రాష్ట్రపతిని కలిసిన రఘురామ కృష్ణంరాజు.. ఆయనకంతా తెలుసు!!
posted on Jul 21, 2020 @ 2:51PM
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలిసి రెండు లేఖలు అందజేశారు. ఒకటి వ్యక్తిగత భద్రత కోసం కాగా, రెండోది రాజధాని అమరావతి కోసం. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతితో పాటు, తన వ్యక్తిగత భద్రత గురించి రాష్ట్రపతితో చర్చించానని అన్నారు. రాష్ట్రపతి తనకిచ్చిన సమయంలో ఎక్కువ సేపు రాజధాని అమరావతి గురించే మాట్లాడినట్లు తెలిపారు. ఏపీలో రాజ్యాంగ విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శాసనమండలిలో బిల్లు పాస్ కాకపోతే, ఆ బిల్లుని మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారని, కానీ మండలి సెక్రటరీ దాన్ని పక్కన పెట్టారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. మండలి ఛైర్మన్ నిర్ణయాన్నే సెక్రటరీ ఒప్పుకోకపోవడం ఆ వ్యవస్థకే మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల తర్వాత రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్ కు పంపించారు అన్నారు. గవర్నర్ కూడా అటార్నీ జనరల్ తో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విధంగానే రాష్ట్రపతికి విన్నవించానని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కులాన్నైతే ద్వేషిస్తుందో.. ఆ కులం వారికంటే ఎస్సీ, ఎస్టీ వాళ్లే ఎక్కువగా రాజధాని కోసం భూములిచ్చారని తెలిపారు. కనుక వాళ్ల కోసమైనా అమరావతిని కొనసాగించాలని అన్నారు. పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతి కోసం చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసిందన్నారు. అయినా ఇప్పుడు విశాఖలో రాజధాని కట్టడానికి అంత డబ్బు ఎక్కడిది? దీన్ని కూడా ప్రజలు నిలదీయాలి అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రపతికి ముందే తెలిసినట్టుగా ఉందని రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పాలనుకున్న సమాచారం అంతా రాష్ట్రపతి దగ్గర ముందే ఉందని తెలిపారు.