మహా లుకలుకలు!.. ఫడ్నవీస్ సర్కార్ క్షేమమేనా?
posted on Feb 22, 2025 9:24AM
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేల మధ్య సఖ్యత లేమి ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలో మహాయతి కూటమి కొలువుదీరి ఆరునెలలు పూర్తయ్యిందో లేదో.. విభేదాలు రచ్కకెక్కడం గమనార్హం.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన షిండే వర్గం అధినేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పై నిప్పులు చెరిగారు. తనను తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. అసలు మహారాష్ట్ర ఎన్నికలలో మహాయతి కూటమి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైనప్పుడే కూటమిలో విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పీట ముడి పడింది. షిండే సీఎం పదవి కోసం గట్టి పోటీయే ఇచ్చారు. అయితే చివరికి బీజేపీ హైకమాండ్ సూచన మేరకు డిప్యూటీ సీఎం పదవికి అంగీకారం తెలిపారు. దీంతో ఫడ్నవీస్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ ఈ ఆరు నెలల కాలంలో షిండే వర్గం శివసేన, బీజేపీల మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పులాగే ఉంది.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ షిండే వర్గం ఎమ్మెల్యేలకు భద్రత కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏక్ నాథ్ షిండే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఏక్‌నాథ్ షిండే హాజరు కావడం లేదు. ఇప్పటి వరకూ చాపకింద నీరులా తన అసమ్మతిని తెలియజేస్తూ వచ్చిన షిండే తాజాగా.. తనను తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ఫడ్నవీస్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. 2022లో శివసేన పార్టీని చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ ఆఘాడీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన విషయాన్ని అన్యాపదేశంగా గుర్తు చేశారు.
అసలింతకూ షిండే ఈ స్థాయిలో రియాక్ట్ కావడానికి ఫడ్నవీస్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలి ఎన్నికలకు ముందు వరకూ మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం కూటమి విజయం సాధించి ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న షిండేను మరింత రెచ్చగొట్టడానికా అన్నట్లు ఫడ్నవీస్ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. షిండే సీఎంగా ఉండగా ఆమోదం తెలిపిన ఓ ప్రాజెక్టును షిండే ఏకపక్షంగా నిలిపివేశారు. దీంతో భగ్గుమన్న ఏక్ నాథ్ షిండే తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. 2022లో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలో తనను అందరూ తేలిగ్గా తీసుకున్నప్పుడు.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టానని ఏక్ నాథ్ షిండే గుర్తు చేశారు. ఇప్పుడు ఫడ్నవీస్ తనను తేలిగ్గా తీసుకుంటున్నారనీ, ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొడతాననీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొట్టి స్వయంగా మీడియా ముందు ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు.