కువైట్ ప్ర‌క‌టించిన క్షమాబిక్షను ఉప‌యోగించుకోండి! భార‌త రాయ‌బార‌కార్యాల‌య ప్ర‌క‌ట‌న‌

గ‌ల్ఫ్ దేశాల్లో అక్క‌డి నిబంధ‌న‌లను ఉల్లంఘించి అక్ర‌మంగా నివాస‌ముంటున్న వారికి ఆమ్మెస్టీ (క్ష‌మాభిక్ష‌) వ‌రం లాంటిదే. ఎందుకంటే అక్క‌డి రూల్స్ క‌ఠినంగా వుంటాయి. వివిధ కార‌ణాల వ‌ల్ల భార‌తీయులు అక్ర‌మంగా వుండాల్సిన దుస్థితి వుంటుంది. దొరికితే జైలు ఖాయం. అయితే ఆ జైల్లో ఎప్ప‌ట్టి వ‌ర‌కు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి. అక్ర‌మంగా వుంటున్న వారి వ‌ద్ద క‌నీసం డాక్యుమెంట్లు కూడా వుండ‌వు. పాస్‌పోర్ట్ కూడా య‌జ‌మాని, లేదా ఏజెంట్ తీసుకుని వుంటాడు. అలాంటి వారికి ఈ క్ష‌మాభిక్ష తో స్వ‌దేశానికి వెళ్ళ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది. అందుకే కువైట్‌లో వున్న భార‌త రాయ‌బార కార్యాల‌యం ఆమ్మెస్టీని ఉప‌యోగించుకోమ‌ని అక్క‌డ వున్న అక్ర‌మ వ‌ల‌స‌దారుల్ని విజ్ఞ‌ప్తి చేసింది. కువైట్ ప్రభుత్వం ఇచ్చిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ను ఉపయోగించుకోవలసింది గా భారత రాయ బార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16 వ తేది(గురువారం) నుండి 20 వ తేది(సోమవారం) వరకు ఉదయం 08 గంటల నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు ఫర్వానియ గవర్నరేట్ లోని ముత్తన్న ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 122 లో మగ వారు నమోదు చేసుకోవాలి. మహిళలు ఫర్వానియ గవర్నరేట్ లోని ఫర్వానియ ప్రైమారి స్కూల్ ఫర్ గర్ల్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 76 లో నమోదు చేసుకోవాలి. అలాగే జేలీబ్ అల్ షువైక్ లో నయీం బిన్ మసౌద్ స్కూల్ బాయ్స్ బ్లాక్ 4 స్ట్రీట్ 250 లో మగ వారికి, రుఫిడా అల్-అస్లమియా ప్రైమరీ స్కూల్ బ్లాక్ 4 స్ట్రీట్ 200 లో మహిళలకు కేటాయించారు. ట్రావెల్ పత్రాలు అంటే పాస్ పోర్ట్ ఉన్నవారందరూ కుడా పైన పేర్కొన్న సెంటర్లకు వెళ్ళాలి. వీరందరూ వారికి సంభందించిన లగేజ్ మొత్తం సర్దుకొని వెంట తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వారి నమోదు పక్రియ కాగానే వారిని షెల్తర్లకు తరలిస్తారు. అక్కడ నుండి నేరు గా వారిని భారత దేశానికి తరలిస్తారు. ఎప్పుడు వారి ప్రయాణం ఉంటుందో ఇరు దేశాల ద్వైపాక్షిక సంభందాల మిధ ఆధార పడి ఉంటుంది.

ఆర్జిత సేవల టికెట్లకు డబ్బు వాపసు: టీటీడీ

మార్చి 13 నుండి మే 31వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బు రీఫండ్‌ చేయాలనీ తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు నిర్ణయించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం  కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో మే 3వ తేదీ వ‌ర‌కు భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా, ఆల‌యంలో అన్నిర‌కాల ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఈ నేప‌థ్యంలో మార్చి 13 నుండి మే 31వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారాగానీ, పోస్టాఫీసుల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు ఆర్జిత సేవ‌లను గానీ, ద‌ర్శ‌న టికెట్ల‌ను గానీ బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను  helpdesk@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది. ఐటి విభాగం ఆధ్వ‌ర్యంలో ఈ వివ‌రాల కచ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు.

క్వారెంటైన్‌కు తరలించ‌డానికి అడ్డుకుంటున్న ఎంఐఎం!

