ఏమ్మా.. నిర్మలమ్మా.... నువ్వు సెప్పిందేంది.. సేసిందేంది...
* ఆర్ధిక మంత్రి మారటోరియాన్ని లైట్ తీసుకున్న బ్యాంకులు
* ఎప్పటిలానే, లోన్ కిస్తీలను డిడక్ట్ చేస్తున్న బ్యాంకులు
* ఓ వైపు జీతాల్లో కోత, మరో వైపు ఇన్ స్టాల్ మెంట్ల వాత
* హామీ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ కూడా సైలెంట్ గా కిస్తీల కోత మొదలెట్టింది
ఏదో పోన్లే గదా అని మా నాయుడు గారు ( అదేనండీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) అవకాశమిస్తే, మా రాష్ట్రం నుంచి రాజ్యసభ కు వెళ్లి, మాకే వెన్నుపోటు పొడిచిన నిర్మలమ్మ గారూ...(కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్).. ఇప్పుడు ఇంకోసారి బ్యాంకు ఖాతాదారులను బిచ్చగాళ్ల స్థాయికి తీసుకువస్తున్నావు గదమ్మా.. .. మా ఆంధ్ర బ్యాంకు ను తీసుకెళ్లి, అదేదో నార్త్ బ్యాంక్ లో మెర్జ్ చేశావు...ఇప్పుడేమో, ఆర్ బీ ఐ వాళ్ళ చేత ..మూడు నెలల మారటోరియం అన్ని లోన్స్ మీద ఉంటుందని చెప్పించి, యధావిధిగా లోన్ ఇన్స్టాల్ మెంట్ కట్ చేయించావు... నువ్వు మామూలు మంత్రివి కాదమ్మా.. ..జనాన్ని ఈ స్థాయిలో పిచ్చివాళ్ల ను చేయగల మీ మేధో శక్తి ని చూసే, నరేంద్ర మోడీ మీకు రెండు సార్లు మంత్రి పదవి ఆఫర్ చేసి ఉంటారు. కిందటి నెల నువ్వు ప్రకటన చేసే సమయానికే ఆ నెల కిస్తీ ని డిడక్ట్ చేసుకున్న బ్యాంకులు, ఈ నెల హోమ్ లోన్స్ కిస్తీలు కూడా మినహాయించుకోవటం మొదలెట్టాయి. చివరికి, ప్రభుత్వ రంగం లోని అతి పెద్ద బ్యాంకు అయిన- భారతీయ స్టేట్ బ్యాంక్ ( ఎస్ బీ ఐ) కూడా ఇచ్చిన మాట ను గట్టున పెట్టి మరీ హోమ్ లోన్ కిస్తీలను మినహాయించుకోవటం మొదలెట్టింది.
ఈ కరోనా కంటిన్యూ అవుతోంది గదా, నా లోన్ కిస్తీ ఆపేస్తారా? , నా క్రెడిట్ కార్డు బిల్ క్యాన్సిల్ చేస్తారా? అంటూ పిచ్చి జనం వేసే వెర్రి ప్రశ్నలకు ఒకటే ఆన్సర్ ఇప్పుడు. అవేవీ ప్రాక్టికల్ గా సాధ్యం కావని నిర్మల సీతారామన్ బ్యాంకుల ద్వారా చెప్పించేశారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో, అన్ని తరహా లోన్ల మీద మారటోరియం విధించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తూ, ఆర్ బీ ఐ కిందటి నెల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం అన్ని బ్యాంకులు కూడా అన్ని తరహా టర్మ్ లోన్ల మీద మూడు నెలల మారటోరియం విధించుకునే వెసులుబాటుని ఆర్ బీ ఐ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల, బ్యాంకు కస్టమర్లు మూడు నెలల పాటు తమ కిస్తీలను కట్టకుండా ఉండే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చునన్న మాట.
ఇక్కడే ఆర్ బీ ఐ ఒక పీట ముడి వేసింది. బ్యాంకులకు తాము మారటోరియం సదుపాయం మాత్రమే కల్పించామని, దీనిపైన తదుపరి నిబంధనలు రూపొందించాలని, ఈ విషయం లో ఒక వేళ వ్యక్తిగత స్థాయిలో ఈ ఎం ఐ లను మూడు నెలలపాటు సస్పెండ్ చేయాలా, లేక బ్యాంక్ లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలా అనేది ఇంకా ఒక నిర్ణయం అయితే జరగలేదనేది ఆర్ బీ ఐ సూత్రీకరణ.
