5జీ తో మారనున్న ప్రపంచం
అనేక రంగాల్లో పెనుమార్పులు..
సమాచార గోపత్య పెద్ద సవాలే..
ట్రింగ్.. ట్రింగ్ అంటూ ఒక్కోక్క నెంబర్ ను డయల్ చేసే స్థాయి నుంచి వాయిస్ కమాండ్ తో ఫోన్ చేసి మాట్లాడే స్థాయికి టెక్నాలజీ వచ్చింది. 1980లో డయల్ ఫోన్ వాడినవారు ఇప్పుడు గూగుల్ అసిస్టెంటు, సిరి లాంటి స్మార్ట్ టెక్నాలజీని చూసి అబ్బుర పడుతున్నారు. వర్చువల్ రియాల్టీతో అద్భుతాలు చూపించే 5జీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే మారిపోతుంది. స్మార్ట్ టెక్నాలజీతో పనులన్నీ సూపర్ ఫాస్ట్, టూ.. స్మార్ట్ అవుతాయి.
1980లో వన్ జీ, 1990లో 2జీ, 2000లో 3జీ, 2010లో 4జీ జెనరేషన్ మొబైల్ నెట్ వర్క్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు హై స్పీడ్, కెపాసిటీతో అందుబాటులోకి వస్తోంది ఫిప్త్ జెనరేషన్ మొబైల్ నెట్ వర్క్. గత నాలుగేండ్లుగా దీనిపై జరుగుతున్న ప్రయోగాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే చైనా, జర్మనీ, దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాలు 5జీ టెక్నాలజీ ని ఉపయోగించుకోవడంలో ముందున్నాయి. మనదేశంలోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిలయల్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు. వచ్చే ఏడాది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 5జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
వర్చువల్ రియాల్టీ సర్వీసెస్ ను సపోర్ట్ చేసే బ్యాండ్ విడ్త్ తో 4జీ కన్నా పది రెట్లు ఎక్కువ స్పీడ్ లో 5జీ పనిచేస్తుంది. ఒక సెకన్ కు 10-20 గిగా బైట్స్ డేటా రేట్ ఉంటుంది. ఇక ఆడియో, వీడియో, పిడిఎఫ్ ఫైల్స్ 50-100 రెట్ల స్పీడ్ తో ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అంతేకాదు 1జీబీ నుంచి 10జిబీ మధ్య డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది.
క్లౌడ్ కంప్యూటింగ్ స్వీడ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సీని సపోర్ట్ చేస్తుంది.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్య, ఆరోగ్య, వాణిజ్య, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, రవాణా, వ్యవసాయ తదితర రంగాలను మరింత స్మార్ట్ గా మార్చవచ్చు. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజెస్ కాదు ప్రతి ఇంటిని స్మార్ట్ గా మార్చవచ్చు.
ఇంటర్నెటు కల్పించే సదుపాయాలన్నింటికీ కొన్ని రెట్లు పెంచే 5జీతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయని ఒక అంచనా. అయితే ఇకముందు ముఖ్యమైన డేటా ట్రాన్సఫర్ అంతా 5జీ ద్వారానే జరిగే వీలుందని.. దీని వల్ల వివిధ రంగాల్లో సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కొన్ని దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.