ఎంఐఎం నేత‌ల ఓవర్ యాక్షన్ పోలీసుల‌కు త‌ల‌నొప్పిగా మారుతోంది. కరోనా అనుమానితులను క్వారెంటైన్‌కు తరలిస్తున్న పోలీసులను ఎంఐఎం పార్టీకి చెందిన మునిసిపల్ డిప్యూటీ మేయర్ అడ్డుకున్నారు. పైగా పోలీసులతో వాదులాటకు దిగ‌డంతో ఏమీ చేయలేక పోలీసులు వెళ్ళిపోయారు. తెలంగాణాలో రెడ్ జోన్లు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు అవగాహన లేని రాజకీయ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నగరంలోని ఆటోనగర్‌లో కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్నాడు డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్. వైద్య సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన ఎం.ఐ.ఎం. నేత, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్‌తో పాటు ఓ కార్పొరేటర్ భర్త సహా 10 మందిపై ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పరిస్థితిని, తమకున్న ప్రభుత్వ ఆదేశాలను వివరిస్తున్నా కూడా డిప్యూటీ మేయర్ పరుష పదజాలంతో పోలీసులను దుర్భాషలాడాడు రోడ్డుపై హంగామా సృష్టించిన ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ రోజు భారతీయ రైల్వే 165 వ పుట్టిన రోజు

1853 ఏప్రిల్ 16, సమయం: మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలు. బాంబే (ప్రస్తుతం ముంబై) లోని బోరి బందర్ నుంచి మొట్టమొదటి రైలు 34 కిలోమీటర్ల దూరం లోని థానే కు బయల్దేరింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించటానికి వందలమంది జనం, బోరి బందర్ రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద వందల మంది జనం గుమికూడారు. ఇది నేటికి 165 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ప్రజా వేడుక. భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి.1947(స్వతంత్రం వచ్చే) నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది. రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది.  భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది మరియు 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము. భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో వుంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు. 1. ఉత్తర రైల్వే------- ఢిల్లీ 2. ఈశాన్య రైల్వే------ గోరఖ్‌పూర్ 3. ఈశాన్య సరిహద్దు రైల్వే-----గౌహతి 4. తూర్పు రైల్వే----- కోల్కతా 5.ఆగ్నేయ రైల్వే ------ కోల్కతా 6. దక్షిణ మధ్య రైల్వే ------- సికింద్రాబాదు 7. దక్షిణ రైల్వే------- చెన్నై 8 . మధ్య రైల్వే-------- ముంబై 9. పశ్చిమ రైల్వే ----- ముంబై ముంబై సెంట్రల్ 10. నైఋతి రైల్వే------ హుబ్లీ 11. వాయువ్య రైల్వే--------- జైపూరు 12. పశ్చిమ మధ్య రైల్వే------- జబల్ పూర్ 13. ఉత్తర మధ్య రైల్వే------- అలహాబాదు 14. ఆగ్నేయ మధ్య రైల్వే ------- బిలాస్‌పూర్ 15. తూర్పు తీర రైల్వే------ భువనేశ్వర్ 16. తూర్పు మధ్య రైల్వే----- హాజీపూర్ 17. కలకత్తా మెట్రో రైల్వే ------- కలకత్తా

గుంటూరు వెళ్ళి క‌రోనా అంటించుకున్నాడు!

తక్షణమే అవసరంలేని శస్త్ర చికిత్స కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడి పిల్లోడు. ఇంట్లోని పెద్ద వాళ్ళు క‌నీసం స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా ఉచితంగా గుంటూరులో చెవి ఆప‌రేష‌న్లు చేస్తున్నార‌ని తెలిసి చికిత్స చేయించ‌డానికి తీసుకువెళ్ళి ఆప‌రేష‌న్ చేయించారు. ఆ త‌రువాత ఇంటికి వెళ్ళారు. అయితే ద‌గ్గు, జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఈ పిల్లోడిని ప‌రీక్షిస్తే పాజిటివ్ తేలింది. ఉచిత చికిత్స స‌రే మ‌రి క‌రోనా అంటిందిగా! తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్టు ఆర్డీవో నరేందర్, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్న గుంటూరు నుంచి బాలుడు వచ్చాడన్న స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. చిన్నారికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో స్పష్టమైంది.   బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అతడి కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్ తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలుడు, అతడి కుటుంబాన్ని ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.  వైద్యాధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

చైనాకు రష్యా రిటర్న్ గిఫ్ట్!

