రాజధాని ఏర్పాటులో ఊహించని ట్విస్ట్.. విశాఖపై జగన్ సర్కార్ వెనకడుగు!!
posted on Jul 23, 2020 @ 10:30AM
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాజధాని మార్పుపై అమరావతి ప్రాంత రైతులు 200 రోజుల నుంచి పైగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విశాఖపై జగన్ సర్కార్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. రాజధానిని విశాఖకు కాకుండా విజయనగరం జిల్లా భోగాపురంకు తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
భోగాపురంలో ఏపీ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం వద్ద 500 ఎకరాలను రాజధాని కొరకు ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. 500 ఎకరాల అభివృద్ధి ప్రణాళికలకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను ఖరారు చేసింది. ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దక్కించుకున్న, గుజరాత్ కు చెందిన హెచ్‌సీపీ సంస్థకు ప్రణాళికల కాంట్రాక్ట్ ను ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని తెలుస్తోంది. హెచ్‌సీపీ సంస్థకు మూడు వారాల క్రితం రహస్యంగా కాంట్రాక్ట్ అప్పగించినట్లు సమాచారం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేటాయించిన స్థలంలో 500 ఎకరాలను ప్రభుత్వం తమ వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థలాన్నే హెచ్‌సీపీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది.
అయితే, జగన్ సర్కార్ విశాఖపై వెనకడుగు వేయడానికి.. విశాఖలో ఇటీవల చోటుచేసుకున్న గ్యాస్ లీకేజ్ ఘటనలు, వరుస అగ్నిప్రమాదాలు కారణమా? లేక మరేదైనా కారణముందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.