ఎస్ బీ ఐ చీఫ్ రజనీష్ కుమార్ అయితే, అన్ని టర్మ్ లోన్లు క్యాన్సిల్ అయినట్లే అని ధృవీకరించారు. కానీ, వాస్తవానికి అది జరగలేదు. లోన్లు తీసుకున్న బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి లోన్లు ఆటొమ్యాటిక్ గా డిడక్ట్ అవుతాయా, లేక, కస్టమర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ ఆప్షన్ ను ఎంచుకొవాలా అనే అంశం మీద ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆ ఇచ్చిన క్లారిటీ లో లొసుగుల కారణంగా, బ్యాంకులు శుభ్రంగా కిస్తీలు డిడక్ట్ చేయటం మొదలెట్టాయి.
అలాగే, ఒక వేళ లోన్ కిస్తీలు చెల్లించకపోతే, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ మీద దాని ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు, ఏ ప్రభావమూ ఉండదు అనే బదులిస్తోంది ఆర్ బీ ఐ. అలాగే, ఆర్ బీ ఐ తీసుకున్న కిస్తీ ల మూడు నెలల వాయిదా నిర్ణయాన్ని, అన్ని కమర్షియల్ బ్యాంకులు, అంటే రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అఖిల భారత స్థాయిలో ఉన్న ఆర్ధిక సంస్థలు, NBFC, అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఈ మారటోరియం సదుపాయాన్ని కల్పించవచ్చును.
అయితే, ఆర్ బీ ఐ దీని మీద మరో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది రుణాల రద్దు కిందకి రాదు, కేవలం కిస్తీల చెల్లింపు లో కల్పిస్తున్న వాయిదా సదుపాయమే కానీ, మూడు నెలల పాటు రీ పేమెంట్ షెడ్యూల్ తో పాటు, తదుపరి కిస్తీ చెల్లింపు తేదీలన్నీ కూడా మూడు నెలల తర్వాత ఉండేలా చూడాలనేది బ్యాంకులకు ఆర్ బీ ఐ సూచన. అంటే దానర్ధం, మూడు నెలల రుణ వాయిదాలన్నీ, ఒకే సారి జూన్ నెలలో చెల్లించాలనే అనుమానాల మీద మాత్రం ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ బీ ఐ పూర్తి గైడ్ లైన్స్ వెలువరిస్తే కానీ, దీని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ మూడు నెలల మారటోరియం -ఖాతాదారుల రుణాల మీద అసలు, ఇంకా వడ్డీ కి కూడా వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చ్ 1 నాటికి ఉన్న అన్ని రకాల రుణాల మీద, మూడు నెలల పాటు రుణ కిస్తీల అసలు, ఇంకా వడ్డీ మీద మినహాయింపు ఉంటుందని ఆర్ బీ ఐ వివరించింది. ఇవన్నీ అబద్హం అని తేలిపోయింది.
హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, నిశ్చిత కాలపరిమితి ఉన్న ఆటో లోన్లు వంటివి అన్నీ, అంటే- మొబైల్, ఫ్రిజ్, టీ వీ లాంటి -కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఆర్ బీ ఐ ప్రకటించిన మారటోరియం పరిధిలోకి వస్తాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది.
అయితే క్రెడిట్ కార్డు పేమెంట్స్ మాత్రం దీని పరిధిలోకి రావాలి. అవి రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి కాబట్టి, ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆర్ బీ ఐ సూత్రీకరణ. అలాగే, క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న రుణాల విషయం లో మారటోరియం వర్తిస్తుందా, లేదా అనే దాని మీద ఆర్ బీ ఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే నిమిత్తం తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది.
ఇక వ్యాపారాల గురించి, వాటి మీద తీసుకున్న రుణాల గురించి మాట్లాడుతూ, ఆర్ బీ ఐ చెప్పేదేమిటంటే -వ్యాపారాల నిమిత్తం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీద వడ్డీ చెల్లింపుల కు మినహాయింపు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని స్పష్టం చేసింది. మార్చ్ 1 నాటికి ఉన్న లోన్స్ మీద ఈ మూడు నెలల కాలానికి గానూ పేరుకుపోయిన వడ్డీని, ఈ మారటోరియం ముగిసిన తర్వాతనే వాసులు చేస్తారనేది కూడా ఆర్ బీ ఐ మాట. అయితే, రుణ ఒప్పందాలను కానీ, ఆస్తుల విభజన అంశాలను కానీ ఈ మారటోరియం ఏ రకంగానూ ప్రభావితం చేయదనేది ఆర్ బీ ఐ మాట. ఇవన్నీ వినటానికి బావుంటాయి. ఇంకా మీరు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మాటలను నమ్ముతూ ఉంటె, మిమ్మల్ని ఆ మోడీ గారే కాపాడాలి.