* ఇతర దేశాలకు అంటించిన వైరస్, తిరిగి పుట్టింటికి చేరిన వైనం  * అంటించిన వారి వివరాలు వెల్లడిస్తే, నగదు బహుమతి ఇస్తామంటూ ఆశ చూపిన చైనా  *మహా భారతం అరణ్యపర్వం లో 'ఈ బాపతు అడ్డగోలు జాతి' గురించి ముందే హెచ్చరించిన భీష్మ పితామహుడు  * ఇతరులకు మనం చేసేది మనకు గ్యారంటీ గా వాపస్ వస్తుందని చైనా గుర్తిస్తే మేలు  ఒరులేయని యొనరించిన  నరవర! యప్రియము దన మనంబున కగు దా  నొరులకు నవి సేయకునికి  పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.  మహాభారతం లోని అరణ్యపర్వం లోని పంచమాశ్వాసం లో ---ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ రాసిన ఈ పద్యం పూర్వ రంగం ఏమిటంటే- పాండవ ప్రథముడైన ధర్మరాజు, ఉత్తమమైన ధర్మం ఏది అని తన సందేహం తీర్చుకోవడానికి భీష్మ పితామహుడి వద్దకు వెళ్లిన సందర్భంలో, ఆ మహానుభావుడు -ధర్మరాజు కు చెప్పిన ధర్మ సూత్రమే ఇది. దీని భావమేమిటంటే, ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. అదే ధర్మం. కానీ, చైనా వాళ్ళు మహా భారతం చదివి ఉండరు కదా.. అందుకని వాళ్లకు, ఈ ధర్మం సంగతి తెలియక, తాము చేయగలిగినంత అపకారాన్ని -కరోనా వైరస్ రూపంలో అన్ని దేశాలకూ చేసేశారు. అయితే, ప్రకృతి చాలా గొప్పది కదా... భీష్ముడు చెప్పిన ఫార్ములా ను తూచా తప్పకుండా పాటిస్తూ, చైనా కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం మొదలెట్టేసింది. అది కూడా ఎలాగంటే, రష్యా నుంచి వస్తున్న వారితో చైనా లో మళ్లీ కేసులు మొదలు కావటం ద్వారా.. అంతే కాదు, వివిధ దేశాల నుంచి చైనాలోకి చొరబాట్లు జరిగిన కారణంగా తేలిన లెక్కలేమిటంటే, రష్యా నుంచి వచ్చిన వారిలో 79 మందికి కరోనా ఉందని తేలటం.  ఆచూకీ చెబితే 5 వేల యువాన్ల నజరానా ఇస్తామనే దౌర్భాగ్య స్థితికి చైనా చేరుకున్నదంటే, చైనా చేసిన దురాగతం ఎలా కొత్త రూపం తీసుకుని ఆ దేశాన్నే కబళించటానికి వెనక్కు రావటం. వివిధ దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారి కారణంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వారి వివరాలు అందిస్తే నజరానా అందిస్తామని ప్రకటించింది. దేశంలోని  ఈశాన్య ప్రాంతమైన హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోకి రష్యా నుంచి వచ్చిన వారిలో మంగళవారం కొత్తగా 79 కేసులు నమోదయ్యాయి. కేసుల నమోదుతో ఉలిక్కిపడిన అధికారులు వాటికి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు వద్ద నిఘా పెంచారు. అయినప్పటికీ చొరబాట్లు ఆగకపోవడంతో అటువంటి వారి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికీ 5 వేల యువాన్లు (రూ.54 వేలు) చొప్పున ఇస్తామని అధికారులు ప్రకటించారు. దేశంలోకి ప్రవేశించే వారిని పట్టుకుని పరీక్షలు చేస్తే పరిస్థితి మళ్లీ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కనీసం, ఇప్పటికైనా మహా భారతం చదివి, అందులో భీష్ముడు చెప్పిన ధర్మ సూత్రాలు ప్రాక్టీస్ చేస్తే, భవిష్యత్తులోనైనా కాస్త మానసిక సంస్కరణ జరిగే అవకాశముంది.

లాస్ట్ బ్రదర్ ఆఫ్ చైనా కు 50 వేల పీపీఈ కిట్స్

*హెల్త్ ఎమెర్జెన్సీ లోనూ డ్రాగన్ కుట్ర రాజకీయాలు  *మరో సారి భారత్ లో విద్వేష జ్వాలలు రేపేందుకు పన్నాగం  చైనా చేసే ప్రతి పని వెనుక ఒక రీజన్, ఒక లాజిక్ ఉంటాయి. కేవలం 32 కేసులున్న అసోంకు 50 వేల పీపీఈ కిట్స్ పంపించటం ద్వారా చైనా, మరో సారి కొత్త కుట్ర కు తెర తీసింది.  ఈ కిట్స్ ను చైనా నుంచి పొందిన తొలి రాష్ట్రంగా అసోం నిలవటానికి కారణం, చైనాకు అసోం కి మధ్య ఉన్న బంధుత్వం. ఈ రోజుకీ అసోం లో చాలా మంది , తమను తాము లాస్ట్ బ్రదర్స్ ఆఫ్ చైనా గా అభివర్ణించుకుంటుంటారు. అందుకనే చైనాకు, అసోం మీద ప్రత్యేకమైన అభిమానం. త్వరలోనే అసోంలోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు ఈ కిట్లను పంపిణీ చేస్తారని తెలిసింది.  దేశమంతటికీ కరోనా భయం పట్టుకున్న వేళ, చైనా నుంచి మొట్టమొదటిగా, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్స్ ను దిగుమతి చేసుకున్న రాష్ట్రంగా అసోం నిలిచింది. చైనాలోని గాంగ్జౌ నుంచి టేకాఫ్ అయి, బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన బ్లూ డార్ట్ విమానం, 50 వేల పీపీఈ కిట్స్ ను తీసుకుని వచ్చింది. ఎన్నో ప్రపంచ దేశాలు పీపీఈ కిట్స్ కోసం చైనా వైపు చూస్తున్న వేళ, చైనా అసోంకు వీటిని పెద్ద ఎత్తున పంపించడం గమనార్హం. ప్రస్తుతం అసోంలో కేవలం 32 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రాల సగటుతో పోల్చినా, కేసుల సంఖ్య పరంగా చూసినా, ఇది చాలా తక్కువే. ఇక విమానాశ్రయంలో పీపీఈ కిట్స్ ను రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ స్వీకరించారు. "భారత ప్రభుత్వంతో పాటు చాలా దేశాలు చైనా నుంచి పీపీఈ కిట్స్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా కూడా పీపీఈల కోసం చైనా వైపే చూస్తోంది. వీటిని చైనా నుంచి డైరెక్ట్ గా దిగుమతి చేసుకున్న తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది" అని ఆయన అన్నారు. మొత్తం 2 లక్షల కిట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని తాము భావిస్తున్నామన్నారు.  వాస్తవానికి పీపీఈ కిట్స్ ను డైరెక్ట్ గా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం ఓ రాష్ట్రానికి అంత సులువేమీ కాదు. ఎన్నో పెద్ద రాష్ట్రాలు, మరిన్ని వనరులుండి కూడా కిట్స్ ను ఇంపోర్ట్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నాయి.

