ఫీవర్, కింగ్ కోఠి దవాఖానాల్లో అన్ని బెడ్స్ కరోనా రోగులకే
posted on Jul 23, 2020 @ 9:38AM
కరోనా చికిత్సకు పూర్తి స్థాయి లో మరో రెండు దవాఖానాలు
కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో రెండు దవాఖానాలను పూర్తి స్థాయి కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు గాంధీ దవాఖానా మాత్రమే పూర్తిస్థాయి కరోనా దవాఖానాగా చికిత్స అందిస్తోంది. ఇప్పుడు ఫీవర్ హస్పిటల్, కింగ్ కోఠి హస్పిటల్ కూడా కరోనా సెంటర్స్ గా మార్చుతారు.
ఐసీయూ బెడ్స్ పెంపు
ప్రస్తుతం గాంధీ దవాఖానాలో 800మంది రోగులు ఉన్నారు. వీరిలో చాలామంది పరిస్థితి ప్రమాదం గా ఉంది. ఇంకా ఎక్కువ మందిని చేర్చుకోవడానికి సరైన సదుపాయాలు, వైద్యసిబ్బంది లేరు. దాంతో ఇటీవల ఇక్కడ వైద్యసిబ్బంది నిరసన కూడా తెలియచేశారు. గాంధీ దవాఖానాపై పెరుగుతున్న వత్తిడిని తగ్గించేలా ఫీవర్, కింగ్ కోఠి దవాఖానాల్లో ఐసీయూ వార్డులను ఏర్పాటు చేస్తారు. ఫీవర్ హస్పిటల్ లో 340బెడ్స్ ఉంటే వాటిలో 200బెడ్స్ వరకు కరోనా రోగులకు కేటాయించారు. మిగతా బెడ్స్ ను కూడా కరోనా రోగులకే కేటాయిస్తూ పూర్తిస్థాయి ఐసీయూ వార్డులను ఏర్పాటుచేస్తారు. కింగ్ కోఠిలో ప్రస్తుతం ఉన్న 350 బెడ్స్ లో 200 బెడ్స్ కరోనా రోగుల కోసం కేటాయించారు. అయితే పూర్తిస్థాయిలో ఐసీయూ సౌకర్యాలను ఏర్పాటుచేసి 350 బెడ్స్ కరోనా రోగులకే కేటాయిస్తారు.