ఉత్తరాంధ్రకు దానా తుపాను ముప్పు
posted on Oct 24, 2024 @ 10:41AM
దానా తుపాను ఉత్తరాంధ్రకు పెనుముప్పుగా పరిణమించనుందా. తీవ్ర తుపానుగా మారిన దానా గురువారం (అక్టోబర్ 24) అర్ధరాత్రి లేదా శుక్రవారం (అక్టోబర్ 25) తెల్లవారు జామున ఒడిశాలోని పూరి, పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపాలకు మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో గంటకు 120 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ, పలు ప్రాంతాలలో 20 సెంటీమీలర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ పేర్కొన్న భారత వాతావరణ శాఖ ఏపీకి కూడా భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్య కారులు చేపల వేటకు వెళ్లవద్దనీ హెచ్చరించింది. దానా తుపాను నేపథ్యంలో గత రాత్రి 8 గంటల నుంచి నేటి ఉదయం 10 గంటల మధ్య ఈస్ట్రన్ సీల్దా డివిజన్‌లో 190 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనూ 14 రైళ్లు రద్దయ్యాయి.