ఏ క్షణంలోనైనా మౌలానా సాద్‌ అరెస్టయ్యే అవకాశం

భౌతిక దూరం నిబంధన గాలికి వదిలేసి సదస్సు నిర్వహించారని, పలువురి మరణాలకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అతనిపై హత్య కేసు నమోదు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కేసు నమోదైంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను గాలికి వదిలేసి మతపరమైన సదస్సు నిర్వహించిన ఆయనపై ఈ మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సదస్సు నిర్వహించిన తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు, సదస్సుకు హాజరైన వారిలో చాలామంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఘటన కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సాద్‌పై సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపైనా వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.

రైతుల నుండి హమాలి చార్జీలు వసూలు చేయడం ఆపాలి!

తెలంగాణ రాష్ట్రంలో  రబీ సీజన్లో  వరి ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు జరుగుతున్నది. సహకార సంఘాలు ,ఐకెపి కేంద్రాల్లో రైతుల నుండి  వసూలు చేస్తున్న హమాలి చార్జీలను ఆపాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో రైతుల నుండి హమాలి ఛార్జీల పేరుతో క్వింటాలుకు రూ!! 35 నుండి 40 వసూలు చేస్తున్నారు. పురి కొనలు కూడా రైతులే  తీసుకు రావాలని చెబుతున్నారు. ఈ రబీ సీజన్లో రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో  రైతులు వరి సాగు చేశారు. కోటి అయిదు లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అకాల వర్షాలు, వడగళ్ళ వానకు నష్టపోయిన రైతులకు హమాలి ఛార్జీలు అదనపు భారమే అవుతుంది.  కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుని హమాలి చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్నాము. గతంలో హమాలి చార్జీలు ప్రభుత్వం సకాలంలో ఐకెపి కేంద్రాలు, సహకార సంఘాలకు చెల్లించకపోవడం వల్ల రైతుల నుండి వసూలు చేస్తున్నామని కొనుగోలు కేంద్రాల వారు రైతులకు తెలియజేస్తున్నారు. గత బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని  తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది.

'ప్రకాష్ రైల్' ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల గాలింపు!

శ్రీకాకుళం జిల్లా కు చెందిన " ప్రకాష్ రైల్" ఆర్మీ జవాన్ గత కొంత కాలంగా హిమాచల్ ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తూ అదృశ్యమైయ్యాడు. అతని సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేదు. ఈ విష‌యాన్ని ఏపి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంచాలకులు మధుకర్  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రయ దృష్టికి తీసుకెళ్ళారు. వెంట‌నే స్పందించిన గ‌వర్నర్ రక్షణ శాఖ మరియు  హిమాచల్ ప్రదేశ్  రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను "ప్రకాష్ రైల్" గురించి దర్యాప్తు చేసి వెంటనే నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశించారు.   ఉన్నతాధికారులు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు.  " ప్రకాష్ రైల్"  మరో జవాన్ తో బాటు చైనా సరిహద్దు లో ఉన్న ఛోలింగ్ ప్రాంతం  దగ్గర  పహారా కాస్తూ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవ శాత్తు "సట్లెజ్ " లోయలోకి జారిపడి అదృశ్యమైనట్లు "పూహ పోలీస్ స్టేషన్" లో ఎఫ్ ఐ ఆర్ నమోదైనట్లు గుర్తించారు. ఈవిష‌యాన్ని అధికార‌దులు గవర్నర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. " ప్రకాష్ రైల్" తో బాటు విధి నిర్వహణలో ఉన్న మరో జవాను నది ఒడ్డున పడటం వలన అతన్ని భధ్రతా సిబ్బంది  కాపాడింది. హిమాచల్ ప్రదేశ్ గౌరవ గవర్నర్ గారి ఆదేశాల అనంతరం రక్షణ శాఖ మరియు పోలీస్ ఉన్నతాధికారులు 300 మంది సిబ్బంది తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి  హెలికాప్టర్, గజ ఈతగాళ్లను,  థర్మల్ సెన్సార్ లను ఉపయోగించి గాలింపు చర్యలను ముమ్మరం చేయడం జరిగింది.  బుధ‌వారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం " ప్రకాష్ రైల్" యొక్క క్యాప్ మరియు బ్యాక్ ప్యాక్ లభించాయి.  " ప్రకాష్ రైల్" ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల గాలింపు  కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు "కల్నల్ సి ఎస్ మఖాన్" మరియు  "మేజర్ ఆనంద్"   తెలియజేసారు.  ఈ దర్యాప్తు పై ఎప్పటికప్పుడు రాజ్ భవన్ కు నివేదిక ఇస్తున్నారు.

ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా!

సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి. దాదాపు 72 మంది పిజ్జా ఆర్డర్ చేసుకున్న వారికి ఈ బాయ్ డెలివ‌రీ ఇచ్చాడ‌ట‌. అధికారులు వీరి ర‌క్త శాంప్లిస్‌ను కూడా సేక‌రిస్తున్నారు. వారందరినీ హోం క్వారెంటైన్ లో ఉంచారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలసిస్ పేషెంట్ అట‌. అత‌ను ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. అక్కడే కరోనా వైరస్ అంటుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు అతను పిజ్జా డెలివరీ చేయగా, ఇటీవల అతనిలో కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల్లో సౌత్ ఢిల్లీ కూడా వుంది.

కరోనా వాక్సిన్ తయారీలో అగ్రరాజ్యాలతో పోటీ ప‌డుతున్న భారత్!

క‌రోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు మ‌న దేశంలోని ఆరు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని విరుగుడు అందుబాటులోకి రావాలంటే చాలా కాలం పడుతుందని మ‌న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జైడస్ కాడిలా రెండు వ్యాక్సిన్‌లపై ప్రయోగాలు చేస్తోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, మైన్‌ వ్యాక్స్ లాంటి ఆరు సంస్థలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయని గగన్‌దీప్ కాంగ్, టీహెచ్‌ఎస్‌టీఐ పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమంటే అది దీర్ఘకాల ప్రక్రియ. వివిధ దశల పరీక్షలను దాటేందుకు, ప్రభుత్వాల ఆమోదం పొందేందుకు నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్ తాయారైన తర్వాత కూడా అనేక సవాళ్ల ఉంటాయి. అన్ని వయస్సుల వారిపై ఇది పని చేస్తుందా? లేదా జన్యు నిర్మాణాన్ని మార్చుకునే క్రమంలో దాన్ని ఎదుర్కోగలదా? వంటి సమస్యలు తలెత్తుతాయని రాజీవ్‌గాంధీ జీవ సాంకేతిక కేంద్రంలోని శాస్త్రవేత్త శ్రీకుమార్ త‌న అభిప్రాయం చెప్పారు. భార‌త దేశంతో పాటు మ‌రో 70 సంస్థ‌లు క‌రోనా వ్యాక్సిన్ తయారీకై ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. అమెరికా, చైనా కూడా వ్యాక్సిన్‌ని తయారు చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రకాల వ్యాక్సిన్‌లు తయారు చేసి జంతువులపై, కొందరి మనుషులపై ప్రయోగించాయి. అయితే అవి అంతగా సక్సెస్ కాలేదని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

నిప్పులు కడిగే వంశం నుంచి ఎగిసిపడ్డ సంస్కరణల తారాజువ్వ

* నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి  ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. సంప్రదాయాల పేరిట జరుగుతున్న అరాచకంపై విరుచుకుపడ్డాడు కాబట్టే ఈయన సార్ధక నామధేయుడయ్యాడు.. కందుకూరి వీరేశలింగం తన ఐదో యేట బడిలో చేరి నేర్చుకున్నవి… బాల రామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ట శతకం. పన్నెండో ఏట నుంచీ పూర్తిగా ఇంగ్లీషులోకి వచ్చేశాడు. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ భావాలు, ఇంగ్లిష్‌లో సంభాషణలు. సిలబస్‌తో పాటు అతడు కేశవ్ చంద్రసేన్ పుస్తకాలు చదివాడు. బెంగాల్ రచయిత అతడు. స్త్రీని స్థిమితంగా ఉంచలేని సమాజం అది ఎంత ఆధునికమైనదైనా, నాగరికమైనది కానే కాదని చంద్ర సేన్ రాశాడు. అది పట్టేసింది వీరేశలింగాన్ని. తను అనుకుంటున్నదే ఆయనా రాశాడు! అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్నాడు వీరేశలింగం. ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా! ఎవరి స్వార్థం వారిదే. ఎవరి నమ్మకాలు వారివే. ప్రజలారా మారండి అని వ్యాసాలు రాశాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు.ఎవరూ మారలేదు. వీడెవరో పిచ్చివాడు అనుకున్నారు. కొత్త పిచ్చోడు అనుకున్నారు. రాజారామ్మోహన్ రాయ్‌ననీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్‌ననీ అనుకుంటున్నాడేమో అన్నారు. ఇది బెంగాల్ కాదు, ఆంధ్రదేశం బ్రదర్ అని హితవు చెప్పారు. వీరేశలింగానికీ సమాజానికీ పడడం లేదు. సమాజం అతడికన్నా బలమైనది. అంతకన్నా మొండివాడు వీరేశలింగం. ఉపాధ్యాయుడుగా అతడు శక్తిమంతుడు. ఒక తరాన్ని మలచగలడు. పత్రికా సంపాదకుడిగా అతడు శక్తివంతుడు. భావ విప్లవం తేగలడు. కానీ తరాన్ని మలచడానికి, విప్లవం రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకు బాల్యవివాహాల బలిపీఠాల నుంచి చిన్నారులను రక్షించేదెలా? బాల వితంతువుల యవ్వనాన్ని భద్రపరిచేదెలా? సమాజం ఉలిక్కిపడి లేచేలా గట్టి దెబ్బ వేయాలి అనుకున్నాడు వీరేశలింగం. ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉండాలంటే – ఊరూరూ తిరిగి, వీధి వీధి తిరిగి తనకు తగిలిన గాయాన్ని ఈ దురాచార సమాజం ఏడ్చుకుంటూ చూపించుకోవాలి.పంతులుగారికి అప్పటికే రాజమహేంద్రవరం నిండా, ఆంధ్రదేశం నిండా శత్రువులు మొనదేలిన రాళ్లలా తయారై ఉన్నారు. విజయనగరం మహారాజుగారి బాలికల పాఠశాల ప్రాంగణంలో రెండు నెలల వ్యవధిలో ఆయన ఇచ్చిన రెండు స్పీచ్‌లు సంప్రదాయాల తాళాలు బద్దలు కొట్టి, ఇళ్లలో చొరబడి, వితంతు బాలికల కోసం వెదకడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా అదే చర్చ. ఆయనదే రచ్చ! "ఎవరయ్యా ఈ త్రాష్టుడు. విలువల్ని భ్రష్టుపట్టించడానికే పుట్టాడా ఈ రాజమహేంద్రవరంలో?, ఒక పెళ్లి చాల్లేదా సంఘ సంస్కర్త గారికి! వితంతువులను ఉద్ధరించే పేరుతో ఊరిమీద పడ్డాడు!!, వీడిదసలు బ్రాహ్మణ పుట్టకేనా? సభల్లో ఏం కూస్తున్నాడో విన్నారా?" వీరేశలింగం కనిపిస్తే పట్టుకుని కుళ్లబొడిచేయాలన్నంత కోపంతో ఉంది ఊరూవాడ. ‘మనవాళ్లు పూర్వాచార పరాయణులగుట చేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారమునైన నంగీకరింతురుగాని, యాచార విరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు’ అని వీరేశలింగం ఏమాత్రం మొహమాటం లేకుండా, మర్యాద లేకుండా సభల్లో ఉపన్యసించడం పెద్దపెద్దవాళ్లకు ఆగ్రహం తెప్పించింది.      1881 డిసెంబర్‌ 11వ తేదీన మొదటి వితంతు వివాహం భువనగిరి పరదేశీ సోమయాజులు, శ్రౌతము కోటీశ్వరశాస్త్రులుగారు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, ఓగిరాల జగన్నాథం, వేంకటరాయ శాస్త్రులు, దంతులూరి నారాయణ గజపతిరావు, దాసు శ్రీరాములు పంతులు వంటి మహామహులు వీరేశలింగంపై విరుచుకుపడ్డారు. ఆయనపై ఖండన గ్రంథాలు రాశారు. ఉత్తరాలు రాశారు. వాటిలో ఏ ఉత్తరానికీ ఆయన విలువ ఇవ్వలేదు. ఒక ఉత్తరానికి తప్ప. అది.. కృష్ణమండలంలోని తిరువూరు డిప్యూటీ తాసిల్దారు బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందం గారి నుంచి వచ్చిన ఉత్తరం. ‘తిరువూరు తాలూకా రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదనీ, ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె తల్లి సీతమ్మ సిద్ధ్దంగా ఉన్నారని’ అందులోని సారాంశం. ‘మీదే ఆలస్యం’ అని పంతులుగారు తక్షణం రిప్లయ్ ఇచ్చారు. అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరం తెప్పించి తన ఇంట్లో, తన భార్య సంరక్షణలో ఉంచుకున్నారు. ఆ వెంటనే వరుడి వేట మొదలైంది!వీరేశలింగం పంతులుగారి ఇల్లు విశాఖపట్నం పోలీస్ హెడ్ క్వార్టర్ట్స్‌లో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు అనే యువకుడు ఆ క్షణంలో పంతులుగారి మదిలో మెదిలారు. గతంలో అతడు పంతులుగారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అతడికి కబురు పంపారు. శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాడు. అది అతడికి పంతులుగారిపై ఉన్న గౌరవం. శ్రీరాములుకు అంతకుముందే పెళ్లయింది. భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా వితంతు వివాహం చేసుకోడానికి అతడు వేచి ఉన్నాడు. చివరికి గౌరమ్మ దొరికింది! పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి. వరుడి పేరును కూడా పంతులుగారు రహస్యంగా ఉంచారు. గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికీ తెలిసింది కానీ వరుడెవరో బయటికి పొక్కలేదు. పెళ్లికి కావలసిన రక్షణ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్నల్ పోర్చిస్ దొరగారి నుంచి లభించింది. పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడా రామకృష్ణయ్యగారు సమకూర్చారు. వధూవరులకు కావలసిన నైతిక స్థయిర్యాన్ని పంతులుగారు ఇచ్చారు. అలా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది. చివరి నిమిషంలో వరుడి తల్లిదండ్రులకు విషయం తెలిసి గగ్గోలు పెడుతూ కల్యాణ మంటపానికి చేరుకున్నారు. వేయడానికి అక్షింతలు, ఇవ్వడానికి అశీర్వచనాలు తప్ప వాళ్లకేం మిగల్లేదు. ఆ వివాహానికి వెళ్లిన వాళ్లందరినీ సమాజం గుర్తుపెట్టుకుని మరీ వెలి వేసింది. వేడుకలకు, వివాహాలకు పిలవడం మానేసింది. పంతులుగారిని చీడపురుగుగా చూసింది. పనిగట్టుకుని వేధించింది. వీరేశలింగం భయపడలేదు. వెనకడుకు వెయ్యలేదు. నేనింతే అన్నాడు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా పెళ్లిళ్లు చేస్తానని సవాల్ విసిరాడు. ‘‘ఈ బక్క పీనుగకు చావైనా రాదే! వీడి మీది గౌరవంతో వీడి పెళ్లానికి ఇంకో పెళ్లి చేద్దుము’’ అని శుద్ధ సంప్రదాయవాదులు పంతులుగారిని రహస్యంగా తిట్టుకున్నారు. ఆ రహస్యం ఆయన చెవిన పడి నవ్వుకున్నారే గానీ, నమ్మిన తోవను వదిలి వెళ్లలేదు. వీరేశలింగం పంతులుగారు శారీరకంగా బలహీనులైతే కావచ్చు. మానసికంగా బలవంతులు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మిగారు. వీళ్లందరి సహకారంతో పంతులుగారు తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. తను బతికుండగా నలభై వరకూ వితంతు వివాహాలు జరిపించారు. ఈ దుస్సాహసమే ఆయన్ని నేడు సంఘసంస్కర్తగా నిల బెట్టింది.

ఏపీలో 11, తెలంగాణ 8 రెడ్‌జోన్‌ జిల్లాలు!

రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌ జాబితాను కేంద్రం ప్రకటించింది.  రెడ్‌జోన్‌లో 170 జిల్లాలు, ఆరెంజ్‌ జోన్‌లో 207 జిల్లాలు, మిగితా జిల్లాలు గ్రీన్‌ జోన్ గా పేర్కొన్నారు. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, ఆరెంజ్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్పు చేస్తారు. ఏపీలో 11 రెడ్‌జోన్‌ జిల్లాలు వున్నాయి. అవి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, ప.గో., చిత్తూరు, విశాఖ, తూ.గో., అనంతపురం. అలాగే తెలంగాణ 8 రెడ్‌జోన్‌ జిల్లాలు హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, గద్వాల, మేడ్చల్‌, కరీంనగర్‌, నిర్మల్‌,  రంగారెడ్డి తెలంగాణలో ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌, సిరిసిల్ల, సిద్దిపేట. తెలంగాణలో హాట్‌స్పాట్‌ క్లస్టర్‌ జిల్లాగా నల్లగొండ వుంది.

అటవీ పరిరక్షణ, అవాసాల అభివృద్దిపై దృష్టి పెట్టండి!

కోవిద్ - 19 (కరోనా వైరస్) నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తూనే, అటవీ పరిరక్షణ చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులతో (పీసీసీఎఫ్) కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి సీ.కే. మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిద్ వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, అటవీ శాఖ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కేంద్ర అటవీ శాఖ కార్యదర్శి సీ.కే. మిశ్రా సూచించారు. అటవీ పరిరక్షణ, అవాసాల అభివృద్ది, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వన్యప్రాణులకు నీటి సదుపాయాల కల్పన, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, కంపా నిధులతో చేపట్టిన పనుల పురోగతి, నిధుల విడుదల తాజా పరిస్థితి, ప్రాజెక్ట్ టైగర్, ఎలిఫెంట్, గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా నర్సరీల అభివృద్ది, అటవీ ప్రాంతాల మళ్లింపు సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అటవీ అగ్ని ప్రమాదాల నివారణలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, మానవ వనరులకు తోడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వాడాలని డీజీ సంజయ్ కుమార్ సూచించారు. కేంద్ర అటవీ శాఖ సూచనల మేరకు ఇప్పటికే తగిన జాగ్రత్తలు చేపట్టామని, కంపాతో (Compensatory Afforestation Fund Management and Planning Authority (CAMPA) పాటు ఇతర పనులు, అనుమతులకు సంబంధించిన నివేదికలను గడువులోగా పంపుతున్నామని సమావేశంలో పాల్గొన్న తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్. శోభ వెల్లడించారు. అలాగే కోవిద్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో అటవీ శాఖ భాగం అవుతోందని తెలిపారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, జిల్లా కంట్రోల్ రూమ్ లలో అటవీ శాఖ సిబ్బంది సేవలు అందిస్తున్నారని, అలాగే అడవుల్లో ఉన్నగిరిజనులకు, అటవీ సమీప ప్రాంతాల పేదలకు నిత్యావసరాలు అటవీ శాఖ తరపున అందిస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల పీసీసీఎఫ్ లు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పీసీసీఎఫ్ ఆర్. శోభతో పాటు, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ.పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, ప్రత్యేక అధికారులు శంకరన్, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రూట్ జ్యూస్!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, నగర రోడ్లపై కష్టపడి పనిచేస్తున్న  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది,  పారిశుద్ధ కార్మికుల కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి  ఏర్పాటు చేసిన ఆరు వేల యూనిట్ల  రియల్ ఫ్రూట్ జ్యుస్ ప్యాకెట్లను, కేంద్రమంత్రి సూచన మేరకు బీజేపీ మాజీ అధ్యక్షుడు  డాక్టర్ కె లక్ష్మణ్ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శి శశికిరణచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కరోన వైరస్ అందరికి కష్టాలు తెచ్చిందని, మహమ్మరిని తరిమి కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు కూడా ప్రభుత్వం కరోన కట్టడి కోసం చేసిన నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని అలానే ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ కష్టకాలంలో తమ తోటివారిని, పెదవాళ్ళను ఆదుకోవాలని లక్ష్మణ్ పిలుపిచ్చారు. రోడ్లపై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం కిషన్ రెడ్డిగారు 6000 ల లీటర్ల ఫ్రూట్ జ్యుస్ ఇవ్వడం అభినందనీయమని ,ఇంకా ఎందరో స్పందించాలని లక్ష్మణ్ కోరారు.

