్తితో ప్రసాదాన్ని ఆరగిస్తారు. అంతే కాకుండా తిరుమల దేవుని ప్రసాదంలాగే అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్ని కూడా తమ తమ ఊర్లకు తీసుకువెళ్లి అందరికీ పంచుతారు. అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, బెల్లం, యాలకుల పొడితో తయారుచేస్తారు. ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది.  ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.  అయితే ఇప్పుడు ఆ ప్రసాదం తయారీలో కల్తీ బెల్లం విడుతున్నట్లుగా వెలుగులోనికి వచ్చింది. సుక్రోజ్ శాతం అధికంగా ఉన్న బెల్లంతోనే సత్యదేవుని ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు కల్తీ నిరోధక శాఖ నిర్ధారించింది. బెల్లం, నెయ్యి నాణ్యతను పరిశీలించకుండానే ఆలయ అధికారులు ప్రసాదం తయారీకి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లాన్ని ఒక ప్రైవేటు సంస్థ అతి తక్కువ ధరకే సరఫరా చేస్తోందని అంటున్నారు. ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లంలో కల్తీ ఉందని అధికారులు పేర్కొన్నారు.  

వాయనాడ్‌.. ప్రియాంక గాంధీ వర్సెస్ ఖుష్బూ?

వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేయనున్న సంగతి విదితమే. అయితే ఆమెకు పోటీగా బీజేపీ తరఫున ప్రముఖ నటి ఖష్బూ బరిలో నిలవనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఖుష్బూ స్వయంగా ఖండించినప్పటికీ ఆగడం లేదు. ఎందుకంటే వాయనాడ్ లో తన పోటీ వార్తలను ఖండిస్తూనే ఒక వేళ బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను పోటీకి రెడీ అని ఖుబ్సు ముక్తాయించడమే.  కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికలలో పోటీ చేసిన విజయం సాధించిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. రాయబరేలి లోక్ సభ నియోజకవర్గం  నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వాయనాడ్ కు రాజీనామా చేసి రాయబరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పీపీ సునీర్‌పై 4 లక్షల 31వేల మెజార్టీతో విజయం సాధించగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి యేనీ రాజాపై 3 లక్షల 64వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఆమెకు పోటీగా ప్రముఖ నటి ఖుష్బును నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది.  పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ప్రియాంక గాంధీ‌పై పోటీ  రెడీ అనడం ద్వారా ఇక్కడ నుంచీ పోటీకి ఖుష్బూ కూడా రెడీ అయినట్లే చెప్పవచ్చు. ఏది ఏమైనా వాయనాడ్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టు, కమలం పార్టీల మధ్య ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ అభ్యర్థిగా నిలవడం ఖరారైనట్లే, కమ్మూనిస్టు పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి వామపక్షాల అభ్యర్థిగా సత్యన్ మొరేఖీ నిలబడుతున్నారు. ఇక కమలనాథులు తమ అభ్యర్థిగా ఖుష్బూను రంగంలోకి దింపడం దాదాపు ఖాయమైందంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని చెబుతున్నారు. వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 13న జరగనుంది. నవంబర్ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటే వాయనాడ్‌లోనూ ఫలితం వెలువడుతుంది.