22 కేజీల పండ్లు రూ.300లకే! ఫోన్ కొట్టు పండ్లు ప‌ట్టు!

ఉద్యానవన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోంది. జంటనగరాల్లో ప్రజల ఇంటి వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ప్రజలు 30 ప్యాక్‌లు ఆర్డర్‌ ఇస్తే నేరుగా సరఫరా చేస్తామని ప్రకటించింది.  73307 33212కు ఫోన్‌ చేస్తే డోర్‌ డెలివరీ అందిస్తారని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్యాక్ లో ఉండే పండ్ల రకాల్ని చూస్తే.. మామిడికాయలు 3.5కేజీలు.. బొప్పాయి 3 కేజీలు.. సపోటా కేజీ..బత్తాయి 2.5కేజీలు.. నిమ్మకాయలు 12.. పుచ్చకాయలు నాలుగు కేజీలు ఉంటాయి. అంటే..మొత్తం 22 కేజీల పండ్లు రూ.300లకే ఇంటికి తెచ్చేలా మార్కెటింగ్ శాఖ ప్లాన్ చేసింది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఉత్తరాదికి పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగా అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఆదాయాన్ని, ప్రజలకు ఇంటివద్దనే  తాజా పండ్లను అందిస్తుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తెలిపారు.

ఉదయం ప్రధాని నాకు ఫోన్‌ చేశారు: చంద్రబాబు

లాక్‌డౌన్‌ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈరోజు ఉదయం ప్రధానితో ఫోన్ లో కరోనా కట్టడి గురించి మాట్లాడానని తెలిపారు.  హైదరాబాద్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్‌ చేశా.. ఆయనతో మాట్లాడాలని అడిగాను. అయితే, ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్‌ చేశారు.  ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా’’ అని చంద్రబాబు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానికి ఇటీవల రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశానని చంద్రబాబు అన్నారు. జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించమని ఆ లేఖలో కోరానన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

వైసీపీ ఎమ్మెల్యేతో సమావేశమైన ఎమ్మార్వోకు కరోనా!!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సన్నిహితులు, తోటి ఉద్యోగులు, ఆయనను కలిసిన రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ తహసీల్దార్ మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామితో పలుసార్లు సమావేశమయ్యారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.

ప్రజలందరికీ ఉచితంగా ఆహారం అందించాలి!

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగమైన "నా ప్రియమైన దేశ ప్రజలారా.." అంటూ ప్రారంభమైన ఆమె సందేశంలో, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడూ సహకరించాలని ఆమె కోరారు. వైరస్ భయాందోళనలు తగ్గేంతవరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిచాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అభ్యర్థించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ భార్యా పిల్లలనూ, తల్లిదండ్రులనూ వదిలి కరోనాపై పోరాడుతున్నారని, వారందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన సోనియా గాంధీ.. ముందస్తు సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌ డౌన్ అమలు చేస్తుండడం వల్ల దేశం నష్టపోతోందని అన్నారు.

భారత్ లోనే ఉంటాం! స్వదేశం వెళ్లేందుకు అమెరిక‌న్‌ల విముఖత!

విదేశాల్లో ఉన్న 50 వేల మంది అమెరికా పౌరులను స్వదేశానికి వచ్చేయాల్సిందిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.  ట్రంప్ ఆదేశాలతో అమెరికా యంత్రాంగం అనేక విమానాలను నడుపుతోంది. విదేశాల్లో నిలిచిపోయిన అమెరికన్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ లో తమకు అందుబాటులో వున్న 800 మందిని అమెరికా అధికార్లు ఒకరోజున సంప్రదించి విమానం రెడీగా వుంది వస్తారా? అని కోరితే, వారిలో 10 మంది మాత్రమే ముందుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా భారత్ లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా సాగుతుండడం కూడా అమెరికన్లలో ఇక్కడుండడమే మంచిదన్న అభిప్రాయం కలిగిస్తోంది. కాగా, భారత్ లోని వివిధ ప్రాంతాల్లో 24 వేల మంది అమెరికా పౌరులు ఉన్నట్టు అధికార వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా రవాణా నిలిచిపోవ‌డంతో అనేక దేశాల ప్రజలు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. అయితే ఆయా దేశాలు విదేశీయులను తమ భూభాగంపై ఉండేందుకు అనుమతించడంలేదు. అయితే కొంత మంది విదేశీయులు ఈ స‌మ‌యంలో భారత్ ను వీడి తమ సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. ముఖ్యంగా అమెరికన్లు భారత్ లోనే ఉంటామని, అమెరికా వెళ్లబోమని అంటున్నారు. అక్క‌డ పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడమే అందుకు కారణం.

