ఎన్-95 మాస్క్ కరోనాను ఆపలేదు
posted on Jul 21, 2020 @ 3:53PM
ఇంట్లో తయారుచేసుకుంటేనే బెటర్
కేంద్ర ఆరోగ్య శాఖ సూచన
కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి అది ఎన్-95 మాత్రమే అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు కవాటం ఉన్న ఆ మాస్క్ లు సురక్షితం కాదు అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్. వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, కరోనా పాజిటివ్ వ్యక్తులు వీటిని ఉపయోగించినప్పుడు కవాటం వల్ల వైరస్ బయటకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సమయంలో ఈ మాస్క్ వాడటం వల్ల వైరస్ ఇరతులకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అయితే కవాటం ఉన్న మాస్క్ లు కాకుండా సాధారణ మాస్కులు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
కవాటం ఉంటే..
ఎన్ - 95 కవాటాలున్న మాస్క్ వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అయితే వదిలిన గాలిని మాత్రం శుద్ధి చేయకుండా నేరుగా వాతావరణంలోకి పంపిస్తుంది. కరోనా ఉన్న వ్యక్తులు వీటిని ధరించినప్పుడు వారు వదిలే గాలి ద్వారా వైరస్ వాతావరణంలోకి చేరుతుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేసిన తరుణంలో ఈ మాస్క్ ల వాడకంపై చాలా దేశాలు నిషేధం విధించాయి. వదిలేసిన గాలిని నేరుగా వాతావరణంలో కలిపేలా ఉంటే మాస్కులు ధరించి ప్రయోజనం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. క్లాత్ తో తయారు చేసిన మాస్క్ లను వాడటమే ఆరోగ్యకరమని సూచించింది. కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి అమెరికా దేశాలు వీటిని నిషేధించాయి. ఇంట్లో తయారు చేసిన మాస్కులనే వాడాలని మన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతిరోజూ...
ముక్కును, నోరును పూర్తిగా కవర్ చేసేలా క్లాత్ తో కుట్టిన మాస్క్ లు వాడటమే శ్రేయస్కరం. బయటకు వెళ్ళివచ్చిన తర్వాత
వేడి నీటిలో కనీసం ఐదు నిమిషాల పాటు నానపెట్టి శుభ్రంగా మాస్క్ ను ఉతకాలి. ఎండలో ఆరవేసిన తర్వాత తిరిగి వాడటం ఆరోగ్యకరం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరు వాడిన మాస్క్ లను మరోకరు వాడవద్దు.