ఆ రెండు పార్టీలు శివసేనకు మద్దతిస్తే కమలనాథుల పని అంతే...
posted on Oct 24, 2019 @ 4:21PM
పాక్ పై మెరుపు దాడులు పని చేయలేదా, దేశభక్తిని రగల్చడంలో బీజేపీ విఫలమైందా, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు బీజేపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చాయనే అంటున్నారు విశ్లేషకులు. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి, హర్యానాలో ఎక్కువ స్థానాల్లో బీజేపీ సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్ ల మద్దతు కోసం బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు, మహారాష్ట్రలో బీజేపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
గతంతో పోలిస్తే బీజేపీ ఆధిక్యం తక్కువ సీట్లలో కనిపిస్తుంది, శివసేన బాగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కూడా ఎక్కువ సీట్లలో ఆధిక్యం కనబర్చింది. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు శివసేనకు మద్దతిస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరితే కమలనాథులు తలలు పట్టుకునే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే సీఎం పదవి తమకివ్వాలని, క్యాబినెట్ లో సగం పదవులు కావాలని శివసేన డిమాండ్ చేస్తోంది కానీ, బీజేపీ నేతలు మాత్రం అంతా సర్దుకుంటుందని శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు.
అమిత్ షా క్యాబినెట్ లోకి రావడం బీజేపీకి కలిసి రాలేదా, నడ్డా వ్యూహాలూ ఫలించలేదా, కమలం పార్టీలో అంతర్మథనం మొదలైంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో అమిత్ షా బిజీ కావడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. పార్టీని పటిష్టం చేయడానికి జేపీ నడ్డాకు పూర్తి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బెంగాల్ లో కూడా బీజేపీ చాలా కష్టపడాల్సి వస్తుంది, ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లాంటి నేతల మరణంతో అక్కడ బీజేపీ నాయకత్వం కొద్దిగా బలహీనమైంది.
మహారాష్ట్ర విషయానకొస్తే నాగ్ పూర్ ఆరెస్సెస్ కు పుట్టినిల్లు, ఈ ఎన్నికలను సంఘ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఊహించిన ఫలితాలు అక్కడ రావడం లేదు, దేశభక్తి, ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ నేతలు బాగా ప్రచారం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా పని చేసినప్పటికీ ఊహించిన ఫలితాలు రాలేదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రైతు సమస్యల కారణంగా రెండు రాష్ట్రాలలో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది.