పెద్దల సభలోకి లోకనాయకుడు.. క్లారిటీ ఇచ్చిన కమల్
posted on Feb 22, 2025 @ 1:22PM
మక్కల్ నిది మయ్యమ్ పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్.. ఇప్పటికే తన కేబినెట్ మంత్రి ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపారు. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాలు చేస్తోంది.
గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఆ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు. కోయంబత్తురు నియోకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో డీఏంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ సలహా, సూచనలతో కమల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.
మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన సైతం ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా వివిధ సమయాల్లో పలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఏంకే పార్టీ అధినేత, సీఎం ఎం.కె.స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులోభాగంగా కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డీఏంకే ఈ నిర్ణయం తీసుకుందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాను రాజ్యసభకు వెళ్తున్న విషయాన్ని లోకనాయకుడు తాజాగా నిర్ధారించారు. ఎంఎన్‌ఎం 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో జెండాను ఆవిష్కంచి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కమల్ హసన్ తాను రాజ్యసభకు వెడుతున్న విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ కెరీర్‌పై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, 20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పార్లమెంట్‌లో మన పార్టీ గొంతు వినిపించబోతోందని ఆయన చేసిన వ్యాఖ్యలతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.