పాక్‌కి షాక్ ఇచ్చి లెక్క సరిచేస్తారా?
posted on Feb 22, 2025 @ 1:09PM
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఎన్ని జట్లు తలపడుతున్నా, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరేగా ఉంటుంది. ఆ రెండు దేశాల అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియా, పాక్ మధ్య పోరు అంటే హైఓల్టేజ్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులైన దాయాది జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం తలపడుతున్నాయి. గత ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించిన పాక్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ పాక్ మొదటి మ్యాచ్ ఓటమితో ప్రారంభించగా.. బంగ్లాపై ఘన విజయంతో భారత్ రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
ఈ సారి బ్యాట్స్‌మాన్ ఫకర్ జమాన్ దూరం కావడం పాక్ జట్టుకు పెద్ద లోటే. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఫామ్ లేమి కూడా వారిని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు బుమ్రా లేకపోయినా.. టీమ్‌ఇండియా పేస్ దళాన్ని తొలి మ్యాచ్‌లో అద్భుతంగా షమీ ఐదు వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడింపించాడు. అతడికి హర్షిత్ రాణా తోడయ్యాడు. స్పిన్నర్లు కూడా తమవంతు ప్రాత్ర పోషించారు. మరి వీరు పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్, సెంచరీ గిల్ మరోసారి చెలరేగితే.. టీమ్‌ఇండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్థాన్‌పై గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. తన మునుపటి ఫామ్‌ను అందుకొని రాణిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు
తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌కు భారత్‌తో మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ ఆతిధ్య జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును భారత్ ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. దాయాదుల పోరు అంటే రెండు జట్ల ఆటగాళ్లు ప్రాణంపెట్టి ఆడతారన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. అందులో మూడు సార్లు పాకిస్థాన్ నెగ్గి పైచేయి సాధించింది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని భారత్ నమోదు చేసింది. గ్రూప్ బీలో భాగంగా జూన్ 4న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌కు 41 ఓవర్లలో 289 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అయితే.. పాక్ 33.4 ఓవర్లలో 164 పరుగులే చేసింది. డక్‌వర్త్ పద్ధతిలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. యువరాజ్ మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
2017 ఫైనల్‌కు చేరిన భారత్.. తిరిగి పాకిస్థాన్‌తోనే తలపడింది. జూన్ 18న లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా మ్యాచ్ జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో టీమ్‌ఇండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలిసారి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆనాటి ఫైనల్‌లో ఘోర ఓటమికి బదులు తీర్చుకొనే అవకాశం ఇప్పుడు టీమ్‌ఇండియాకు వచ్చింది. గత వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన మన మెన్ ఇన్ బ్లూ... మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటున్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి చాంపియన్ ట్రోఫీలో రెండ జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సీనియర్లకు ఇదే చివరి ట్రోఫీ అని భావిస్తున్న తరుణంలో పాకిస్థాన్‌పై చెలరేగి ఆడి.. కెరీర్‌కు ముగింపు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.