రేవంత్ అనుమానాలే నిజమయ్యాయా? కంచుకోటలో ఉత్తమ్ ఎందుకు చతికిలపడ్డారు?
posted on Oct 24, 2019 @ 2:06PM
హుజూర్ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఫలించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే గులాబీ జెండా పాతడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్న టీఆర్ఎస్ అధినేత స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది. తన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకోలేని ఉత్తమ్... ఇక తెలంగాణలో పార్టీని ఎలా నడిపించగలరన్న సంకేతాలను కేసీఆర్ ప్రజల్లోకి పంపారు. అయితే తన సొంత నియోజకవర్గంలో... పైగా తన కంచుకోటైన సిట్టింగ్ సీటును కోల్పోవడం ద్వారా సొంత పార్టీలో కూడా ఉత్తమ్ విమర్శలను ఎదుర్కోనున్నారు. పీసీసీ పదవి నుంచి వెంటనే వైదొలగాలన్న డిమాండ్ పెరగనుంది. సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకోలేని ఉత్తమ్ ఇక రాష్ట్రంలో పార్టీని ఎలా గెలిపించగలరనే విమర్శలు పెరగడం ఖాయం. దాంతో, పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసే అవకాశం లేకపోలేదు.
ఇదిలా ఉంటే, హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై మొదట్లో రచ్చ జరిగింది. ఉత్తమ్ భార్య పద్మావతి ఎంపికను రేవంత్ తీవ్రంగా వ్యతిరేకించారు. పద్మావతికి ప్రత్యామ్నాయంగా రేవంత్ మరో అభ్యర్ధిని తెరపైకి తెచ్చారు. అయితే రేవంత్ పై సీనియర్లంతా ఏకమై మాటల దాడి చేయడంతో గాంధీభవన్ లో రచ్చ నడిచింది. చివరికి పద్మావతి పేరును సోనియా ఓకే చేయడంతో... అంతా కలిసి హుజూర్ నగర్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. రేవంత్ కూడా ఒక రోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటూ విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతలంతా హుజూర్ నగర్ లో క్యాంపైన్ చేశారు. కానీ ఎవరూ ఊహించనివిధంగా భారీ తేడాతో పద్మావతి ఓడిపోవడంతో కాంగ్రెస్ లీడర్లు షాక్ కి గురవుతున్నారు.
అయితే, టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపునకు ఉత్తమ్ ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత కూడా కారణమనే మాటలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడుసార్లు ఉత్తమ్ గెలిచి ఉండటంతో ప్రజలు మార్పు కోరుకున్నారని అంటున్నారు. అదే సమయంలో అధికారంలో టీఆర్ఎస్ ఉండటంతో ఇక్కడ కూడా అదే పార్టీని గెలిపిస్తే మంచిదనే అభిప్రాయమే సైదిరెడ్డి విజయానికి కారణమనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే, రేవంత్ చెప్పినట్లుగా ఉత్తమ్ ఫ్యామిలీ నుంచి కాకుండా మరో అభ్యర్ధిని రంగంలోకి దింపి ఉంటే... కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో.