అంతర్గత రాజకీయాలతో అట్టుడుకుతున్న తిరుమల.. డాలర్ శేషాద్రికి కరోనా అంటూ ట్వీట్
posted on Jul 21, 2020 @ 10:36AM
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంతర్గత రాజకీయాలతో అట్టుడుకుతోంది. కరోనా కాలంలోనూ కొందరు శ్రీవారి చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అక్కడి ప్రముఖులు కొందరు వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతోంది.
తాజాగా తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న ఎస్వీ బద్రిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, ఈ ఎస్వీ బద్రి తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.
ఇటీవల రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా దర్శనాలు నిలిపివేయాలని సీఎం జగన్ ని కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇప్పటికీ తిరుమలలో మాజీ సీఎం చంద్రబాబు హవానే నడుస్తోంది అన్నట్లుగా సంచలన వ్యాక్యాలు చేశారు. దీంతో, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సాక్షిగా మీరు రాజకీయాలు చేయడం తగదంటూ రమణ దీక్షితులకు సూచించారు.
ఇదిలా ఉంటే, రమణ దీక్షితులు అనుచరుడు ఎస్వీ బద్రి.. తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ వచ్చిందని, చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. అంతేకాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ లను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం కలకలం రేపింది.
'డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అని నాకు తెలిసింది. ఇది నిజమేనా? కరోనా నేపథ్యంలో కైంకర్యాలన్నీ ఏకాంతంలోనే నిర్వహించాలనే ఒక మంచి సలహాను జగన్, వైవీ సుబ్బారెడ్డి ఎందుకు వినడం లేదు?.. కరోనా బారిన పడిన జీయంగార్లు ఎలా ఉన్నారు? తక్షణమే సరైన చర్యలు తీసుకోండి లేదా కర్మ ఫలితాలను ఎదుర్కోండి' అంటూ బద్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై డాలర్ శేషాద్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తనకు ఇప్పటి వరకు మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారని.. అన్ని పరీక్షల్లోనూ నెగెటివ్ అని తేలిందని చెప్పారు. అయినప్పటికీ తనను మానసికంగా వేధించేలా బద్రి ట్వీట్లు చేస్తున్నారని అన్నారు. బద్రి ట్వీట్లతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. మరోపైపు ఎపిడెమిక్ చట్టం కింద బద్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్ శేషాద్రి ఫిర్యాదుతో పోలీసులకు బద్రిపై టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బద్రిపై కేసు నమోదు చేశారు.