గిఫ్ట్ ఏమోకానీ! శానిటరీ కార్మికులకు జీతాల్లేవట!!

"మున్సిపల్ పారిశ్యుద్ద కార్మికుల గురించి సీఎం కేసీఆర్ చెప్పే మాటలు చేతల్లో లేవు. వారికి పరిశుభ్రత కోసం సబ్బులు లేవు. గ్లౌజ్లు శానిటైజేషన్ వంటివి లేదు. వారికి అదనపు గిఫ్ట్ సంగతి పక్కకు పెడితే.. రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు" అని తెలంగాణా పిసిసి అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. శానిటైజేషన్ వర్కర్లు పోలీసులు హెల్త్ సిబ్బందితో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి 30శాతం అదనంగా జీతాలు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర కిలోమీటర్ కు ఒక అన్నదాన కేంద్రమని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అయితే అవి ఎక్కడా కన్పించడం లేదని ఆయ‌న ఆరోపించారు. కరోనా వైరస్ అరికట్టడం కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామమాత్రమేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రకటనలకు వాస్తవానికి మధ్య ఎంతో తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు.  తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు ఆగిపోయాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా కంటే ముందు నుంచే 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోమని వారు కోరుతున్నా. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లాక్ డౌన్ తో ఆదాయం తగ్గింది అంటున్న సీఎం కేసీఆర్ గతంలో బాండ్ల ద్వారా సేకరించిన 3500 కోట్ల రూపాయలు ఏమీ చేశారో సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష మధ్య కరోనా కేంద్రంగా విమర్శలు-ప్రతి విమర్శలు హాట్హాట్గా కొన సాగుతున్నాయి.

రంజాన్ నెల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా పాటించాల్సిందే! అబ్బాస్ నఖ్వీ

కరోనా మహమ్మారి విసురుతున్న ప్ర‌మాద‌క‌ర‌మైన‌ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు సామాజిక దూరం మార్గదర్శకాలను నిజాయితీతో క‌చ్చితంగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పిలుపునిచ్చారు. ఈ నెల 24 నుంచి ప‌విత్ర రంజాన్ మాస‌ము ప్రారంభం కానుంది. ముస్లింలు ఇంటిలోనే మతపరమైన ఆచారాల‌ను నిర్వ‌హించుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా సౌదీ అరేబియాతో సహా చాలా ముస్లిం దేశాలు రంజాన్ సంద‌ర్భంగా మతపరమైన ప్రదేశాలలో ప్ర‌వేశాల‌ను నిలిపివేసిన విష‌యాన్ని ముస్లింలు గమనించాల‌ని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పరిధిలో దాదాపు 7 లక్షలకు పైగా రిజిస్టర్డ్ మసీదులు, ఈద్గా, ఇమాంబాడా, దర్గాలు మరియు ఇతర మత సంస్థలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలియ జేశారు. ప్రజలు గుమిగూడకుండా చూసేందుకు సమర్థవంతమైన విధానాన్ని తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డులను సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా సూచించినట్లు మంత్రి నఖ్వీ తెలిపారు. ఈ విషమై అవ‌స‌ర‌మైతే వివిధ మత, సామాజిక సంస్థలు, ప్రజలు, స్థానిక యంత్రాంగ‌పు యొక్క సాయం తీసుకోవలసిన అవసరం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక దూరం నిబంధ‌న‌లు కఠినంగా సమర్థవంతంగా అమల‌య్యేలా ముస్లింలు సహకరించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న అన్నారు. “ఇఫ్తార్”తో సహా ఇతర మతపరమైన ఆచారాల విష‌యంలో ప్ర‌భుత్వం సూచిస్తున్న అన్ని మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.

ఎకాన‌మీ కంటే జీవితం గొప్ప‌ది!

ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా మ‌రో 19 రోజులు లాక్‌డౌన్ పెంచుతున్నాం. మే 3వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. ఇదే ఐక్య‌మ‌త్యం, స్పూర్తిని ప్ర‌జ‌లు చూపించి ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని పి.ఎం. విజ్ఞ‌ప్తి చేశారు. ఏప్రిల్ 20 వ‌ర‌కు ప‌రిస్థితి తీవ్రంగా వుంటుంది. ఈ వారం రోజులు భార‌త్‌కు గ‌డ్డు కాలం. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా వుండాలి. ఇంట్లో త‌యారు చేసిన మాస్క్‌ల‌ను ఉప‌యోగించండి. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డానికి చ‌ర్య‌లు తీసుకోండి. ఆరోగ్య శేతు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పేద ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోండి. వీలైనంత మందికి భోజ‌నం పెట్టండి. ఎవ‌రినీ ఉద్యోగాల నుంచి తీయ‌కండి. మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్ని పాటించి సుర‌క్షితంగా ఉండండి.

లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడ‌గింపు

ఎన్ని ఆటంకాలు క‌ష్టాలు వ‌చ్చినా ధైర్యంగా దేశం కోసం నిల‌బ‌డ్డారంటూ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. తిన‌డానికి, ప్ర‌యాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనా క‌రోనాపై పోరాటానికి దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనాపై భార‌త్ యుద్ధం కొన‌సాగుతోంది. క‌రోనాను త‌ర‌మ‌డం కోసం  ప్ర‌జ‌లు త్యాగాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సంతృప్తికరంగా అమ‌లౌతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సామాజిక దూరం పాటించ‌డ‌మే స‌రైన ప‌ద్ధ‌తి. దీనితో ఎంతో ప్ర‌యోజ‌నం దేశానికి క‌లిగింది. ఆర్థిక‌ప‌రంగా చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింది. కానీ భార‌తీయుల జీవితాల్ని కాప‌డ‌డానికి ఆర్థికంగా ఎంత న‌ష్టం వ‌చ్చినా ప‌ర్వాలేదు.  క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వాల‌ను వైద్యుల‌ను మొప్ప‌తిప్ప‌లు పెడుతోంది. భార‌త్‌లో కూడా క‌రోనాపై విజ‌యం ఎలా సాధించాలి. న‌ష్టాన్ని ఎలా త‌గ్గించాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ఎలా త‌గ్గించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంత‌రం చ‌ర్చ‌లు చేశాను. అంద‌రూ లాక్ డౌన్ పెంచాల‌నే సూచ‌న‌లు వ‌చ్చాయి. లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పెంచుతున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.

శంకర్ పల్లి టూ దేవరకొండ! చిన్నారులతో కాలినడక!

వారంతా పొట్ట చేతపట్టుకొని కడుపునింపుకోడానికి పని నిమిత్తం శంకర్ పల్లి వెళ్లారు. అక్కడే ఒక రియ‌ల్ ఎస్టేట్ వెంచర్లో పనిచేసుకుంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వారికి పనికరువైంది. ఈ నెల 14న లాక్ డౌన్ ముగుస్తుందని ఆశతో అక్కడే ఉండిపోయిన వారికి లాక్ డౌన్ పొదగించడం తో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో 5గురు చిన్నారులతో పాటు 3కుటుంబాలు తమ సొంత గ్రామమైన దేవర కొండకు వెళ్లేందుకు కాలినడకన బయలు దేరారు. కేశంపేట మీదుగా వెళుతున్న వీరిని గమనించిన స్థానిక ఎస్.ఐ కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలు తెలుసుకున్నారు.లాక్ డౌన్ నేపద్యంలో పంపించడానికి వీలుకాదని మీరు ఉండటానికి వసతి కల్పిస్తామని వారికి వివరించారు. కేశంపేట సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి వారికి భోజన వసతి కల్పించారు.మండుటెండలో 5 గురు చిన్నారులతో కాలినడకన వెళుతున్న వారి పరిస్థితి చూసిన పలువురు చలించిపోయారు.

ఖాళీ అయిన తెలంగాణ క్వారంటైన్ సెంటర్లు!

