జగన్‌కి సీఎం అపాయింట్‌మెంట్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా?
posted on Feb 22, 2025 @ 11:17AM
ముఖ్యమంత్రిగా అయిదేళ్లు పరదాల మాటున, ప్యాలెస్ పాలన ఎలా ఉంటుందో చూపించిన జగన్‌కు ఏపీ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. కనీసం జగన్‌కు ప్రతిపక్షనేత హోదా కూడా లేకుండా చేయడంతో ఆయన దాన్ని వంకగా చూపిస్తూ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. ఆ క్రమంలో ఆ మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల ఎమ్మెల్యేగానే చూస్తూ టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితల దగ్గర నుంచి అందరూ జగన్‌ని పులివెందుల ఎమ్మెల్యేగానే సంభోదిస్తున్నారు. ప్రతిపక్షనేత హోదా ఎలాగూ రాదని తెలిసినా జగన్ మాత్రం దాని కోసం న్యాయ పోరాటం చేస్తూ సొంత పార్టీలోనే అభాసుపాలవుతున్నారు.
ఓటమి తర్వాత జగన్ ఎప్పుడు, ఎక్కడ ఉంటారో వైసీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ టూ బెంగళూరు ప్యాలెస్‌కు షటిలింగ్ చేస్తూ, పులివెందులలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి మాయమవుతున్నారు . మధ్యమధ్యలో జైళ్లకు వెళ్లి రిమాండ్‌లో ఉన్న తన పార్టీ నేతలను పరామర్శించి వస్తున్నారు. అంతేకాని సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని ఘనంగా ప్రకటించిన ఆయన దాని ఊసే ఎత్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందులు సమస్యలకు లింకు పెట్టి తాజాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జగన్ తన నియోజకవర్గం పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి లేటెస్ట్‌గా ప్రకటించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలంటే మాజీ సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని, అక్కడ ఎన్నో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌కు ఉందని దెప్పిపొడిచారు. జగన్ అసెంబ్లీకి గైర్హాజరవుతుండటంతో పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ ఉప ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచినా అసెంబ్లీకి వెళ్లేది లేదని బీటెక్ రవి యద్దేవా చేశారు. ఏదేమైనా పులివెందుల ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాలం, కర్మం కలిసి రాకపోతే మాజీ సీఎం అయినా, ఇంకెవరైనా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో.