మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. తెరమీదకు 50-50 ఫార్ములా!!
posted on Oct 24, 2019 @ 4:10PM
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం దిశగా సాగుతోంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి కూడా బలపడింది. మొత్తం 288 సీట్లలో బీజేపీ శివసేన కూటమి నూట అరవై ఐదు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి తొంభై ఆరు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి, ఎంఐఎం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఇరవై ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్లంతా స్వీట్ లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అధికారం దిశగా బీజేపీ శివసేన అడుగులు వేస్తోంది, దాదాపు నూట అరవై ఐదు స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు కావడంతో అవసరమైన దానికన్నా ఇరవై సీట్లే ఎక్కువ వచ్చాయి కానీ, గతంలో ఈ కూటమి గెలిచిన సీట్లకన్నా ఇరవై సీట్లు తగ్గడంతో ఇప్పుడు కొత్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. బీజేపీ శివసేన కూటమి గెలిచినప్పటికీ వారికి మొత్తంగా గతంలో గెలిచిన సీట్ల కంటే ఈ సారి సీట్లు మాత్రం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రచారం చేయకుండా ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపించని కాంగ్రెస్ గానీ, ఎన్సీపీ గానీ గతంలో కన్నా కొన్ని సీట్లు ఎక్కువగా సాధించారు. మరీ ముఖ్యంగా ఎన్సీపీ అయితే యాభై మార్కును దాటింది, గతంలో ఎన్సీపీ కేవలం నలభై రెండు, నలభై మూడుకు మాత్రమే పరిమితమైంది. గతంలో అరవై రెండు సీట్లు గెలిచిన శివసేన ఈ సారి డెబ్బై మార్కుకు దగ్గరగా వచ్చింది.
ఈ ఎన్నికలలో సక్సెస్ రేట్ శివసేనది పెరిగింది, బిజెపిది తగ్గింది. ప్రభుత్వంలో తమ ప్రాబల్యాన్ని చూపించుకోవడానికి ఈ ఫలితాలు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. దీనిపై శివసేన ఎంపీ రావత్ మాట్లాడుతూ 50-50 ఫార్ములా ఎన్నికల ముందు అనుకున్నాం అని ఇప్పుడు ప్రభుత్వంలో అదే పాటిస్తామని అన్నారు. ఆయన నేరుగా చెప్పకపోయినా ముఖ్యమంత్రి పదవిని రెండున్నర సంవత్సరాలు ఒక పార్టీ తరువాత రెండున్నర సంవత్సరాలు ఇంకొక పార్టీ శివసేన, బిజెపి పంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. శివసేనకు సంబంధించిన వ్యక్తిని కూడా ఈసారి ముఖ్యమంత్రి చెయ్యాలనేది శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో అది జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ముఖ్యమైన నాయకులు ఎవరైతే మహారాష్ట్ర ఎన్నికల్లో నిల్చున్నారో వాళ్ళందరూ విజయం సాధించారు. వారిలో ప్రముఖంగా అజిత్ పవార్ గురించి చెప్పుకోవచ్చు, లక్ష మెజారిటీని ఆయన దాటారు. బారామతి నుంచి పోటీ చేసిన ఆయన అక్కడ పోలైన ఓట్లలో ఎనభై ఐదు శాతం ఓట్లు ఆయన దక్కించుకున్నారు. వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు, దాదాపు అరవై వేల ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. సౌత్ నాగ్ పూర్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం మహారాష్ట్ర పైన తన ప్రభావాన్ని చూపింది. దాదాపు నలభై ఆరు నియోజక వర్గాల్లో ఎంఐఎం సాధించిన ఓట్లతో గెలుపు అవకాశాలు మారాయి. దీంతో బిజెపికి కొంత లాభం చేకూరింది.