మార్చిలో విమాన సర్వీసులు నిలిచిపోవడానికి ముందు తెలంగాణకు సుమారు 74 వేల మంది వివిధ దేశాల నుంచి రాగా, వారిలో 25,973 మందిని ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. వీరిలో అత్యధికులు క్వారంటైన్ సమయాన్ని ముగించుకుని ఇళ్లకు చేరారు. వీరిలో 30 మందికి ప్రైమరీ కాంటాక్టు ద్వారా, వారి కుటుంబీకులకు మరో 20 మందికి వైరస్ సోకింది. వీరిలోనూ చాలా మంది చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. వీరిలో కరోనా లేదని, వీరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని నిర్ధారణ అయిన తరువాతే వారిని ఇళ్లకు పంపించి, మరో రెండు వారాలు జాగ్రత్తగా ఉండాలని కోరామని అధికారులు వెల్లడించారు. క్వారంటైన్ చికిత్స నిమిత్తం కేటాయించిన సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్, చార్మినార్ లోని నిజామియా ఆసుపత్రి సెంటర్లు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. రాజేంద్రనగర్ లోని సెంటర్ లో 160 మంది ఉండగా, మేడ్చల్ జిల్లాలో 152 మంది, రంగారెడ్డి జిల్లాలో 135 మంది క్వారంటైన్ లో ఉన్నారు. వీరి క్వారంటైన్ సమయం ఈ వారంలో ముగియనుంది. ఇక ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 1089 మందిలో 603 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారని గుర్తించిన అధికారులు, వారికి సంబంధించిన వారితో కలిపి మొత్తం 3,015 మందిని క్వారంటైన్ కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరి క్వారంటైన్ ముగియనుండగా, వీరున్న ప్రాంతాల్లో కొత్తగా ఎవరికీ వైరస్ సోకకుంటే, కమ్యూనిటీ వ్యాప్తి లేనట్టేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, కరోనా చికిత్సకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న గాంధీ హాస్పిటల్ లో 295 పాజిటివ్ కేసులుండగా, ఐసొలేషన్ లో మరో 250 మంది వరకూ ఉన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో 29 పాజిటివ్ కేసులు, 10 మంది ఐసొలేషన్ లో ఉన్నారు. కింగ్ కోఠి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో 12 కేసులు ఉండగా, 74 మంది ఐసొలేషన్ లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఐసొలేషన్ లో ఉన్నవారి రక్త పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత వారిని ఇంటికి పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాజకీయాలు చేస్తూ శవాల పైన ప్యాలాలు వేరుతున్నారు! ప్రజలు ఐసో లేషన్ లో పెట్టినా బుద్ధి లేదు!

ఈ సమయంలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు, అలంటీ వారిని ఇప్పటికే ప్రజలు  ఐసో లేషన్ లో పెట్టారు. అయిన వారికి బుద్ధి రాలేదంటూ  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా విమ‌ర్శించారు.  ఊరంతా ఒకదారి అయితే ఉలికి కట్టది ఒక దారి అన్నట్టు... కొంతమంది రాజకీయ పార్టీల తీరు ఉంది. వలస కార్మికులను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఒక్క వలస కార్మికునునైన అదుకున్నారా...? అని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్ర‌శ్నించారు. కరోన విషయంలో దేశములో ఏ రాష్ట్రం చేయని విధముగ తెలంగాణ బాగా పని చేస్తుంది అని ఉప రాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి అర్జున్ ముండ మెచ్చుకొన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 87% మందికి 12 కిలోల బియ్యం ఇచ్చాం. రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులకు  87లక్షల 55వేల మందికి 13వందల 14 కోట్ల డబ్బులు వేయబోతున్నాం. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ రబీలో అత్య అధికంగా ధాన్యం వచ్చింది. ఆర్థికమాంద్యం దెబ్బతిన్న కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ చేస్తుంటే... ప్రతిపక్షలకు ఇవి కనబడడం లేదా...? 24 గంటలు సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రతిపక్షల మీద విమర్శలు కావాలని చేయడం లేదు... వారు అనే మాటలు విని బాధతో మాట్లాడుతున్న. రాష్ట్ర ప్రభుత్వం కరోన కోసం ఇప్పటివరకు 3వేల 147 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక్కనైన ప్రతిపక్షలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హరీశ్‌రావు సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ల ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సిఎంకు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు.  ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకో డిఎం అండ్ హెచ్ఓ ఉన్నారు. 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  ‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగీ ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో మ‌రొక‌రు మృతి, 592కి చేరిన కరోనా కేసులు!

సోమ‌వారం ఒక రోజే తెలంగాణ వ్యాప్తంగా 61 నూత‌న కరోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 592కి చేరింద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  మ‌రొక‌రు మృతి చెంద‌డంతో ఇప్ప‌ట్టి వ‌ర‌కు  కరోనాతో మృతి చెందిన వారిక సంఖ్య 17కు పెరిగింది.  క‌రోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్‌ చేసిన అయిన వారి సంఖ్య 103కాగా వారు పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన 472 మంది చికిత్స పొందుతున్నారు.  ఎక్కువ కేసులు హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే న‌మోదువుతున్నాయని ప్ర‌భుత్వం తెలిపింది.  