కరోనా బఫర్ జోన్ లోకి సి ఎం జగన్ నివాసం

గుంటూరు జిల్లా డోలాస్ నగర్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పాజిటివ్ కేసు నమోదు అయిన గ్యాలక్సీ అపార్ట్ మెంట్ నుంచి ఇరువైపులా ఒక కిలో మీటర్ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. పాజిటివ్ కేసు నమోదు అయిన ప్రాంతంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలను అధికారులు మూడు జోన్లుగా విభజించారు. ఒక కిలో మీటరు పరిధిని హై రిస్క్ జోన్ గా ప్రకటించారు. మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గాను, ఏడు కిలో మీటర్ల పరిధిని బఫర్ జోన్ గానూ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి నివాసం ఈ బఫర్ జోన్ లోకే వస్తుంది.

జన్ ధన్ బ్యాలెన్స్ కోసం క్యూ లు కట్టకండి

* మీ మొబైల్ నుండి మిస్డ్ కాల్ చేసి, బ్యాలెన్స్ తనిఖీ చేయండి  లాక్డౌన్ తరువాత, వివిధ పథకాల కింద కార్మికులు, రైతులు, మహిలా జన ధన్ ఖాతాదారులకు డిబిటి ద్వారా డబ్బు పంపబడుతోంది. ఆశ్చర్యకరంగా, ఈ మొత్తం గురించి తెలుసుకోవడానికి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి వారి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు ... బ్యాంక్ పేరు బ్యాలెన్స్ తెలుసుకోవడానికి జారీ చేసిన సంఖ్య ..........   సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9555244442 కెనరా బ్యాంక్ 09015483483, 09015734734 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223766666, 1800112211 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18001802222, 18001802223, 01202303090 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9222281818 యాక్సిస్ బ్యాక్ 18004195959 పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7039035156 యుకో బ్యాంక్ 9278792787 దేనా బ్యాంక్ 09278656677, 09289356677 బ్యాంక్ ఆఫ్ ఇండియా 9015135135 ఐసిఐసిఐ 9594612612 ఇండియన్ బ్యాంక్ 9289592895 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 08067205757 హెచ్‌డిఎఫ్‌సి 18002703333, 18002703355 కార్పొరేషన్ బ్యాంక్ 9268892688 ఐడిబిఐ 18008431122 అవును బ్యాంక్ 9223920000 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223008586 యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015431345 బ్యాంక్ ఆఫ్ బరోడా 8468001111 అలహాబాద్ బ్యాంక్ 9224150150

అడవి పంది దాడిలో గిరిజన బాలిక మృతి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో అడవి పంది దాడిలో గిరిజన బాలిక మృతి చెందిన సంఘటన పై అటవీశాఖ సంతాపాన్ని తెలియచేసింది. సంఘటన విషయం తెలుసుకున్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పి సి సి ఎఫ్) ఆర్. శోభ జిల్లా అటవీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. గురువారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి, నిబంధనల ప్రకారం వారికి నష్టపరిహారాన్ని (5 లక్షలు - అటవీ శాఖ తరపున అందించాలని జిల్లా అధికారులను పి సి సి ఎఫ్ ఆదేశించారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే వారు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవుల లోపలికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పి సి సి ఎఫ్ కోరారు. జంతువుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా అటవీ ప్రాంతాల్లో నిఘాను పటిష్టంగా కొనసాగించాలని అటవీ ప్రాంతాల జిల్లాల అధికారులను సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. అటవీ శాఖ తరపున అందించాలని జిల్లా అధికారులను పి సి సి ఎఫ్ ఆదేశించారు.