జగ్గారెడ్డి అసలు వ్యూహం ఏమిటి?
posted on Oct 24, 2019 @ 5:25PM
మాస్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి నేత జగ్గారెడ్డి. ఆయన ఒక పార్టీలో ఉంటారు మరోక పార్టీ నేతలను పొగుడుతారు. తెల్లారితే మళ్లీ ఆయన్నే తిడతారు. ఒక రాజకీయవేత్తలో ఇన్ని కోణాలు ఎందుకు చూపిస్తున్నారు అనేది అందరికి అంతు చిక్కని విషయంగా మారింది. జగ్గారెడ్డి స్టైల్ ఏ వేరు, పేరుకే సంగారెడ్డి మాస్ లీడర్ కానీ ఆయన వ్యవహారంపైనే గాంధీ భవన్ నుంచి సంగారెడ్డి వరకు చర్చ జరుగుతోంది. ఒక రోజు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తారు. వెంటనే మరో రోజు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకసారి హరీశ్ రావు పైన పంచులు విసురుతారు. మళ్లీ టైము దొరకగానే ఆయనకు సన్మానం చేస్తారు.
మొన్నటికి మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ప్రత్యక్షంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అరెస్టు కూడా అయ్యారు. కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలని ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. అంతటితో ఊరుకోకుండా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తే అందులో పాల్గొనడానికి ప్రగతి భవన్ దగ్గర వరకూ పోలీసుల కళ్ళుగప్పి ఆటోలో వెళ్లి అక్కడ అరెస్టయ్యారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నినదించారు. ఇలా చేసి ఇరవై నాలుగు గంటలు గడిచిందో లేదో మళ్లీ కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగ్గారెడ్డి.
సంగారెడ్డికి మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీంతో ఏకంగా కేటీఆర్ ఫొటో పక్కన తన ఫొటో వేసుకొని సంగారెడ్డిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఇవన్నీ చూస్తున్న సంగారెడ్డి జనానికి మాత్రం జగ్గారెడ్డి అంతరంగం అంతు పట్టడం లేదు. ఒక వైపు పోరాటం, కార్మికులకు సంఘీభావం, మరోవైపు కేసీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తడం అసలు జగ్గారెడ్డి విషయం ఎవ్వరికి అంతు చిక్కట్లేదు ఇప్పుడు ఈ విషయం సంగారెడ్డిలో చర్చనీయాంశమైంది. ఇంతకు జగ్గారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదంటే టీఆర్ఎస్ లో చేరబోతున్నారా ఇవేవీ ఎవరి ఊహకు అందడం లేదు. మొత్తానికి జగ్గారెడ్డి రోజుకో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నారని సెటైర్ లు విసురుతున్నారు జనం.