ముఖ్యమంత్రికి అండగా నిలుద్దాం..ఒక్క పత్రికలోనే ప్రకటనలు

కరోనా సమయంలో ప్రకటనలు లేక తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ పత్రికలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని చిన్న పత్రికలు మూతపడుతున్నాయి కూడా.. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి సంబంధించిన పత్రిక ఏ విధంగా ఉంది? ఎన్ని కరోనాలు వచ్చినా ఆ పత్రికను ఏం చేయలేవు. నిజం.. ప్రస్తుతం ప్రభుత్వ ప్రకటనల సాక్షిగా ఆ పత్రికకు ఉన్న అనుకూలాంశం అది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్లు పేజీ యాడ్లు వచ్చేస్తుంటే దాని స్టామినా పెరగక తగ్గుతుందా? కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే ఆ పత్రిక మాత్రం ప్రకటనల పండగ జరుపుకుంటున్నది. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అంటూ ఇప్పటికే నాలుగు ఫుల్ పేజీ యాడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో యాడ్ ఖరీదు అక్షరాలా కోటీ 36 లక్షల రూపాయలు. ముఖ్యమంత్రి ఫొటో ప్రముఖంగా సంబంధిత శాఖ మంత్రి ఫొటో కింద వచ్చే ఈ ప్రకటనలో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రికి అండగా ఉండటం ఏమిటో అర్ధం కాదు కానీ మరెన్నో యాడ్లు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఏ శాఖలో డబ్బులు ఉంటే ఆ శాఖ లోని ఆ విభాగానికి ఆ పత్రిక బిల్లు పంపుతుంది. దాన్ని అక్కడ నుంచి చెల్లించే ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనా పై జరుపుతున్న పోరాటానికి ఇన్ చార్జి అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ పర్యవేక్షించే ఆళ్ల నాని ఫొటో మాత్రం ఉండదు. ఎవరి ఫోటో ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చేది మన పత్రికకే కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలకు పైబడి ఆ పత్రిక ఖజానాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటన ఇస్తే డబ్బులు వచ్చేసినట్లే కదా. 8వ తేదీన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరుతో యాడ్ వచ్చింది. రేపో ఎల్లుండో కోటీ 36 లక్షల రూపాయలు చెల్లించేస్తారు. పాపం ఆ శాఖకు చెందిన కొన్ని విభాగాల్లో పని చేసే వారికి రెండు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. పని చేసేవారికి జీతాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు కానీ పత్రికలకు మాత్రం యాడ్లు వచ్చేస్తున్నాయి. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అని లలితా జువెలర్స్ వారు మొదట సదరు పత్రికకు ప్రకటన ఇచ్చారు. డబ్బులు ఊరికే రావు అన్న గుండు బాస్ కాన్సెప్టు బాగుందని అన్ని ప్రభుత్వ శాఖలూ ముఖ్యమంత్రికి అండగా నిలవడానికి పాపం ఆ పత్రికకు ప్రకటనలు ఇవ్వడానికి క్యూ కట్టేశాయి. అసలు కరోనా బారిన పడ్డవారికి అండగా నిలవాలి లేదా దాని బారిన పడకుండా ప్రజలకు అండగా నిలవాలి కానీ ముఖ్యమంత్రికి అండగా దేనికి? కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు గుప్పిస్తే అండగా ఉన్నట్టు ఎలా అవుతుంది? ఈ ప్రకటనలకయ్యే ఖర్చు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చినా కొంత మేలు జరుగుతుంది కదా అంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఈ వార్త చూసిన వైసీపీ అభిమానులు ఏమంటారో తెలుసా? చంద్రబాబునాయుడు అయన అనుకూల  మీడియాకు వందల కోట్లు దోచి పెట్టినప్పుడు కనిపించలేదా? మీరు కూడా అయన భజన మీడియా లాగా వార్తలు రాస్తున్నారు అని విమర్శలకు దిగే ప్రమాదం కూడా లేకపోలేదు.. దిగుతారు కూడా. వాటి పర్యవసానమే చంద్రబాబుకు 23 సీట్లు. మరి మనకూ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లే కావాలా? అన్నియ్యా..

