ఆదిత్య బిల్డర్స్ అధినేతపై చీటింగ్ కేసు
posted on Jul 22, 2020 @ 4:30PM
కొత్త మలుపు తిరిగిన డాక్యుమెంట్ల చోరీకేసు
ప్రముఖ బిల్డర్స్ సంస్థ ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. గత కొన్నిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన 100కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆదిత్య బిల్డర్స్ ఛైర్మన్, డైరెక్టర్స్ మధ్య నెలకొన్న వివాదంలో కొత్త కోణం బయటకు వచ్చింది. ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటా రెడ్డితో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్ హోమ్స్ ఎల్‌ఎల్‌పీ జాయింట్ వెంచర్‌లో తనకు తెలియకుండా విల్లాలు విక్రయించారని వంశీరామ్ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాము ముందుగా చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నందగిరి హిల్స్‌లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్ సంస్థతో 2014లో డెవలప్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే రెండురోజుల క్రితం ఆదిత్య బిల్డర్స్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కోటారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఈ నేపధ్యంతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. కుటుంబ కలహాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసుల పర్వం కొనసాగుతోంది.