మాజీ మంత్రి నారాయణ మౌనం వెనుకు అసలు వ్యూహం ఏమిటి?
posted on Oct 24, 2019 @ 5:13PM
మాజీ మంత్రి నారాయణ ఎక్కడ అన్నది అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజావేదిక కూల్చివేత సమయంలో, రాజధాని రచ్చ జరుగుతున్న సమయంలో బయటకు రాలేదు మంత్రి నారాయణ. అసలు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా నెల్లూరు జిల్లాతో సహా రాష్ట్ర రాజకీయాలకు నారాయణ దూరంగా ఉంటున్నారు. ఆయన తాజా ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచీ పొలిటికల్ గా సైలెంటయ్యారు. నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు, ఒక్క లోక్ సభ వైసిపి గెలిచింది. దీంతో జిల్లాలో టిడిపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు నారాయణ వ్యవహరించారు. ఫలితాలు వచ్చిన తరువాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఏం చేస్తున్నారని హాట్ డిస్కషన్ నడుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి నారాయణ పూర్తిగా టిడిపి నేతలను దూరం పెట్టారు. తన పక్కనే ఉంటూ తనకిందే గోతులు తీశారనే అనుమానం ఓ వైపు మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన భారం మరో వైపు నారాయణకు దిక్కు తోచకుండా చేశాయి. దీంతో ఆయన దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లాకు చంద్రబాబు వచ్చినపుడు నారాయణ వచ్చారు. రెండ్రోజుల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ మళ్లీ మాయమైపోయారు. అమరావతిలో జరుగుతున్న పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాల్గొనలేదు. ఇటివల చంద్రబాబు కోటరీలో కీలక నేతలు బీజేపీలో చేరడంతో నారాయణ కూడా కమలం వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. అధికార పార్టీలోకి జంప్ అవుతారని మరో వార్త వినిపించింది. కానీ నారాయణ మాత్రం సైలెంట్ గా తన విద్యాసంస్థల పనులు చూసుకుంటున్నారని తెలుస్తోంది. అక్కడ కొత్త కొత్త టార్గెట్ లు పెట్టి విద్యాసంస్థల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకైతే నారాయణ తెర వెనక ఉండే మంత్రాంగం నడుపుతున్నారు. అసలు తను ఉనికి ఎక్కడుందో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.