లాక్ డౌన్ తో దేశానికి 7. 5 లక్షల కోట్ల నష్టం

* కోలుకోవడానికి ఉద్దీపనలు కావలసిందే  * లెక్కల్లో మునిగి తేలుతున్న ఎకనామిస్టులు  130 కోట్లకు పైగా జనాభాతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలందుకుంటున్న భారత్ కరోనా ప్రభావంతో దాదాపు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రజారవాణా వ్యవస్థ స్థంభించిపోవడమే కాదు, జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన 21 రోజుల లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థికరంగ నిపుణులు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించడంతో 70 శాతం ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు నిలిచిపోయాయని, పెట్టుబడులు, ఎగుమతులు, వస్తు వినిమయం ఎక్కడివక్కడే ఆగిపోయాయని పేర్కొన్నారు. భారత్ లో ఆర్థిక సంస్కరణలు, కేంద్రం ఉద్ధీపనలు, ద్రవ్య నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో కరోనా ప్రవేశించిందని, తద్వారా దేశ అభివృద్ధికి విఘాతం ఏర్పడిందని తెలిపారు. అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ అంచనా ప్రకారం లాక్ డౌన్ కారణంగా రోజుకు రూ.35 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందట. ఆ లెక్కన 21 రోజుల లాక్ డౌన్ మొత్తానికి రూ.7.5 లక్షల కోట్ల మేర నష్టపోతుంది. లాక్ డౌన్ తొలి 15 రోజులకు గాను సరుకు రవాణా రంగం (లారీలు మాత్రమే) రూ.35,200 కోట్లు నష్టపోయిందని, ఓ లారీ సగటున రోజుకు రూ.2,200 నష్టపోయిందని ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) సెక్రటరీ జనరల్ నవీన్ గుప్తా వెల్లడించారు. ఇక లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. కొనుగోళ్లు, విక్రయాలు నిలిచిపోవడంతో ఈ రంగానికి లక్ష కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. రిటైల్ వాణిజ్యం కూడా కనీవినీ ఎరుగని స్థాయిలో క్షీణత చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్రం కావడంతో మార్చి ద్వితీయార్థం నాటికి దాదాపుగా రూ.2.2 లక్షల కోట్ల మేర రిటైల్ వాణిజ్యం నష్టపోయినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. భారత్ లో రిటైల్ అమ్మకాల రంగంలో 7 కోట్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులుండగా, వారి పరిధిలో 45 కోట్ల మంది పనిచేస్తున్నారు. దేశంలో ఈ రిటైల్ వ్యాపారమే నెలకు రూ. 6.5 లక్షల కోట్ల మేర జరుగుతుంది. లాక్ డౌన్ కారణంగా ఆయా రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. లాక్ డౌన్ అనంతరం కేంద్రం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవం ఆధారపడి ఉంటుంది.

ఉచిత కరోనా టెస్టులు పేదవాళ్లకు మాత్రమే: సుప్రీం స్పష్టీకరణ

కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతవారం పేర్కొన్న సుప్రీం కోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని స్పష్టం చేసింది. ఎవరెవరికి ఉచితంగా కరోనా టెస్టులు వర్తింపజేయాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది. కొన్నిరోజుల కిందట అందరికీ ఉచితంగా కరోనా టెస్టులు అందుబాటులోకి తేవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనగా, తాము ఉచితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేమని ప్రైవేటు ల్యాబ్ లు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం తన నిర్ణయాన్ని సవరించుకుంది. "ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్దిపొందుతున్నవారు, బలహీన వర్గాల కేటగిరీలో ప్రభుత్వ గుర్తింపు పొందినవారు  అర్హులుగా భావించి వారికి ఉచిత కరోనా నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలి" అని వివరించింది. అయితే బలహీన వర్గాల్లో ఎవరెవరు ఈ వెసులుబాటుకు అర్హులో కేంద్రం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించుకోవచ్చని తెలిపింది.

రేపు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం.. లాక్ డౌన్ పై ప్రధాని క్లారిటీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో తాజా పరిస్దితులపై సమీక్ష నిర్వహించిన ప్రధని మోడీ... రేపు మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో తన అభిప్రాయాన్ని మోడీ వెల్లడించనున్నారు.  రేపు ఉదయం 10 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఇవాళ ట్వీట్ చేసింది. వాస్తవానికి రెండురోజులుగా మంత్రి వర్గ బృందంతో పాటు అధికారులతో కీలక చర్చలు జరిపిన ప్రధాని, ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే పరిమిత లాక్ డౌన్ పై చర్చ జరుగుతున్న వేళ... మోడీ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో మోదీ పొడిగింపుకు మొగ్గు చూపుతారా లేక ఏపీ సీఎం జగన్ సూచించిన తరహాలో రెడ్ జోన్లకే దీన్ని పరిమితం చేస్తారో తేలాల్సి ఉంది.