అవినాష్.. కింకర్తవ్యం!?
posted on Oct 23, 2024 @ 4:04PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని జగన్ అధికారంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆయనపై ఈగ కూడా వాలకుండా తన అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడేశారు. కోర్టులు ఆయన అరెస్టుకు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఆయన అరెస్టే తరువాయి అన్న పరిస్థితుల్లో కూడా జగన్ ఆయనకు రక్షణ కవచంలా నిలబడ్డారు. ఒక దశలో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ అన్ని ఏర్పాట్లూ చేసింది. సినీ ఫక్కీలో కర్నూలు వరకూ ఛేజ్ చేసింది. అయినా అరెస్టు చేయలేకపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అప్పట్లో అంతా భావించిన పరిస్థితి. వివేకా హత్య కేసులో కీలక పరిణామం అనివార్యం అనిపించిన ప్రతి సందర్భంలోనూ జగన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు వెళ్లేవారు. ఆయన హస్తినలో ఏం చక్రం తిప్పేవారో కానీ.. అరెస్టు తథ్యం అన్న పరిస్థితి నుంచి అవినాష్ సునాయాసంగా బయటపడేవారు.
ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. హస్తినలో ఆయన పరపతీ పూర్తిగా అడుగంటింది. ఇప్పుడు ఇక అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఆయన అరెస్టు అనివార్యమేనా, అయితే ఎప్పుడు అరెస్టౌతారు. అసలు వివేకా హత్య కేసు విచారణ ఎప్పుడు ట్రాక్ మీదకు వస్తుంది? అన్న ప్రశ్నలు రాజకీయవర్గాలలోనే కాదు.. జన బాహుల్యంలో కూడా వినిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైందన్న వార్త ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లేనన్న చర్చకు తెరతీసింది.
ఇంతకూ ఏం జరిగిందంటూ వివేకా హత్య కేసులో నిందితులుగా యాంటిసిపేటరీ బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలు తమ బెయిలు కండీషన్లు సడలించాలని కోరుతూ తెలంగాణ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఆ కోర్టు కొట్టివేసింది. తాము విదేశీ పర్యటనక వెళ్లేందుకు వీలుగా బెయిలు కండీషన్లు సడలించాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 2 వరకూ తాము జపాన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. ఆ పిటిషన్ నువిచారించిన తెలంగాణ హైకోర్టు.. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే సీబీఐ కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాలని కోర్లు తీర్పు చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించినా అక్కడ ఆయనకు సానుకూల తీర్పు వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని న్యాయ నిపుణులు అంటున్నారు.
వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి, వారిపై దాడులు చేసిన చరిత్ర ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ గట్టిగా అభ్యంతరం చెబుతుందని అంటున్నారు. తెలంగాణ హైకోర్టులో తన అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో అవినాష్ రెడ్డికి ఇక దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు.