సరిహద్దులో భారీగా చైనా బలగాలు
posted on Jul 23, 2020 @ 9:35AM
ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్న భారత్ సైన్యం
లద్ధాఖ్ ఎల్ఎసీ వద్ద చొరబాట్లపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకముందే డ్రాగన్ కంట్రీ భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ కుతంత్రాలు పన్నుతోంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూస్తామంటూనే డ్రాగన్ కంట్రీ మరోవైపు తన కుటిల బుద్ధిని చూపిస్తోంది. భారత్ సరిహద్దు దేశాలను తన వైపు తిప్పుకుంటూ యుద్దానికి సిద్ధం అంటూ పరోక్షంగా సంకేతాలను అందిస్తోంది. వెనుకడుగు వేసినట్టే వేసి భారీగా సరిహద్దు వెంట సైన్యాన్ని మోహరిస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మెహన్ రేఖ (ఎంఎల్) సమీపంలోకి దాదాపు 40 వేలమంది సైనికులను చేరవేస్తుంది. . భారత సైన్యం కూడా డ్రాగన్ కంట్రీకి ధీటైన సమాధానం చెప్పడానికి సిద్ధమవుతోంది. యుద్ధ సామాగ్రిని, సైన్యాన్ని అరుణాచల్ ప్రదేశ్ కు పంపిస్తోంది.
వైమానిక దళం సిద్దంగా ఉండాలి..
దేశ సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండమని సైన్యాన్ని ఆదేశించారు. భారత వాయుసేన అగ్ర కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలు మోహరించడం మంచి చర్య అన్నారు. సరిహద్దుల వెంట శత్రుదేశానికి గట్టి బుద్ధి చెప్పడానికి వైమానిక దళం సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
సరిహద్దుల్లో యుద్ధవిమానాలు..
చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆర్మీ అమ్ముల పొదిలో కొత్త చేరిన అస్త్రాలను సరిహద్దుల వెంట సిద్ధం చేస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంలో తయారుచేసిన డ్రోన్ కెమెరాలతో డ్రాగన్ కంట్రీ చర్యలపై నిఘా పెంచింది. మిగ్ 29కె సూపర్ సోనిక్ ఫైటర్స్, లాంగ్ రెంజ్ ఎయిర్ క్రాఫ్ట్ పి 8లను తూర్పు లద్దాఖ్ సరహిద్దుల్లో సిద్ధంగా ఉంచింది. భారత్ చైనా సరిహద్దులోని ప్రధాన ఎయిర్ బేస్ ల్లో ఐఏఎఫ్ ఫైటర్ జెట్లతో పాటు మిగ్ విమానాలు కూడా సిద్ధంగా ఉంచారు. సుఖోయ్ 30 ఎంకేఐఎస్, చినూక్ హవీ లిఫ్ట్ హెలికాప్టర్లను కూడా సన్నద్దం చేశారు.